Feed on
Posts
Comments

12

అట్ల ఆ డిమాండ్స్‌ డే – మే డే ఒక బ్లాక్‌ డేగ నగర చరిత్రల నిలిచిపోయింది. తెల్లారి మే రెండున జంటనగరాలల్ల సంపూర్ణ హర్తాల్‌, బంద్‌ జరిగింది. ఆ రోజు కూడా మళ్లీ అల్లర్లు జరిగినై. ఆ రోజు రాత్రి సికింద్రాబాద్‌ల జేమ్స్‌ స్ట్రీట్‌ నుండి ఓల్డ్‌ ఘాస్‌మండీకి పోతున్న పోలీసు వ్యాన్‌ మీద ఇద్దరు యువకులు బాంబులు విసిరితే ఒక జవాను అక్కడికక్కడే మరణించినాడు. వ్యాన్‌ల ఉన్న మిగిలిన వారు గాయపడినారు. నరేందర్‌ అనే ఆవుల మందకు చెందిన పాల వ్యాపారి, మల్కాజిగిరికి చెందిన కుమార్‌ అనే ప్రింటింగు ప్రెస్‌ కార్మికుడు ఆ బాంబులు వేసినారు. వీరిని అరెస్టు చేసిన తరువాత వారిచ్చిన సమాచారం ఆధారంగ పి.జె. సూరి అనే సికింద్రాబాద్‌ విద్యార్థి నాయకుడ్ని కూడ అరెస్టు చేసి అతని ఇల్లు సోదా చేస్తే బాంబులు తయారు చేసే సామాను దొరికింది. అదే రోజున హైద్రాబాదుల జరిగిన అల్లర్లకు బాధ్యుడని ఇ.వి. పద్మనాభంను అరెస్టు చేసినారు.

* * *

1969 మే నెల ఎండాకాలం. ఉధృతంగ మండుతున్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమం. అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది. అది పాతనగరంల శాలిబండా అయినా కావచ్చు లేదా నయాపూల్‌ పక్కన గౌలిగుడా చెమన్‌ అయినా కావచ్చు. లేదా నారాయణగూడాల విఠల్‌వాడి అయినా కావచ్చు. చివరికి లష్కర్‌ల అంజలీ టాకీస్‌ చౌరస్తా అయినా కావచ్చు. ప్రత్యేక తెలంగాణా సభలు ఇంకా ఆ సమయంల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడ జరుగుతనే ఉన్నై. ప్రజలందరు ఓపికగ ఒకే ఒక వక్త కోసం ఎదురు చూస్తున్నరు.

మాటల మాంత్రికుడతను. మాటలను మంటలుగ మార్చి, ఆ మంటలను ఈటెలుగ మార్చి, ఆ ఈటెలను ఆంధ్ర వలస పాలకుల గుండెలల్ల సూటిగ గురిచూసి విసిరే నేర్పుగల తెలంగాణా వీరుడతను. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలల్ల అనర్గళంగ ఉపన్యసించి శ్రోతలను ఉత్తేజపరిచి ఆవేశంతోటి ఉర్రూతలూగించి శివతాండవం చేయించగల ఉపన్యాసకుడతను.

ఇంతకీ ఎవరా మాటల ఈటెల మంటల మాంత్రికుడు? చివరికి ప్రజలు నిరీక్షణను భరించలేక ‘బర్దాష్‌ కే బాహర్‌’ వచ్చేసి తమ సహనాన్ని బద్దలు కొట్టుకొని “పద్మనాభం వాంటెడ్‌, పద్మనాభం వాంటెడ్‌” అని ఎలుగెత్తి అరిచెటోళ్లు. వాళ్లను సముదాయించటం వేదిక మీద ఉన్న చెన్నారెడ్డికి గానీ, మల్లికార్జున్‌కు గానీ సాధ్యం అయ్యేది కాదు.

అప్పుడు ఒక సాదాసీదా “ఆమ్‌ ఆద్మీ” బక్క పలుచటి తెల్లటి మనిషి, తెల్లటి పంచె, తెల్లటి కమీజ్‌ ధరించి ఒక చేతిల పుస్తకాల సంచీ పట్టుకొని బరికాళ్లతోటి వేదికనెక్కి మైకు ముందు నిల్చుంటే తెలంగాణా ప్రజాసమూహాలు పోటెత్తిన జన సముద్రాల్లాగ మారిపోయెటోళ్లు. హోరెత్తిన పాటలాగ చెలరేగెటోళ్లు. రెపరెపలాడే తెలంగాణ పతాకంలాగ ఎగిసిపోయెటోళ్లు. జ్వలించి పోయే అగ్ని శిఖలుగ ఆకాశాన్ని అందుకొని అగ్నికీలలుగ మారిపోయెటోళ్లు. ఒక ముక్కల చెప్పాలంటే అతని మాట మంత్రంలాగ పని చేసేది. అతని వాక్కు వేదంలాగ నిలిచిపోయేది.

ఆయనే ఇ.వి. పద్మనాభం. వృత్తిరీత్యా వకీలు. ప్రవృత్తి రీత్యా జర్నలిస్టు, కవి, సంఘ సేవకుడు. ఏ రాజకీయ పార్టీకి చెందని హిమాయత్‌నగర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌. చెప్పుల్లేని నగ్నపాదాలతోటి ఎంత దూరమైన చకచక నడుచుకుంట పోయెటోడు తప్ప ఏ వాహనాన్ని ఎక్కెటోడు కాదు. మోచేతికి ఎప్పుడూ ఒక గుడ్డ సంచి వేలాడుకుంట ఉండేది. సత్యపథంల అతనొక ఒంటరి బాటసారి. సత్యం అతడిని ధనికుడ్ని చేయలేదు గానీ సర్వస్వతంత్రుడ్ని చేసింది.

1948 సెప్టెంబర్‌ల పోలీసు యాక్షన్‌ జరుగంగనే మిలటరీ పాలకులతో పాటు కొంత మంది సివిల్‌ అధికారులు కూడ ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చినారు. వాళ్లందరికీ తెలంగాణా ప్రజలంటే హీనభావం. ఒక రోజు ఏదో పని మీద పద్మనాభం గవర్నమెంటు ఆఫీసుకు పోతే అక్కడున్న ఆంధ్రా అధికారి తెలంగాణా వారికి తెలివి లేదు అని ఆయన ముఖం మీదే అన్నడు. దానితోటి పద్మనాభం ఉగ్రశివుడై పోయి Take back your words అని అరిచినాడు. ఆఫీసుల ఉన్న వాళ్లందరూ భయపడి ఆ ఇద్దరి చుట్టూ జమ అయినారు. వాడు మళ్లీ మూర్ఖంగ, మొండిగ అదే మాట అన్నడు. అప్పుడు ‘నేను పది లెక్కపెట్టేలోగ You must take back your words, otherwise my punishment is sharp and instant’ అని పద్మనాభం వార్నింగు ఇచ్చినాడు.

దానితోటి చుట్టూ ఉన్న వాళ్లల్ల టెన్షన్‌ పెరిగింది. వాడు అట్లనే రాయిలాగ కూర్చున్నడు. ఒకటి రెండు మూడు అనుకుంట పద్మనాభం లెక్కపెడుతుంటే అందరి ముఖాలల్ల ఆందోళన, ఆతృత. వాడు నోరు విప్పటం లేదు. పది కంప్లీట్‌ అయినై. యాక్‌ తూ అని కాండ్రించి వాడి ముఖం మీద పద్మనాభం లప్పెడంత ఉమ్మేసినాడు. అప్పుడు వాడు తీవ్రంగ షాక్‌కు గురై భయంతోటి వణికిపోయినాడు. అటువంటి తీవ్ర ప్రతిస్పందన ఉంటదని వాడు ఊహించలేదు. వెంటనే ‘వెరీ వెరీ సారి’ అని ముఖం తూడుచుకుంట అందరికీ వినబడేలాగ క్షమాపణలు కోరినాడు. ‘Yes. My punishment is sharp and instant’ అని మళ్లీ అనేసి ఇవతలికి వచ్చుకుంట “చమార్‌ కీ దేవతా కో చప్పల్‌ కీ పూజా” అన్నడు.

తెలంగాణావాళ్లకు తెలుగు సరిగ్గ రాదని రాష్ట్రం అవతరించిన కొత్తల బహిరంగంగనే ముఖం మీద అనెటోళ్లు. అసెంబ్లీ ముందు ఒకసారి బహిరంగసభ జరుగుతుంది. అండ్ల ప్రకాశం పంతులు కూడ ఉన్నడు. ‘నేను మాట్లాడుత, నాకూ ఒక అవకాశం ఇవ్వండి’ అని పద్మనాభం ప్రాధేయపడినాడు. దానికి సభా నిర్వాహకులు మీ తెలుగు బాగుండదు అని మొఖం మీదే అన్నరు. ‘నాకు రెండు నిముషాలు మాత్రమే సమయం ఇవ్వండి, మిమ్మల్ని ఒప్పిస్త’ అని సవాలు విసిరినాడు. వాళ్లు పంతానికి పోయి అవకాశమిచ్చినారు.

ఇగ పద్మనాభం యతిప్రాసలతోటి, అందమైన పదబంధాలతోటి, ఉపమానాలతో, సామెతలతోటి, వ్యంగ్య బాణాలతోటి గంగాఝరి ప్రవాహంలాగ విజృంభించినాడు. ఆ ఉపన్యాస ప్రవాహంల వారు గడ్డి పోచల లెక్క కొట్టుకుపోయినారు. రెండు నిముషాలు కాదు పది నిముషాలు కూడా ఎప్పుడో అయిపోయినాయి. వాళ్లు దానిని గమనించే స్థితిల లేక ఆ ఉపన్యాసాన్ని కమ్మని సంగీతంలాగ విన్నరు. నాగస్వరానికి తలలూపే నాగుపాములోలె తలలూపుకుంట విని చివరికి తమ తలలు అవమానంతోటి దించుకున్నరు.

తెలంగాణా ‘సోయి’ ఎప్పటిది? ఇప్పటిదా? ఆనాడు పోతనకు ఆ కాలానికే తెలంగాణా సోయి ఉండింది. కావుననే కన్నడ రాజులకు తన భాగవతాన్ని అంకితమిచ్చి పడుపు కూడు భుజించనని భీష్మించి ‘సత్కవుల్‌ హాలికులైననేమి’ అని మనకు భరోసా, ఆత్మాభిమానం ఇచ్చినాడని చెప్పుకుంట పోతన భాగవతం పద్యాలను గలగలా వినిపించెటోడు. తెలంగాణావాడికి తెలంగాణ సోయి ఆది నుండి ఉన్నదని నొక్కి చెప్పుకుంట అంతలనే కవిత్వ ధోరణిలకు వెళ్లిపోయి అనేక ఉర్దూ గజల్స్‌ని, తన ఇంగ్లీషు వ్యాసాలను ఆశువుగ వినిపించెటోడు.

అటువంటి తెలంగాణా భూమిపుత్రుడు ఇ.వి. పద్మనాభంను అరెస్టు చేసి రాజమండ్రి జైలుల నిర్బంధించినారు. ఆయన విడుదల అయిన తర్వాత చాల సభలల్ల ప్రజలు పూలహారాలు వేయడానికి ముందుకు వస్తే “మై హార్‌ నహీఁ పేన్తా హూఁ. మై కేవల్‌ జీత్‌ పెన్తా హూఁ” అని చమత్కరించెటోడు. తనను కలిసిన మిత్రులతోటి “తెలంగాణ ఆయే తక్‌ మై నహీఁ మరుంగా, తెలంగాణా దేఖ్‌నే కే బాద్‌ హీ మరూంగా” అని నిరీక్షిస్తున్న మృత్యువును పరిహసిస్తూ వారితోటి అనెటోడు.

* * *

అవుతల ఉద్యమం, ఇంట్ల నిర్బంధం రెండూ పెరిగిపోతున్నై. ఆ వైరుధ్యంల ఊపిరి ఆడక స్వామి ఉక్కిరిబిక్కిరి అయితున్నడు. మధ్యతరగతి కింది కుటుంబాలల్ల పిల్లలకు స్వేచ్ఛ పరిమితంగ ఉంటది. పెరిగే పిల్లలు టీనేజీ దశల స్వేచ్ఛ కోసం, ఉనికి వ్యక్తిత్వం కోసం ఆరాటపడుతుంటరు. నిర్బంధ పరిస్థితులున్న కుటుంబ వ్యవస్థ నుండి ఇవతల పడి కొంతమంది ఉద్యమాలల్ల తమ ఉనికిని, వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకొనే ప్రయత్నాలు చేస్తరు. ఆ ప్రయత్నమే ఇంటి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి మధ్య ఘర్షణను సృష్టిస్తది. పద్దెనిమిదేండ్ల స్వామి సరిగ్గ ఆ ఘర్షణలనే ఉన్నడు.

స్వామి పట్ల అమ్మాబాపుల ‘అతిజాగ్రత్త’ అతని పుట్టుకతోటే ప్రారంభమైంది. స్వామి సరిగ్గ అర్ధరాత్రి ఉస్మానియా దవాఖానాల జన్మించినాడు. ఆ సమయం, తేదీ, దినం ఆధారంగ అలియాబాద్‌ కాలువగడ్డ గుడిల జ్యోతిష్యుడితోటి జాతకచక్రం వేయించినారు. ‘ఈ పిల్లవాడు గజదొంగైనా అవుతడు లేదా అడవులు పట్టుకొనైనా తిరుగుతడు’ అనేసరికి ఆ తల్లిదండ్రులు నోళ్లు వెళ్లబెట్టి, బీరిపోయినారు. ‘శాంతి చేయించండి, ఫరవాలేదు. దోషగుణం దూరమవుతది’ అని ఆయనే నివారణోపాయాన్ని సూచించినందున అదీ చేయించినారు. ఆ జ్యోతిష్యుని మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వాళ్ల గుండెలు దడదడలాడుతనే ఉంటై.

ఇంక వీడు పెరిగి పెద్దయిన తర్వాత కూడ ఒక కంట కనిపెడుతనే ఉండాలె సుమా! అని వాళ్లు నిశ్చయించుకున్నరు.

స్వామి బాపు సిఫారస్‌తోటి హైద్రాబాద్‌కు బదిలీ చేయించుకున్నదాని వెనుక ఆయన భార్య పోరు చాల వుంది. ఆ పల్లెటూళ్లల్లనే ఉంటే పిల్లల ఆరోగ్యాలే కాక చదువులు కూడ దెబ్బ తింటయని ఆమె దూరం ఆలోచన చేసి హైద్రాబాద్‌కు వచ్చింది. ఆయనకేమో ఆ బదిలీ హైద్రాబాద్‌కు కాక వరంగల్లుకు చేయించుకొని మడికొండల బంధువుల మధ్యన ఉండాలని ఆశ. చివరికి ఆమె మాటనే నెగ్గి పట్నం వచ్చినారు. స్వామి పెద్ద మేనత్త నెల్లుట్ల కమలమ్మ కూడ ‘అన్నా! ఎక్కడున్నా

మోదుగుకు మూడు ఆకులే కదా – వరంగల్లుల ఉంటేమి, హైద్రాబాద్‌ల ఉంటేమి?’ అని వదిన మాటనే సమర్థించింది. చెల్లె మాట కాదనలేక సరే అని పట్నంకు బదిలీ చేయించుకున్నడు.

స్వామి అమ్మకు చదువంటే చాల ఇష్టం. ఆమె చదివింది నాలుగో తరగతే అయినా తీరిక ఉన్నప్పుడు చందమామ కథలు, నవలలు చదివేది. తను చదివేదే కాక తన అమ్మకు కూడ చదివి వినిపించేది. చూపులేని ఆ ముసలమ్మ నవ్వుకుంట ఏడ్చుకుంట ఆ కథలను శ్రద్ధగ వినేది, ఆనందించేది. స్వామిని కనటానికి లేబర్‌ రూమ్‌ల టేబుల్‌ మీద పండుకొని ‘నాకు సుభాష్‌ చంద్రబోస్‌లాంటి కొడుకు పుట్టాల’ని మనస్సుల అనుకుంది. అట్ల అనుకోవటమే పొరపాటైందని మళ్ల చాలసార్లు తనను తాను తిట్టుకుంది.

స్వామి పెరిగి పెద్దగవుతుంటే తల్లిదండ్రులు తమ కొడుకు లోపల రెండు గుణాలను గమనించినారు. ఒకటి తిరగబడే స్వభావం. రెండు ఇతరుల పట్ల శ్రద్ధ, ఆసక్తి.

అప్పుడు స్వామికి పదేండ్ల వయస్సు ఉంటదేమో! ఒకరోజు వాళ్లింట్ల పని చేసేటందుకు ఒక కూలీ మనిషి వచ్చినాడు. ముసలివాడు. గడ్డాలు, మీసాలు బాగ పెరిగి బక్కచిక్కిన శరీరం. ఆ శరీరాన్ని పట్టుకొని వేలాడుతున్న ఒక బుడ్డగోచి. ఆ కూలీ ఆకారం, వాడు చేస్తున్న మట్టిపని స్వామిని బాగ ఆకర్షించినై. పొద్దస్తమానం వానిచుట్టే తిరిగినాడు. మాటలు కలిపినాడు. వాళ్లిద్దరికి మంచి దోస్తీ కుదిరింది. స్వామి వేసే యక్షప్రశ్నలన్నింటికీ ఆ కూలీ తన పని చేసుకుంటనే ఓపికగ సమాధానాలు ఇస్తున్నడు. ఇంతల మధ్యాహ్నమైంది. వాడు తినేటందుకు కాళ్లుచేతులు కడిగి తన సద్దిమూట విప్పినాడు. అండ్ల ఏముంటదో అన్న జిజ్ఞాసతోటి స్వామి తొంగిచూసినాడు. ఎండిపోయిన పచ్చజొన్న రొట్టె ముక్కలు, ఎండిన కారం ముద్ద ఉంది. స్వామి ఆశ్చర్యం వేసింది. అండ్ల పప్నన్నం కనబడకపోయేసరికి మళ్ల తిండికి సంబంధించిన ప్రశ్నలు ప్రారంభించినాడు. తను ప్రతి దినాం ఇట్లనే జొన్న రొట్టె, కారం తింటనన్న వాని జవాబు విని ‘మరి పండుగరోజు ఏం తింటవు?’ అని ప్రశ్నించినాడు. ఆ కూలీ తన పండ్లన్నీ కనబడేటట్లు ఇకిలించి నవ్వుకుంట ‘పండుగ నాడు తెల్లన్నం వండుకొని, అండ్ల, పాలు, షర్కర కలుపుకొని తింట’ అని సంబరంగ సమాధానమిచ్చినాడు. పండుగ రోజు తన ప్రత్యేక భోజనం అదేనని మళ్లమళ్ల చెప్పినాడు.

ఆ మాటలు విన్న స్వామికి వాని మీద జాలి, దయ ముంచుకొచ్చినై. వాళ్ల ఇంట్ల పండుగ రోజు అమ్మ చేసే కోడికూర, గారెలు, పూరీలు వానికి జ్ఞాపకం వచ్చి, తమ ఇద్దరి జీవితాలల్ల ఉన్న వ్యత్యాసాన్ని గమనించినాడు.

స్వామికి జీవితంల మొదటిసారి బీదల పట్ల కరుణ ఉద్భవించింది. పెద్దగైన తర్వాత కూడ పండుగ అనంగనే బుడ్డగోచీ పెట్టుకొనే కూలీవాడే జ్ఞాపకం వస్తడు.

ప్రశ్నించే స్వభావం, తిరుగుడు స్వభావం, తిరగబడే లక్షణాలు, ఇతరుల పట్ల శ్రద్ధ, ఆసక్తి చూపే గుణాలు అమ్మాబాపులను కలవరపరిచినై. వాళ్లకు కొడుకును చూస్తుంటే తమ ‘వెంకటనర్సయ్య’ జ్ఞాపకం వచ్చి దిగులు పడేటోళ్లు. స్వామికి తన చిన్నబాపు సాలు వస్తదేమో అనుకొంట భయపడెటోళ్లు.

వెంకటనర్సయ్య బాపుకు పెద్ద తమ్ముడు. అన్నలాగ బుద్ధిమంతుడు కాదు. బడిచదువులు అబ్బలేదు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులను ఎదిరించటం వల్ల చచ్చేటట్లు దెబ్బలు తినెటోడు. అయినా దారికి రాలేదు. ఆయన స్నేహితులందరూ కింది కులాలవాళ్లే. అయ్యోరు కులంల పుట్టి సుద్దరోళ్లతో రాసుకపూసుక తిరుగుతవా, మాలమాదుగుల భుజాల మీద చేతులేసుకొని తిరుగుతవా అని తల్లి తన్నేది. బట్టలన్నీ అవతల విడిపించిన తర్వాతనే ఇంట్లకు రానిచ్చేది. ఆ ముగ్గురు మొగపిల్లలల్ల అతనే అందంగ, చురుకుగ, తెలివిగ ఉండెటోడు. మరి అతని జీవితం ఎందుకు, ఎట్ల, ఎప్పుడు పట్టాలు తప్పిందో ఎవళ్లకూ అర్థం కాలేదు. ఇంట్ల, బంధువులల్ల అందరూ అతడ్ని చీదరించుకొనెటోళ్లే. దెబ్బలు కొట్టెటోళ్లే, పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఇంకా చెడిపోయినాడు. ఇంట్ల నుండి పైసలు దొంగతనం చేసెటోడు. అమ్మ జాగ్రత్తగ దాచి పెట్టిన అప్పాలను ఎత్తుకపోయి దోస్తులకు పంచెటోడు. బయటి ప్రపంచమే ఎక్కువైపోయింది. ఊరంతా దోస్తులే. పిల్లల కోడిలాగ ఎప్పుడూ పదిమందిని వెంటవేసుకొని తిరుగుతుండెటోడు.

మడికొండకు ఆ రోజులల్ల సురభినాటకాల గ్రూపు సంవత్సరానికోసారి వస్తుండేది. ఒకసారి ఊర్లకు వస్తే నెల, రెండు నెలలు ఉండి ప్రతీరోజు ఏదో ఒక ప్రదర్శన ఇస్తుండెటోళ్లు. ఊరి ప్రజల దయాదాక్షిణ్యాలపై వాళ్లు ఆధారపడెటోళ్లు. నాటకాలు మాత్రం చాల గొప్పగ వేసెటోళ్లు. మాయాబజార్‌, కృష్ణలీలలు, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధంలాంటి నాటకాలను రాత్రిపూట దివిటీల వెలుగులల్ల అద్భుతంగ వేసెటోళ్లు.

వాళ్ల మఖ్మల్‌ సిల్కు బట్టలు, నగలు, తలలకు పెట్టుకొనే కిరీటాలు, చేతులల్ల పట్టుకొనే ఆయుధాలే కాక ముఖాలకు పూసుకొనే రంగులు, పౌడర్లు, స్నోలు అన్నీ ఆ యువకుడిని ఆకర్షించినాయి. సురభినాటకాలవాళ్లు ఊళ్లె ఉన్నన్ని రోజులు వెంకటనర్సయ్య వారితోనే వాళ్ల గుడిసెలల్లనే ఉండెటోడు. వాళ్ల కోసం అందరి దగ్గర చందాలు వసూలు చేసెటోడు. తమింట్ల నుండి దొంగతనంగ బియ్యం, ఉప్పుపప్పులను తీసుకపోయి వాళ్లకు ఇచ్చెటోడు. తను తినే అన్నం కూడ పట్టుకపోయి వాళ్లకే దానం చేసెటోడు. చిన్నప్పటి నుండి ఆయనకు దానగుణం, దయాగుణం చాలా ఉండేవి.

సురభి నాటక సమాజంల అందరూ ఆయనను బాగ ఇష్టపడెటోళ్లు. తమ పట్ల, నాటకాల పట్ల ఉన్న శ్రద్ధను గమనించి తమతో పాటు వచ్చేయమని చెప్పినారు. అంతే వాళ్లతో పాటు తిరిగి తిరిగి రెండు మూడు నెలల తర్వాత పిచ్చి ఆకారంతోటి ఇంటికి తిరిగొచ్చినాడు. తను చూసి వచ్చిన కన్నాంబ, పుష్పవల్లి, గోవిందరాజుల సుబ్బారావు గురించి కథలుకథలుగ ముచ్చట్లు చెప్పెటోడు. “ముఖానికి రంగులు పూసుకొని తిరిగే ఆ బోగంవాళ్లతోటి తైతక్కలాడే ఆ నాటకాల వాళ్లతోటి గాలికి తిప్పకాయ వోలె తిరుగుతవా?” అని వాళ్ల నాయిన చింతబరిగెతోటి ఒళ్లంత వాతలు తేలేలాగ కొట్టినాడు, ముంతపొగ పెట్టినాడు. కోదండం వేసినాడు. ఆ పిల్లవాడు ఇంకా ముదిరిపోయినాడు.

ఒక్క వొదిన (స్వామి అమ్మ) దగ్గర మాత్రమే అతనికి చనువు ఉండేది. ఏదున్నా ఆమెకే చెప్పెటోడు. ఆమె సుద్దులు, బుద్దులూ చెప్పుతుండేది కావున ఆమెను ‘పంతులమ్మా!’ అని హాస్యాలు చేసెటోడు. నొసలు మీద నుండి కండ్ల మీదికి పడే వాలుజుట్టును తలతోనే మీదికి ఎగురేసుకుంట, లోకాన్నే ధిక్కరిస్తున్నట్లు ఆవారా బాదల్‌గ కనబడెటోడు. అట్లనే మాట్లాడెటోడు.

ఒక రోజు తల్లి మెడల ఉండే బంగారుగుండ్ల గొలుసు దొంగతనం చేసి ఇంట్ల నుండి మాయం అయినాడు. ఆర్నెల్ల తర్వాత ఒక కారటు ముక్క వొచ్చింది. బొంబైల ఉన్ననని, బట్టల మిల్లుల పని చేస్తున్ననని. ఇంక అందరూ ఆయనను ‘కులం పోయిన మనిషిగ’ లెక్కవేసినారు.

ఉయ్యాల ఊగిఊగి ఎప్పుడో అప్పుడు ఆగిపోక తప్పదు కదా! వెంకటనర్సయ్య అట్లనే మళ్లా మడికొండకు వచ్చినాడు. లోకం చుట్టిన వీరుడు కావున ఎన్ని ముచ్చట్లో. ఎన్ని భాషలల్ల మాట్లాడెటోడో. లోకం మీది ముచ్చట్లు చెప్పుతుంటే అందరు నోళ్లు వెళ్లబెట్టుకొని వెర్రి వెంగళప్పల్లాగ వినెటోళ్లు. ఆ కూపస్థమండూకాలకు ప్రపంచాన్ని పరిచయం చేసెటోడు.

అన్న తమ్ముడ్ని చిలుపూరు గుట్టకు తీసుకపోయి ప్రాయశ్చిత్తం చేయించినాడు. బట్టలు కుట్టే సూదిని ఎర్రగ కాల్చి నాలిక మీద వాతలు పెట్టినారు. ఇతర కులాల వాళ్ల ఇండ్లల్ల అన్నం తిన్నందుకు అది పాపపరిహారం. బంధువులందరూ గుట్ట కింద తినీ తాగిన తర్వాత ఆయనను ‘కులం’ల మళ్లా కలుపుకున్నరు. మర్యాదస్తులల్ల జమ చేసుకున్నరు.

వరంగల్లు ఆజంజాహీ బట్టల మిల్లుల ఎటువంటి సిఫారస్‌ లేకుండనే మనిషిని చూడంగనే ఉద్యోగం ఇచ్చినారు. ‘బహుత్‌ ఖాబిల్‌ ఆద్మీ హై’ అని మెచ్చుకున్నరు. నౌకరీ దొరకంగనే పెండ్లి కూడ అయ్యింది. ఒక కొడుకు పుట్టినాడు. హమ్మయ్య దారిల పడ్డడు అని అన్నవదినెలతో సహా అందరూ సంతోషించినారు. వాళ్ల నాయిన అప్పటికే కాలం చేసినాడు.

ఒక రోజు ఆయన భార్య వీపు తోముతుంటే వెనుక భుజం మీద ఎర్రటి మచ్చ కనబడింది. ఇదేంది అని అనుమానంగ అన్నది. దేన్నీ లెక్కజేయని మనిషి కావున ఆ మచ్చను కూడ లెక్క చేయలేదు. మళ్లా నెల రెండు నెలలకు అటువంటి మచ్చలే ఒంటి నిండ కనబడినై. నొప్పి గిప్పి ఏం లేదు. అప్పటికే అన్నకు హైదరాబాద్‌కు బదిలీ అయ్యింది. అన్నా వదినలున్నరు కదా అని పట్నంల పెద్ద దవాఖానాకు వచ్చినాడు.

డాక్టర్‌ సూదులతోటి మచ్చల మీద గుచ్చితే నొప్పే లేదు. చర్మం మొద్దుబారి పోయింది. అటువంటివే ఇంకా వొకటిరెండు పరీక్షలు జరిగినై. డాక్టర్‌ ముఖం చిన్నబోయింది.

“ఏమైంది, డాక్టర్‌ సాబ్‌?” అన్నడు నవ్వుకుంట, నిర్లక్ష్యంగ తల ఎగురేసుకుంట.

“నువ్వు డిచ్‌పల్లి దవాఖానాకు పోవాలె” అని డాక్టర్‌ నిమ్మళంగ అన్నడు.

“డిచ్‌పల్లికా? అదెక్కడుంది? అయినా అక్కడికి నేనెందుకు?” అన్నడు మళ్ల నవ్వుకుంటనే.

“నీకు కుష్ఠురోగం తగిలింది” అన్నడు డాక్టర్‌ తల అటు దిక్కు తిప్పుకొని.

ఆ మాటలు చెవుల పడంగనే కరెంట్‌ షాక్‌ కొట్టినట్లు అట్లనే కూచున్నడు. గుడ్లప్పగించి డాక్టర్‌నే చూస్తున్నడు. దౌడలు గిట్ట కరుచుకపొయ్యి నోట్లె తడారిపోయింది. నాలుక ఆడక మాట బందు అయ్యింది. అట్ల ఎంత సేపు కూచున్నడో ఆయనకే తెలువది. డాక్టర్‌ చెప్పుల చప్పుడు కాకుండ రూంల నుండి అవుతలకు పొయినాడు.

ఎంతో సేపటికి హోష్‌లకు వచ్చి చిన్నగ స్టూల్‌ మీద నుండి లేచి నిలబడ్డడు. వెంట ఎవరూ లేరు. లేరు లేరు ఇంక ఎవరూ లేరు. ఎవరూ వెంట రారు. తను తనొక్కడే ఇంక ఈ ‘పెద్ద రోగాన్ని’ మోసుకుంట తిరగాలె. తిరుగుడు తిరుగుడు. ఆ తిరుగుట్ల ఎక్కడ తగిలిందో ఈ పెద్ద రోగం. ఎక్కడ? ఎక్కడ? సురభి గుడిసెలల్లనో, వాళ్లతోటి తిరిగిన ఊర్లల్లనో, బొంబైలనో, రైలు డబ్బాలల్ల, ప్లాట్‌ఫారాల మీద, బోరీబందర్‌ గాలివెలుగురాని ఇరుకిరుకు గుడిసెలల్లనో, మురికి నాలాల పక్కన బస్తీలల్లనో, చాయ్‌పానీలల్ల, బట్టల మిల్లులల్ల, సీన్మా టాకీసులల్ల, తొడతొక్కిడి జనం జాతరల మధ్య ఎక్కడ ఎప్పుడు తగిలిందో ఈ రోగం – పెద్ద రోగం. పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్లకే ఈ పెద్ద రోగం అని విన్నడు. తనేం పాపం చేసినాడు? ఇంక తను పదిమందిల గజ్జి కుక్కోలె బతకాలె. ఎవళ్లూ తనను ఇంట్లకు రానియ్యరు. అసహ్యంతోటి, భయంతోటి తనను చూసి దూరం దూరం జరిగిపోతరు. ఇంక ఈ అందమైన ముఖం ఉండదు. కండ్లబొమ్మలు రాలిపోయి ముక్కు సొట్టబోయి పెదవులు లావయ్యి………

వెంకటనర్సయ్య దవాఖాన్ల నుండి మరబొమ్మోలె అడుగులు వేసుకుంట ఇవతలకు వొచ్చి అఫ్జల్‌గంజ్‌ పార్క్‌ల “మూసీ వరదలల్ల వొందల మందిని రక్షించిన చెట్టు కింద” మోకాళ్ల మీద తల పెట్టుకొని ముడుచుకొని కూర్చున్నడు. అయిపోయింది. అంత అయిపోయింది. ఇంక ఈ నాటకం అయిపోయిందని విషాదంగ నవ్వుకొన్నడు. అయినా ఓడిపోలేదు. కండ్ల నుండి ఒక్క చుక్క నీరు రాలేదు. ఏడవలేదు. ఇంక అన్న ఇంటికి ఆలియాబాద్‌కు పోలేదు. తనెవరికీ భారం కావొద్దు. తనవల్ల ఎవరూ బాధపడొద్దు, భయపడొద్దు అని గట్టి మనస్సుతోటి పెద్ద నిర్ణయం తీసుకొని అన్నకు ఒక కారట్‌ రాసి విషయమంత వివరించి తన గురించి విచారించవద్దని, తన కోసం దేవులాడవద్దని వేడుకుంట, ‘పంతులమ్మకు’ నమస్కారాలు చెప్పమని సెలవు తీసుకున్నడు.

రైలెక్కినాడు గని అది వరంగల్లు పోయే రైలు కాదు. దేశం కాని దేశం ఉత్తర భారతదేశానికి పేరు తెలువని ఊరికి పోయే రైలు.

ఆ తెగిన పతంగం మళ్ల ఎవరికీ, ఎక్కడ కనబడలేదు.

ఎవళ్లయినా తల ఎగురేసి మాట్లాడుతున్నా, నొసలు మీద నుండి కండ్ల మీదికి పడుతున్న జట్టు గల్లోళ్లను చూసినా స్వామి అమ్మబాపులు ‘వెంకటనర్సయ్యను’ జ్ఞాపకం చేసుకుంట కండ్లల్ల నీళ్లు నింపుకుంటరు.

స్వామికి తన చిన్నబాపు సాలు వస్తదేమో అని అమ్మాబాపుల భయం. వాళ్ల భయానికి తగ్గట్టే స్వామి తన పదిహేనేళ్ల వయస్సుల అట్లనే ప్రవర్తించినాడు. ఆ దశ స్వామి జీవితంల ఒక పెద్ద డిస్టర్బ్‌డ్‌ పీరియడ్‌.

స్కూలు చదువంత అస్తవ్యస్తంగ తయారయ్యింది. చదువు మీద, పాఠాల మీద శ్రద్ధ పోయింది. స్కూలు ఎగ్గొట్టి మార్నింగు షో సీన్మాలు చూడటమో లేదా లైబ్రరీల కూచొని పుస్తకాలు చదవటమో చేస్తున్నడు. వరుసగ పది పదిహేను రోజులు స్కూలుకు డుమ్మా. క్లాసు టీచర్‌ బాపుకు ‘వార్త’ అందచేసినాడు. బాపు స్కూలుకు పోయి టీచర్‌ను కలిసినాడన్న సంగతి ఒక దోస్తు ద్వారా స్వామికి తెలిసింది. భయంతోటి వణికిపోయినాడు. అపరాధభావంతోటి కృంగిపోయినాడు. ఆ సంగతి అమ్మకు తెలిస్తే నిజంగనే చచ్చిపోతదని భయపడినాడు. ఆ పరిస్థితి నుండి ఎట్ల తప్పించుకోవాల్నో తోచలేదు. బాపు ఇంక ఇంటికి చేరుకోలేదు. ఇక ఆయన ఇంట్లకు రాంగనే బాంబు బద్దలవుతది. అమ్మకు సంగతంత తెలుస్తది.

ఎట్ల ఎట్ల.. ఇంట్ల నుండి పారిపోవటం ఒక్కటే మార్గం. ఇంక ఈ చదువుల పీడ పోతది. అమ్మాబాపుల తిట్లుకొట్లు తప్పుతై. పోవాలె. పోవాలె. బాపు ఇంటికి రాకముందే ఎక్కడికైన పారిపోవాలె. ఇంట్ల పైసలు ఎక్కడుంటయో స్వామికి తెలుసు. పెట్టె తెరిచి కొన్ని పది రూపాయల నోట్లను గుప్పిట్ల ఇరికించుకొని జేబుల పెట్టుకొని ఇంట్ల నుండి బయటపడినాడు. తోవల ఒక దోస్తు కలిస్తే తమ ఇంట్ల ఇవ్వమని ఒక చిన్న చిట్టి రాసి వాడికి ఇచ్చినాడు. అండ్ల ఒకే ఒక వాక్యం రాసినాడు. ‘నేను ఇంట్ల నుండి పోతున్న’ అని. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు పోయేసరికి విజయవాడ ప్యాసెంజర్‌ రెడీగ ఉంది. టిక్కట్‌ తీసుకొని పెట్టెల ఎక్కి ఒక మూలల కూచున్నడు. అప్పటికి చీకటైంది.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రైలు కదిలింది. ఇంట్ల ఏమవుతుందోనన్న దిగులు. ఆకలి. నిద్రలేదు. అట్లనే కూర్పాట్లు పడుకుంట విజయవాడ చేరుకున్నడు.

విజయవాడ స్వామి కలల నగరం. తను చదివిన నవలల వల్ల అక్కడి వీధులు, చౌరస్తాలు అన్నీ సుపరిచితాలే. కనకదుర్గ కొండ, ప్రకాశం బ్యారేజీ, కాళేశ్వరరావు మార్కెట్టు, హనుమంతరాయ గ్రంథాలయం – అన్నింటితోటి తనకు పూర్వజన్మ సంబంధమే. విజయవాడ ఆధారంగ రాసిన నవలలు బజారుబిడ్డలు, పారిపోయిన బఠానీ జ్ఞాపకం వచ్చినై. బందరు కాలువ, ఏలూరు కాల్వలల్ల పారుతున్న నీళ్లు మురికివాసన కొడుతున్నా, నగరం గుడిసెలతోటి, పందులతోటి అపరిశుభ్రంగ ఉన్నా స్వామి మనోనేత్రాలకు విజయవాడ అందంగనే కనిపించింది.

పగలంత పట్నంల అన్ని వీధులూ తిరిగితిరిగి రాత్రయ్యేసరికి కనకదుర్గ కొండ మీదికి చేరుకొనేటోడు. నాలుగు రోజులల్ల తెచ్చుకున్న పైసలన్నీ అయిపోయినై. పైసలు సరిపోవన్న భయంతోటి ప్రతి రోజు ఒక్కపూటనే అన్నం తినేటోడు. తిండికి కష్టమైంది. ఆకలి. తిరిగి తిరిగి నీరసం. కాళ్ల నొప్పులు. దినం కన్న రాత్రుళ్లు ఇంకా కష్టమనిపించేది. ఆకలికి తోడు కొండ మీద గజగజ వొణికించే చలి. దుకాణాల అరుగుల మీద ముడుచుకొని పండుకునెటోడు. ఆకలికి, చలికి నిద్ర రాకపోయేది. పక్కన ఎవరో సాధువులు, దేశద్రిమ్మరులు. ఒక ముసలి సాధువు దయతలచి తన జోలె నుండి ఒక పంచె తీసి ఇచ్చినాడు. అది కప్పుకుంటే కొంత నయంగ అనిపించింది.

తెల్లారి లేవంగనే కడుపుల ఆకలిమంటలు. సాధువులందరు మురమరాలు కొనుక్కొని, గడ్డాలు మీసాలు తమాషగ కదులుతుంటే వాటిని బుక్కుతున్నరు. తను కూడ తన దగ్గరున్న ఆఖరి ఐదు పైసల బిళ్లతోటి మురమరాలు కొనుక్కొని పచ్చి మిరపకాయ నంజుకుంట అవన్నీ తినేసి కడుపు నిండ నీళ్లు తాగినాడు. ఇంటి మీద బెంగ మొదలైంది. అప్పటికే ఇల్లు వదిలి ఐదు రోజులు.

“హరహర మహదేవ్‌” అని అరుచుకుంట సాధువుల పాదయాత్ర బయలుదేరింది. స్వామి కూడ వారితోటి నడుచుకుంట, ముచ్చట్లు చెప్పుకుంట కొండ దిగినాడు. కనకదుర్గ పాదాల కింద, కృష్ణా నది మెట్ల మీద సాధువులందరు స్నానాలు చేస్తుంటే-

“మేము మంగళగిరి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయ్‌” అని పంచె ఇచ్చిన ముసలి సాధువు స్వామిని ఆదేశించినాడు.

“మరి అక్కణ్నుంచి మళ్ల ఎక్కడికి?” అని అడినాడు స్వామి – వాళ్లు హైదరాబాద్‌ దిక్కు వస్తరేమో అన్న ఆశతోటి.

“అక్కణ్నుంచి అమరావతి, శ్రీశైలం, మహానంది…..” అనుకుంట చాంతాడంత లిస్టు చదివినాడు ఆ ముసలి సాధువు.

“లే ! నేను హైద్రాబాద్‌ పోవాలె” అన్నడు స్వామి.

“శంభో శంకర !” అనుకుంట సాధువులు ‘స్వామిని’ వదిలేసినారు.

అట్ల స్వామి సాధువుల సాంగత్యం నుండి విముక్తి పొంది విజయవాడ రైల్వే స్టేషన్‌ చేరుకున్నడు.

‘బగర్‌ టికెట్‌’ మీద దొంగతనంగ రైళ్లల్ల తిరుగుడు స్వామికి అలవాటే. బడి ఎగ్గొట్టి ఉప్పుగూడల రైలెక్కి ఫలక్‌నుమా దాక దోస్తులతోటి అటూఇటూ అకారణంగ తిరిగెటోడు. టికెట్‌ కలెక్టర్‌ చెకింగు కోసం రైలు పెట్టెలకు రాంగనే కదులుతున్న రైలు నుండి ప్లాట్‌ఫామ్‌ మీదికి దుంకి కింద బొక్కబోర్ల పడి చాల సార్లు దెబ్బలు తగిలించుకున్నడు. ఆ అనుభవంతోటే టికెట్‌ కొనకుండ ప్యాసింజర్‌ రైలుల హైద్రాబాద్‌కు బయలుదేరినాడు.

రైలు సికింద్రాబాద్‌ చేరుకుంది.

స్వామి నాంపల్లిల దిగాలె. రైలు కదలటానికి ఇంక టైమ్‌ ఉంది కదా అని ప్లాట్‌ఫాం మీద నిలబడినాడు. పక్క పెట్టెల నుండి కిందికి దిగి ఎదురుంగ వస్తున్నడు ‘బాపు’.

తనకు తెలువకుండనే అన్నీ మర్చిపోయి “బాపూ !” అని గట్టిగ అరిచిండు స్వామి. ఆయన దిగ్గున స్వామి దిక్కు చూసి ఆనందంతోటి కొడుకును కావలించుకుని వలవల ఏడ్చిసినాడు.

స్వామికి సిగ్గనిపించింది. అందరి ముందు ఆ ‘సీన్‌’కు.

బాపు తేరుకొని స్వామి చేయి పట్టుకొని అదే రైలు పెట్టెల కూచుండబెట్టుకున్నడు. ఇంతల చాయ్‌ వస్తే రెండు చాయ్‌లు తీసుకొని ఒకటి స్వామికి ఇచ్చి, మరొకటి తను తాగినాడు. సంతోషంతోటి ఆకుల సంచి నుండి పాన్‌ తీసి దాన్ని దౌడకు పెట్టుకొని చిందరవందరగ చెత్త బుట్టోలె ఉన్న స్వామి వంకీల జుట్టును తన వేళ్లతోటి దువ్వి సరి చేసుకుంట-

‘నీ కోసం వరంగల్ల ఉన్న చుట్టాల ఇండ్లన్నీ వెదికి వస్తున్న” అన్నడు. ముందు పెద్దక్క శకుంతల ఇంటికి ‘ములుగు’కు పోయినాడట.

“వాడు తప్పక ఇంటికి వస్తడు, బాపూ !” అని ఆమె భరోసా ఇచ్చిందట.

కొండంత సంతోషంతోటి కొడుకును వెంటబెట్టుకొని ఆయన శాలిబండల తమ ఇంటికి చేరుకున్నడు. రాత్రి తొమ్మిది అవుతున్నది. చలి పులిలాగ ఉంది.

“టక్‌టక్‌.. టక్‌టక్‌…” తలుపు గొళ్లెం కొట్టేసరికి శంకర్‌ మామ ఉరుక్కుంట వచ్చి తలుపు తీసినాడు. స్వామి కనబడంగనే కావలించుకొని, ఎత్తుకొని ఇంట్లకు తీసుకొచ్చినాడు. – “ఎంత పని చేసినవు తమ్మీ !” అని అంగలార్చుకుంట.

ఇంట్ల కిరాయివాళ్లతో సహా ఇంక ఎవళ్లూ పండుకోనట్టుంది. అమ్మను సముదాయించుకుంట అందరూ ఆమె చుట్టే కూర్చున్నరు. వాళ్ల మధ్యన చలి కాచుకునే కుంపటి కూర్పాట్లు పడుతున్నది.

అమ్మ ఈసారి సంతోషం పట్టలేక ఏడ్చింది.

దారి తప్పిన గొర్రె పిల్ల మళ్ల ఇంటికొచ్చింది.

‘పెద్దనాని’ ఇంటికి తిరిగి వచ్చినందుకు అమ్మ పెరుమాండ్లకు ‘తళియరాధన’ చేసింది.

ఆ సంవత్సరం హెచ్‌.యస్‌.సి. పరీక్షల స్వామి ఫెయిల్‌ అయినాడు.

“ఏం ఫరవాలేదు. మిగిలిన పేపర్లు సప్లిమెంటరీ పరీక్షలల్ల రాయొచ్చు” అని ధైర్యం చెప్పినాడు బాపు. అమ్మ కూడ ఏం అనలేదు.

పరీక్షలు ఫెయిల్‌ అయిన దిగులు రవ్వంత కూడ లేని స్వామి ఆ రోజే విడుదలైన షమ్మీపూర్‌ సీన్మా ‘ఎన్‌ ఈవినింగు ఇన్‌ ప్యారిస్‌’ కృష్ణా టాకీసుల చూసి ఇంటికి రాంగనే -

“పరీక్ష ఫెయిల్‌ అయిన అన్న సిగ్గు కూడ నీకు లేదు కదరా” అని పెద్దక్క వ్యాఖ్యానించింది.

ఆ తర్వాత సప్లిమెంటరీ పరీక్షలల్ల బొటాబొటి మార్కులతోటి కంపార్ట్‌మెంటల్‌గా పాసై ఈ సంవత్సరమే పి.యు.సి. ఆర్ట్స్‌ గ్రూపుల సిటీ కాలేజీ అడ్మిషన్‌ తీసుకున్నడు-

“బిలో యావరేజీ స్టూడెంట్‌” స్వామి.

* * *

ఉధృతంగ నడుస్తున్న తెలంగాణ ఉద్యమానికి భయపడి అమ్మాబాపులు స్వామిని ఇంట్లె నుండి అవుతలికి కదలనిస్తలేరు. సక్త్‌ నిగరానీ. జైళ్లల్ల ఖైదీల మీద పోలీసుల కాపలా ఉన్నట్లు. అప్పుడప్పుడూ గుణవర్ధక్‌ సంస్థ లైబ్రరీకి మాత్రం పోనిస్తున్నరు. ‘త్రిమూర్తులు’ దూరమైన ఒంటరితనం స్వామిని బాధపెడుతున్నది. ఉన్న ఇద్దరు దోస్తులు వేణు, యాదగిరి ‘కాంటాక్టు’లకు వస్తలేరు. నిరంతర కర్ఫ్యూలతోటి ఉత్తరాల బట్వాడా బందు అయ్యింది. వేణు ఉత్తరాలు ఆగిపోయినై.

గుణవర్ధక్‌ లైబ్రరీల సభ్యత్వం తీసుకొని వారానికి సరిపడే దొడ్డు దొడ్డు పుస్తకాలను తెచ్చుకొని చదువుకుంటున్నడు. ‘పెరల్‌బక్‌’ సుక్షేత్రం – దాయాదులు, గోర్కీ అమ్మ, టాల్‌స్టాయ్‌ అన్నా కెరినినా, అలెగ్జాండర్‌ కుప్రిన్‌ యమకూపం తెలుగు అనువాద నవలలు స్వామి కోసం కొత్త లోకపు తలుపులను తెరుస్తున్నై. ప్రజల మనిషి, గంగు, రథచక్రాలు, ఓనమాలు వంటి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట నేపథ్యం గల నవలలను ‘సెలెక్టివ్‌’గ చదువుతున్నడు. మైనా, అంపశయ్య నవలలు ప్రాణప్రదంగ కనిపిస్తున్నై. రాహుల్‌ సాంకృత్యాయన్‌, సంజీవ్‌దేవ్‌ రచనలు లోపల ఉన్న ‘సంచార ప్రవృత్తి’ని రెచ్చగొడుతున్నై. చరిత్ర ఒక అబ్సెషన్‌గ అడిక్ట్‌గ మారుతుంది.

స్వామికి గుణవర్ధక సంస్థ లైబ్రరీ పరిచయం కావటం జీవితంల ఒక పెద్ద మలుపు. అదొక అందమైన జ్ఞాపకం. ఇంట్లనే కుదురుగ ఉంటున్న స్వామిని చూసి అమ్మాబాపులు కొంత స్థిమితపడినారు.

భారత్‌ గణవర్ధక్‌ సంస్థ లైబ్రరీ అమ్మ తరవాత మరొక అమ్మ. అన్నం పెట్టిన అమ్మ ఒకరైతే జ్ఞానభిక్ష ప్రసాదించిన మరో అమ్మ ఆ గ్రంథాలయం. అది నగరంలనే చాల పురాతనమైన గ్రంథాలయం సుల్తాన్‌ బజార్‌ శ్రీకృష్ణ దేవరాయల గ్రంథాలయం కన్నా పాతది. నగరంల ఆసఫియా స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీని 1892ల స్థాపించినారు. ఈ గుణవర్ధక్‌ సంస్థ లైబ్రరీని 1895ల, కృష్ణదేవరాయల లైబ్రరీని 1901ల స్థాపించినారు. శాలీబండాల నివసించే మహారాష్ట్రులల్ల జాతీయ భావాలు అధికంగ ఉండేవి. వాళ్లు చత్రపతి శివాజీ నుండే కాక ‘గోఖలే, తిలక్‌ నుండి కూడా స్వాతంత్య్ర సమరస్ఫూర్తిని పొంది గుణవర్థక్‌ సంస్థ గ్రంథాలయాన్ని స్థాపించినారు. ఆ భవనం క్రింద భూగృహంల తాలింఖానాను ఏర్పాటు చేసి యువకులకు కత్తిసాము, ముష్టియుద్ధం, వ్యాయామాన్ని నేర్పించెటోళ్లు. ఉత్తరోత్తరా ఈ గ్రంథాలయాలు, తాలింఖానాల నుండే నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాట యోధులు ఉద్భవించినారు. గుణవర్ధక్‌ సంస్థ గ్రంథాలయం ముందు మరాఠీ గ్రంథాలయంతోటి ప్రారంభమయ్యి తరవాత కాలంల అన్ని భాషల గ్రంథాలతోటి నిండిపోయింది.

అమ్మ. అమ్మ చిటికెన వేలు పట్టుకుని స్వామి. అప్పుడు స్వామి వయస్సు పదేళ్ల లొపేనేమో! ఏవో వస్తువులు కొనటానికి వాళ్లిద్దరూ బజారుకు నడుసుకుంట పోతున్నరు. దారిల ఒక పెద్ద భవనం కనబడింది. దానిలోపలికి పోయ్యేందుకు ఒక పెద్ద నల్లని దర్వాజా. దానిపై నగిషీలు, చెక్కణాలు, పూలు, లతలతో చాలా ఆకర్షణీయంగ కనబడింది. మరుక్షణమే దానికన్న మరో దృశ్యం స్వామిని బాగ ఆకర్శించింది. ఆ దర్వాజా పైన పెద్ద గూడు. ఈజీగ అండ్ల ఒక మనిషి కూచునేటంత స్థలం. అండ్ల బాలుడి పాలరాతి విగ్రహం ఉంది. ఆ బాలుడికి సరిగ్గ తన వయస్సే ఉంటదేమో! ఆ బొమ్మ కూచుని దీక్షగ పుస్తకంల లీనమై చదువుతున్నట్లు తల కొంచెం దించుకుని ఉంది. ఆ బాలుడూ ఆ పుస్తకం తనను అమితంగ ఆకర్షించినై.

“అమ్మా అదేంటిది?” ఆ విగ్రహం వైపు వేలు చూపిస్తూ అడిగినాడు స్వామి.

“అది లైబ్రరీ.”

“అంటే”?

“అండ్ల కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు ఉంటై.”

“ఎవరైనా పోయి చదువుకోవచ్చా?”

“ఆఁ నువ్వు కూడ.”

స్వామికి అట్ల భారత గుణవర్ధక్‌ సంస్థ లైబ్రరీ అమ్మతోటి మొదటిసారి పరిచయ మయ్యింది. అసలు లైబ్రరీ అన్న పదమే అమ్మతోటి తెలిసింది. స్వామికదివరకే బొమ్మల పుస్తకాలు, పిల్లల కథల పుస్తకాల గురించి తెలుసు. కాని లైబ్రరీ అన్న సంగతి మాత్రం తెలియదు. ఆ క్షణంల తనకు లైబ్రరీలకు – సాహిత్యానికి – వ్యక్తిత్వానికి గట్టి పునాది పడింది. సాహిత్యం జీవితాన్ని నడిపే చోదక శక్తిగ మారింది.

ఆ తెల్లారి స్వామి ఒంటరిగ ఆ లైబ్రరీకి పోయినాడు. మెట్లెక్కి లోపలికి పోతుంటే భయమేసింది. విశాలమైన హాలు. ఆ హాలుకు నలుమూలల గోడలు కనబడతలేవు. పుస్తకాలతోటి నిండిన ర్యాకులు, అలమరాలు, ఎటుచూస్తే అటు వేల వేల పుస్తకాలు. ఆ హాలు మధ్యల పొడుగైన టేబుళ్లు. వాటి పక్కన వరుసగ ఉన్న కుర్చీలల్ల కూచొని సీరియస్‌గ, నిశ్శబ్దంగ చదువుకుంటున్న పాఠకులు. పైన ఫ్యాన్‌ చప్పుడు కింద పేపర్లు త్రిప్పుతున్న చప్పుడు తప్ప అక్కడ అంత నిశ్శబ్దమే. నిశ్శబ్దమే దేవతల నివాస స్థలం. చదువుకుంటున్న పాఠకులందరూ స్వామి కండ్లకు తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులలాగ కనిపించినారు.

ఆ రోజు స్వామి జీవితం మరోదారిలకు మళ్లింది. చిన్న పిల్లల సెక్షన్‌ల పుస్తకాలన్నీ నెమ్మదిగ చదవడం మొదలయ్యింది. కొన్ని అర్థం అయ్యి మరికొన్ని అర్థం కాక పోయినా రీడింగు ఒక అలవాటుగ మారింది. అరేబియన్‌ నైట్స్‌ కాశీమజిలి కథలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి మొదలుకొని చేతికందిన ప్రతి పుస్తకం చదివినాడు.

స్వామి హైస్కూలుకు వచ్చేసరికి స్కూలు ఎగొట్టి లైబ్రరీలల్ల కూచొని ఇష్టమున్న పుస్తకాలన్నీ చదివెటోడు. ఆ చదువు ముందు స్కూలు చదువులు రంగురుచి వాసనలేని రసవిహీనమైన చదువులుగ తోచినై. బాపు స్కూలు టీచర్‌ అయినందున ఇల్లంత పుస్తకాల వాతావరణమే. అమ్మబాపు అక్కలు అందరి దగ్గర అక్షరాల గుబాళింపులు. పుస్తకాల పరిమళాలు అక్షరాలు. అక్షరాల లోకంలకు తనెప్పుడు ప్రవేశించినాడో, అక్షరాలతోటి ఏ వయస్సుల ప్రేమల పడ్డాడో తనకే సరిగ్గ తెలియదు.

ఆ అందమైన అక్షరాల బాట స్వామిని గ్రంథాలయ దేవాలయంలకు ప్రవేశపెట్టింది.

… తరువాత భాగం ఒచ్చే వారం

2 Responses to “సలాం హైద్రాబాద్ : పన్నెండో భాగం”

  1. 1
    none Says:

    అడిదం అప్పారావు శాస్త్రి గురించి వాడి నీతి మాలిన బ్రతుకు గురించి క్రింది లింక్ లో చూడండి.

    http://telugusimha.blogspot.com/

  2. 2
    Apparao Sastri Says:

    plz delete this comment

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com