సలాం హైద్రాబాద్ : పద్నాల్గో భాగం
ఫిబ్రవరి 1st, 2010 by డిస్కవర్ తెలంగాణ
14
ఏ బొంబై కా తమాషా దేఖో
ఏ చార్ దిన్‌కా తమాషా దేఖో
ఏ కల్‌కత్తా కాళీ మాతా దేఖో
ఏ బెజ్వాడా కనకదుర్గా దేఖో
ఏ చారానా తమాషా దేఖో
ఏ బార్ బార్ తమాషా దేఖో
ఏ బొంబై కా తమాషా దేఖో
స్వామి తన మిత్రబృందంతోటి ఆ బొంబై కా తమాషా ముందు నిలబడి ఉన్నడు.
బొంబై కా తమాషా నడుస్తుంది. ఒక రాజస్థానీ జిప్సీ మహిళ గజ్జెలు కట్టుకున్న చేతులతో బైస్కోపు డబ్బా మీద లయబద్దంగ కొట్టుకుంట తన జీర గొంతుతోటి యాసగ ఆ పాట పాడుతుంది. మొదటి రెండు చరణాలు ఉచ్ఛస్వరంతోటి మిగిలిన చరణాలు మధ్యస్వరంతోటి చివరి చరణాలు మళ్లీ ఉచ్ఛస్వరంతోటి ఆరోహణ, అవరోహణలతోటి పాట జలపాతంలాగ ప్రవహిస్తుంది. రంగు రంగుల అద్దాలు, చమ్కీలు, అల్లికలతోటి కొద్దిగ మోకాళ్ల కింది దాక లంగ. అటువంటిదే అద్దాల బిగువు రవిక, రెండు జడలతో, రాగి రంగు చర్మంతో, సుర్మా కళ్లతో మధ్య ఆసియా రూపురేఖా విలాసాలతో చాలా ఎత్తుగ, బలంగ ఆమె ప్రత్యేకంగ కనబడుతుంది. చంకల ఇరికించుకున్న స్టాండు తీసి నేల మీద నిలబెట్టి తల మీద బైస్కోపు డబ్బాను దాని మీద అమర్చింది. ఆ డబ్బాకు రెండు పొడుగు గొట్టాలు ఉన్నై. వాటికి బూతద్దాలు బిగించినారు. చారానా ఇచ్చినవారు ఒక కన్ను మూసి మరో కంటితో ఆ బూతద్దం లోపలికి తొంగి చూస్తే దాని లోపల దాగిన రంగు రంగుల అద్భుత విశ్వరూప సందర్శనం జరుగుతది.
ఒక దిక్కు నుండి మరో దిక్కుకు కాగితం బొమ్మల రీలు తిరుగుతుంటే అండ్ల ఉన్న బొంబై పట్నం, కల్‌కత్తా కాళీ మాత, బెజవాడ కనకదుర్గ, చార్మినార్, కుతుబ్‌మినార్, తాజ్‌మహల్ వంటి బొమ్మలు వరుసగ కదిలిపోతూ వీక్షించే ప్రేక్షకులకు భారతదేశ సందర్శనం జరుగుతుంది. ఆ జీర గొంతుల నుండి వినిపించే పాట, కళ్లకు కనబడే కమనీయ దృశ్యాలు మనస్సును మురిపించి మరిపింపచేస్తున్నై. చారానా ఇచ్చి ఆ తమాషాను చూడలేని వాళ్లు ఆ బైస్కోపు డబ్బా మీదున్న రంగు రంగుల సినిమా బొమ్మలను, కదులుతున్న రైలు డబ్బాలను చూసి సంతృప్తి చెందుతున్నరు.
ఆ ప్రదర్శన పక్కన్నే కొంత దూరంల మరికొంత మంది అటువంటి జిప్సీ మహిళలే నేల మీద పరిచిన గుడ్డల చాకుల్ని, చురకత్తుల్ని, బటన్ నైఫుల్ని అమ్ముతున్నరు. మరికొంత మంది తమ చిన్న పిల్లలతో డప్పులు కొట్టుకుంట గారడీ చేస్తున్నరు. వాళ్ళంతా ఒకే తండాకు చెందినవాళ్ళు. స్త్రీలంతా కష్టపడి పనిచేసి పైసలు సంపాదిస్తుంటే పురుషులు మాత్రం సోమరిగ కూర్చొని బీడీలు తాగుతున్నరు. ఎవరైనా పోకిరీలు ఆ స్త్రీలతో ఏమైనా పరాచికాలు ఆడినా లేదా చేయి తాకినా ఆ సుందరీమణులు త్రాచు పాముల్లాగ బుసలు కొట్టి ఆ అమ్మే కత్తులనే తమ చేతులల్లకి తీసుకొని బెదిరిస్తే ఆ పోకిరీ హీరోలు అక్కడ్నుండి పరార్ అవుతున్నరు.
మేలా దునియా కా మేలా. పీర్ల పండుగ మేలా. చార్మినార్ దగ్గరి అలీజాకోట్ల పంజేషా మైదాన్‌ల ఆ మేలా జరుగుతుంది. బైండ్లోళ్లు రక్తాలు చిందేలాగ కొరడాలతో ఒళ్లంతా కొట్టుకుంట, చిందులు వేసుకుంట భీకరంగ డప్పుల్ని వాయించుకుంటా భిక్షమడుగుతున్నరు. వారి నల్లటి శరీరాలపై ఎర్రెర్రని గాయాల్ని ప్రదర్శిస్తూ దయను, సానుభూతిని కొన్ని చిల్లర పైసల్ని అడుక్కుంటున్నరు. సూఫీ ఫకీర్లు ముంజేతి నుండి మోచేయి వరకు వెండి కడియాలు ధరించి అరచేతిల పట్టుకున్న కట్టెతో వాటిని లయబద్దంగ కొట్టుకుంట ‘అల్లా కే నామ్ పే…’ అంటూ గీతాలు పాడుతూ, ఊదు, సాంబ్రాణి ధూపాలు వేస్తూ, నెమలి పింఛాల వింజామరలతో భక్తుల శిరస్సులను స్పర్శిస్తూ ఖైరాతీలు అడుగుతున్నరు.
ఖిలోనాలు, లాయిలప్పలు, లట్టూలు, చెక్క బొమ్మలు, రంగు రంగుల బుగ్గల దుకాణాలు, టపటప చప్పుళ్ల మృచ్ఛకటికాలు, పిల్లన గ్రోవిల వేణునాదాలు, రంగుల రాట్నాలు, బూరు మిఠాయిలు, ఐస్‌ఫ్రూట్‌లు, తినుబండారాల చిల్లర దుకాణాలు. హిందూ ముస్లిం - చిన్నా పెద్దా తేడాలేని పీర్ల పండుగ జాతర, మేళా. టప టప, డమ డమ డప్పుల వాయిద్యాలతో ఊరేగుతున్న ఆకుపచ్చ త్తుల పీర్లు. మైసాక్షి ఊదు పొగల మధ్య దూసుపోతున్న అలంలు. యా అలీ దులా, యా హుసేన్ అంటూ శిరసెత్తి, శివమెత్తి చిందులు తొక్కే ముస్లిం యువకులు.
మొహర్రం పండుగను తెలంగాణాల పీర్ల (పేర్ = జండ, పతాకం) పండుగ అంటరు. నిజానికి ఇది పండుగ కాదు. మహమ్మద్ ప్రవక్త మనుమలైన హసన్, హుస్సేన్‌ల అమరత్వాన్ని స్మరించుకొని జరిపే సంతాప దినాలనే మొహర్రం అంటరు. మహమ్మద్ ప్రవక్తకు కొడుకులు లేరు. కూతురు ఫాతిమా. ఆమె ఇద్దరు కొడుకులే హసన్, హుస్సేన్‌లు. క్రీ.శ. 680ల అనగా 1400 సంవత్సరాల కిందట ఖలీఫా చనిపోయిన తర్వాత మదీనా రాజ్య వారసత్వం కోసం పోటీ మొదలై అది యుద్ధానికి దారి తీసింది.
యుద్ధానికి ముందే హసన్ విషప్రయోగంతో హత్యకు గురైనాడు. హుస్సేన్ తన కుటుంబ సభ్యులు, పరివారం మొత్తం 72 మందితో ఒక ప్రయాణంల ఉండగ ఇరాక్‌లోని కర్బలా మైదానంల యజీదు రాజు సైన్యం వారిని చుట్టుముట్టి యుద్ధం చేసింది. కర్బలా మైదానంల జరిగిన 10 రోజుల యుద్ధంల హుస్సేన్ పరివారం మొత్తం చిత్రహింసలకు గురై చనిపోయింది. మరణించినవారిల చిన్న పిల్లల నుండి 80 సంవత్సరాల వృద్ధులు, స్త్రీలు కూడ ఉన్నరు. వారంతా క్షతగాత్రులుగ మారి రక్తసిక్త గాయాలతో ‘పానీ పానీ’ అని దాహార్తితో అలమటించి ప్రాణాలు వదిలినారు. ఆ వీర మరణాన్నే ‘షహదత్’ అన్నరు.
అమర వీరుల బాధలతో తాదాత్మ్యం చెందడం, వారి వీర మరణాలను కీర్తించడం, ఉత్సవాలుగ జరుపుకోవటమే మొహర్రం ఉద్దేశం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం సంవత్సరంల మొదటి మాసమే మొహర్రం. ఈ పండుగను షియా మతస్థులు మాత్రమే జరుపుకుంటరు. మృత్యువును కీర్తిస్తూ, కాంక్షిస్తూ, మరణాన్ని కూడ ఉత్సవీకరించడం షియా మతస్థుల గొప్పతనం. అట్ల మొహర్రం అమరవీరుల సంస్మరణ దినం.
ఈ నేపథ్యం వల్ల తెలంగాణా గ్రామాలల్ల శూద్రకులాలవారు, దళితులు కూడా పీర్ల పండుగను ఘనంగ జరుపుకుంటరు. గ్రామాలల్ల కులాలవారీగ చాకలి పీరు, గౌండ్ల పీరు, మంగలి పీర్లు ఉంటై. తమ పిల్లలకు ఆశన్న (హసన్), ఊషన్న (హుస్సేన్)ల పేర్లు పెట్టుకుంటరు.
ప్రపంచంల ఏ మూలనైనా బాధితుల స్థితి ఒక్కటే అన్న ఐక్యతాభావమే ఈ పీర్ల పండుగకు పునాది. అట్ల ఈ పండుగ మత సామరస్యానికి చిహ్నం. హిందూ, ముస్లిం భేదం లేకుండ అందరూ కలిసి మాతంను (విషాదం) పాటిస్తరు. మర్సియాలు (శోకగీతాలు) పాడుకుంటరు.
ఆశన్నా ఊషన్న అన్నదమ్ములంట
ఆశన్నా ఊషన్న తలకాయలను
ఆ దుష్టులు నరికినారంట
తల నుండి కారిన నెత్తురు కత్తిపీర్లు
చిల్లీన నెత్తురు చిన్న పీర్లు
పేరీన నెత్తురు పెద్ద పీర్లు
అంటూ హిందువులందరు పీర్లను ఎత్తుకొని సిగం పూని చిందులేస్తరు. నిప్పుల గుండంల కాళ్లు కాలుతున్న నడుస్తరు, ఆడుతరు, పాడుతరు. హిందూ ముస్లింల ఐక్యతను ఒక్క గొంతుతో చాటుతరు.
హైద్రాబాద్‌ల మొదటిసారిగ 1587ల కుతుబ్‌షాహీ రాజుల కాలంల మౌలాలీ గుట్ట మీద పీర్లను నిలబెట్టినారు. ఆ రాజులు షియా మతస్థులు. హైద్రాబాద్‌ల పీర్ల పండుగ ప్రారంభానికి ఒక కథ ఉంది. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా చనిపోంగనే ఆయన కొడుకు అబ్దుల్లా కుతుబ్ షా పన్నెండు సంవత్సరాల వయస్సులనే సింహాసనం అధిష్ఠించినాడు. ఇతను కుతుబ్ షాహీ వంశ పరిపాలకులల్ల ఐదవ రాజు. చిన్న వయస్సు వలన అతను కేవలం ‘నామ్ కే వాస్తే’ నవాబుగ ఉన్నడు. తల్లి హయాత్ బక్షీ బేగం ‘రాజమాత’గ నిజమైన అధికారాన్ని నిర్వహించేది. పరిపాలనల ఆమె కడు సమర్థురాలు. ఆమెను హైద్రాబాదు నూర్జహాన్ అనవచ్చు. ఆమె పేరు మీదనే హయత్‌నగర్ వెలిసింది. హయత్‌నగర్ మసీదు ఆమె కట్టించిందే.
హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ ఖులీ కుతుబ్ షా, బాగమతిలకు పుత్ర సంతానం కలగలేదు. వారి ఏకైక పుత్రికే హయాత్ భక్షీ బేగం. చిన్నతనంల ఆమెను తల్లిదండ్రులు ప్రేమగ “లాడ్లీ” అని పిలిచేటోళ్ళు. ఆమె పేరనే చార్మినార్ దగ్గర లాడ్ బజార్ వెలిసింది. ఆమెకు యుక్తవయస్సు రాంగనే నవాబు తన మేనల్లుడు మహమ్మద్‌తో వివాహం జరిపించినాడు. నవాబు తదనంతరం ఆ అల్లుడే వారసునిగ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా పేరుతో రాజ్యాధికారం చేపట్టినాడు.
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, హయాత్ భక్షీ బేగంలకు చాలా కాలానికి ప్రథమ సంతానంగ కొడుకు జన్మించినాడు. ఆ తండ్రి ఆనందం అంబరాన్ని తాకింది. కొడుకును చూడాలని తండ్రి హృదయం తహతహలాడింది. అయితే ఆ పిల్లవాడు జన్మించిన ఘడియ మంచిది కాదని, తండ్రికి ప్రాణగండమని, కొడుకుకు 12 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు తండ్రి అతని ముఖం చూడటం అరిష్టమని మతపెద్దలు జోస్యం చెప్పినారు. ఆ నిర్ణయానికి నవాబు తలొంచక తప్పలేదు. పిల్లవాడికి అబ్దుల్లా అని నామకరణం జరిగింది. తండ్రికి దూరంగనే తల్లి హయాత్ భక్షీ బేగం పర్యవేక్షణల అబ్దుల్లా పెరిగినాడు. రాజకుమారుడిలాగే అన్ని విద్యాబుద్ధుల్ని సంపాదించినాడు. చివరికి 12 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఆ తండ్రి కొడుకును మొదటిసారిగ చూసి కౌగిలించుకొని ఆనందభాష్పాలు రాల్చినాడు. తర్వాత కొన్ని రోజులకే నవాబు హఠాత్తుగ మరణించినాడు. 12 సంవత్సరాల అబ్దుల్లా కుతుబ్ షా సింహాసనాన్ని అధిష్ఠించినాడు. తెర వెనక నిజమైన అధికారం ‘రాజమాత’ హయాత్ భక్షీ బేగం చెలాయించేది.
ప్రజలు ఆమెను గౌరవించి ‘మాసాహెబా’ అని పిలిచేటోళ్ళు. ఆమె కట్టించిన మాసాహెబా టాంకు కాలక్రమంల మాసాబ్‌టాంక్ అయ్యింది. యువరాజు 15 సంవత్సరాల వయస్సుల ఉన్నప్పుడు ఒక రోజు ‘మూరత్’ అనే మదపుటేనుగు మీద ఎక్కి పురానాపూల్ దాటి మూసీ నదికి అవతలి వైపున ఉన్న ‘నదీ మహల్’ విహారానికి పోయినాడు. చిన్నప్పుడు ఆ ఏనుగును అతని తండ్రి వియత్నాం అడవులు సైగాన్ నుండి తెప్పించి బహుమతిగ ఇచ్చినాడు. తిరుగు ప్రయాణంల ఆ మదపుటేనుగు మతిచలించి తన తొండంతో మావటీని కిందికి గుంజి తన పదఘట్టనలతో అతడిని నుజ్జు నుజ్జు చేసి, చుట్టుపక్కల ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి తన మీద అంబారీల కూర్చున్న యువరాజుతో సహా సమీపంల ఉన్న అడవిలకు అంతర్థానమైంది. నవాబు వెంబడి ఉన్న కాల్బలం ఆ ఏనుగును వెంబడించినా ఫలితం లేకపోయింది.
మూడు రోజులు గడిచినా ఆ ఏనుగు దాని మీద ఉన్న యువరాజు ‘అత్తాపత్తా’ దొరుకలేదు. రాజమాత హయత్ బక్షీ బేగం దుఃఖానికి, విచారానికి అంతులేదు. అడవిల ఉన్న చెట్ల కొమ్మలకు ఆహార పొట్లాలను, మంచి నీటి ముంతల్ని వేలాడదీసింది. ఒక వేళ ఆ మార్గం నుండి కొడుకు తిరిగి వస్తే ఆకలిదప్పుల్ని తీర్చుకుంటడని ఆమె ఆశ. కొడుకు సురక్షితంగ తిరిగి రావాలని ఆమె నగరంల ఉన్న అన్ని మసీదులల్ల నమాజులను చదివించింది. ముల్లాలను, మౌల్వీలను, ఫకీర్లను ఆశ్రయించింది. తొందరగ తన కొడుకు తిరిగి వస్తే 40 కిలోల బంగారంతో లంగర్ (గొలుసు) చేయించి వాటి ముక్కల్ని పేద ప్రజలకు పంచుతనని అల్లాకు మన్నత్ (ముడుపు) కట్టింది.
ఆమె ప్రయత్నాలు, ప్రార్థనలు ఫలించినై. నవాబు అంతర్థానమైన ఏడవ రోజు ఉదయాన, మొహర్రం మాసం మొదలైన ఐదవ రోజున ఏనుగుతో సహా యువరాజు సురక్షితంగ తిరిగి వస్తున్నట్లు ఆమెకు శుభవార్త అందింది. ఆమె తన మొక్కు ప్రకారం బంగారు గొలుసును చేయించి నగ్నపాదాలతో నడుచుకుంటూ వెంట పరివారం రాంగ ఊరేగింపుగ బయలుదేరింది. దానినే ‘లంగర్’ ఊరేగింపు అంటరు. మదీనా హోటల్ దగ్గరున్న బాద్‌షాహీ అశుర్ ఖానల (పీర్లను నిలబెట్టే గది) ఆ గొలుసును దట్టీగ సమర్పించింది. పిమ్మట హుస్సేనీ ఆలం వద్ద ఆ బంగారు గొలుసును ముక్కలు ముక్కలుగ విడగొట్టి పేదసాదలకు పంచిపెట్టింది. అక్కడనే అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. ఆ విధంగ నగరంల పీర్ల పండుగ ప్రారంభమయ్యింది. ఈ అన్నదాన కార్యక్రమం 1918 వరకు మొహర్రం ఐదవ రోజున అదే హుస్సేనీ అలం ప్రాంతంల ప్రభుత్వ హయాంలనే జరిగేది.
కుతుబ్‌షాహీ రాజుల కాలంల పవిత్రమైన మొహర్రం మాసం ప్రారంభం కాంగనే వారు పూర్తిగ విభిన్నమైన మనుషులుగ మారిపోయేటోళ్ళు. మధువుతో తొణికిసలాడే చషకాలను పగులగొట్టి, వైరాగ్యాన్ని ఆచరించి అశుర్‌ఖానాలలో వేలవేల ప్రమిదల్ని వెలిగిస్తూ మౌనంగ కూచునేటోళ్లు. ఆ దీపకాంతులతో నిశి రాత్రి పట్టపగలుగ భాసించేది. అల్లంత దూరంలనే బాద్‌షాహీ అశుర్ ఖానా ఉండగనే ఏనుగు మీది అంబారీ నుండి దిగి నగ్నపాదాలతో నడుచుకుంట వచ్చి భక్తిప్రపత్తులను చాటుకునేటోళ్ళు. ఆ పవిత్ర మాసంల మొదటి పది రోజులు నగరంల గానాబజానాలు, విందులు-వినోదాలు అన్నీ బంద్. లోకమంత శోకపూరిత వాతావరణమే. నగరంల భవంతులపైన విషాద సంకేతాలైన నల్లటి కేతనాలు రెపరెపలాడుతూ ఎగురుతూ ఉండేవి. పానశాలలు బోసిపోయి ఉండేవి. వేశ్యావాటికలల్ల విటుల్కెడా కనబడక పోయేటోళ్ళు. ఆ పవిత్ర దినాలల్ల వారు ప్రేమకవిత్వాన్ని పక్కన పెట్టి అనేక మర్సియాలను స్వయంగ రచించి గానం చేసేటోళ్ళు.
కుతుబ్‌షాహీ వంశం తర్వాత ఆసఫ్‌జాహీ వంశపు నవాబులు అధికారంలకు వచ్చినారు. వీరు సున్నీ మతస్థులు అయినా మొహర్రం పండుగను, సంప్రదాయాలను గౌరవించినారు. ముఖ్యంగ ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంల మొహర్రం ఘనంగ జరిగేది. మొత్తం ఏడుగురు నిజాం రాజులల్ల ఇతడు ప్రజలందరికి ప్రియతముడు కావున ప్రజలు ‘పాషా’ అని ముద్దుగ, గౌరవంగ పిలుచుకునేటోళ్ళు. ఆయన మతసహనాన్ని పాటించి మతసామరస్యాన్ని సాధించినాడు. హిందువులు, ముస్లింలు ఇద్దరూ నా రెండు కండ్లు అని పదే పదే అనేవాడు.
ఈయన కాలంల మొహర్రం ‘లంగర్’ ఊరేగింపు అతి వైభవంగ జరిగేది. ఊరేగింపు ముందు భాగాన ఉరి తీసే తలారులు సన్నని పొడవైన తల్వారులను పట్టుకొని ఎర్రని దుస్తులతో నడిచేటోళ్ళు. వారి వెనుక ఏనుగు మీద అంబారీల నగర కోత్వాల్ కూచునేటోడు. ఆ ఏనుగును అతి ఆడంబరంగ అలంకరించి దాని మెడకు బంగారు గొలుసును వేసేటోళ్ళు. ఆ నగర కోత్వాల్ వెనుక అనేక విభాగాలకు చెందిన సైనికులు, పోలీసు జవానులు కవాతు చేస్తూ నడిచేటోళ్ళు. వారి వెనుక ఆట, పాటల కళాబృందాలు, సాము గరిడీల పహిల్వానుల బృందాలు విన్యాసాలు చేస్తూ నడిచేవి. ఊరేగింపు చివరి భాగంల ప్రభువు, ఉన్నత వంశాలవారు, పుర ప్రముఖులు ఉండేటోళ్ళు. అనేక పెద్ద పెద్ద ‘దేవిడీ’లు, బంగ్లాల ముందు నుండి ఆ ఊరేగింపు సాగేది. పేష్కార్ దేవిడీ ముందు నుండి వెళ్లుతున్నప్పుడు ఆ పుర ప్రముఖులందరు విధిగా పేష్కారు గారికి గౌరవ వందనం చేసేటోళ్ళు.
ఆ కాలంల పేష్కార్ మహారాజ కిషన్ పర్‌షాద్‌కు మాత్రం ఆ గౌరవ వందనం స్వీకరించడం చాలా ఇబ్బందిగ ఉండేది. ‘మాతం’ ఊరేగింపుల పీర్లను పట్టుకొని ఊగిపోయే షియా మతస్థులు అర్ధనగ్నంగ ఒక పైజామా మీద మాత్రమే ఉండి ఒళ్లంతా రక్తాలు చిందేలాగ చురకత్తులతో తమను తామే గాయపరుచుకుంట, హింసించుకుంట వెళ్లే దృశ్యాలను ఆయన చూడలేక పోయెటోడు. వారి శరీరాలు రక్తమండలాలుగ మారిపోయేవి. వారు మర్సియాలను ఆలాపిస్తూ బిగ్గరగ రోదిస్తూ అరచేతులతో, పిడికిళ్లతో తమ యెదలను గట్టిగ బాదుకుంట నడిచేటోళ్ళు. వారందరూ ఒక పద్ధతి ప్రకారం తమ ఛాతీలను కొట్టుకొంట నడవటం వలన ‘దభీ దభీ’ మనే చప్పుళ్లతో ఆ వాతావరణంల ఒక విషాద సంగీతం వినబడేది. ఎండలో కారుతున్న చెమటలతో వారి రక్తం కలిసిపోయి ఒక విధమైన వింత మదం వాసన ఆ చుట్టు పక్కల వ్యాపించేది. రోడ్డు మీద నిల్చున్న ప్రేక్షకులు కొంతమంది ఆ రక్త ప్రవాహాన్ని అరికట్టి వారి బాధను కొంచెమైనా ఉపశమింపచేయాలన్న సానుభూతితో బిందెలు, బకెట్లు, చెంబులతో వారి రక్తసిక్త శరీరాలపై నీళ్లు చిమ్ముతూ ఉండేటోళ్ళు. ఇరానీ తెగలకు సంబంధించిన ఆ షియాల బంగారు, రాగి రంగు, శ్వేత వర్ణ శరీరాలమీద ఎర్రని రుధిర ధారల చారికలు బీభత్స రస వింత సోయగాలను ప్రదర్శించేవి. అటువంటి బీభత్స, బాధామయ ఊరేగింపు వందన స్వీకారాన్ని ఇష్టపడని మహరాజా కిషన్ పర్‌షాద్ తమ దేవిడీల ఎక్కడో ఓ మూలన దాక్కునేటోడు.
మాతం ఊరేగింపును నగర కోత్వాల్ నిర్వహించేటోడు. ప్రభుత్వం తరఫున అది ఆయన బాధ్యత. నగర ప్రముఖులందరికి ఆహ్వానాలు అచ్చువేసి పంపేటోడు. చార్మినార్ సమీపంల ఉన్న నగర పోలీసు కార్యాలయం ముందు ప్రముఖులు, పెద్దలు ఊరేగింపును చూడటానికి వేదికను ఏర్పాటు చేసేటోడు. గౌరవనీయులైన అతిథులందరు పేదసాదలకు పంచటానికి అవసరమైన చిల్లర నాణాలను పక్కనే ఉన్న మోతీగల్లీలోని ఖజానే ఆమ్రా (ప్రభుత్వ ఖజానా) నుండి తెప్పించేటోడు. మరో ఏనుగు మీద ఆరవ నిజాం మహబూబ్ అలీ పాషా కూడా కూర్చొని తన రెండు గుప్పిళ్లతో బంగారు, వెండి నాణాలను, రూపాయి బిళ్లలను పేద ప్రజలు నిలుచున్న వరుసల వైపు విసిరేటోడు. ప్రజలు వాటిని ఆనందంగ ఏరుకొని ప్రభువును చల్లగ వెయ్యేళ్లు వర్ధిల్లమని దీవించేటోళ్ళు. ఆరవ నిజాం కాలంల రావు బహదూర్ కొండా వెంకట రంగారెడ్డి కొత్వాల్‌గ, మహారాజా కిరష్ పర్‌షాద్ పేష్కారుగ ఉండేటోళ్ళు. అట్లా రాజు తర్వాత ముఖ్యమైన రెండు పదవులల్ల హిందువులే కొనసాగినారు. వాళ్లు హిందువులైనా మొహర్రం పండుగను గౌరవించి శ్రద్ధగ నిర్వహించేటోళ్ళు. మత సామరస్యానికి ఇదొక మంచి ఉదాహరణ.
ఒకసారి మొహర్రం, హోళీ పండుగలు రెండూ ఒకే రోజు కలిసి వచ్చినై. ముస్లింలకు మొహర్రం విషాదమే తప్ప ఉత్సవ సంబరం కాదు. హిందువులకు హోళీ ఆనందోత్సాహాల రంగుల పండుగ. బంగు మత్తులకి జారిపోయి రంగులల్ల మునిగితేలే ఆటపాటల పండుగ. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మతకల్లోలాలు సంభవించే ప్రమాదం ఉంది. మతసామరస్యం స్వయం సిద్ధంగ రాదు. బలమైన సంకల్పసిద్ధి ద్వారానే సాధించబడుతుందని ఆరవ నిజాం గాఢంగ విశ్వసించేటోడు. ఆనాడు దారుల్ షిఫా ఇరుకు గల్లీల మాతం ఊరేగింపు వెళ్లుతుంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం మహబూబ్ అలీ పాషా ఏనుగు మీద అంబారీల కూచున్నడు. ఆ రోజు ఆయన చాల అప్రమత్తతతో ఉన్నడు. ఆయన చూపులు నిశితంగ పరిసరాలను గమనిస్తున్నయి. కోత్వాల్ కూడ డేగ కళ్లతో పహరా హుషార్‌గ ఉన్నడు.
ఇంతల ఎదురుగ హోళీ ఊరేగింపు రానే వచ్చింది. హిందువులు తమ గుప్పిళ్లతో గాలిలకు వెదజల్లే బుక్కా గులాల్ రంగులతో ఆకాశంల హరివిల్లులు పూస్తున్నయి. వాళ్లందరూ పూర్తిగ బంగు మత్తుల మునిగున్నరు. ఆటపాటల కేరింతలతో, గానా బజానాల కోలాహలంతో వారి ఊరేగింపు ముందుకొస్తుంది. నవాబ్ మహబూబ్ అలీ పాషాగారు రాబోయే ప్రమాదాన్ని, జరుగబోయే విపత్తును క్షణాలల్ల పసిగట్టినారు. బంగు మత్తుల ఉన్నవారు రంగులు చల్లుతున్నప్పుడు పొరపాటుగ అలం వైపు, పీర్ల మీద పడితే రంగుల స్థానంల ఇరు వర్గాల రక్తం ప్రవహిస్తది.
ఆయన చటుక్కున అంబారీ దిగి ఒక్కడే నడుచుకుంట హోళీ ఊరేగింపుకు ఎదురుంగ పోయినాడు. రాజును చూడంగనే హిందువులు సంతోషంతో ఎగిరి గంతులేసి కేరింతలు కొట్టినారు. కావలించుకున్నరు. ఆయనపై రంగులు చల్లినారు. ముఖానికి సున్హేరీ పూసినారు. మిఠాయిలు తినిపించినారు. ఆయన చుట్టూ చేరి నాట్యం చేసినారు. రాజు చాకచక్యంగ తను కూడ వారితో పాటు ఆడుతూ పాడుతూ తెలివిగ ఆ ఊరేగింపును పక్క వీధిలకి మళ్లించినాడు. రెండు ఊరేగింపులు ఒకదాన్ని మరొకటి ఢీకొనకుండ మత కల్లోలాలను తప్పించి మత సామరస్యాన్ని సాధించినాడు. అదీ నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ గొప్పతనం. ఆయన కాలంల ఇతరుల మత విశ్వాసాలను, ఆచార వ్యవహారాలను, జీవన పద్ధతులను అర్థం చేసుకొని గౌరవించే సంస్కారం అన్ని మతాల ప్రజలల్ల ఉండేది. పంది మాంసం, గోమాంసం వండుకొనే సందర్భాలల్ల పొరుగింటి మతం వారి విశ్వాసాలకు దెబ్బ తగలకుండ జాగ్రత్త పడేటోళ్ళు.
ఒకసారి హిందువులు శివుని గుడి నిర్మాణం కోసం ధన సహాయం చేయమని ఆయనను అడిగినారు. రాజు వెంటనే ఖజానా నుండి కావలసిన ధనం తీసి బంగారు నందిని చేయించి పంపమని పురమాయించినాడు. “ఇదేమిటి? మీరు ఇస్లాంకు విరుద్ధంగ విగ్రహారాధనను ప్రోత్సహిస్తున్నారు?” అని ఒక మౌల్వీ అభ్యంతరం తెలియజేసినాడు. “ప్రభుత్వ ఖజానా ఒక ముస్లింలదే కాదు, అది హిందువులది కూడా. వారికి కూడా అండ్ల భాగం ఉంది” అనే జవాబుతో నవాబు ఆ ముసలిమాను మౌల్వీ నోరు మూయించినాడు.
బొంబై కా తమాషా నడుస్తనే వుంది. స్వామి తన మిత్రబృందంతోటి మేళా అంత కలియ తిరుగుతున్నడు. వేణు, యాదగిరి, జయప్రకాశ్, రాజేందర్, దయానంద్ అందరూ వచ్చినారు. సికింద్రాబాదుల పీర్ల పండుగ అంత గొప్పగ జరగదు. పాత నగరంల పీర్ల పండుగను చూడటానికి రమ్మని స్వామి వారందరినీ ఆహ్వానించినాడు. వాళ్లకు ఇదొక కొత్త అనుభవం. కావున హుషారుగ ఉన్నరు.
పాత నగరంల ప్రతి చౌరస్తాల కొత్త కుండలల్ల చల్లటి నీళ్లను, చిక్కటి పాలను, తియ్యటి షర్బతులను, బెల్లం పానకం నీళ్లను వచ్చిపోయే బాటసారులకు, ముసాఫిర్‌లకు అందజేస్తున్నరు. అందరూ వాటిని సంతోషంగ స్వీకరిస్తున్నరు. మిత్రబృందం అందరూ మరి మరీ అడిగించుకొని రెండు మూడు గ్లాసుల షర్బతులు, బెల్లం పానకం తాగినారు. “వీటిని ఉచితంగా ఎందుకు ఇస్తున్నరు?” అని దయానంద్ అడిగినాడు.
కర్బలా మైదానంల చిత్రహింసలకు గురైనవారు ‘పానీ పానీ’ అని అలమటించుకుంటూ దాహార్తి చింతతో చనిపోయినారు కావున వారి ఆత్మశాంతి కోసం ఈ పదిరోజులు రకరకాల పానీయాల్ని సరఫరా చేస్తారని స్వామి వివరించినాడు.
స్వామి వారందర్నీ నడిపించుకుంట మదీనా దగ్గరున్న బాద్‌షాహీ అశుర్ ఖానలకు తీసుకపోయినాడు. కుతుబ్‌షాహీల కాలంల పీర్లను నిలబెట్టిన మొదటి అశుర్‌ఖానా అదేనని చెప్పినాడు. చాలా ఎత్తుల కళాత్మకత ఉట్టిపడే ఆ వాస్తుశిల్ప శైలిని చూసి వారంత ముగ్దులైనారు. మధ్య ఆసియాలోని సమర్‌ఖండ్ వాస్తుశిల్ప శైలి అది. ఆ ప్రాంగణం ఎంతో అందంగ, ప్రశాంతంగ ఉంది. ఆ తర్వాత డబీర్‌పురాల ఉన్న బీబీ కా ఆలం అశుర్‌ఖానా చూపించినాడు. డబీర్ అంటే ఉర్దూల పాత దస్తావేజులు, మిసళ్లు (ఫైళ్ళు) భద్రపరిచే కార్యాలయమని, అట్లాంటిది ఒకటి ఆ రోజులల్ల ఇ్కడుండేది కావున ‘డబీర్‌పురా’ అని పేరొచ్చిందని యాదగిరి వివరించంగనే అందరూ ‘శబాష్’ అని వాడిని మెచ్చుకున్నరు. మొహర్రం పవిత్ర మాసంల మొదటి తొమ్మిది దినాల రాత్రుళ్లు ఆ అశుర్‌ఖానాలల్ల కర్బలా యుద్ధానికి సంబంధించిన కథలు, కవిత్వాలు వినిపిస్తరని స్వామి చెప్పినాడు.
అంతట్లనే బీబీకా అలం పీరు బయలుదేరింది. ముతావలీల (ఇస్లాం పురోహితులు) ఆధ్వర్యంల ఊరేగింపు నడుస్తుంది. హిందూ ముస్లిం భేదం లేకుండ రూపాయలు, కుడుకలు కలిపి ‘దట్టీ’లు కడుతున్నరు. బెల్లం, ఊదు, మైసాక్షిలను సమర్పించుకొని మొక్కుతున్నరు. సంతానంలేనివారికి సంతానం కలిగితే ఆశన్న, ఊశన్నల పేర్లు పెట్టుకుంటమని మొక్కుతున్నరు. మార్వాడీలు, అగర్‌వాల్‌లు కూడా పీర్లకు దట్టీలు కట్టి దండాలు పెట్టుకుంటున్నరు. అలంల ఊరేగింపు యాఖుత్‌పురా, కాలీ కమాన్, ఏతే బార్ చౌక్, చార్‌మినార్, పంజేషా మైదాన్, అలీజా కోట్ల, కాలీ ఖబర్‌ల నుండి చాదర్‌ఘాట్ దిక్కు పోతుంది. అక్కడ మూసీనది దగ్గర అశుర్‌ఖానాల తాజియాలల్ల (పీర్లను దాచే పెట్టెలు) ఆ పీర్లను మూసి పెడతరు. బీబీ కా ఆలం ఏనుగు అంబారీమీద గొప్పగ ఊరేగుతది. ముత్యాలు, రత్నాలు, వజ్రవైఢూర్యాలతో అలంను అందంగ అలంకరించినారు. అదే ఊరేగింపుల ఒక శ్వేతాశ్వాన్ని ప్రత్యేకంగ అలంకరించి ఎవరూ దానిని అధిరోహించకుండ ఖాళీగ నడిపిస్తున్నరు. ఆ శ్వేతాశ్వాన్ని చూసిన వేణు ‘దీని భావమేమి తిరుమలేశా?’ అని స్వామితో హాస్యమాడినాడు.
కర్బలా యుద్ధరంగంల హుస్సేన్ వీరమరణం చెందినంక అతని అశ్వం ఒక్కటే ఒంటరిగ, ఖాళీగ ఇంటికి తిరిగి వచ్చి వాకిట్లనే ప్రాణాలు వదిలింది. ఆ విషాదానికి సంకేతంగ ఈ అశ్వాన్ని అట్ల నడిపిస్తున్నరని స్వామి చెప్పినాడు. ‘మాతం’ ఊరేగింపు ముందు షియా యువకులు వరుసలు కట్టి నడుస్తున్నరు. ‘యా హుస్సేన్’ అని అరుచుకుంట అరచేతులతోటి ఛాతీ మీద కొట్టుకుంటున్నరు. పిడికత్తులతోటి ఒళ్లంత గాయాలు చేసుకుంటున్నరు. రక్తం ఏరులై పారుతుంది. ‘మర్సియా’ విషాద గీతాలు అంబరాన్ని చుంబిస్తున్నయి. రోదన, వేదనల మధ్య తీన్‌మార్ డప్పులు పెటిళ్లున ఆకాశం పగిలేటట్లు మారుమోగుతున్నయి. వారి పక్కనే అడుగుల అడుగులు వేసుకుంట స్వామి మిత్రబృందం వారిని వెంబడిస్తూ ఆశ్చర్యంగ వారిని గమనిస్తున్నరు.
రక్తం, చెమట, మదం వాసన. వారిమీద నీళ్లు చల్లుతున్న చప్పుడు. టపటప ఢమఢమల మధ్య చిన్నా పెద్దా పీర్ల చిందులు. ఊదు, సాంబ్రాణి, మైసాక్షి పొగల మైకం. స్వామికి కండ్లు తిరుగుతున్నయ్. కాళ్లు తేలిపోతున్నయ్. ఒళ్లు దూది పింజోలె తేలీ తేలి ఇరాక్ కర్బలా యుద్ధ మైదానంల వాలిపోయింది. హసన్, హుస్సేన్‌లు స్వామిని ఆవాహన చేసుకుంటున్నరు. ఆవరిస్తున్నరు. మాయా సంజనిత దిగ్భ్రాంతికర దృశ్యాదృశ్యాలు. అది కర్బలా మైదానం కాదు నేలతల్లి - తల్లి తెలంగాణా యుద్ధభూమి. వందల వేల గాయాల యుద్ధాల ఒడి. నరకలోకపు జాగిలమ్ములు ఆంధ్రా యజీదులుగ మారి తుపాకులతో మొరుగుతున్నరు. తెలంగాణా గడ్డ మీద రక్తం చినుకుల వర్షం కురుస్తుంది. నిప్పుల వడగండ్ల వాన కురుస్తుంది. హసన్, హుస్సేన్‌లు ‘జై తెలంగాణా’ అని అరుస్తూ నేలకొరుగుతున్నరు. పానీ పానీ అని జెఫ్రీ రాజ్‌భవన్ రైలు కట్ట మీద కొస ప్రాణాలతో అటూ ఇటూ పొర్లుతూ తండ్లాడుతున్నడు. ఇసామియా బజార్ అందాల బిడ్డ- గరీబోళ్ల బిడ్డ ప్రేమ్‌కిశోర్ పొత్తి కడుపుల నుండి పేగులు బైటికొచ్చినా అరచేత్తో అదుముకుంటూ జై తెలంగాణా అని నినదిస్తున్నడు. కవాడీగుడా ఆకుల నరేందర్ కర్బలా యుద్ధరంగంల పరీక్షల కోసం పుస్తకాలు ముందేసుకుని దీక్షగ చదువుకుంటున్నడు. చిన్నారి చెల్లె చాదర్‌ఘాట్ రేణుక ఈ పాపం ఎవ్వరిదని తన ఒంటిలోని తూటాలను చూపిస్తూ అందరినీ ప్రశ్నిస్తుంది. సలామన్నలై సలామన్నలై. వీరులారా శూరాలారా ఒక్కరొక్కరే ఒరిగినారా? కర్బలా యుద్ధ మైదానంల శవాల గుట్టల కింద జెఫ్రీ కోసం స్వామి అన్వేషణ. జెఫ్రీ జెఫ్రీ అని గొంతెత్తి అరుస్తున్నడు. యుద్ధం చేసుకుంటనే యుద్ధరంగంల దారి తప్పి - తప్పిపోయిన అశోక్, గోపిల కోసం దేవులాడుతున్నడు. ఆశన్న - ఊశన్నలు, తెలంగాణా అమరవీరులు స్వామి ఒంటి మీదికి సిగం బూని పీరులాగ పరుగెత్తిస్తున్నరు. ఎవరి మీదనో తెలియని కోపం, కసి. తన పిడికిళ్లు బిగుస్తున్నయ్. పండ్లు పటపట కొరుకుతుంటే దవడలు గిట్ట కరుచుకపోతున్నయ్. స్వామి, వేణు, యాదగిరి ‘జంజీర్ మాతం’ చేస్తున్నరు. పొడుగాటి ముండ్ల గొలుసుకు చిన్న చిన్న కత్తుల్ని వేలాడదీసి ఆ గొలుసులను తమ ఒంటిపై విసురుకుంట తమని తామే గాయపరుచుకుంటున్నరు. హింసించుకుంటున్నరు. ఆంధ్రా యాజీదుల హృదయ పరివర్తన కోసం తపిస్తున్నరు. మూసీల రక్తం కాలువలు కట్టి పారుతుంది. ‘కారీన రక్తమంతా కుండల్ల పేర్చుకోనీ ఏ బండ్లే పోతవ్ కొడుకో బండ్లోల్ల కుర్మరెడ్డి’ (బండ్లోల్ల కుర్మరెడ్డి ‘సర్వాయిపాపడి’లాగా ఒక జానపద వీరుడు. ఆయన మీద ఉన్న పాట ఆధారంగానే తెలంగాణ సాయుధపోరాటం కాలంల ‘ఏ బండ్ల పోతవు కొడుకో నైజాం సర్కరోడా’ అన్న పాట వచ్చింది.) అని జానపదులు ఘోషిస్తున్నరు. వేణు మహాప్రస్థానంలోని కదన కుతూహల రాగాలను మర్సియాలుగ పాడుకుంట ఒళ్లంత చురకత్తులతోటి ఛిద్రం చేసుకుంటున్నడు. యాదగిరి మైలారు దేవుడుగ మారి నాలికకు నార్సం తీగలను గుచ్చుకుంటున్నడు. హరోం హరోం హర హర హర హర అనుకుంట వీరగల్లు మీద తల ఆన్చి విచ్చుకత్తితోటి తన మెడను తానే నరుక్కుంటున్నడు. అంతలనే భక్తకన్నప్పగ మారి ఒకటి కాదు, రెండు కండ్లు పెకిలించి ఇస్తనని అందుకు బదులుగ తెలంగాణా ఇస్తవా లేదా అని యజీదు మహారాజును బెదిరిస్తున్నడు. స్వామి తన పొట్టను తనే చీల్చుకొని పేగులను ఇవతలికి గుంజి రుద్రవీణను మీటుతున్నడు. నా తెలంగాణా కోటి రతనాల వీణ, తీగలను తెంపి అగ్నిలో దింపినారు అని దిక్కులు పిక్కటిల్లేల ఘోషిస్తున్నడు. ప్రజలు పోతరాజులుగ మారిపోయి చెర్నాకోలలతో జై తెలంగాణ జై తెలంగాణా అని తమని తామే కొట్టుకుంటున్నరు. కణకణమనే భగభగ లాడే నిప్పుల గుండాలను నేల మీద పేర్చుకొని కాళ్లు కాలుతున్న లెక్కచేయకుండ వాటి మీద నుండి ఉరుకుతున్నరు. దూల ఆడుతున్నరు. యజీదు మహారాజు సిగ్గుతోటి తల వంచుకొని తెలంగాణా ఇస్తనని అల్లా మీద ప్రమాణం చేస్తున్నడు. ఫాతిమా బీ తల్లి తెలంగాణాగ మారిపోయి చనిపోయిన బిడ్డల కోసం గొల్లు గొల్లున ఏడుస్తుంది. బీబీ కా అలం పీరు నేల నుండి నింగికెగసి తెలంగాణా పతాకంగ మారి రెపరెపలాడుతుంది. నౌ జిల్లోంకా నారా హై తెలంగాణా హమారా హై అని కర్బలా ఆకాశం దద్ధరిల్లుతుంది.
స్పృహ తప్పి కింద పడిపోయిన స్వామి ముఖంమీద మిత్రబృందం కన్నీళ్ల చన్నీళ్ల వర్షాన్ని కురిపిస్తున్నరు.
… తరువాత భాగం ఒచ్చే వారం




http://dedicatedtocpbrown.wordpress.com/2010/02/06/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3/