Feed on
Posts
Comments

11

“ఈ చిలుక పలుకదేమీ మనతో
మాటాడదేమీ మనతో
నిన్న మొన్నటి దాకా ఈ చిలుక
మాటలాడెను బాగా”

అర్ధరాత్రి దాటింది. నట్టింట్ల జెఫ్రీ శవం. అనంతశయనం. అతి దీర్ఘమైన పెను నిద్దుర. పెను విశ్రాంతిలకు పోయిన జోసెఫ్‌ మార్క్వెజ్‌ జెఫ్రీ కండ్లు తెరుచుకునే ఉన్నయి – రాబోయే తెలంగాణా కోసం నిరీక్షిస్తున్నట్లు. ప్రాణం పోయిన కొద్దిసేపట్లనే కనురెప్పల్ని మూయాలంట. లేకపోతే కండ్లు అట్లనే తెరుచుకొని ఉంటవని ఎవరో ముసలమ్మ అంటుంది. ఆ గదిల ఒక మూలల స్వామి ముడుచుకొని కూచొని మోకాళ్ల మీద తల పెట్టుకొని వెక్కిళ్లు పెడుతున్నడు. అశోక్‌, గోపీలు నేల మీద పండుకొని ఎటో చూస్తూ ఏమొ ఆలోచిస్తున్నరు. జెఫ్రీ తల్లిదండ్రులు జీవచ్ఛవాల్లాగ గోడకు అనుకొని కూచున్నరు. చిన్న చెల్లె నేల మీద స్పృహ తప్పి పడిపోయింది. ఆ వాడకట్టు వాళ్లందరూ అక్కడే ఉన్నరు.

శవజాగారం. తలాపున దీపం తల వెనుక వెలుగుతున్న ఊదుబత్తీలు. ఊదుబత్తీలు, శవం మీది పూలదండలు కలిసి వ్యాపింపజేస్తున్న విషాదపు వాసనలు. ఇంటి ముందు వాకిట్ల రగులుతున్న నాలుగు కట్టె మొద్దులు. గోధుమ రంగు ఉనుకపొట్టు పైన బరఫ్‌ గడ్డల మీద తెల్లటి కొత్త గుడ్డల చుట్టబడిన నల్లటి జెఫ్రీ శవం. జీసస్‌కు ప్రియమై త్వరగ ఆయన సన్నిధికి చేరుకున్న జెఫ్రీ. అదృశ్య మృత్యు దేవత ఆ వాతావరణాన్ని ఆవహించుకుని బుగులు రేపుతుంది.

ఆ బుగులును పటాపంచెలు చేయటానికి, మృత్యువును ఒక మిత్రుడిగ పలకరించేటందుకు సికింద్రాబాద్‌ బన్సీలాల్‌ పేట స్మశాన వాటిక నుండి ‘గోపాల్‌ దాస్‌ మఠం’ భజన వాళ్లు ఆ ఇంట్ల భజనలు చేస్తున్నరు. ‘ఈ చిలుక పలుకదేమీ మనతో’ అని వాళ్లు పాడుతుంటే పక్కన్నుండి తాళాలు, తంబూరా, హార్మనీ, డోలక్‌, కంజర్‌లు భజనకు అనువైన సంగీతాన్ని అందిస్తున్నయి. అందరూ దుఃఖాన్ని దిగమింగుకుంట తత్వవిచారంల మునిగి తేలుతున్నరు. ఆత్మల్ని ప్రక్షాళనం చేసుకుంటున్నరు. మృత్యువు నీడలల్ల మునిగి తేలుతున్నరు. ఆత్మల అంతరంగ లోకాలను ఆవిష్కరించుకుంటున్నరు.

“ప్రపంచమె బహు ఝూటా
ఇగ పలుకరాదురా నోట
లఫంగ వేషములాటా
అవలక్షణంబుల మూటా”

అని తెలంగాణా యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్య కవి తత్వాలను గుండె గొంతుకల నుండి పలికిస్తున్నరు. విషాదాన్ని హృదయ తంత్రుల నుండి ఒలికిస్తున్నరు. ఆ పాట వింటున్న వారి కండ్లల్ల నుండి కండ్లనీళ్లు జలజల రాలిపోతున్నయి. అదొక ఆత్మల పరిశుభ్రవేదన. సికింద్రాబాదు బన్సీలాల్‌ పేట స్మశానవాటికల గోపాల్‌దాస్‌ మఠానికి 1949ల అంకురార్పణ జరిగింది. “కబీర్‌ పంథ్‌- పారక్‌ సిద్ధాంత్‌” వీరి ప్రధాన లక్ష్యం. కబీర్‌ దాస్‌ తత్వాలల్ల పారక్‌ (శోధించడం) అనే సిద్ధాంతంతోటి వీరు పాడే పాటలు వినేవాళ్ల మనస్సును చెరువుగ చేసి కంట తడిపెట్టిస్తయి. ఇక్కడి స్మశానవాటికల ఆయన ఎన్నో తత్వాలను భజన రూపాలల్ల పాడటం జరిగింది. గోపాల్‌దాస్‌ పరమపద సోపానానికి చేరుకున్నంక ఆయన శిష్యగణం ఆ తత్వాలను ప్రచారం చేయటానికి అనేక భజన బృందాలుగ ఏర్పడినారు. వారి గీతాలల్ల ఆద్యంతం కర్మ సిద్ధాంతం, మనిషి పుట్టుక, జీవితంల అత్యాశలకు దూరంగ భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ఒక వరంగ భావించి సన్మార్గంల పయనించాలన్న తత్వాలు ఒదిగి ఉంటై.

ఆత్మ అమర్‌ (అమరత్వం), అజర్‌ (అరిగేది కాదు), అఖండ్‌ (ముక్కలయ్యేది కాదు), అవినాష్‌ (నాశనం కానిది), అనాది (ఎప్పటి నుండో) అంటూ నిర్వచిస్తూ మానవ జీవితం క్షణభంగురమని, పుట్టిన మనిషి బతికినంత కాలం చేసే పనులను బట్టి తిరిగి జన్మ ఉంటదని పాటల ద్వారా ప్రచారం చేస్తరు.

“దునియా మే ఆయా మనుష్‌ బన్‌కే
యహాఁ ఫిర్‌తా హై మూరఖ్‌ పశూ బన్‌కే”

రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు వరకు వీరు భజనలు చేస్తుంటరు. ఎంత దూరమైనా ఎవరు చనిపోయినా పిలువంగనే పోయి భజనలు చేస్తరు. సంతోషంగ డబ్బులు ఇస్తే తీసుకుంటరు. ఇవ్వకపోతే అడుగరు. నిష్కామ కర్మ వీరిది. జీవనోపాధికి వీరు వేరు వేరు వృత్తుల్ని అవలంబిస్తరు. రాజస్థాన్‌ల ‘రుడాలీ’లకు చిత్తూరు జిల్లాల ‘ఒప్పారి’ వాళ్లకు, వీళ్లకు దగ్గరి పోలికలు ఉంటై. వాళ్లు శోక గీతాలను ఎక్కువగ ఆలాపిస్తే వీరు భజనలకు మాత్రమే పరిమితం కాని ఏడవరు. మరణించిన వ్యక్తి గుణగణాలను కుటుంబ సభ్యుల ద్వారా, బంధువుల ద్వారా తెలుసుకొని అప్పటికప్పుడు ఆశువుగ పాటలు కట్టి పాడుతరు. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఓదార్పు మాటలను పాటలుగ పేర్చి పాడుకుంట మానవ సంబంధాల ప్రాధాన్యతను తెలుపుకుంట జీవిత తత్వాన్ని వర్ణిస్తరు. ఇది వీరికి ఒక వృత్తి కాదు. కానీ రుడాలీలకు, ఒప్పారి వాళ్లకు అదొక కులవృత్తి, ఉపాధి.

“సమల్‌ కర్‌ చలో మేరే మనువా,
యే ఖిలోనా టూట్‌ జానే వాలీ హై
సమజ్‌కర్‌ దేఖో మేరే మనువా
ఏ దునియా రూట్‌ జానే వాలీ హై”

సూర్యుడు పొద్దు పొడిచేవరకు జెఫ్రీ ఇంట్ల భజనలు కొనసాగుతనే ఉన్నై. వాటిని వింటున్న వారందరి ఆత్మలోకాలు, అంతర్లోకాలు పరిశుభ్రమవుతనే ఉన్నై. తెల్లారంగనే చుట్టుపక్కల ఇండ్ల వాళ్లందరూ చాయ్‌లు, ఉప్మాలు తెచ్చినారు. బలవంతం చేసి, బతిమాలి అందర్నీ ముఖాలు కడిగించి ఉప్మాలు తినిపించి చాయ్‌లు తాగించినారు. మాట వినని వాళ్లను ‘అంత్యక్రియలయ్యే దాకా తట్టుకునే బలం ఉండొద్దా?’ అని మరీ కోప్పడి వాళ్ల చేత చాయ్‌లు తాగించినారు.

ఎంత గొప్ప మానవ సంబంధాలు! బస్తీలల్ల, వాడకట్టులల్ల కనబడే ఆత్మీయ మానవ సంబంధాలు కాలనీలల్ల, అపార్ట్‌మెంటులల్ల కనీసం మనిషి చచ్చిన తర్వాతనైనా కానరావు. అక్కడ మోయటానికి మనుషులే కరువు. కిరాయి వాహనాలల్ల హడావుడిగ తీసుకపోయి తగిలేస్తరు.

పొద్దెక్కుతుంది. నింబోలి అడ్డ, ఇసామియా బజార్‌, కుత్బీ గుడా, గౌలీగుడా బస్తీల నుండి విద్యార్థులు, యువకులు, తెలంగాణా ప్రజాసమితి వాళ్లు తండోపతండాలుగ వచ్చేసినారు. అండ్ల కొందరి చేతులల్ల జై తెలంగాణా, జెఫ్రీ అమర్‌ హై అన్న బ్యానర్లు. అంత్యక్రియల ఏర్పాట్ల హడావుడి మొదలయ్యింది. అంబర్‌పేట స్మశానవాటికల అంత్యక్రియలకు నిర్ణయం జరిగింది. తెలంగాణా ఉద్యమ నాయకులు ఒక్కరొక్కరే వస్తున్నరు. కేశవరావు జాదవ్‌, మల్లికార్జున్‌, మదన్‌మోహన్‌లు వచ్చినారు. పూలహారాలతో జెఫ్రీని ఆఖరిసారిగ గౌరవిస్తున్నరు.

ఇంతలనే జెఫ్రీ తండ్రి మళ్లీ పెద్దగ ఏడుస్తున్నడు. “నన్ను మొయ్యాల్సిన బిడ్డా, నేనే నిన్ను మోస్తున్నానురా కొడుకా” అని జెఫ్రీతోటి మాట్లాడుతున్నడు. మాట్లాడని జెఫ్రీ. మౌనముని జెఫ్రీ. ఏడుకట్ల సవారీ మీద, మంచు పల్లకీల ఆకాశం అవతలి దిక్కు దిగంతాలకు దూరదూరంగ పయనమైన జెఫ్రీ. అనంతశయనం ఆఖరి యాత్ర. పొద్దెక్కి ఎండ కొడుతుంది. పాడె మీద పండుకొన్న జెఫ్రీకి ఎండ కొట్టొద్దని ఎవరో ఛత్రీ పట్టుకున్నరు. మరెవరో ఈగలు ముసరకుండ విసనకర్రతోటి వింజామరలు విసురుతున్నరు. రారాజు జెఫ్రీ. యేసయ్యకు దగ్గరైన నల్లనయ్య జెఫ్రీ. ఇంతల జెఫ్రీ చెల్లెలు ఇంట్లకు ఉరికి ఒక చిన్న టేప్‌ రికార్డర్‌ తెచ్చి జెఫ్రీ పక్కన పాడె మీద పెట్టింది. అది జెఫ్రీకి ప్రియమైన వస్తువట. అండ్ల ప్రతి రోజూ రాత్రి పూట ముఖేష్‌ పాటలు మంద్రస్థాయిల వినెటోడట. ఆ పాటలు వినుకుంటనే అన్న ఆఖరి యాత్ర చేయాలని ఆమె చివరాఖరి కోరిక. రాజ్‌కపూర్‌ పాట “మేరా నామ్‌ రాజు” మొదలయ్యింది. తరువాత “సజన్‌ రే ఝూట్‌ మత్‌ బోలో” మళ్లీ ఆ తర్వాత “మేరా జూతా హై జపానీ..” పాటల ప్రవాహంల పూలతెప్పలాగ తేలిపోతున్న జెఫ్రీ.

‘రామ్‌ నామ్‌ సచ్‌ హై’ అన్న అరుపులతో ఆ ఏడుకట్ల సవారీ పైకి లేచింది. పాడె ముందు వరుసల వాళ్ల నాయిన, మల్లికార్జున్‌. వెనుక గోపీ, స్వామి. వాళ్ల వెనుక అశోక్‌, వేణు, యాదగిరి ఇంక ఎందరెందరో. జెఫ్రీ ఆశయాల అడుగుజాడలల్ల తమ అడుగులు వేసుకుంట ముందుకు నడుస్తున్నరు. శవయాత్ర ప్రారంభమైంది. గల్లీ నిండ జనం. అశ్రుసిక్త నయనాలతోటి ఆఖరిసారి వీడ్కోలు. ఆ గల్లీల పుట్టి పెరిగిన పిల్లగాడికి ఆఖరి సారి ‘అల్విదా’. రోడ్డు మీద, అరుగుల మీద, తలుపుల దగ్గర, కిటికీలల్ల నుండి దుఃఖపు సెగల పొగలతో, కన్నీళ్లతో చిట్టచివరి వీడ్కోలు. ఊరేగింపు ఆ గల్లీ మలుపు దాటింది.

టమ టమ టమ టమ
టమ్కు టమా టమ్కు టమా

నలుగురు బ్యాగరోళ్ల చేతులల్ల నాలుగు మాదిగ డప్పులు. ఎడమ చేతిల చిటికెన పుల్ల. కుడి చేతిల చిర్రాకర్ర. చంకల ఇరికించుకున్న మాదిగ డప్పు. ఆ నలుగురు కల్లు ఫుల్లుగ తాగిన నిషాల ఉన్నరు. ఆ ఎనిమిది కండ్లు జ్యోతుల లెక్క మండుతున్నయి. లేని సత్తువను ముంజేతులకు తెచ్చుకొని కైదండలు ఉప్పొంగగ ఆ డప్పుల చర్మం పగిలేటట్టు చావు డప్పు వాయిస్తున్నరు. కింది పెదవిని పై పండ్లతోటి గిట్ట కరిచి శక్తి కొద్దీ డప్పుల్ని హోరెత్తిస్తున్నరు. ఆ శ్రమకు వాళ్ల శరీరాలు, మొఖం మీద చెమటలు కారికారి కాలువలు కడుతుంది. ఒకరి కండ్లలల్లకు మరొకరు సూటిగ చూసుకుంట పోటీలు పడుకుంట ఆ డప్పుల్ని మోగిస్తున్నరు. ఆ చప్పుడుకు దిక్కులు పిక్కటిల్లుతున్నయి.

ఇంతల మరొకతను. అతను కూడ కల్లు ఫుల్లుగ పట్టించినట్లుంది. వాళ్ల మధ్యన గుసాయించి తన అంగీ జేబుల నుండి ఒక కొత్త రూపాయి నోటును ఇవతలికి తీసి దానిని నిలువున సగానికి మడిచి వాళ్ల కండ్ల ముందు ఇటూ అటూ ఆడించుకుంట చిందులు వేసుకుంట ‘తీన్‌ మార్‌’ డాన్సును మొదలు పెట్టినాడు. డప్పుల దరువు మారింది. దద్దడ్‌ కీ దద్దడా, దద్దడ్‌ కీ దద్దడా అని తీన్‌ మార్‌ సంగీతాన్ని కొడుతున్నాయి. ఉత్తర భారతదేశంల దండోరా డప్పులు ఉండవు. కేవలం కంజర్‌లు మాత్రమే ఉంటై. వాటి లయ, సంగీతం కూడ విభిన్నంగ ఉంటది. ఈ తీన్‌ మార్‌ సంగీతం, నాట్యం ఒక హైద్రాబాదు నగరానికి మాత్రమే పరిమితం. ఆ ఐదవ అతను తీన్‌ మార్‌ డాన్స్‌ చేసీ చేసి అలసిసొలసి చివరికి బాగ డప్పు కొట్టినవాని నోటికి ఆ నోటును అందించినాడు. మళ్లీ ఆ ఊరేగింపు కొంచెం ముందుకు కదిలి ఒక విశాలమైన స్థలంల ఆగింది.

మరొకతను ముందుకు వచ్చి అందర్నీ దూరంగ జరిపి ఒక పెద్ద వలయాన్ని ఏర్పరిచినాడు. ప్యాంటు జేబుల నుండి తళతళ మెరిసే ఒక రూపాయి బిళ్లను చేతులకు తీసుకొని తన బొటనవేలు, చూపుడు వేలు నడుమ నిలిపి చిన్న చిటికేసి ఆ బిళ్లను గాలిలకు విసిరినాడు. అది గింగుర్లు తిరుగుకుంట పై నుండి నేల మీద పడి కొంచెంసేపు చక్రంలాగ గిరగిర తిరిగి చతికిలపడింది. ఆ నాణానికి చుట్టూ ఆ డప్పు సైజుల మరొక వృత్తాన్ని వేలితోటి గీసినాడు. బ్యాగరోళ్లకు ఆ సంకేతం అర్థం అయినట్టుంది. నలుగురూ తమ డప్పుల్ని ఆ వృత్తం పరిధి లోపలికి దాటకుంట డప్పులను తిరిగేసి పట్టుకొని కొట్టటం మొదలు పెట్టినారు. ఆ చప్పుడుకు దుమ్మంత రేగి నేల శుభ్రమయ్యింది. ఆ తరువాత ధనధన చప్పుళ్లకు ఆ నాణెం ఎగిరెగిరి పడసాగింది. అందరూ నేల మీదికి ఒంగి చప్పుళ్లకు ఆ నాణెం చేసే నాట్య విన్యాసాన్ని తిలకించసాగినారు. రెండు డప్పులు పొరపాటున ఆ వృత్తం పరిధి లోపలికి వెళ్లినందున అవి పోటీ నుండి ఉపసంహరించబడినాయి. మిగిలిన రెండు డప్పులల్ల అధిక శబ్దాలు చేసిన డప్పు అంచు దిక్కు నాణెం మెల్ల మెల్లగ కదులుకుంట చటుక్కున డప్పు అంచులకు ఎక్కేసింది. చూస్తున్న వాళ్లందరూ ‘హే’ అని హుషారుగ చప్పట్లు చరిచినారు. ప్రేక్షకులు తమ శక్తి కొద్దీ ఆ విజేతకు డబ్బుల్ని దానం చేసినారు.

ఆ చావు ఊరేగింపుకు కొంచెం ముందు కొంత మంది యువకులు నల్లటి డాంబరు రోడ్డు మీద తెల్లటి చాక్‌ పీసులతో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తున్నరు. వాళ్ల రాతలను చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగ చూస్తున్నరు. ఆ రాతలు ఆనాటి తెలంగాణా తలరాతలు. ‘జెఫ్రీ అమర్‌ హై’, ‘జై తెలంగాణా’. జెఫ్రీ అమర్‌ హై అన్న అక్షరాల మీద ఆ యువకులు అక్కడక్కడ పైసలను పెడుతున్నరు – సంక్రాంతి పండుగ రోజులల్ల గీతల ముగ్గులేసి వాటి నడుమ చుట్టుపక్కల గుర్తులు పెట్టినట్లు. వెనక నుండి వస్తున్న గుంపు నాట్యాలు చేసుకుంట వచ్చి ఆ పైసలను కాలి బొటనవేళ్లతో ఒడుపుగ మీదికి లేపి చేతులతో అందుకుంటున్నరు. నాట్యాలు మాత్రం ఆగడం లేదు.

ఇంతల ఒకాయన ఇసుకతోటి ఓ చిన్న కుప్ప చేసి దాని మీద ఒక ఐదు రూపాయల నోటును సన్నగ మడిచి స్తంభంలాగ నిలబెట్టినాడు. చిందులేస్తున్న వాళ్లల్ల ఒకతను వచ్చి పూర్తిగ నేల మీదికి వంగి తలను నేల మీదికి ఆన్చినట్లు చేసి తన కనురెప్పలతోనే ఆ నోటును పట్టుకొని పైకి లేపి ఆ విద్యను అందరికీ ప్రదర్శించినాడు. కెవ్వుకెవ్వుమని కేకలు, ఈలలు, ఊళలు.

మరెవరో పఠాకులను తెచ్చినట్లుంది. లక్ష్మీ బాంబులు, ఆటంబాంబుల లడీలు. రోడ్డుకు అడ్డంగ ఇటు నుండి అటు హారంలాగ అమర్చి దాని పురికొసకు అగ్గి అంటించినారు. ధనధనా. ధనధనా పేలుళ్ల మోతలు. ఆనందాల కేరింతలు. చిందులు. నాట్యాలకనుగుణంగ వాయిద్యాలు. ‘చావు కూడ పెళ్లి లాంటిదే’ అన్న సామెతను నిజం చేస్తున్న జెఫ్రీ అంతిమయాత్ర. తిరిగి రాని లోకాలకు పోతున్న సుదీర్ఘ యాత్ర. అది చావు యాత్ర కాదు. జెఫ్రీ గాడి పెళ్లి రాత్రి నాటి ‘ధూం ధాం’ బారాత్‌ యాత్ర. మృత్యు దేవత వాడి పెళ్లి కూతురు. మృత్యువును ముద్దుగ కౌగలించుకున్న పెండ్లికొడుకు వాడు. జెఫ్రీ నాయన మాత్రమే క్రిస్టియన్‌. అది కూడ పేరుకు మాత్రమే. తల్లి హిందువు. వాళ్లవన్నీ దళిత సాంప్రదాయాలు, సంస్కారాలు. అందుకే ఈ చావు కళ. పాడె కట్టి దాని మీద జెఫ్రీని పండబెట్టబోయే ముందు ఒక జిల్లేడు చెట్టును తెచ్చి దానితో వానికి పెండ్లి చేసినారు. మంత్రాలు చదివినారు. కొందరు కట్నాలు చదివించినారు. ‘చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం’ అన్నది ఒక మొరటు సామెతనే కాదు పరమసత్యం, చేదు నిజం కూడా. పెళ్లి కాని యువకులు చచ్చిపోతే ఆ పెళ్లి తప్పనిసరి.

జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదు కావున ‘మృత్యువు’ తప్పించుకోలేని ఒక జీవిత సత్యం. ఆత్మకు చావు పుట్టుకలు లేవు కావున మనిషి జీవించడు, మరణించడు. ఆది, అంతం లేని విశ్వంలో నిరంతరం సంచరిస్తూ ఒక రవంత సేపు విశ్రమించటానికే మనిషి ఈ భూమిని సందర్శిస్తడు. అందుకే జగము సత్రము చావు స్వగృహయానమని తాత్వికులు బోధిస్తరు. పుట్టిన మరుక్షణమె మృత్యువు నీడలా మనల్ని వెన్నంటి వస్తది కావున మృత్యువే మన అంతిమ నేస్తం. మరి అటువంటప్పుడు మనం మరణానికి ఎందుకు భయపడాలి? ఎందుకు దుఃఖించాలి? మరణించిన మనిషికి చివరిసారి వీడ్కోలు మహా గొప్పగ ఇవ్వాలె. ఆ వీడ్కోలు చాల గౌరవంగ ఉండాలె. అందుకనే దళితులు, శూద్రకులాలవారు ‘చావు కూడ పెళ్లి లాంటిదే’ అని నిరూపిస్తరు. సిక్కు మతంల వృద్ధులు లేదా వీరులు చనిపోతే ఏడవటం అపచారంగ భావిస్తరు. కంట తడి పెడితే వీరుడిని అవమానించినట్లే అని భావిస్తరు.

జెఫ్రీ కూడా వీరుడే. ఒక ఆశయం కోసం తల్లి తెలంగాణా ఒడిల ఒదిగిపోయినాడు. జారిపోయినాడు. చుక్కలల్ల చుక్కలాగ కలిసి పోయినాడు. ఆకాశం అవతలి వైపుకు తిరిగి రాకుండ మాయమైనాడు. అతను తెర వెనక్కి వెళ్లినా మిగిలిన వాళ్లతోటి మిగిలిన జగన్నాటకం నిరవధికంగ, నిరంతరంగ నడుస్తనే ఉంటది. రంగస్థలం శాశ్వతం. నటులు మాత్రమే వస్తూ పోతుంటరు. అందుకే తెలంగాణాల ఎవరైన చనిపోతే ‘జరిగిపోయిండు’ అని అంటరు. అది చాలా గొప్ప పదం. మరికొందరు ‘కాలం చేసిండు’ అని కూడా అంటరు. ఈ తత్వవిచారంతోనే ఈ మృత్యువును సెలబ్రేట్‌ చేసుకోవటం ఒక మహోన్నత మానవ సంస్కారం. ఒక ఎరుక. ఒక సోయి.

శవయాత్ర నింబోలి అడ్డ, ఇసామియా బజార్‌, చప్పల్‌ బజార్‌, గోల్‌నాక మీద నుండి అంబర్‌పేట స్మశానానికి చేరుకుంది – జెఫ్రీని మట్టిల కలపటానికి. మట్టి నుండి జన్మించిన మనుషులు. మళ్లీ మట్టిల మట్టిగ మారే మట్టి మనుషులు. తిరిగి మనిషిగ పూచే మట్టి. అచ్చ దళిత సంప్రదాయం ప్రకారం దహనం చేయకుండ బొంద పెట్టటానికి ఆరడుగుల నేలల ఒక బొంద తవ్వినారు. నేలతల్లి విముక్తి కోసం నేలల కలిసే జెఫ్రీ.

హిందూ మతంల అగ్రవర్ణాల వాళ్లందరూ చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తరు. ముస్లింలు, దళితులు, వెనుకబడిన కులాలవారు మాత్రం ‘ఖననం’ చేస్తరు. పంచభూతాలల్ల ఒకటైన మట్టిల కలపటమే సరియైన పద్ధతేమో!

జెఫ్రీ అమ్మ, చెల్లె ఇతర బంధు స్త్రీలు కాకి శోకాలు పెట్టుకుంట ఏడుస్తున్నరు. వాళ్లందరిది ఎడతెగని సుదీర్ఘ దుఃఖకావ్యం. అమ్మ వాడి జీవితాన్నంతటిని తలుచుకొని, తలుచుకొని ఏడుస్తుంది. చిన్నప్పటి వాడి ఆటపాటలు, దూము, దుంకులాటలు, మొండితనం, ఇష్టాయిష్టాలు, కోపం, ప్రేమ, దయాగుణం అన్నింటినీ గుర్తు చేసుకొని సుదీర్ఘ శోకకావ్యంగ ఏడుస్తుంది. ప్రతి జ్ఞాపకానికి చివరల “నా కొడుకా, నా కొడుకా” అని లయబద్ధంగ ఏడుస్తుంది. ఒక పురాగాథగ దుఃఖిస్తుంది. బాధకు పర్యాయపదమే కవిత్వం కదా! వాడి అచ్చట్లూ ముచ్చట్లను కవిత్వపరంగా చెప్పి సంగీతబద్ధంగ ‘నా కొడుకా, నా కొడుకా’ అని ఏడుస్తుంది.

నాగరీకులు పట్నం పోకడల నాజూకు మనుషులు. హాయిగ నవ్వలేరు, హాయిగ ఏడ్వలేరు. జంతువులను, మనుషులను వేరు చేసేది ఈ నవ్వు – ఏడ్పులే కదా! నాగరీకులు ఈ రెండింటికీ దూరమయ్యి హిస్టీరియాలకు, డిప్రెషన్‌లకు గురవుతున్నరు. సహజసిద్ధ మట్టి మనుషులు మామూలు మనుషులు హాయిగ నవ్వి, కడుపు దుఃఖం తీరేటట్లు గట్టిగ ఏడుస్తరు. జెఫ్రీ అమ్మ అట్లనే ఏడుస్తుంది. దుఃఖాన్ని రాతలో పెట్టి రసాత్మక వాక్యంగ మలిచి కావ్యాన్ని సృష్టించిన బోయవాడు వాల్మీకిగ నిలిచిపోతే రాయలేని ఆడవాళ్లు కవితాత్మకంగ ఏడ్చి మామూలుగ మిగిలిపోతరు.

* * *

అర్ధరాత్రి దాటింది. పోయినోడు పోంగ ఆఖరుకు మిగిలిన ముగ్గురు దోస్తులు అంత్యక్రియలైన తర్వాత ఇండ్లల్లకు పోనేలేదు. జెఫ్రీ జ్ఞాపకాలను తవ్వుకుంట, తలుచుకుంట రోడ్ల మీద తిరుగుతున్నరు. కథలు కథలుగ చెప్పుకుంటున్నరు. గోపీకి తల మీద బ్యాండేజీ అట్లనే ఉంది. ఆ బ్యాండేజీతో వాడొక ‘విక్టిమ్‌ హీరో’లాగ కనబడుతున్నడు. వసపిట్టలాగ ఒర్లకుండ గంభీరంగ ఎక్కువగ మౌనముద్రల ఉంటున్నడు. అశోక్‌ తుంటి బాధను పండ్ల బిగువుతో భరిస్తూ కుంటుతనే నడుస్తున్నడు. స్వామి నిద్రల లేచి నడుస్తున్నోడి లెక్క ఉన్నడు. నిశ్శబ్దపు నడిరాత్రి నిద్రపోయే వీధులల్ల ముగ్గురు స్నేహితులు ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని గొలుసుకట్టుగ తిరుగుతున్నరు. రాంకోఠీ, ఆంధ్ర సారస్వత పరిషత్‌, బొగ్గులకుంట, తిలక్‌రోడ్‌ మీది నుండి ఆబిడ్స్‌ చౌరస్తాల గ్రాండ్‌ హోటల్‌కు చేరుకున్నరు. రాత్రి ఒంటి గంట దాటింది. హోటల్‌ షట్టర్లు ముందు నుండి మూసి ఉన్నయి. స్వామి స్నేహితులు పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌ బిల్డింగు గల్లీల పిషాబ్‌ఖానా పక్క నుండి హోటల్‌ వెనుక దిక్కు పోయి అక్కడి దారి నుండి లోపలకు ప్రవేశించినారు.

ఆర్ధరాత్రి దాటిన కూడ గిరాకీలు తగ్గనే లేదు. ట్యూబ్‌ లైట్ల వెలుగులల్ల ఆ ‘రాత్రి హోటల్‌’ ‘దినం హోటల్‌’ కన్న అందంగ మెరిసిపోతుంది. సర్వర్‌ల కేకలు, ప్లేట్లు, గ్లాసుల గలగలలతోటి కళగ వెలిగిపోతుంది. రాత్రి రాజుకొని, రాజుకొని రంజుగ రాణిస్తుంది. ముగ్గురు ఒక మూలల మార్చి తొమ్మిదిన రెడ్డి హాస్టల్‌ సదస్సునాడు కూర్చున్న అదే టేబుల్‌, అవే కుర్చీలల్ల మళ్లీ కూర్చున్నరు. నాలుగో కుర్చీ ఖాళీగ ఉంది. ఆ కుర్చీని చూసి గోపి అకస్మాత్తుగ ఎక్కెక్కి ఏడుస్తున్నడు. టేబుల్‌ మీద తల వాల్చి ఎక్కిళ్లు పెట్టి ఏడుస్తున్నడు. స్వామి, అశోక్‌లు వాణ్ని సముదాయించే ప్రయత్నం చేస్తలేరు. వాడు పొగిలి పొగిలి దుఃఖిస్తున్నడు. సర్వర్‌ రాంగనే అశోక్‌ పాత అలవాటు ప్రకారం ‘దో బై చార్‌’ అనబోయి ‘దో బై తీన్‌’ అని అతి కష్టంగ అన్నడు. ఇంక మిగిలిన ‘దో బై తీన్‌’ జెఫ్రీ లేని జీవితం చాలా కష్టం అని స్వామి బెంగగ, దిగులుగ ఉన్నడు.

పౌనాలు లేవు. డబుల్‌ శక్కర్‌ మలాయ్‌ చాయ్‌లు లేవు. మీఠా పాన్లు అంతకంటే లేవు. ఉత్త చాయ్‌లు, చాయ్‌ల మీద చాయ్‌లు. గోపి, అశోక్‌లు సిగరెట్లు కాదు, సిగరెట్ల డబ్బాలనే తగిలేస్తున్నరు. ఊదేస్తున్నరు. దుఃఖపు పొగల మధ్య మిగిలిన ముగ్గురి స్నేహాలు. ఎవరి ఆలోచనలల్ల వాళ్లు. ‘దో బజ్‌ గయా సాబ్‌’ అని సర్వర్‌ సున్నిత జ్ఞాపకం. మళ్లీ హోటల్‌ ముందు పాన్‌ డబ్బ దగ్గర ముగ్గురు దోస్తులు. మూసి ఉన్న పాన్‌ డబ్బ. మూగబోయిన స్నేహితం. తెగిపోయిన జీవితం. హఠాత్తుగ అశోక్‌ పాన్‌ డబ్బ ముందు నేల మీద కూలబడి పెద్దగ ఏడుపు.

“ఏందిరా అశోక్‌?” అన్నడు స్వామి.

“తెలంగాణా వచ్చినంక సర్కారీ నౌఖరీ చేసి సిగరెట్ల రుణం తీర్చుకుంటనన్నది ఇక్కడే, ఈ పాన్‌ డబ్బ దగ్గరే” అన్నడు వాడు.

మళ్లీ ముగ్గురు ఒకర్నొకరు పట్టుకొని ఏడుస్తున్నరు. ఆ అర్ధరాత్రి ఆబిడ్స్‌ చౌరస్త ముగ్గురు స్నేహితుల్ని మౌనంగ చూస్తూ నిలబడిపోయింది.

ఆ తర్వాత కొద్ది రోజులకు అశోక్‌ నాయన వచ్చి రూం ఖాళీ చేయించి పిల్లలందర్నీ మెట్‌పల్లికి తీసుకుపోయినాడు. ఒక రెండు నెలల తర్వాత అశోక్‌ దగ్గర్నుండి లెటర్‌ వచ్చింది. మళ్లీ మరో పిడుగు. ‘వాడి నాయన గుండెనొప్పితోటి కాలం చేసినాడట. ఇంటికి పెద్ద కొడుకును. ఇక ఇంటి బాధ్యతలు మోయక తప్పదు. ఇష్టమున్నా ఇక చదవలేను. వ్యవసాయం చూసుకోవాలె. హైద్రాబాద్‌కు ఇక శాశ్వతంగ సెలవు. నన్ను మరిచిపోవద్దు. ఒక వేళ మరిచిపోతే తెలంగాణా రాంగనే మొట్టమొదట నన్నే జ్ఞాపకం చేసుకో” అని అశోక్‌ ఉత్తరం సారాంశం. స్వామి కన్నీళ్లతో ఉత్తరంల ఉన్న అక్షరాలన్నీ కరిగిపోయినై.

మళ్లీ కొద్దిరోజులకే ఒక రోజు పొద్దు పొద్దుగాల్నే స్వామి ఇంటికి సైకిలేసుకొని గోపీ వచ్చినాడు. ఈ సంవత్సరం చదువంత చట్టుబండలయ్యిందని, అకాడమిక్‌ ఇయర్‌ వేస్ట్‌ అయిందని వాని డాడీ ఒకటే కాకి గోలనట. జెఫ్రీలాగ వీడు కూడ ఏ పోలీసు కాల్పులల్ల చస్తడోనని వాళ్ల మమ్మీ ప్రతి దినమూ ఏడుపేనట. చివరికి వాని జీవితం గింగుర్లు తిరిగి, చక్కర్లు గొట్టి బొంబైల వాళ్ల అంకుల్‌ నడిపే ఆటోమోబైల్‌ వర్క్‌షాప్‌ల అప్రెంటిస్‌గ తేలిందట. అదే తన నిర్ణయం అట. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు నాంపల్లి స్టేషన్‌ల రైలు ఎక్కుతున్నడట. మళ్లీ హైద్రాబాద్‌ ఎప్పుడొస్తడో తనకే తెలియదు కావున సెండాఫ్‌ చేయటానికి తప్పకుండ రావాలని చేతిల చేయి వేయించుకొని మాట తీసుకొన్నడు.

స్వామి ఇచ్చిన మాట ప్రకారం నాంపల్లి స్టేషన్‌కు పోయినాడు. ట్యూబ్‌ లైట్ల వెలుగులల్ల రైల్వే స్టేషన్‌ రాత్రి పూట పెండ్లి విడిదిలాగ వెలిగిపోతుంది. బొంబై పోయే రైలు ఎర్రడబ్బాలతోటి చాల పొడుగ్గ ఉంది. ప్లాట్‌ఫారం మీద స్వామి ప్రతి కిటికీలకు తొంగి చూస్తూ వెతుకుతుంటే గోపి పెద్దగ “స్వామీ!” అని అరిచినాడు. వాడు కొత్త బట్టలేసుకున్నా ముఖంల సంతోషం లేదు. గూడు విడిచిన గువ్వ పిట్టోలె దిగులుగ ఉన్నడు. రైలు నుండి కిందికి దిగి ప్లాట్‌ఫాం మీదనే అందరూ చూస్తుండగనే స్నేహితుడిని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేసినాడు. స్వామికి దుఃఖం, కన్నీళ్లు వస్తలేవు. కాని లోలోపల రగులుతున్న ఒక అగ్నిపర్వతం. దుఃఖం సెగల పొగలతో కుతకుత ఉడుకుతున్న లావా. ఏ శక్తులు, ఏ పరిస్థితులు ఈ స్నేహాన్ని విడదీస్తున్నయని అంతర్ముఖుడవుతున్నడు.

గోపి – తనను నీడలాగ వెంబడించిన దోస్తు గోపి- సిటీకేఫ్‌ల వన్‌ బై టు చాయ్‌తోటి గంటలు గంటలు గప్పాలు కొట్టే గోపి – దక్కన్‌ క్రానికల్‌ కబుర్లను కథలు కథలుగ వివరించి చెప్పే గొప్ప స్టోరీ టెల్లర్‌ గోపి – ప్రాణం లేని ఆటోమొబైల్‌ ఇంజనీరింగులకు ప్రవేశిస్తున్న గోపీ – నిజాం కాలేజీల పోలీసులు నరకలోకపు జాగిలమ్ములుగ గెదుముతుంటే తన చేయి పట్టుకొని గోడ దూకించిన గోపి – సైగల్‌ పాటలను భానుమతి పాటలను మిమిక్రీ చేసి కడుపుబ్బ నవ్వించిన గోపీ- ఇక తనను కలువడు. తనకు కనబడడు. ఒక వేళ కనబడ్డా, కలిసినా కాలం కర్కశపు కోరలల్ల చిక్కుకొని మెకానికల్‌గ ఒక ఆటోమొబైల్‌ పార్టు లాగ జీవం లేకుండ కనబడుతడేమో! స్వామికి భవిష్యత్తు అంత దిగులు దిగులుగ దృశ్యాదృశ్యమవుతుంది. దిగులు దుఃఖపు పొగల బండి వేసిన ఒక ఆఖరి కేక.

గోపి స్వామిని విడిచి రైలెక్కి తలుపు పక్కన నిలబడ్డడు. కదులుతున్న రైలు. స్నేహితుల్ని విడదీస్తున్న రైలు. రైలు వెంబడి నడుస్తున్న స్వామి. ఒకరి చేతులల్ల మరొకరి చేతులు. కాలం వేగానికి విడిపోయిన స్నేహహస్తాలు. చివరాఖరి కరచాలనాలు. అన్ని దోస్తానాలు తీన్‌ తేరా నౌ అఠారాలు. వేగం అందుకున్న రైలు. రైలు వెంబడి వడివడిగ నడుస్తున్న స్వామి. కన్నీళ్ల తెరల మధ్య గోపి అస్పష్ట నైరూప్య రూపం.

గోపి హఠాత్తుగ తన కొత్త షర్టు లోపల బొడ్డుల చేయి పెట్టి ఒక ప్యాకెట్‌ తీసి స్వామి చేతికి అందించినాడు. ఆగిపోయిన స్వామి. విడిపోయిన గోపి. ఒంటరి ప్లాట్‌ఫాం మీద ఒంటరొంటరిగ స్వామి. దిగులు దిగులుగ దుఃఖం బరువుతోటి ఒకటవ అంకెలాగ మిగిలిపోయిన ఒంటరి స్వామి. దాటిపోతున్న రైలు పెట్టెలు. చేయి అదే పనిగ ఊపుతున్న గోపి. మసక మసక కన్నీళ్ల మధ్య అస్పష్టంగ గోపి రూపం. కటకటా కటకటా రైలు పట్టాల చప్పుడు. దాటిన చివరి పెట్టె. స్వామి చివరి పెట్టె వెనుక ఉన్న ఎర్ర దీపాన్నే తదేకంగ చూస్తున్నడు. ఆ దీపం దూరమవుతూ, దూరమవుతూ చివరికి చిన్నగ చుక్కలెక్క మారి చీకట్ల కలిసిపోయింది. అంతా శూన్యం. అంతా చీకటి. చీకట్లకు వెళ్లిపోయిన స్నేహాలు. చుక్కలల్ల కలిసిపోయిన జెఫ్రీ. మట్టి మనిషిగ మారిన భూమి పుత్రుడు అశోక్‌. ఆటోమొబైల్‌ పార్ట్‌గ చేతికందకుండా జారిపోయిన గోపి.

స్వామి తన చేతిల ప్యాకెట్‌ను చింపి చూసినాడు. అది ఆర్‌.కె. నారాయణ్‌ నవల తెలుగు అనువాదం.

“స్వామి స్నేహితులు.”

… తరువాత భాగం ఒచ్చే వారం

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com