సలాం హైద్రాబాద్ : పదమూడో భాగం
జనవరి 25th, 2010 by డిస్కవర్ తెలంగాణ
13
1969 జూన్ నెలను తెలుగు పంచాంగం ‘రక్తాక్షిమాసం’ అని పేర్కొంది. ఆ పేరుకు తగ్గట్టు నిజంగనే తెలంగాణాల ఆ నెల అంతా రక్తం ప్రవహించింది. ఆ రక్తాక్షి మాసమంత పోలీసుల కాల్పులతోటి, తెలంగాణా ప్రజల బలిదానాలతోటి దద్ధరిల్లిపోయింది. జూన్ రెండవ తేదీ సోమవారం నుండి నాలుగు రోజులు కొనసాగిన అల్లర్లు, మారణకాండల ప్రభుత్వ లెక్కల ప్రకారమే నగరంల 30 మందికి పైగా మరణించినారు. వందలాది మందికి గాయాలైనాయి. అండ్ల కొందరు శాశ్వతంగ అవిటివారైనారు. అనధికార లెక్కలు తెలుసుకుంటే గుండెలు బద్దలయితయి. ఎన్ని సార్లు కర్ఫ్యూ విధించినా పరిస్థితి అదుపులకు రానందున 33 గంటల పాటు నిరవధిక కర్ఫ్యూ విధించినారు. జనజీవనం స్తంభించిపోయింది. అనేక జీవితాలు అల్లకల్లోలాలయినై. కుటుంబాలు కూలిపోయినై.
నాలుగవ తేదీ బుధవారం నాడు జంటనగరాలల్ల 14 సార్లు కాల్పులు జరగగా అక్కడకక్కడే రోడ్ల మీద క్షణాలల్లనే తొమ్మిది మంది ప్రాణాలు విడిచినారు. అండ్ల ఐదుగురు హైద్రాబాద్, ముగ్గురు సికింద్రాబాద్‌ల మరణించినారు. కర్ఫ్యూ ఉన్న సమయంల ఏడుసార్లు కాల్పులు జరిగినై. భాష్పవాయువు, లాఠీచార్జిలకు లెక్కేలేదు.యువకులను, విద్యార్థులను తెలంగాణా పోలీసులు లాఠీలతో కొట్టేటప్పుడు వారికి తమ పిల్లలు జ్ఞాపకం వచ్చి కండ్లల్ల నీళ్లు తిరిగినయని ఇప్పటికీ రిటైర్డు పోలీసులు చెప్పుతుంటరు. తెలంగాణా పోలీసుల్ని నక్సలైట్లను అణచడానికి ఆంధ్రా ప్రాంతం పంపి, మలబారు పోలీసుల్ని తెలంగాణాల నియమించినారు. వారికి ఇక్కడి వాళ్లతో తాదాత్మ్యం లేనందున భాష రానందున క్రూరంగ ప్రవర్తించినారు.
హైద్రాబాద్ నగరం ఆబిడ్స్ చౌరస్తా సమీపంల దుర్గా విలాస్ హోటల్ ఉంది. అది కోస్తా వాళ్లది. తెలంగాణా ఉద్యమాన్ని అణచడానికి కిరాయి గుండాలు, రౌడీలను తీసుకొచ్చి అండ్ల ఉంచినారు. జూన్ రెండవ తేదీన తెలంగాణా ప్రజా సమితి పిలుపు మేరకు నగరమంత బంద్‌కు ప్రతిస్పందించి సహకరించినా ఆ హోటల్ మాత్రం తెరిచే ఉంది. బంద్ చేయమని ప్రజలు పోయి అడిగినప్పుడు కొట్లాటలు చెలరేగినై. లోపలున్న రౌడీలు కారంపొడి, కత్తులతో దాడి చేసినారు. ఒక గంట సేపు హోటల్ ముందు నడిరోడ్డు మీద రెండు వర్గాలవారికి హోరాహోరీ పోరాటం జరిగింది.
హోటల్ లోపలికి చొచ్చుకపోయిన ప్రేంకిశోర్ అనే యువకుడిని రౌడీలు ముందు షట్టర్లు దింపి ఆ తర్వాత లోపల చిక్కుకుపోయిన అతడ్ని కత్తులతో పొడిచినారు. అప్పటికి అతని వయస్సు 18 సంవత్సరాలు. కేశవ మెమోరియల్ హైస్కూలుల చదువుకుంటనే మోటార్ సైకిల్ మెకానిక్‌గ పని నేర్చుకునెటోడు. ఆ అందమైన బిడ్డను రౌడీలు కత్తులతోటి పొత్తి కడుపు కింద కసిదీరా పొడిచినారు. లోపల నుండి ప్రేంకిశోర్ అరుపులు వినిపించంగనే ఇవతలున్న ప్రజలు ప్రమాదాన్ని పసిగట్టి హాహాకారాలు చేసినారు. కొంతమంది యువకులు ప్రాణాలకు తెగించి ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కి హోటల్ బాల్కనీల గుండా కిటికీలల్ల దూరి లోపలికి ప్రవేశించినారు. కానీ అప్పటికే ప్రేంకిశోర్ ప్రాణాలు కొస ఊపిరిన ఉన్నై. అభిమన్యుడిలాగ పద్మవ్యూహంల చిక్కి తీవ్రంగ గాయపడిన ఆ యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకపోయేందుకు పోలీసులు సహకరించలేదు. దారిన పోయే ఒక ప్రైవేట్ కారుల ప్రజలే అతడిని ఉస్మానియా దవాఖానాకు తీసుపోతుంటే దారిలనే ప్రాణాలు విడిచినాడు.
కర్ఫ్యూను లెక్క చేయని జనం. వీధులల్ల పోలీసులతోటి గెరిల్లా పద్ధతిల దాగుడు మూతలాడినారు. ప్రజలు రోడ్ల మీద బారికేడ్లను నిర్మించినారు. రోడ్లకు అడ్డంగ టెలిఫోన్ స్తంభాలను పీకి పడేసినారు. చెత్తకుండీలను దొర్లించుకొచ్చి గోడలు కట్టినారు. ఫుట్‌పాత్‌లను పగులగొట్టి పెద్దపెద్ద బండరాళ్లను రోడ్లపై వేసినారు. కొన్ని చోట్ల టెలిఫోను వైర్లతో, ముళ్లకంచెలతో తమకు పోలీసులకు మధ్య సరిహద్దులను నిర్మించుకొన్నరు. ఫైరింజన్లు, పోలీసు వాహనాలు దిగ్బంధనం చేయబడినై. పోలీసు కాల్పులల్ల ఉద్యమకారులే గాక అల్లర్లతో సంబంధం లేని సామాన్య ప్రజలు కూడ చనిపోయినారు.
పాత నగరం ఆలియాబాద్‌ల కాల్పులు జరుగుతున్నై. మెయిన్ రోడ్డు మీదనే వెంకటేశ్వరరావు అనే న్యాయవాది ఇల్లు. కాల్పుల చప్పుడు అవుతుంటే ఏమీ తెలియని ఆయన చిన్న కొడుకు బయటి అరుగుల మీద నిలబడి చూస్తున్నడు. ఆ బాబును లోపలికి లాగటానికి ఆయన ఆత్రంగ ఇవతలికి వచ్చి వాన్ని తీసుకొని ఇంట్లకు తిరిగి పోబోతుండగ గుండు దెబ్బ తలకు తగిలి ఆ తలుపు గుమ్మం దగ్గరే కిందపడి ప్రాణాలు విడిచినాడు. ఆ న్యాయవాదికి చివరికి లభించిన న్యాయం అదే.
కవాడిగూడాల ఆకుల నరేందర్ అనే 15 సంవత్సరాల విద్యార్థి తన ఇంట్ల మేడ మీద కూర్చొని పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటే ఒక తూటా అతడి బంగారు భవిష్యత్తును దూరం చేసింది. ఆ పిల్లగాడి పుస్తకాలు రక్తపు మడుగుల తడిసిపోయినై. చాదర్‌ఘాట్ ప్రభుత్వ పాఠశాలల ఆరవ తరగతి చదువుతున్న రేణుక వయస్సు 11 సంవత్సరాలు. ఆ బాలికకు మూడు బుల్లెట్లు తగిలి మరణించింది. ఆ మరణానికి బస్తీ మొత్తం ఏడ్చింది. సికింద్రాబాదు కోనేరు సమీపంల శ్రీమతి సావిత్రి తన ఇంటి ముందు నాలుగు సంవత్సరాల కొడుకు శివకుమార్‌తో నిలుచొని ఉంటే పోలీసుల కాల్పులకు గురై మరణించింది. ఆమె భర్త నిజంగనే పిచ్చివాడైపోయినాడు. ఇట్ల ఎంతో మంది అమాయకులు అకాల మరణం పొందినారు.
అల్లర్లు అదుపులకు రానందున అనేక సార్లు కర్ఫ్యూను విధించినారు. జనజీవనం అల్లకల్లోలమైంది. చాలా మందికి ఇంకా జీతాలు రానే లేదు. వచ్చినా సరుకులు కొనడానికి దుకాణాలు తెరిచి లేవు. అందరి ఇండ్లల్ల సరుకులు నిండుకున్నై. పొరుగువారి నుండి చేబదులు తీసుకురావాలంటే అందరి ఇండ్లల్ల అదే పరిస్థితి. రోజూ కూలినాలీ చేసుకునెటోళ్ల పరిస్థితి మరీ అధ్వాన్నం. ఆసుపత్రికి పోయే ఎమర్జెన్సీ కేసులు అంతే సంగతి. దైవాధీనం. కనీసం వీధిలకు పోయి బజారు నల్లాల్ల నీళ్లు పట్టుకోవాలన్నా పోలీసుల లాఠీల భయం. తుపాకీ తూటాల భయం. గల్లీలల్ల చిన్న చిన్న దుకాణాలను రహస్యంగ సగం సగం తెరిచి భయం భయంగ సరుకుల్ని అమ్మెటోళ్లు. కర్ఫ్యూ ఎత్తివేయంగనే లేదా సడలించంగనే ధరలు చుక్కలు తాకినై.
ఎక్కడైనా ఒక చిన్న హోటల్ తెరిచి ఉంటే టీ, కాఫీలు పాలు, చక్కెర లేకుండ అమ్మినారు. ఇంక దినపత్రికల సంగతి చెప్పనే అక్కరలేదు. ప్రజలకు తిండి లేకున్న సరే. తెలంగాణా ఉద్యమ వార్తలు కావాలె. బ్లాకుల పేపర్లు ఎక్కువ ధరకు అమ్మినా సంతోషంగ కొనుక్కున్నరు. ప్రతి ఇంట్ల పురాణ శ్రవణంలాగ ఎవరో ఒకరు పేపరు పెద్దగ చదువుతుంటే మిగిలినవారు చుట్టూ కూర్చొని శ్రద్ధగ వార్తలు వినేటోళ్లు. రేడియోల ప్రాంతీయ వార్తలు ఎప్పుడు వస్తయా అని ఎదురుచూపులతోటి గడిపేటోళ్లు. వార్తలు చదువుకుంట, వినుకుంట కండ్ల నీళ్లు పెట్టుకునేటోళ్లు. ఉద్రేకపడేటోళ్లు. సర్కారుకు శాపాలు పెట్టేటోళ్లు.
మరో వైపు తమ పిల్లలను ఆందోళనల పాల్గొనకుండ ఆపటం పెద్ద తలనొప్పిగ పరిణమించింది. వాళ్లను ఇండ్లల్ల బంధించి తలుపులకు తాళాలు వేసేటోళ్లు. పిల్లలకు అవతలికి వెళ్లి సాహసాలు చేయాలని మహా కుతూహలంగ ఉండేది. ఒక వాడల ఉన్న పిల్లవాడు జైల్ల ఉంటే ఆ వాడకట్టు వాళ్లందరూ మిఠాయిలు, పండ్లు పట్టుకొని జైలుకు పోయి ‘ములాఖత్’ చేసి వాడిని పరామర్శించేటోళ్లు. తెలంగాణా ఉద్యమం వలన తెలంగాణా ప్రజలల్ల ఒక నూతన పోరాట సంస్కృతి వ్యాపించింది.
భగ్గుమన్న నగరాన్ని పరామర్శించడానికి జూన్ నాలుగున అర్ధరాత్రి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హైద్రాబాద్‌కు వచ్చి తెల్లారే వరకు విద్యార్థి నాయకులను, తెలంగాణా ప్రజాసమితి నాయకులను అన్ని రాజకీయ పార్టీలను విడివిడిగ కలిసి వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుంది. “33 గంటల నిరంతర కర్ఫ్యూ వార్త విని ఆందోళన చెంది వచ్చినానని, శాంతి కోసం తెలంగాణా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్ననని, ప్రశాంత పరిస్థితులు ఏర్పడంగనే అన్ని విషయాలు చర్చించుకోవచ్చునని ఆమె అన్నది. వెంటనే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెలంగాణా ప్రజా సమితి విజ్ఞప్తి చేసింది.
ఆ తెల్లారి హైద్రాబాద్ నగరంల తెలంగాణా రచయితల సదస్సు జరిగింది. కాళోజీ నారాయణరావు అధ్యక్షుడిగ ఒక కమిటీ ఏర్పడింది. ఆ సదస్సుకు హాజరైన రచయితలంత ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు కోసం పోరాడుతమని ప్రతిజ్ఞ చేసినారు. జూన్ 7న ఆ మూడు రోజుల పోలీసు కాల్పులకు నిరసనగ జంటనగరాలల్ల రెండున్నర లక్షల మంది కార్మికులు సార్వత్రిక సమ్మె చేసినారు. జూన్ 10 నుండి తెలంగాణా ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభమయ్యింది. ప్రభుత్వం 29 మంది తెలంగాణా ఉపాధ్యాయ నాయకుల్ని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేసింది. అమోస్, స్వామినాథం మొదలగు ఉద్యోగనాయకులను అరెస్టు చేసి జైల్ల పెట్టింది.
జూన్ 25న హైద్రాబాదుల జరిగిన సత్యాగ్రహం స్వాతంత్య్రోద్యమ కాలంనాటి పోరాట దృశ్యాలను జ్ఞాపకానికి తెచ్చింది. అనేక సంఘటనలతోటి హైద్రాబాద్ అట్టుడికి పోయింది. ఆ రోజు మొత్తం తెలంగాణాల యాభై వేల మంది ప్రజలు సత్యాగ్రహం చేసి అరెస్టు అయినారని దినపత్రికలు రాసినై. జైళ్లు నోళ్లు తెరుచుకున్నై. హైద్రాబాదు అగ్నిగుండంగ మారింది. ఆ రోజు ఆబిడ్స్ చౌరస్తాల జరుగబోయే సత్యాగ్రహం ఆపాలని పోలీసులు ఉదయం ఆబిడ్స్‌కు చేరుకొనే మార్గాలను దిగ్బంధనం చేసినారు. వీధులల్ల సైన్యం ఫ్లాగుమార్చ్ చేసి ప్రజలల్ల భయం సృష్టించాలని ప్రయత్నం చేసింది. అయినా ప్రజలు బెదరలేదు. బస్సులన్నింటినీ ప్రభుత్వమే బందు చేసింది. అయినా ప్రజలు కాలినడకన వచ్చినారు. పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతాయని పుకార్లను సృష్టించింది. అయినా జనం ప్రభంజనంలాగ మారిపోయినారు.
ఆ రోజు విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే కాక స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అందరూ కదిలి వచ్చినారు. లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, కార్మికులు కూడ సత్యాగ్రహానికి తరలి వచ్చినారు. ఆ జనప్రవాహాన్ని ఆపటం పోలీసులకు చాత కాలేదు. సత్యాగ్రహం చేస్తున్న వేలాదిమందిని ఎట్ల అరెస్టు చేయాల్నో, ఎక్కడికి తీసుకపోవాల్నో వాళ్లకు తోచలేదు. చివరికి ఆ జన సముద్రాలను చెదరగొట్టడానికి విపరీతంగ, విచక్షణారహితంగ లాఠీచార్జి చేసి టియర్‌గ్యాస్‌లను వదిలినారు. పోలీసులు ప్రజలను లాఠీలతోటి కొడుతుంటే లాఠీలే విరిగిపోయినై.
తెలంగాణా నేలతల్లి రక్తసిక్తమయింది. ఒళ్లంత గాయాలమయమైంది. ఆబిడ్స్‌ల పోలీసులు యువకులను లాఠీలతో కొట్టుకుంట టియర్‌గ్యాస్ వదులుతుంటే అనేక మంది యువకులు తమ షర్టులను చింపుకొని ఛాతీలను చూపిస్తూ దమ్ముంటే కాల్చమని సవాలు చేసినారు. భవనాలపై నిలబడి, కిటికీలల్ల నుండి చూస్తున్న చాలా మంది ప్రజలు ఆ యువకులు, విద్యార్థులు తింటున్న దెబ్బల్ని చూసి హాహాకారాలు చేసినారు. కంట తడిపెట్టుకుంట గొల్లున ఏడ్చినారు. సమీప దుకాణంల పనిచేస్తున్న ఒక యువకుడిని పోలీసులు అకారణంగ కొడుతుంటే ఆ యువకుడు గొల్లుగొల్లున ఏడుచుకుంట తాను సత్యాగ్రహిని కాదని పనిచేసే నౌకరునని మొత్తుకున్నా వినలేదు. చివరికి అతడి తల పగిలింది. అంతవరకు తనను కాల్చమని ఛాతీ చూపించిన యువకుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి తన షర్టును చింపి ఆ యువకుడి తలకు కట్టు కట్టినాడు. ఇటువంటి అపూర్వ, మానవతా దృశ్యాలు ఆ ఉద్యమంల ఎన్నో జరిగినై.
లాఠీచార్జి, భాష్పవాయువుల నుండి తప్పించుకునేందుకు ప్రజలు సమీపంల ఉన్న ప్యాలెసు టాకీసు, సాగర్ టాకీసులకు దూరినారు. అయినా పోలీసులు వారిని వెంబడించి తరిమి తరిమి కొట్టినారు. ఇంతల అక్కడికి వచ్చిన సర్వే ఆఫ్ ఇండియా జీపును ప్రజలు పూర్తిగ తగులబెట్టినారు. ఆ మంటల్ని ఆర్పటానికి వచ్చిన ఫైర్ ఇంజన్ చక్రాలల్ల గాలిని తీసేసి దాన్ని కూడ తగులబెట్టినారు. అల్లర్లు నాంపల్లి, మొజాంజాహీ మార్కెట్, సుల్తాన్ బజార్‌లకు వ్యాపించినాయి. విద్యానగర్ రైల్వే స్టేషన్‌ల వేలాది మంది ప్రజలు రైలు పట్టాల మీద బైఠాయించి రైళ్ల రాకపోకలకు భంగం కలిగించినారు.
ఆబిడ్స్‌ల సత్యాగ్రహం చేస్తున్న ప్రజలు అక్కడికి సమీపంల ఉన్న బృందావన్ హోటల్ ముందు వేలమంది ఆగ్రహావేశాలతోటి గుమికూడినారు. దుర్గా విలాస్ హోటల్ కూడ వీరిదే. అప్పటికే ఆ హోటల్ మీద వారికి చాలా ద్వేషం ఉంది. ప్రేంకిశోర్‌ను ఆ హోటల్‌వారే కత్తులతో పొడిచి చంపినారు. కిరాయి గుండాలకు ఆ హోటల్ బసగ మారింది. ఆ కారణాల వల్ల గుమికూడిన ప్రజలు హోటల్ మీద దాడి చేసి బోర్డును పీకేసినారు. అండ్లకు దూరి గ్లాసులూ ప్టేట్లు బద్దలుకొట్టడమే కా పర్నీచర్‌ను ఇవతలికి గుంజుకొచ్చి రోడ్డు మీద కుప్పగ పోసి తగులబెట్టినారు. ప్రేమ్ కిశోర్ అమర్ హై అని నినాదాలు చేసినారు. ఈ హోటల్ పైభాగం టెర్రేస్‌పైన దాక్కున్న కిరాయి రౌడీలు కిందున్న ప్రజల మీద రాళ్లూ సోడాసీసాలు విసరటం ప్రారంభించినారు. రెచ్చిపోయిన గుంపులే మళ్ల హోటల్లకు చొచ్చుకొని పోతే లోపల గుండాలు కారం పొడి, చైన్‌లు, కత్తులతోటి దాడి చేసినారు. ఆ యుద్ధం రెండు గంటల పాటు కొనసాగింది.
చివరికి పోలీసు కాల్పులు జరపటానికి సిద్ధపడినారు. ఆ దశల శ్రీధర్ రెడ్డి, మరికొంత మంది యువకులు పోలీసులకు ప్రజలకు మధ్య బారికేడ్లలాగ నిల్చొని రెండు వర్గాలవారిని శాంతింపజేసే ప్రయత్నం చేసినారు. అనేకసార్లు శ్రీధర్ రెడ్డి రెండు చేతులు ఎత్తి రెండు వైపుల దండం పెట్టినాడు. ఒక దశల కాల్పులు జరిపేదుంటే ముందు నన్ను కాల్చి చంపండి అని వేడుకుంట తన లాల్చీని చింపుకొని ఛాతీని చూపించినాడు. అప్పుడు పోలీసులు వెనక్కి తగ్గినారు. లేకపోతే ఆ రోజు చాలమంది ప్రాణాలు గాలిల కలిసేటివి. ఇటువంటి అద్భుత సాహసదృశ్యాలు, మానవతా దృశ్యాలు ఆ ఉద్యమంల ఎన్నో జరిగినై. మామూలు ప్రజలు ఎన్నో వీరోచిత సాహస కార్యాలు చేసినారు. అరెస్టు చేసిన వేలాది మందిని సిటీ కాలేజీకి తరలించినారు. కోపం పట్టలేని బందీలు అక్కడి ప్రిన్సిపల్ ఆఫీసును పూర్తిగ తగులబెట్టినారు.
అదే రోజు రాత్రి ముషీరాబాద్ జైలుల సత్యాగ్రహుల మీద లోపలున్న ఖైదీలు దాడి చేసి తీవ్రంగ గాయపరిచినారు. దీని వెనుక జైలు అధికారుల ప్రోత్సాహం కూడ ఉంది. ఆ రోజు రాత్రి భోజనాల సమయంల ఖైదీలకు, సత్యాగ్రహులకు గొడవ జరిగింది. దాన్ని సాకుగ తీసుకొని ఖైదీలు గూడుపుఠాణీ చేసి ఒక పద్ధతి ప్రకారం పొయ్యి కట్టెలు, కారం, గంటెలు మొదలగు వంట సామానులతోటి నిరాయుధులైన సత్యాగ్రహులపై దాడి చేసి తీవ్రంగ కొట్టినారు. గొడవలు చెలరేగంగనే పోలీసులు జోక్యం చేసుకొని మళ్లీ సత్యాగ్రహులనే టార్గెట్లుగ చేసి కొట్టినారు. జైలు ఆవరణల గాలిలకు కాల్పులు జరిపినారు. 70 మంది సత్యాగ్రహులకు తీవ్ర గాయాలైనై.
జైలు లోపల పోలీసుల విజిల్సు, అరుపులు, కాల్పుల చప్పుడు, హాహాకారాలు, జై తెలంగాణా నినాదాలతోటి లోపల ఏదో ప్రమాదం జరిగిందని జైలు చుట్టుపక్కల ఇండ్లవాళ్లకు తెలిసిపోయింది. క్షణాలల్ల వార్త పట్టణమంత పాకింది. నగరం నలుమూలల నుండి సత్యాగ్రహ ఖైదీల తల్లిదండ్రులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు తండోపతండాలుగ ముషీరాబాదు జైలుకు చేరుకున్నరు. స్త్రీలు పిల్లల రోదనలతో పరిసరాలు దద్ధరిల్లినై. ప్రజలు జైలును చుట్టుముట్టి తమ వాళ్లను వెంటనే చూడాలని పట్టుపట్టినారు. వాళ్లందరినీ పేరు పేరునా జైలు గోడలకు ఇవతల నిలబడి పిలువసాగినారు. గేట్లను దబదబా బాదినారు. రాళ్లు విసిరినారు.
జైలు అధికారులను శాపనార్థాలు పెడుతున్నరు. రోడ్లపై గాయపడిన వాళ్లను దవాఖానాకు తీసుకపోయేందుకు కూడ వీలు లేకుండ జైలు ముందు, రోడ్ల మీద ప్రజా సమూహాలు పోగైనాయి. అందరి కండ్లల్ల తమ వారికేమైందో అన్న ఆందోళన, పరేషాన్. కొంతమంది లోపలికి దూసుకపోయే ప్రయత్నాలు చేస్తున్నరు. వాళ్లను చెదరగొట్టడానికి మళ్లీ పోలీసులు లాఠీఛార్జి చేసి టియర్‌గ్యాస్ వదులుతున్నరు. ఇంతల జైలు ఇవతలి నుండి పెట్రోలుతోటి తడిసిన గుడ్డలను కిటికీల నుండి లోపలికి విసిరేస్తే జైలు ఆఫీసు తగులబడుతుంది. దాన్ని ఆర్పటానికి ఫైర్ ఇంజన్‌లు వచ్చినా ప్రజలు తోవ ఇవ్వనందున దూరంగనే ఆగిపోయినై. జైలు లోపల గొడవల సంగతి తెలిసి కాంగ్రెసు నాయకుడు, పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి జీపుల జైలు దగ్గరికి రాంగనే ఆయన జీపు ఉల్టా పడి తలకు తీవ్రంగ గాయాలైనై. పోలీసులు పేల్చిన తూటా జీపు టైరుకు తగిలి అది ఉల్టపల్ట అయింది. అక్కడ జమయిన ప్రజలందరినీ తిత్తరబిత్తర చేసి ఆయనను దవాఖానాకు తీసుపోయినారు.
అదే రోజు రాత్రి ప్రభుత్వం 16 మంది అగ్రనాయకులను అరెస్టు చేసి తెల్లవారక ముందే తెలంగాణా సరిహద్దుల్ని దాటించి రాజమండ్రి జైలుకు పంపింది. మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, బద్రీ విశాల్ పిట్టీ, హాషిం, ఇ.వి. పద్మనాభంలు అందులో కొందరు. తెల్లవారి ప్రజలు నిద్రలేచేసరికి నాయకుల అరెస్టులు వాళ్లకు ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించినై.
మరునాడు జూన్ 26న అగ్రనాయకుల అరెస్టుకు నిరసనగ జంటనగరాలల్ల ప్రజలు స్వచ్ఛందంగ బందును నిర్వహించినారు. ఘట్‌కేసర్‌ల ఉన్న బ్రూక్‌బాండ్ కార్మికులు మొదటిసారి సమ్మెలకు దిగినారు. ఆ అరెస్టులకు నిరసనగ పార్లమెంటు సభ్యులైన డా|| మేల్కోటే, సంగం లక్ష్మీబాయమ్మలు తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా ఇస్తమని బెదిరించినారు. సికింద్రాబాద్‌ల వెండి, బంగారు నగల వర్తకులు ఒక ప్రత్యేక ఊరేగింపును నిర్వహించినారు. జంట నగరాల న్యాయవాదులు నాలుగు వందల కార్లల్ల ఊరేగింపుగ బయలుదేరి రాజ్‌భవన్‌కు చేరుకొని గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఒక మహాజరును సమర్పించినారు. న్యాయవాదులు రంగంలకు దిగి అటువంటి కార్ల ఊరేగింపు నిర్వహించటం అంత వరకూ కనీవిని ఎరుగని అద్భుత దృశ్యం.
వేణు దగ్గరి నుండి ఒక రోజు ‘తోకలేని పిట్ట’ లష్కర్ నుండి ట్యాంక్ బండ్ దాటి హైద్రాబాద్ పాతనగరంల ఉన్న స్వామి ఇంటి ముంగిట్ల వాలింది. అండ్ల ఒకే ఒక చిన్న పోయెం.
“జై”లు, జైలు, “జై”లు
“జై”లు కొడితె జైలు
జైలు కెడితే “జై”లు
జైలులో మన “జైజై”లు
“జైజై”లలో ఖైదీ అయిన జైలు
… తరువాత భాగం ఒచ్చే వారం




మన్షిగ షెప్పినవ్.
మరి తెలగాన వచ్చిండా ? .. రాలె !
మళ్ళా 70ల్లో లొల్లి మధ్యలా షురూ చేసిరి, ఇచ్చిండ్రా? ..గీయలే!
గిప్పుడు కెసిఆర్ వచ్చి తల నరుక్కుంటాం అనిషెప్పిండు , నరుక్కున్నాడా? నరక్కోలే! మరి ఎవలిస్తారు?
గీసారి అస్సల్ ఎవలూ గడబిడ చేస్తలేరు , గీసారి వస్తదా? గేమో!