16
కాలేజీలు తెరిచినారు.
ఉద్యమం ప్రారంభం అయ్యేనాటికి, ఇంకా మూడు నెలల సిలబస్ పూర్తి కావాల్సి ఉండేది. ఇప్పుడు ఒక నెలలనే హడావిడిగ సిలబస్ కంప్లీట్ చేసి డిసెంబరు నెలల పరీక్షలు నిర్వహించినారు. ఎంత చేసినా అప్పటికే ఒక విద్యా సంవత్సరం నష్టం అయ్యింది. ప్రాణత్యాగాలు కష్టనష్టాలతో పాటు ఇది కూడా ఒక త్యాగమే. విద్యార్థుల జీవితంల విలువైన ఒక సంవత్సరం వృధా కావటం వలన జీవితంల అన్ని రంగాలల్ల వారు ఒక సంవత్సరం వెనుకబడిపోయినారు.
స్వామి మనస్సంతా కేంద్రీకరించి శ్రద్ధతో శక్తి కొద్దీ పరీక్షలు సిద్ధం అయినాడు. ఆఖరి పేపరు రాసిన తర్వాత క్లాసు రాకున్నా ఫెయిల్ మాత్రం కానన్న నమ్మకంతో తృప్తిగ గాలి పీల్చుకున్నడు. కాలేజి నుండి చక్కగ ఇంటికి వెళ్లకుండ అఫ్జల్‌గంజ్‌ల బస్సు ఎక్కి కోఠీ బస్ స్టాపుల దిగినాడు. ఎదురుగ మాడ్రన్ టిఫిన్ రూం.
నగరంల 1969 సంవత్సరంలనే కోఠీల మాడ్రన్ టిఫిన్ రూం ప్రారంభమయ్యింది. అతి తక్కువ రేట్లతో ‘సెల్ఫ్ సర్వీసింగు’ ఆలోచనతో ప్రారంభమైన మొదటి హోటల్ అది. 15 పైసలకే ఇడ్లీ. ఇచ్చే ఇడ్లీలు రెండే అయినా సాంబారుకు మాత్రం నో లిమిట్. కేవలం సాంబారుతోనే పొట్ట నింపుకునే నిరుద్యోగులకు, విద్యార్థులకు, పేదలకు ఆ హోటల్ వరప్రసాదంగ మారింది. ఒక విజిటేబుల్ బిర్యానీ తింటే ఇక ఆ పూటకు భోజనం చింత తీరినట్లే. ఆ మాడ్రన్ టిఫిన్ రూంను ఆదర్శంగ చేసుకొని తర్వాత కాలంల అనేక సెల్ఫ్ సర్వీసింగు హోటళ్లు, నిలబడే తినేసి డబ్బుల్ని, సమయాన్ని ఆదా చేసుకునే ఆధునిక హోటళ్లు చాలా వెలిసినై. ఆ హోటల్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గ మారి అందరూ దాని గురించి చెప్పుకొనేటోళ్ళు. కోఠీ చౌరస్తాల వున్న తాజ్‌మహల్ హోటల్ డబ్బులున్న మహారాజుల హోటల్ అయితే ఈ హోటల్ సాదాసీదా ఆమ్ ఆద్మీలకు అందుబాటుల ఉండేది.
అంతకన్నా ఒకటి రెండు సంవత్సరాల ముందే నగరంల మొట్టమొదటి ‘సూపర్ బజార్’ నాంపల్లి స్టేషన్ రోడ్డుల ‘మైసూర్ కేఫ్’కు ఎదురుగ ప్రారంభమయ్యింది. అప్పటి వరకు కిరాణాకొట్టుల సరుకులను చిల్లరగ కొనుక్కొని కాగితం పొట్లాలల్ల కట్టించుకొని తీసుకపోయేటోళ్లు. దానికి బదులు ఈ సూపర్ బజార్‌ల ప్లాస్టిక్ సంచులల్ల, పాలిథిన్ పేపర్లల్ల సరుకుల్ని అందంగ ప్యాక్ చేయటం, కొనేముందు ఆ సరుకులన్నింటినీ ఎగ్జిబిషన్ తరహాల సందర్శించటం కొనుగోలుదార్లకు వింతగ కనబడేది.
ఈ సూపర్‌బజార్‌లే తర్వాత కాలంల బిగు బజారులుగ, ఫుడ్ వరల్డులుగ రూపాంతరం చెంది వినియోగదారుల జేబులు కత్తిరించే “జేబుదొంగలు”గ మారినవి. పాలిథిన్ సంచుల కాలుష్య ప్రమాదం ఈ సూపర్ బజారుల పుణ్యమా అని ప్రారంభమయ్యింది.
ఒక చారానాతో స్వామి ఇడ్లీ తిని చా తాగి తీరికగ హోటల్ నుండి ఇవతలికి వచ్చి ఆంధ్రాబ్యాంకు దిక్కు నడక సాగించినాడు. ఫుట్‌పాత్‌ల మీద రకరకాల దుకాణాలు. బెల్టులు. మనీపర్సులు. బనీన్లు. దస్తీలు. చిన్న చిన్న ఎలక్ట్రికల్ సామానులు.
కిశోర్ కేఫ్‌ల నోరూరించే వేడివేడి దిల్‌ఖుష్‌లు. మీద బన్ ఆకారం లోపల ఘుమఘుమలాడే తియ్యటి పూర్ణం. ఒక బన్‌ను సమానంగ కోస్తే ఎనిమిది చంద్రవంకలు. సాయంత్రం మూడు నాలుగు మధ్యనే అవి దొరుకుతై. మోజంజాహీ మార్కెట్ కరాచీ బేకరీల వాటి కోసం కస్టమర్లు సాయంత్రం నాలుగు గంటలకు క్యూలు కడతరు. ఒక గంట లోపే సరుకు అంత అయిపోతది. ఆ రుచి రహస్యం ఆ కొరతలనే ఉందేమో! ఒక దిల్‌ఖుష్, ఒక ప్యాజ్ కీ సమోసా తిని గరం గరం చాయ్ తాగితే తబ్యత్ ఖుష్ అయిపోతది.
కోఠీ చౌరస్తా చేరుకొని ఫుట్‌పాత్ ఎడమ వైపు ఉన్న దినపత్రికలు, మ్యాగజైన్ల దుకాణం ముందు నిలబడి వైర్లకు వేలాడే ఆనాటి దినపత్రికల హెడ్‌లైన్స్‌ను చూస్తున్నడు. తెలంగాణా ఉద్యమ వార్తలు లేక అన్ని దినపత్రికలు వెలవెలబోతున్నయి. ఒకటి రెండు మ్యాగజైన్లు తీసుకొని పేజీలు తిప్పేస్తున్నడు. “గిరాక్ కా టైం సాబ్ జరా బాజూ హఠో” అని షాపు ఓనరు మర్యాదగా గెంటిసాడు. స్టూడెంట్లకు పర్చేజింగు కెపాసిటీ తక్కువ విజిటింగు కెపాసిటీ ఎక్కువా అని వాడికి కూడ తెలిసిపోయినట్టుంది. ఖర్మ. కొంచెం పక్కకు జరిగి ఫుట్‌పాత్ మలుపుల ఉన్న ఇనుపగొట్టాల రేలింగ్సు మీద కూచొని ‘దునియా కా మేలా’ చూస్తున్నడు. ఎదురుగ రెసిడెన్సీ.
ఎదురుగ కోఠీ ఉమెన్స్ కాలేజీ గేటుకు కొంచెం ఇటు పక్కగ రెసిడెన్సీ బస్ స్టాప్. కోఠీ అసలు పేరు రెసిడెన్సీ. ఆనాటి నైజాం రాజ్యంల బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగ వ్యవహరించే ‘రెసిడెంట్’ అధికార నివాసమే ఈ రెసిడెన్సీ. సుల్తాన్ బజార్, ఇసామియా బజార్, బొగ్గులకుంట, హనుమాన్ టేక్డీ మొదలగు పరిసర ప్రాంతాలను కలిపి రెసిడెన్సీ బజార్ అనేటోళ్లు. ఈ రెసిడెన్సీ ఏరియాల పరిపాలన బ్రిటిష్ వారిది. వెనుకబడిన రాచరిక భూస్వామ్య రాజ్యంల అదొక ఆధునిక అభివృద్ధి ద్వీపకల్పం.
ఈ రెసిడెన్సీ ప్రాంతం అభివృద్ధికి, నాగరికతకు సంకేతంగ నిలిచింది. అప్పటి వరకూ కార్వాన్, బేగంబజార్, గుల్జార్ హౌజ్‌లల్ల వ్యాపారాలు చేసుకొనే షావుకారులు అందరూ ఈ కొత్త ప్రాంతంల స్థిరపడినారు. కంపెనీలల్ల పనిచేసే ఉన్నతోద్యోగులు, పోలీసు, మిలటరీ అధికారులందరూ ఈ ప్రాంతాలల్లనే తమ కుటుంబాలతో స్థిరపడినారు. కాన్వెంటు పాఠశాలలు, హాస్పిటళ్లు, చర్చీలు అన్నీ కాలక్రమంల స్థాపించబడి ఇదొక ఆధునిక పట్టణంగ వెలిసింది. ఏడవ నిజాం తన అధికార నివాసాన్ని లార్డ్ బజార్‌లోని ‘చౌ మహల్లా’ నుండి కింగు కోఠీకి మార్చేసరికి మూసీకి దక్షిణాన ఉన్న అసలైన నగరం వెలవెలబోయి పాతనగరం అనిపించుకుంది. పాతనగరం వృద్ధ నగరంగ మారి మూలకు పడితే కొత్త నగరం వయసొచ్చిన కన్నెపిల్లలాగ పరవళ్లు తొక్కింది. వింత వింత సోయగాలు పోయింది.
రాజులు పోయి, రాజ్యాలు మారినంక ఆ రెసిడెన్సీ భవనం ‘కోఠీ ఉమెన్స్ కాలేజీగ అవతరించింది. అందులో కొంత భాగాన్ని 1955ల మెడికల్ కాలేజీకి ఇచ్చినారు. ప్రపంచ పురావస్తు సంస్థ గుర్తించిన వంద పురాతనమైన కట్టడాలల్ల ఈ రెసిడెన్సీ కూడా ఒకటి.
మొదటి నిజాం 1748ల మరణించగనే అతని ఇద్దరు కొడుకులు సింహాసనం అధిష్ఠించటానికి పోటీ పడినారు. వారిద్దరిలో ఒకరు ఈస్ట్ ఇండియా కంపెనీ సహకారంతో అధికారంలోకి వచ్చి ఒప్పందం ప్రకారం కొంత బ్రిటిష్ సైన్యం హైదరాబాద్‌లో స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినాడు. ఆ సైన్యాల ఆజమాయిషీతో పాటు నిజాం రాజ్య వ్యవహారాలపై ఒక కన్నేసి ఉంచటానికి కంపెనీవారు ఒక రెసిడెంట్‌ను నియమించినారు. మూసీనదికి ఎడమ వైపున నైజాం నవాబుకు ఒక బంగళా ఉండేది. దానిని రెసిడెంట్ అధికార నివాసంగా కేటాయించినారు. తర్వాత కాలంలో మేజర్ జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్ రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆ పురాతన భవనాన్ని సమూలంగా తీసివేసి నూతన నిర్మాణాన్ని చేపట్టినాడు. 1802లో ఆ భవన నిర్మాణం ప్రారంభమైంది. అదొక అద్భుతమైన పాలరాతి మందిరం. ఆకుపచ్చ వనంలో విరిసిన ఆకాశహర్మ్యం. ప్రజలు దానిని ‘బడే సాహెబ్ కీ కోఠీ’ అని పిలిచేవాళ్లు. స్థానికులు ఆంగ్లేయులను ‘సాహిబ్’లని పిలిచేవాళ్లు. కిర్క్ పాట్రిక్ ఖైెరున్నిసా బేగంను ప్రేమించి పెళ్లి చేసుకున్నడు. ఆ ప్రేమ చిహ్నంగానే ఈ రెసిడెన్సీ వెలిసిందని ఒక కథ ప్రచారంల ఉంది.
ప్రపంచంలో ఏ నగరం కూడా ప్రేమ పునాదిగా ప్రేమ కోసం స్థాపించబడలేదు ఒక హైద్రాబాద్ నగరం తప్ప. నగరమూ, నగరంలోని నిర్మాణాలు, కట్టడాలు ప్రేమకు సంబంధించినవే. నూనూగు మీసాల తొలి యవ్వనంలోనే ప్రేయసి భాగుమతిని కలవటానికి యువరాజు ఖులీ కుతుబ్‌షా ప్రాణాలకు తెగించి పరవళ్లు తొక్కుతున్న ముచికుందా నదిని దాటుతున్నందున పుత్ర ప్రేమతో తండ్రి కట్టించిన వంతెన పురానాపూల్ – పాతవాలాద్రి. 1578లో దీని నిర్మాణం జరిగింది. ఇది ప్రేమకు గుర్తుగ నిలబడిపోయింది.
ఆ తర్వాత బాద్‌షా తన ప్రేయసి భాగుమతి కోసం నిర్మించిన ప్రేమ నగరమే హైద్రాబాద్ నగరం. నవాబు ఇస్లాం మతానికి చెందినవాడు. ఆయన ప్రేయసి హిందూ స్త్రీ. అట్ల హైద్రాబాద్ నగరం రెండు మతాల మధ్య సమైక్యతకు, సహజీవనానికి వారధిగా నిలిచింది. చార్మినార్ రెండు మతాల మధ్య స్నేహానికి, ప్రేమకు సందేశంగా నిలబడింది. ప్రేయసి భాగుమతి, అర్ధాంగి హైదర్‌బేగంగా మారంగనే బాగునగర్ హైద్రాబాద్‌గా పేరు మార్చుకుంది. ఎటు చూస్తే అటు కన్నుల పండుగ చేసే పూదోటల నగరం కావున బాగునగర్ పేరు సార్ధక నామం అయ్యింది. ఒక ప్రియుడు తన ప్రియురాలికి కానుకగా నిర్మించి ఇచ్చిన నగరమే హైద్రాబాద్. ఇటువంటి ప్రేమపురాణం ప్రపంచంలో ఏ నగరానికీ లేదు.
చార్మినార్ మహమ్మద్ ఖులీ కుతుబ్‌షా, బాగమతిల ప్రేమతో ముడిపడి వున్నట్లే రెసిడెన్సీ కూడా జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్ ఖైరున్నిసాల ప్రేమతో ముడిపడి ఉంది.
మొదటిది సుఖాంతం అయితే రెండవది మాత్రం విషాదాంతం. సఫలమైన ప్రేమల కంటే విఫమైన ప్రేమలే ‘మధురమైన ప్రేమ కతలు’గా చరిత్ర పుటలలో నిలుస్తాయేమో!
జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్ 1798లో హైద్రాబాద్‌కు రెసిడెంట్‌గా వచ్చినాడు. ఇతను స్కాట్లండు జాతీయుడు. చాలా అందగాడు. తెలివి, ధైర్యం సరేసరి. హైద్రాబాద్ నగరానికి రాక ముందే పర్షియన్ భాషలో మంచి ప్రావీణ్యం గలవాడు. అందులో కవిత్వం కూడా చెప్పేవాడు. దక్కనీ ఉర్దూ చక్కగా మాట్లాడేవాడు. ఆనాటి మొఘలాయి ముస్లిం నవాబుల్లాగనే ఆ దస్తులనే ధరించేవాడు. వేషభాషలతో స్థానికులలో చక్కగా కలిసిపోయి ‘పాన్ సుపారీ’ మాదిరిగా ఇమిడిపోయినాడు. పాట్రిక్ హైద్రాబాదుకు రెసిడెంట్‌గా వచ్చేసరికి రెండవ నిజాం అధికారంలో ఉన్నడు.
పాట్రిక్ అటు టిప్పు సుల్తాన్‌ను మైసూరు యుద్ధంలో ఓడించి ఇటు అంతరంగిక కల్లోలాలను అణిచివేసి నిజాం ప్రభువుకు సన్నిహితుడైనాడు. కష్టాలలో తనకు అండగా నిలిచి, అన్ని సమస్యలను పరిష్కరించినందుకు నిజాం నవాబు పాట్రిక్‌కు ‘హష్మత్ జంగు బహద్దుర్’ అని బిరుదును ప్రసాదించినాడు. అతని పర్షియన్ భాషా ప్రావీణ్యాన్ని అతను చెప్పే కవిత్వాన్ని మెచ్చుకుని నిండు దర్బారులో అతడిని తన ‘దత్తపుత్రుడని’ ప్రకటించినాడు. ఇది ప్రభువులవారి ప్రేమకు పరాకాష్ట. నచ్చనివారికి, మెచ్చనివారికి కడుపు మంట.
పాట్రిక్ కళాత్మకంగానే కాక చాలా అట్టహాసంగా కూడా జీవించేవాడు. హైద్రాబాద్‌కు రెసిడెంట్‌గా వచ్చిన తొలి రోజున నవాబుగారి దర్బారుకు హాజరు కావడానికి తన కోఠీ నుండి లార్డ్ బజార్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌కు బయలుదేరినాడు. అక్కడున్న చోటా నవాబులు, జమీందార్లు, జాగీర్దార్లను ఆశ్చర్యచకితులను చేసే ఉద్దేశ్యంతో నాలుగు గుర్రాల బగ్గీ మీద ఆసీనుడైనాడు. వెంట ఏనుగులు, శ్వేతాశ్వాలు – వాటిని అనుసరించి ఫిరంగి దళాలు, కాల్బలాలు, యుద్ధాన్ని తలపింపజేసే కదన కుతూహల సంగీత వాయిద్య పరికరాలు. పెద్ద హంగామాగా ఆ బారాత్ బయలుదేరి చౌమహల్లా ప్యాలెస్ చేరుకునేసరికి చోటా నవాబులు కాదు కదా ఏకంగా నిజాం నవాబుగారే హడలిపోయి ఎవరైనా శత్రుదేశం రాజు యుద్ధానికి వచ్చాడేమో అని బెదిరిపోయినాడట. వేగులవారు అసలు సంగతి తెలిపేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నరు.
చౌమహల్లాల జరిగే ప్రతి ‘హుక్కా దర్బార్’కు పాట్రిక్‌కు ఆహ్వానం ఉండేది. విందు భోజనానంతరం హుక్కా దర్బార్‌లు రాత్రి పూట కొనసాగేవి. గులాబీ నీటిలో లేదా పన్నీరులో నింపిన హుక్కాతో పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలను, మేలిమి రకం పుగాకు పొడిని కలగలిపేవారు. ఆ హుక్కా పైపులకు దంతెపు పీకెలను అమర్చి వాటి ద్వారా ఆ పొగలను నెమ్మదిగా పీల్చేవారు. స్త్రీలు పీల్చేది హుక్కీ. అందులో ఒక పుగాకు తప్ప అన్నీ షరా మామూలుగా ఉండేవి. హోదా, అంతస్థులకు – కులాసాల విలాసాల జీవితాలకు హుక్కాలు, పాన్‌దాన్‌లు, ఒగల్‌దాన్‌లు తప్పనిసరి.
ఇక వెన్నెల రాత్రుళ్లలో జరిగే ‘ముషాయిరాల’ గురించి చెప్పతరం కాదు. ఆ సొగసు చూడతరమూ కాదు. నిండు పున్నమి వెన్నెల సోనలు జాలువారుతుండగా పూదోటలలోనో లేదా బంగళా మీది డాబాలపైననో ఆ కవిత్వ గోష్ఠులు నిర్వహించేవారు. ఆనాటి సాయంకాలమే శుభ్రంగా ఊడ్చి, తూడ్చి, నీళ్లు చల్లి ఆపై రంగురంగుల చద్దర్లను వేసి వాటి మీద వెన్నెలతో పోటీ పడే తెల్లటి మెత్తటి పురుపుల్ని పరిచేవారు. సుఖాసీనులయ్యేందుకు అనువైన తెల్లటి పరుపుల మీద ఎర్రటి గులాబీలను అక్కడక్కడా చల్లేవారు. సువాసనలు వెదజల్లే పరిమళభరిత హుక్కా గొట్టాలు, వెండి పళ్లాలలో ఎండిన ద్రాక్ష కిస్‌మిస్‌లు, అరేబియా ఖర్జురాలు, కాశ్మీరం అక్రోట్, బాదాం, పిస్తాలు మరో కిస్తీలో యాలకులు, లవంగాలు, పోకలు వంటి దినుసులు అందంగా అమర్చబడేవి. ఇక మీఠాపాన్లు, జర్దాపాన్లు, సరేసరి. అతిథులను అత్తరుపూసి ఆహ్వానించేవారు. అందరూ సుఖాసీనులయిన తర్వాత ఒక చిన్న వెండి దీపపు సెమ్మపై ‘షమా’ను వెలిగించేవారు. గుండ్రంగా కూచున్న వారి మధ్య ఆ ‘షమా’ క్రమబద్దంగా తిరుగాడుతుండేది. ఆ షమా రాగానే దానికి ఎదురుగా కూచున్నవారు ‘షాయరీ’ వినిపించేవారు. ఆ కవిత్వాన్ని ఆస్వాదించేవారు. వాహ్వావాహ్వాలతో, బహుత్ ఖూబ్ బహుత్ ఖూబ్‌లతో, మైతో లుఠ్ గయాలతో ఆనంద డోలికలలో ఊయలలూగేవారు. ఆ ముషాయిరాలలో స్త్రీలు కూడా పాల్గొనేవారు. వారి కోసం ప్రత్యేకంగా జలతారు పరదాలు, జాలీ చిల్మన్‌లు ఏర్పాటు చేసేవారు. ప్రతి ముషాయిరాలోనూ పున్నమి చంద్రుడిగా పాట్రిక్ మాత్రమే వెలుగుతూ ఉండేవాడు. పర్షియన్ భాషలో అతను వినిపించే ‘మస్నవీ’లు (ప్రేమ కవిత్వాలు) ‘వాహ్వాలను’ అందుకునేది.
1799లో జరిగిన మైసూరు యుద్ధంలోనే నిజాం సైన్యం, పాట్రిక్ సైన్యం సంయుక్తంగా టిప్పు సుల్తాన్‌ను ఓడించి, సంహరించినందుకు నవాబ్ మీర్ ఆలం తన దేవిడీలో ఒక గొప్ప విందు, వినోదం కోసం ఒక నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాడు.
పత్తర్‌గట్టీల మీర్ ఆలం మండీ కూరగాయల మార్కెట్, మీర్ ఆలం చెరువు రెండు కూడ ఆయన కట్టించినవే. మీర్ ఆలం మండీ వెనుక భాగంలో ఇతని దేవిడీ ఉండేది. వెన్నెల రాత్రి విందు భోజనాలు ముగిసిన తర్వాత ఆస్థాన నర్తకి, ప్రముఖ కవయిత్రి ‘మాహ్‌లఖా (మాహ్ అంటె చంద్రుడు, లఖా అంటె వదన = చంద్రవదన) బాయి చందా’ నృత్య కార్యక్రమం ప్రారంభమయ్యింది.
కళ్ల ముందు జిగేలున మెరిసే మెరుపు తీగె ఆమె సౌందర్యం. ముట్టుకుంటే కందిపోయే సుకుమార సౌందర్యం. ఆత్మసౌందర్యం, బాహ్యసౌందర్యం సమపాళ్లలో మేళవించిన విదుషీమణి ఆమె. ఆమె కేవలం ఒక ఆస్థాన నర్తకి మాత్రమే కాదు, నిజాం దర్బారులో అత్యున్నత ‘ఉమ్రావ్’ పదవిని అలంకరించిన మేధావి మాత్రమే కాదు ఆనాటి యావత్ భారతదేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రి. చందా అన్న తఖల్లూస్‌తో (కలంపేరు) ఆనాటి దక్కన్‌లోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ‘తవాయఫ్’ (కళావంతురాలు) ఆమె. మాహ్‌లఖా బాయి చందా అన్న పేరు వింటేనే ఆనాటి రసిక హృదయాలు ‘లయలు’ తప్పి మతులు పోయేవి. ఆమె కాలి అందెల సవ్వడులలో స్పృహలు తప్పేవారు. కోటి కోర్కెల కోరలతో కాటేసి, నిలువునా దహించి వేసే ఆ అనన్య అసామాన్య సౌందర్య జ్వాలల్లో శలాభాల్లా దూకి మాడి మసై పోయే దివానా, పర్వానాలెందరెందరో!
ఆ రోజు ఆమె రసికజన మనోరంజనం కోసం నృత్యం చేస్తూ చేస్తూ నృత్యం మంచి రసపట్టులో ఉండంగానే హఠాత్తుగా నృత్యాన్ని ఆపి పాలరాతి ప్రతిమలా నిలుచుండిపోయింది. ఆమె కాళ్ల ఘుంఘురూలు మూగోబోయినాయి. డోలక్, సారంగీలు అర్థాంతరంగా ఆగిపోయినాయి. రసభంగం చెందిన రసిక హృదయాలు ఆ ‘రసాభాస’కు కనుబొమ్మలు ముడిచినాయి. కళ్లెర్ర జేసినై.
‘ఏక్ ఏలాన్ హై’ కలకూజిత కోయిల కంఠధ్వని ఆ మహల్లో ప్రతిధ్వనించింది. ఆ గొంతు మాఖన్ మిశ్రీలు కలిపినంత తియ్యగా ఉంది.
‘క్యా హై’ అన్నట్లు రసపిపాసులు కనుబొమ్మలు పైకెత్తి కండ్లతోనే ప్రశ్నించారు.
“ఏ దివానీ కా ఏక్ నజ్‌రానా…” ఆ సిగ్గుల మొగ్గ ముగ్ధ కంఠం మూగోబోయింది.
“క్యా నజ్‌రానా, కిస్కో నజ్‌రానా?” అసహనంగా రసికులు తమలో తాము గుసగుసలు పోయారు.
“గుల్‌బదన్!” అని చిన్నగా కేకేసి పిలిచింది.
ఒక పూబోడి తన చేతులతో ఒక ‘కిస్తీ’ పట్టుకుని వచ్చింది. అందులోని వస్తువేదో కనబడకుండా ఒక అందమైన కశ్మీరీ శాలువా కప్పబడి ఉంది. సభ సర్వత్రా సంభ్రమాశ్చర్యాలు. బిగువు నరాల మీద ఏకునాదం మోతలు.
“ఏ దివానీ కా నజ్‌రానా ‘దివాన్’ జాన్ మాల్కం సాబ్ కే లియే”
నిండు సభ కరతాళ ధ్వనులతో మారుమోగింది. అందరి చూపులు కెప్టెన్ జాన్ మాల్కం, అసిస్టెంట్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ మీదనే నిలిచినై. ఈసారి అతను సిగ్గుల మొగ్గ అయినాడు. షహరులోని ప్రతి గల్లీగల్లీకి తెలుసు తవాయఫ్ మాహ్‌లఖా బాయి చందా, జాన్ మాల్కంల ప్రేమ పురాణం. అయితే వారిద్దరి మధ్య ప్రేమా, ప్రణయం తప్ప పరిణయం మాత్రం జరగదని వారితో పాటు జగానికంతా తెలుసు.
జాన్ మాల్కం హుందాగా నడుస్తూ వెళ్లి ‘చందా’ ముందు నిలుచున్నాడు. చందా ‘కిస్తీ’లో వున్న పట్టుశాలువా తీసి అతడికి కంఠహారంగా వేసి సన్మానించింది. ఆ ట్రేలో ఉన్న తన ప్రథమ కవిత్వ పుస్తకాన్ని ‘దివాన్’ను అతని చేతులలో పెట్టి శిరసు వొంచి మూడుసార్లు సలాం చేసింది. అందరి సమక్షంలో తన ప్రేమకు పట్టాభిషేకం చేసింది.
యావత్ భారతదేశంలోనే తొలిసారిగా కవిత్వాన్ని ఒక పుస్తకంగా తీసుకొచ్చింది మహమ్మద్ ఖులీ కుతుబ్‌షా. ఆ కవితా సంపుటి పేరు ‘ఖుల్లీయత్. అట్లనే అప్పటి వరకూ దేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రి మాహ్‌లఖా బాయి చందా. స్త్రీల తొలి కవిత్వ సంపుటి కూడా ఆమెదే. మొదటిసారి ఒక కవీ, కవయిత్రీ కవితా సంపుటులు హైద్రాబాద్ నుండి రావటం అది హైద్రాబాద్ నగరం అదృష్టం. ఆమె కవిత్వం ఢిల్లీ, లాహోర్, లక్నోలలో కూడా మారుమోగింది. పండితులచే ప్రశంసలు అందుకుంది. ఆ ప్రియురాలు తన ప్రియుడికి సమర్పించిన కానుక ‘దివాన్’ ఉర్దూ కవిత్వ సంపుటి.
సభ ఆనందంలో మునిగి తేలుతున్నా నవాబు మీర్ ఆలం మాత్రం ఈర్ష్యాసూయలతో భగ్గున మండి పోతున్నాడు. తన యవ్వనంలో ఆమెను తలమునకలుగా ప్రేమించినాడు. ఆమె ప్రేమరోగంతో తపించి మదర్సా తాలీంలను తగిలేసుకున్నాడు. అయితేనేం విజయం సాధించి ఆమెను కన్నెరికం చెర నుండి విముక్తి చేసినాడు. ఒక తవాయఫ్‌ను ‘నిఖా’ చేసుకోలేడు కావున చివరికి ‘జెనానా’లో బంధించే ప్రయత్నం చేసినాడు. కాని ఆమె ఒక స్వేచ్ఛా విహంగం. తనను కాదని, కాలదన్ని ప్రధాన మంత్రి అరస్తుజా ఆశల వాకిట్లో కొంత కాలం రెపరెపలాడి, ఆ ముసలోణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసి ఆయన తల మీద ఓ తన్ను తన్ని ఏకంగా రెండవ నిజాం దర్బారులో ఆస్థాన నర్తకిగా వాలింది.
దీపావళి పండుగ రాత్రి పటాకుల హోరెత్తే చప్పుళ్ల మధ్య మొదటిసారి ఆమె మెరుపు నృత్యాన్ని, మరిపించి మురిపించే అందాన్ని చూసిన ఆ వృద్ధ నవాబు నిజంగానే ‘గుండెపోటు’కు గురైనాడు. కోలుకున్న తర్వాత ఆమె ప్రతిభా పాటవాలకు మెచ్చి ‘ఉమ్రావ్’ స్థానాన్ని ప్రసాదించి తన ఆస్థానంలో ఆమెను అలంకరించినాడు. వివిధ రంగాలలో ప్రముఖులైన మేధావులకు ‘ఉమ్రావ్’ బిరుదులను ఇచ్చి దర్బారులో ఉంచుకునేవారు. వారు అన్ని విషయాలలో ప్రభువులకు సలహాలను అందించేవారు.
ఒకప్పుడు తన ‘ఇలాఖా’లో వున్న ఆ తవాయఫ్ ఆ షాయరీల కితాబ్‌ను తనకు, అదీ తన ఇంట్లో, తను ఏర్పాటు చేసిన సంబరాల సభలో తనకు నజరానాగా ఇవ్వక ఒక ఫిరంగీకి ఇవ్వటం మీర్ ఆలంకు పుండు మీద కారం రాసినట్లయ్యింది. అన్నింటినీ మించి జాన్ మాల్కం సమక్షంలో ఆమె ‘పువ్వు పూసి మొగ్గగా మారటం’ అతను సహించలేకపోయినాడు. అవమాన భారంతో లోలోపలే పండ్లు పటపటా కొరికినాడు.
మాహ్‌లఖా బాయి చందా తల్లి రాజ్ కన్వర్ బాయి. ఆమె హిందువు. ఆమె అన్న నైజాం సైన్యంలో ఉన్నతాధికారిగా పని చేసేవాడు. నృత్యం ఆమెకు ఆరో ప్రాణం. ఆస్థాన నర్తకిగా వున్నా వివాహం చేసుకుంది. భర్త తాజ్ అలీ షా. విభిన్న రంగాలలో ప్రతిభాశాలి. చిత్రకారుడే కాదు, చరిత్రకారుడు కూడా. వారి ఏకైక సంతానమే మాహ్‌లఖా బాయి. తల్లి నుండి నృత్యాన్ని, అందాన్ని తండ్రి నుండి కళాత్మక హృదయాన్ని, చరిత్ర గ్రంథాల యెడల మమకారాన్నే గాక మేన మామ నుండి ధైర్యాన్ని, వీరత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకుంది. విలువిద్యలో, ఈటెలు ఉపయోగించటంలో ఆమె ఆరితేరిన వీరవనిత. పురుషుల దుస్తుల్ని ధరించి నిజాంతో పాటు ఆమె యుద్ధాలలో పాల్గొనేది. ఒక అందంలోనే కాక అనేక విషయాలలో ఆమె ప్రతిభాపాటవాలు కలిగిన స్త్రీ అని జాన్ మాల్కం తన స్వీయ చరిత్రలో రాసుకున్నడు.
మాహ్‌లఖా బాయి జననమే ఒక వింత కథ. ఆమె 1764లో జన్మించింది. ఆమె తల్లి ఆర్నెల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మౌలాలీ గుట్ట మీద ఉన్న ఒక సూఫీ సాధువు దర్గా సందర్శనకు పోయింది. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. భర్త తాజ్ అలీ షా ఒక్కడే పరిగెత్తి పైకి పోయి అక్కడి ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయింది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డ ‘మాహ్‌లఖా బాయి’ని కన్నది. ఆమె కారణ జన్మురాలు.
దర్గాల సంస్కృతి ఇస్లాం మతంలో ఒక భాగమే అయినా మనదేశంలోని సూఫీ సాధువులు, ఫకీర్లు ఇస్లాంలోని షియా మతస్తులు కావటం వలన మతసహనం దృష్టితో హిందూ మత ఆచారాలలో భాగమైన ‘ప్రసాదాన్ని’ కూడా దర్గాలలో ప్రవేశపెట్టినారు. అందుకనే పహడీ షరీఫ్, జహంగీర్ పీర్ దర్గా, మౌలాలీ దర్గాలలో ప్రసాదాన్ని పంచుతారు. దానితో హిందువులలోని శూద్రకులాల వారు, దళిత కులాలవారు దర్గాలకు, సూఫీ సాధువులకు దగ్గరైనారు.
భారతదేశంల పన్నెండవ శతాబ్దంల వ్యాపించిన సూఫీ తత్వం హిందువులల్ల శూద్రకులాలను, దళితులను చాలా ప్రభావితం చేసింది. తొలిదశల సూఫీలు ఇరాన్, ఇరాక్ దేశాల నుండి భారతదేశానికి వచ్చినారు. వీరు విద్య, వైద్యం ద్వారా హిందువులల్ల అట్టడుగు వర్గాల ప్రజలకు చేరువైనారు. వారు మరణించిన తర్వాత వారి దర్గాలు వెలిశాయి. వైద్యుల, విద్యాదాతల సమాధులే ఈ దర్గాలు. హిందువులందరూ ఆ దర్గాలను ఆదరించి ఆరాధించినారు.
హైద్రాబాదుల జహంగీర్ పీర్ దర్గా, పహడీ షరీఫ్ దర్గా, యూసుఫియా దర్గా ముఖ్యమైనవి.
ఆమె కళావతి మాత్రమే కాదు, విద్యావతి కూడా. ఆమె నివాసం సరస్వతీ సన్నిధానం. ఆమె సాజిందాలతో (వాయిద్యకారులతో) మెహఫిల్‌లలో, ముషాయిరాలలో ప్రవేశించగానే సభికులు ఆమె సన్మానార్థం, గౌరవార్థం లేచి నిలబడేవాళ్లు. నిజంగానే ఆమె కారణజన్మురాలు. ఆమె ఇంట్లో ఒక పెద్ద గ్రంథాలయం ఉండేది. అవన్నీ సకల శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు. విద్య, విజ్ఞానం పట్ల ఆమెకు గల తృష్ణకు ఒక తార్కాణమే ఆ గ్రంథాలయం. దక్కన్ చరిత్ర రాయడానికి ఆమె కొంత మంది చరిత్రకారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. కవులకు, రచయితలకు ఆర్థిక సహాయమే గాక ఆశ్రయం కూడా కలిగించేది. మౌలాలీ, అధికమెట్ట (అడిక్‌మెట్) నేటి ఉస్మానియా యూనివర్శిటీ, సీఫెల్ నుండి బాగులింగంపల్లి వరకూ ఈమె జాగీరులోని ఇలాఖాలు. చదువుల తల్లి ఉస్మానియా యూనివర్శిటీ, వివిధ విదేశ భాషలను అభ్యసించే ‘సీఫెల్’, ఆంధ్ర మహిళా కళాశాలతో పాటు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొదలగు విద్యాకేంద్రాలన్నీ మాహ్‌లఖా బాయి చందా భిక్ష పెట్టిన స్థలాలే.
ఆమె తన జీవితకాలంలో మౌలాలీ గుట్టపై ‘ఉర్సులను’ ప్రతి యేటా ఘనంగా జరిపించేది. గుట్ట కింద ఒక పెద్ద పూలతోటను నిర్మించింది. అందులో తన తల్లిని సమాధి చేసింది.
చివరికి ఆమె సమాధి కూడా అక్కడే ఉంది. మాహ్‌లఖా బాయి చందా ప్రతి వర్ధంతి నాడు అక్కడ ముషాయిరా, సంగీతనృత్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. కొంతమంది దీవానా, పర్వానాలు ఉత్త చేతులతో కాక షాయరీలతో అక్కడ జమ అవుతుంటారు. తన సౌందర్యంతో, ప్రతిభా పాటవాలతో హైద్రాబాద్ నగరాన్ని రగిలించి వెలిగించిన ఆ ‘తవాయఫ్’ ప్రస్తుతం గాలి కూడా సడి చేయని, ఆకు కూడా కదలని, దేవతలు నివసించే ఆ నిశ్శబ్ద సంగీతంలో, ఆమె కలల పూదోటలో, పూల రేకుల నీడల కింద ఆమె పెను విశ్రాంతిలో ఉంది.
కనీసం ఇప్పుడైనా ఆమె ‘శాంతి’ని ఎవరూ భగ్నం చేయకండి.
* * *
కెప్టెన్ జాన్ మాల్కంకు ఒక ప్రియురాలు నజ్‌రానా ఇచ్చిందీ అక్కడే. తన ప్రేమకు పట్టాభిషేకం జరిపిందీ అక్కడే. జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్‌కు కూడా ప్రేమా, ప్రియురాలు దొరికిందీ అక్కడే. మీర్ ఆలం ఏర్పాటు చేసిన ‘మెహఫిల్’ ముగిసిన తర్వాత చాలా సేపటి వరకూ అతిథుల ముచ్చట్లు కొనసాగుతనే ఉన్నయి. తన సహాయకుడు, సన్నిహిత మిత్రుడు జాన్ మాల్కం పత్తా లేడు. బహుశా ‘చందా’ చూపుల తూపులకు కరిగిపోయి పానీ పానీ అయిపోయినాడేమో! చషకాల గలగలలు, పూబోడుల గాజుల గలగలల నుండి తప్పించుకుని మహల్ నుండి ఇవతలికి వచ్చి బాల్కనీలో నిలబడి నిండు పున్నమి చందురుడిని చూస్తూ, ఒంటరితనం మరింత బాధ పెడుతుంటే మాల్కం కోసం నిరీక్షిస్తున్నాడు పాట్రిక్. ఇంతలో ఒక చమేలి అత్తరు పరిమళం అతడిని చుట్టుముట్టి కమ్ముకుంది.
“హలో పాట్రిక్” లారా పలకరిస్తూ సన్నగా నవ్వింది. ఆమె నగరంలోని ప్రముఖ బ్యాంకర్ విలియం పామేర్ గారి కోడలు. ప్రౌఢ. పెద్ద సోషలైట్. ఆమె లేకుండా విందులు, గానా బజానాలు, సోషల్ గ్యాదరింగులు జరగవు. సంస్కారంతో కూడిన చతుర సంభాషణ ఆమె సొత్తు.
“హలో మేడం లారా” మర్యాదగా ప్రతిస్పందించినాడు.
“ఎన్నాళ్లీ ఒంటరితనం ఓ తోడు వెదుక్కోకూడదూ?” చనువుగా ప్రశ్నించింది.
“యస్. మీరు సహాయం చేస్తే” నవ్వులాటకు అన్నాడు.
“సుబ్హానల్లా” అని ద్కనీ సంప్రదాయంలో నాటకీయంగా శిరసు వొంచి సలాం చేసింది.
“మీ కోసం ఓ చక్కని చుక్కను ఎన్నిక చేసినాను”
“ఆకాశంలోని అందని చుక్కనా?” హాస్యమాడినాడు.
“నోనో. మిస్టర్ పాట్రిక్! సీరియస్లీ టెల్లింగు”
“ప్లీజ్ హెల్ప్ మీ!” ఆత్రుతగా అడిగినాడు.
“నేను మొన్న పంచ్ మహల్లాలోని మేడమ్ షర్ఫున్నిసా దేవిడీకి పోయిన. ఆమె తండ్రి బాఖర్ అలీ ఖాన్ తనకు ‘భక్షీ’గా (పే మాస్టర్) సర్కారీ నౌఖరీలో పదోన్నతి లభించిన సందర్భంగా వారింట్లో పెద్ద విందు ఏర్పాటు చేసినాడు. నేనూ పోయి హాజరు వేయించుకున్నా”
“ఎవరా భక్షీ?” ఆలోచిస్తున్నట్లు అడిగినాడు.
“అదే. ఈ మధ్యనే అఖలుద్దౌలా అని నవాబుగారు బిరుదును కూడా ప్రసాదించినారు. అతనే.”
“యస్. యస్. ఐ టూ అటెండెడ్ దట్ జషన్” అన్నడు.
“ఆఁ ఆయనే బాఖర్ అలీఖాన్. ఆయన కూతురే షర్ఫున్నిసా. అల్లుడు మహమ్మద్ అలీఖాన్. గోల్కొండ కోటలోని ఆయుధాగారంలో తుపాకుల పర్యవేక్షణాధికారి. వారి రెండో అమ్మాయి ఖైరున్నిసా. ఆ విందు సందర్భంలో జెనానాలోకి వెళ్లేసరికి ఆ “చాంద్ క తుక్‌డా” కనిపించింది. నిజంగా చూసేసరికి మూర్ఛపోయాననుకో”
“రియల్లీ?” విస్మయంగా అన్నడు.
“అసలు ఆ పేరులోనే ఒక నిషా ఉంది. అందుకే మూర్ఛపోయానని అంటున్నాను. ఖైర్ – ఊన్ – నిషా. నిజంగా ఆ అందంలో చూసేవారికి నిషా కలిగించే సుందరే. ఆమెనే మీకు సరైన జోడీ. ఇక మీ కలలరాణి మీకు దొరికినట్లే.”
“ఓ మై జీసస్” తన్మయత్వంతో తనలో తనే గొణుక్కున్నడు.
“అప్పుడే ఏమైందీ? ఇంకా విను. ఖైరున్నిసా పూర్వీకులు పర్షియా నుండి ఈ హైద్రాబాద్‌కు వలస వచ్చినారు. పర్షియా సుందరీమణుల అందం గురించి నీకు తెలియనిదేముంది? అయినా నేను నీకు చెప్పాల్నా? పురాతన పర్షియా రాచకుటుంబాల అందాలన్నీ ఒక చోటనే ఒలకబోసినట్లు, వాటన్నింటినీ తానే పుణికి పుచ్చుకున్నట్లు ఆ ముగ్ధ మనోహర మందారపు మొగ్గ నీకు కనిపించింది అంటే ఈ చషకాలన్నీ వృధా వృధా…ఆ ముగ్ధ సుందరి నయనాలే అసలైన చషకాలు. వాటిలోని మత్తును నీవు తనివి తీరేలా గ్రోలి ఆ మత్తులో చిత్తయిపోవాలె. అదే అసలైన మజా” అంటూ అతడి ముఖంలోకి చూసింది మేడమ్ లారా.
అప్పటికే జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్, ది గ్రేట్ రెసిడెంట్ ఆఫ్ హైద్రాబాద్ సంస్థాన్ ఆన్ భిహాఫ్ ఆఫ్ ఈస్టిండియా కంపెనీ “మైతో లుఠ్ గయా, మైతో బర్బాద్ హో గయా” అన్న స్థితిలోకి జారిపోయినాడు. జావకారి పోయినాడు.
పాపం పాట్రిక్‌ను చూసేసరికి ఆమెకే జాలి వేసింది. తను చలాయించిన ‘తీర్’ సరిగ్గా ‘నిషానీ’ మీదనే తగిలిందని తనని తనే లోలోపల మెచ్చుకుంది.
“లారా! ప్లీజ్ ఒక్క సహాయం చేయవూ?”
“తెలుసు. తెలుసు. ఆమెను చూపించాలె. నీవామెతో మాట్లాడాలె. అంతే కదా!” అంది కవ్వింపుగా.
“ఔనౌను” తసబిస అవుతూ అన్నాడు.
“సరే. ఐ విల్ టెల్ యూ వన్ గుడ్ ప్లాన్.”
“ప్లీజ్. ప్లీజ్.”
“వచ్చే శుక్రవారం ఖైరున్నిసా అక్క నజీరున్నిసా పెళ్లి. తప్పకుండా నీకు ఆహ్వానం వస్తుంది. పాంచ్ మహల్లాలోనే పెళ్లి. ఆ పెళ్లిలోనే మీ ఇద్దరికి పెళ్లి చూపులు కూడా. ఓ.కే.?”
ఆ కలల మనిషి, కవిత్వంలో జీవించే ఆ మనిషి కిర్క్ పాట్రిక్ ఇక ఆ క్షణం నుండి శుక్రవారం కోసం ఎదిరిచూడటం ప్రారంభించినాడు. ఆమెను చూడకముందే ఆమెను ప్రేమించటం మొదలు పెట్టినాడు. జన్మజన్మల నుండి ప్రతీ రాత్రి తన కలల్లో కనిపించే ఆ స్వప్నసుందరి తనకు అపరిచిత ఎలా అవుతుంది? ‘ఖ్వాబో మే మిలే అక్సర్’ అనుకుంటూ మీర్ ఆలం దేవిడీ నుండి నిష్క్రమించినాడు.
ప్యార్ ఏక్ ఆగు కా దరియా హై
కహీఁ ఆగు న లగు జాయే
కహీఁ దాగు న లగు జాయే
* * *
షెహనాయీ, సారంగీ, తబ్లా, డోలక్‌లు ఇవేవీ అతడి మనస్సును స్పృశించటం లేదు. హృదయాన్ని, పులకరింపజేయటం లేదు. అతను ఇహలోకంలో లేనేలేడు. స్వప్న లోకాలలోని స్వప్నసుందరి ఖైర్ -ఊన్ – నిషా కోసం అన్వేషిస్తున్నాడు. ఆమె కోసం ఆ నయనాలు చకోరాలై చంచలంగా అటూ ఇటూ ఆ పాంచ్ మహల్లా అంతటా వెదుకుతున్నాయి. నీకు నాకు దూరమాయె – నీలికొండలడ్డమాయె’ అన్నట్లు ఆ మహల్ అంతటా నిలువెత్తు జలతారు పరదాలు. జాలీ జాలీ చిల్మన్లు. వాటి వెనుక గాజుల గలగలలు, ఘుంఘురూల సవ్వడులు, కలకల కిలకిలల నవ్వుల పువ్వులు – మబ్బుల మాటున దాగిన తారకలా ఆ జలతారు పరదాల వెనుక ఎక్కడో తన ఖైరున్నిసా!
అతను జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్‌గా ఆ షాదీకి రాలేదు. అచ్చం దక్కనీ ఆహార్యం, అలంకరణలతో నవాబ్ హష్మత్ జంగు బహద్దూర్ నిజాం దత్తపుత్రుడిలాగే ఆ వివాహస్థలం పాంచ్ మహల్లాకు వచ్చినాడు. అతను ‘ఫిరంగీ’ అని ఎవరూ గుర్తు పట్టనంతగా వేషభాషలు. భారీ జరీ అల్లికలతో అద్దాలు, రంగు రంగుల అద్దకాలతో చేసిన మొఘలాయి అంగరఖా మోకాళ్ల కింది వరకూ ధరించినాడు. లోపల తెల్లని కుర్తా, పైజామా. మెడలో మేలిమి ముత్యాల హారాల దండలు. తల మీద చెమ్కీల తురాయి, దాని మీద ఓ పింఛం. సుర్మా కండ్లు, పొడవైన నాసిక కింద దక్కన్ నవాబుల మాదిరే మెలి తిప్పిన నల్లటి మీసాలు – రోసమంతా ఆ మీసంలోనే ఉన్నట్లు. లేత తాండూరు తమలపాకుల సేవనంతో కెంపుల్లా మెరిసే ఎర్రటి పెదాలు. కాళ్లకు లక్నో చడావులు. ఎడమ చేతిలో అలీగఢ్ నగిషీలతో సుతారంగా తీర్చి దిద్దిన పొడుగాటి వొరలో పొందికగా ఒదిగిన తేజ్ తల్వార్. రాజసం, దర్పం ఉట్టి పడుతుంటే మహల్లోకి అడుగు పెట్టినాడు. బాఖర్ అలీ ఖాన్, మహమ్మద్ అలీ ఖాన్‌లు ఎదురేగి సగౌరవంగా ఆహ్వానించినారు. అక్కడే ఉన్న ప్రముఖ ఆస్థాన చిత్రకారుడు వెంకటాచలం పాట్రిక్ మొఘలాయి రూపాన్ని కళ్లలో నింపుకుని, ఆ తర్వాత అందమైన నిలువెత్తు చిత్రాన్ని గీసినాడు. ఆ తస్వీర్ ఇప్పటికీ సాలార్‌జంగు మ్యూజియంలో భద్రంగా ఉంది. అది హైద్రాబాద్‌కు దక్కిన అపురూప కానుక.
ఎట్టకేలకు తారాచంద్రుల కలయిక జరగనే జరిగింది. పాట్రిక్ జెనానా పరదాల పక్క నుండి దివాన్‌ఖానాలోకి పోతుంటే ఓ రామచిలుక ఆ పరదాల పక్కనుండి రివ్వున ఎగిరి వచ్చి రెపరెపలాడుతూ అతడి కుడిభుజం మీద అలవోకగా వాలి కూచుంది. దాని వెంటనే పరదాలను పక్కకు తొలగించి ‘మిట్టూ’ అని అరుస్తూ ఓ మెరుపు తీగె దివి నుండి భువికి దిగివచ్చిందా అన్నట్లు ప్రత్యక్షమయ్యింది. ఆ కోకిల కంఠం వెన్న, ఖండ శక్కర కలిసినంత తియ్యగ ఉంది. ఆ అసూర్యంపశ్య అట్లాగే స్థాణువు లెక్క నిలుచుండిపోయింది. వారిద్దరి చూపుల తూపులు – “మీఠీ నజరోఁకీ బిజిలీ గిరానే లగే”. ఆ అపరిచిత, ఆ అనామిక తన పేరు చెప్పకపోయినా ఆమెనే ఖైరున్నిసా అని పాట్రిక్‌కు తెలిసిపోయింది. ఆ అద్వితీయ సౌందర్యాన్ని వర్ణించటానికి ఏ ఉపమానమూ సరిపోదు. ఆమె అందానికి ఆమెనే సాటి.
అయితే ఆ అందగాడు పాట్రిక్ అని ఖైరున్నిసాకు ఖచ్చితంగా ముందే తెలుసు. ఆ పరదాల వెనుక యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని నడిపించి ముందు రామచిలుకనూ, దాని వెనువెంటనే పంచవన్నెల పంచదార చిలుకనూ పంపింది లారానే కదా! అయినా పాట్రిక్ నీలికళ్లలోని ‘కనికట్టు’ ముట్టడికి ఆమె మంత్రించిన బొమ్మలా నిలబడిపోయింది.
“ప్రియా! ఎన్ని యుగాల తర్వాత మళ్లీ లుసుకున్నం” అని ఆ మూగ హృదయాలు పరస్పరం పలకరించుకున్నై.
షెహనాయీ, సారంగి స్వరాలు మంద్రస్థాయిలో మంగళవాయిద్యాలు మోగిస్తున్నై.
* * *
ఖైరున్నిసా మాతామహుడు బాఖర్ అలీఖాన్ మీర్ ఆలంకు దగ్గరి బంధువు. మీర్ ఆలం వంశానికి చెందిన చోటే నవాబుతో ఖైరున్నిసా వివాహం జరపాలని ఒక బాఖర్ అలీఖాన్ మాత్రమే కాక అల్లుడైన మహమ్మద్ అలీఖాన్‌కు కూడా కోరిక ఉంది. చోటె నవాబ్‌తో వివాహం వలన రాచకుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడి తమ ఉద్యోగాలలో త్వరితగతిన పదోన్నతులు పొందాలని ఆ మామా అల్లుళ్ల చిరకాల వాంఛ. అందుకే చోటే నవాబుతో వివాహానికి ‘ఖరార్‌నామా’ (వివాహ నిశ్చితార్థం) కూడా జరిపించినారు. ‘తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి’ అని ఆ మామా అల్లుళ్లు ఆడవాళ్లందరికీ ఫత్వా జారీ చేశారు.
ఖైరున్నిసా తల్లి షర్ఫున్నిసాకు ఆమె అత్త దుర్దానా బేగంకు చోటే నవాబుతో ఖైరున్నిసా పెళ్లి అసలు ఇష్టం లేదు. వాడుత్త ఆడంగి రేకులోడు. ఇటు చదువు అటు పని ఏమీ లేదు. పతంగీలెగరేయడం, పత్తాలాడటంలో మాత్రం అవ్వల్ దర్జా. లారా అప్పటికే ఆ అత్తాకోడళ్లను మంత్రించి పారేసింది. అక్లీస్ కిర్క్ పాట్రిక్ రెసిడెంటు గారు నిజాం నవాబు తర్వాత మరో నవాబంతటి వాడని, నిజామే స్వయంగా దత్తపుత్రుడని ‘ఏలాన్’ చేసినాడు కావున పాట్రిక్‌కు ఇక ఎదురేలేదని, వారిద్దరి వివాహంతో మీ కుటుంబం ‘షాన్ ఔర్ షౌరత్‌లు’ పెరుగుతాయని ఉన్న వాస్తవాలే చెప్పింది. అత్త లేని కాపురానికి కూతురు వెళ్లుతుందని ఆ తల్లి హృదయం సంతోషించింది. రెసిడెంటు గారిని అల్లుడిగా చేసుకుంటే తమ సామాజిక స్థాయి, అంతస్థు పెరుగుతాయని ఆమె ఆశించింది. అత్తాకోడళ్లు ఒక వైపు, మామా అల్లుళ్లు మరో వైపు ఒకే ఇంట్లో రెండు శత్రుశిబిరాలు ఏర్పడినాయి. కుట్రలు, కుతంత్రాలు ఎత్తులు పైయెత్తులు ప్రారంభమైనాయి.
ఇక ఖైరున్నిసాకు మొదటి నుండీ చోటే నవాబ్ అంటే మురికి కుంటలోని కీటకంతో సమానం. ఆమె అందం చీకటిలో మెరిసే కర్పూర దీపకళిక. విరబూసిన గుల్‌మొహర్ పుష్పం. ఆ సుకుమార ముగ్ధ సౌందర్యం యావత్ దక్కన్‌కే ఒక దీపస్తంభం. ఆమెది అపురూప పురాతన పర్షియన్ సౌందర్యం. పాట్రిక్‌ను చూసి తొలిచూపులోనే మనస్సు అర్పించుకున్న ఆమె వేరెవర్నీ వరించనని మొండికేసింది. చాటుమాటున ప్రియుడ్ని కలుసుకుంటూనే ఉంది. అప్పటికి ఆమె వయస్సు పదహారేళ్లు. పాట్రిక్ ఆమె కన్నా ఇరవై రెండు సంవత్సరాలు పెద్దే అయినా తన స్వప్పసుందరి కోసం బ్రహ్మచారిగానే మిగిలినాడు. ఆ స్కాటిష్ అందం అతడి వయస్సును మరిపించింది. ఆమెను మురిపించింది.
వారి ప్రేమ కర్పూరపు పరిమళంలా నగరమంతా గుప్పున గుభాళించి గల్లీగల్లీలలో వ్యాపించి చివరికి చార్మినార్ చబూత్రాల మీద పుకార్ల షికార్లు చేసింది. ఎవరి నోట విన్నా వారి ప్రేమ పురాణమే. ఈ పుకార్లన్నీ మామా అల్లుళ్ల చెవిన పడగానే అగ్గి మీద గుగ్గిలమైనారు. చోటే నవాబుతో ‘నిఖా’కు ముహూర్తాలు పెట్టుకున్నరు. ఆ దుర్వార్త తెలిసిన ఖైరున్నిసా విషం సేవించి ఆత్మహత్యా యత్నం చేసింది. ఆడవాళ్లు గొల్లుమన్నారు. హకీముల దవాతో, ఫకీర్ల దువాతో పాట్రిక్ నామస్మరణతో ఆమె కండ్లు తెరిచింది.
ఆ తర్వాత అల్లా దయ వలన మామా అల్లుళ్లు ఏదో రాచకార్యం మీద నెల రోజుల కోసం మైసూరు పోయినారు. పై నుండి దేవతలు తథాస్తు అన్నారు. అత్తాకోడళ్ల బుర్రలు పాదరసంలా పని చేసినై. ఈ మొత్తం వ్యవహారంలో ఆడవాళ్లందరూ మొగవాళ్లందరి కన్న తెలివిగా, లౌక్యంగా వ్యవహరించి తాము అనుకున్నది సాధించినారు.
ఒక వెన్నెల రాత్రి తమ కర్పూర దీపకళికను సింగారించి రెసిడెన్సీకి తీసుకపోయి తామే స్వయంగా అతడికి అప్పగించి, అప్పగింతలు చెప్పి తమ గారాల బిడ్డకు సుద్దులు, బుద్ధులు చెప్పి పాంచ్ మహల్లాకు వాపసు వచ్చినారు. కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారని ఆ ఆడవాళ్లిద్దరూ నిశ్చింతగా నిద్రపోయినారు.
ఆ చిలకా గోరింకల కలలు, కళలు పండి నెల తిరిగేసరికి ఖైరున్నిసా నెల తప్పింది. ఈసారి గొల్లుమనటం మగవాళ్ల వంతయ్యింది. ఆ వార్త కూడా షహరులోని బజారులలో హుషారుగా షికారు చేసింది. నిజాం నవాబుకు, ప్రధానమంత్రి అరుస్తజాకు సంగతి తెలిసింది. కరటక దమనకులైన మామా అల్లుళ్లు గర్భవిచ్ఛిత్తి జరిపించైనా సరే చోటే నవాబుతోనే పెళ్లి జరిపించాలని నిర్ణయం తీసుకున్నరు. అది పెద్ద ప్రాణానికే ముప్పని ఆడవాళ్లు గుండెలు బాదుకున్నరు. మొగవాళ్లు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించినారు. ముందు ఖైరున్నిసాను గృహ నిర్బంధంలో వుంచినారు.
సంయోగంలో నిద్దుర లేదు
వియోగంలో నిద్దుర రాదు
కంటికి నిద్దుర కరువైనప్పుడు
రాత్రికి పగలుకు తేడా లేదు
తొలి తొలి వలపులు తనివి తీరా తీరక ముందే ఆ ప్రేయసీప్రియుల మధ్యన ఎడబాటు కలిగింది. విరహం వారిని వేధించింది. వెన్నెల వారిని బాధించింది. ఖైరున్నిసా చదువుకున్న అమ్మాయి. పైగా తెలివైన పిల్ల. ప్రతి రోజూ అందమైన ప్రేమలేఖ రాసి పనివాళ్లనే వేగులవాళ్లుగా మార్చుకుని పాట్రిక్‌కు ప్రేమ సందేశాలు పంపేది. అన్ని సంగతులు వెంటవెంటనే తెలియజేస్తుండేది. తన నెలరాజు వచ్చి ఆ బందీఖానా నుండి బంధవిముక్తి గావించి తన బిగికౌగిలిలో బంధిస్తాడని ఆమె గట్టి నమ్మకం. ఆ ప్రయత్నాల వెనుక అమ్మా అమ్మమ్మల సహకారం కూడా ఉంది.
ప్రేమా పెళ్లి విషయంలో ఆమె వ్యక్తిత్వం చాలా దృఢమైనది. ఆమె తరచూ తన స్నేహితురాళ్లకు ఉత్తరాలు రాసేది. లేఖా సంస్కృతి ఆమెకు ఆరో ప్రాణం. దూరాలను కలిపే దారాలే ఈ ఉత్తరాలు అనేది. ఆమె రాసే ఉత్తరాలలో పర్షియన్, దక్కనీ ఉర్దూ కవిత్వ పరిమళాలు వెదజల్లుతూ గుప్పున గుభాళించేవి. పాయెగా, ఉమ్రావ్ లాంటి ఉన్నత వంశాల వారి స్త్రీలందరితోనూ ఆమెకు చక్కటి స్నేహసంబంధాలు ఉండేవి. లారాతో ఉన్న సుస్నేహమే ఆమెను పాట్రిక్‌కు దగ్గర చేసింది. ఆనాటి ముస్లిం ఛాందస సమాజంలో ఆమె ప్రేమకథ, షికార్ల పుకార్లు ఉన్నత వంశాల స్త్రీలందరినీ ఆకర్షించినై. గొప్ప సాహసం చేసిన వీరవనితగా వారందరి అభిమానాన్ని సంపాదించింది. చాటుమాటు అక్రమ సంబంధాలను ఆమోదించే ఆ ఛాందస సమాజం సాహసంతో కూడిన ప్రేమ సంబంధాలను ‘ధిక్కారంగా’ బరి తెగించిన బలుపుగా భావించింది.
ప్రేమా, పెళ్లి సంగతులలో పాట్రిక్ కన్నా ఆమెనే ఎక్కువ చొరవ, సాహసం చేసి చూపింది. అతడు ఆమె మనసును దోచుకుంటే ఆమె అతడి ప్రేమను పోరాడి గెలుచుకుంది. పరదాల వెనుక అణిగిమణిగి ఉండే ఆ అసూర్యంపశ్య ప్రేమ కోసం లోకాన్నే ఎదిరించి పోరాడింది. తమ మతం కాని, తమ దేశం కాని ఓ ‘ఫిరంగీ’ని ప్రేమించడం నిజంగా ఒక దుస్సాహసమే !
నిజాం నవాబు అతని ప్రధాన మంత్రి అరుస్తుజా దృష్టిలో వారిద్దరి ప్రేమ పెళ్లి ఒక రాజకీయ అంశం. వారిద్దరికీ పెళ్లి జరిపించి తమ సంస్థానానికి ఈస్టిండియా కంపెనీకి ఆపై బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య గల స్నేహసంబంధాలను పదిలపరుచుకోవాలని, పటిష్టం చేసుకోవాలని నిజాం నవాబు రాజకీయపుటెత్తుగడలు. వారిద్దరూ రెసిడెన్సీ రాసలీలలను జాగ్రత్తగా గమనిస్తుండగానే ఇంతలో ఒక ఘోరం జరిగిపోయింది.
ఖైరున్నిసా తండ్రి మహమ్మదలీ ఖాన్ గోల్కొండ కోటలోని తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా తుపాకిని పర్యవేక్షిస్తుండగా అది హఠాత్తుగా పేలి గుండు తలలోకి దూరి అతను అక్కడికక్కడే మరణించినాడు. అది ప్రమాదవశాత్తుగానే జరిగినా పాట్రిక్ తనకు అడ్డు తొలగించుకోవాలని ఒక పథకం ప్రకారం అతడిని హత్య చేయించాడని చార్మినార్ చబూత్రా వద్ద పుకార్లు వ్యాపించినై. మీర్ ఆలం మనుషులు తెర వెనుక నుండే ఆ పుకార్లకు ధూపం వేయసాగినారు. పరిస్థితి చేజారినట్లు గమనించిన నిజాం ఖైరున్నిసా తాత బాకర్ అలీఖాన్‌ను పిలిచి వారిద్దరి వివాహానికి అతడిని బెదిరించి ఒప్పించినాడు. కొంతకాలం కోసం హైద్రాబాద్ నుండి దూరంగా వెళ్లమని సలహా ఇచ్చినాడు.
అప్పటికే ఖైరున్నిసా మూడు నెలల గర్భవతి.
నిజాం నవాబు పెళ్లి కొడుకు తండ్రిగా, అరస్తుజా పెళ్లి కూతురి తండ్రిగా నిఖానామా మీద సంతకాలు చేసినారు. పెద్ద మనసుతో దీవించినారు.
పాట్రిక్ ఖైరున్నిసాల పెళ్లి ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారమే జరిగినా సుల్తాన్ బజార్ చర్చిలో క్రైస్తవ మతపద్ధతిలో కూడా మళ్లీ ఆ పెళ్లి జరిగింది. రెండు మతాలవారిని సంతృప్తి పరచడం కోసం పాపం పాట్రిక్ కత్తి మీద సాము చేయవలసి వచ్చింది.
ఆ వివాహం సందర్భంగా చౌమహల్లాలో నిజాం కనీవిని ఎరుగని విందు ఏర్పాటు చేసినాడు. ధూమ్‌ధామ్ బారాత్‌తో పెళ్లి కూతురు ఖైరున్నిసా భర్త పాట్రిక్‌తో కలిసి రెసిడెన్సీలోకి ప్రవేశించింది.
పారవశ్యం పన్నీరై వాళ్ల మధ్య ప్రవహించింది. ఆ నూతన దంపతుల ఆనందానికి అవధులు లేవు. పాట్రిక్‌కు భూమి మీద కాలు ఆనటం లేదు. తమ ప్రేమాపెళ్లికి గుర్తుగా ఆ పాతకాలంనాటి నిజాం భవంతిని తీసేసి అదే స్థానంలో రెసిడెన్సీలో ఒక కొత్త ప్రేమ మందిరాన్ని సృష్టించాలని కలలు కన్నడు. పైగా ఆమె ఉత్త మనిషి కాదు, ఆమెను సంతోషపెట్టడానికి ఏదైనా ఘనకార్యం చేయాలని ఆలోచించి ఆ నూతన నిర్మాణాన్ని తలపెట్టినాడు.
ఆ నూతన భవనాన్ని చౌమహల్లా ప్యాలెస్ కన్నా, కలకత్తాలోని గవర్నర్‌గారి భవనం కన్నా అందంగా, కళాత్మకంగా, గొప్పగా నిర్మించాలని ప్లాను వేశాడు. ప్రముఖ ఇంజనీరు, వాస్తుశిల్పి రాజా కందస్వామిని పిలిపించినాడు. ఆయన తమిళుడే అయినా హైద్రాబాద్‌లోనే స్థిరపడి అనేక భవనాలను నిర్మించి నిజాంచే సెహభాష్ అనిపించుకొని ‘రాజా’ అన్న బిరుదును పొందినాడు. రెండవ నిజాం 1748లో ‘చౌమహల్లా ప్యాలెస్’ను 57 ఎకరాలలో నిర్మించినాడు.
పాట్రిక్ తన రెసిడెన్సీని 60 ఎకరాలలో ప్లాను చేసినాడు. రాజా కందస్వామి పెద్ద కాగితంపై ఆ ప్లాను గీసినాడు. నిజాం ఆమోదం కోసం దానిని రాజా కందస్వామిచే పంపించినాడు. వెంట శామ్యూల్ రస్సెల్‌ను కూడా పంపించినాడు. అతను పాట్రిక్‌కు రెండవ అసిస్టెంట్. అన్నిట్లో మంచి నమ్మినబంటు. నిజాం ఆ ప్లానును చూసి మొదట పరేషాన్ అయిపోయినాడు. అంత పెద్ద కాగితంపై ఆ ‘నక్షా’ అతడిని బెదరగొట్టింది. చివరికి ఏమీ తోచక ముచికుందా నదికి మరీ దగ్గరగా ఉంది కావున వరద ప్రమాదానికి గురి కావచ్చని జాగ్రత్తగాగా మరో నక్షా గీయమని దానిని తిరిగి పంపినాడు.
పాట్రిక్, రాజా కందస్వామిలు మళ్లీ ఒరిజినల్ ప్లానును ఏ మాత్రం తగ్గించకుండా, సవరించకుండా సరిగ్గా దానినే చిన్న కాగితంపైన గీసి కింద చిన్న నోట్ రాసినారు. ప్రతి ఇంచీ ఒక మైలుకు సమానమని. ఆ మెలిక నిజాం గమనించక దానిని ఆమోదించినాడు. నిర్మాణం పనంతా రాజా కందస్వామి, రస్సెల్‌ల భుజాల మీద పడింది. వారిద్దరూ మరో తాజ్‌మహల్‌ను కడుతున్నామన్న ఉత్సాహంతో ఏకదీక్షగా పని చేసినారు.
జీవితాలు శాశ్వతం కాదు, కట్టడాలు మాత్రమే శాశ్వతమని మొగల్ ప్రభువుల లాగే పాట్రిక్ కూడా విశ్వసించినాడు. ఇంగ్లాండులోని తన ఆస్తుల్ని అమ్మి, తన జీతంలోని సేవింగ్సుని అంతా వెచ్చించి నిజాం ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఇచ్చిన నిధుల్ని స్వీకరించి ఆ ప్రేమ మందిరాన్ని నిర్మించినాడు.
వారి ప్రేమ పండి ఆమె ఒడి నిండి 1801లో పనసపండు లాంటి కొడుకు పుట్టినాడు.
కొడుకు పుట్టిన మరు సంవత్సరమే కూతురు కూడా పుట్టింది. ఆ కూతురు పుట్టిన సంతోష సందర్భంలో పాట్రిక్ తన ముద్దుల భార్యకు మరో నజ్‌రానా ఇవ్వాలని అనుకున్నాడు. ఆమె కోసం ప్రత్యేకంగా రెసిడెన్సీలో ఒక జెనానా (స్త్రీల అంతఃపురం) నిర్మించినాడు. దాని పేరే ‘రంగు మహల్’.
దానిని హిందూస్తానీ శిల్ప శైలిలో చాలా కళాత్మకంగా సృష్టించినాడు. నిజానికి అదొక అద్దాల మహలు. ఎటు చూసినా అద్దాలే. బెల్జియం దేశం నుండి నాణ్యమైన అద్దాలను దిగుమతి చేయించాడు. చౌమహల్లాలో కూడా అటువంటి అందమైన అంతఃపురం లేదు. ఆ రంగు మహల్ చుట్టూ నాలుగు వైపులా ‘చార్‌బాగు’ను నిర్మించినాడు. అది కాశ్మీరులో షాజహాను నిర్మించిన మొగల్ గార్డెన్‌కు నమూనా. ఖైరున్నిసాకు పువ్వులన్నా, పక్షులన్నా ఇష్టం కావున రకరకాల పూదోటలతో పాటు ఒక ‘కబూతర్ ఖానా’ను కూడా కట్టించినాడు. ఆమె పావురాలను మక్కువతో పెంచుకునేది. రామచిలుకల కోసం, బుల్‌బుల్ పిట్టల కోసం ప్రత్యేకమైన ‘చిడియా ఘర్’ కూడా నిర్మించినారు. పావురాల పెంపకం మొగలుల విలాస, వినోదాల సంస్కృతిలో ఒక భాగం. వెన్నముద్దలు, మంచుపూల లాంటి కుందేళ్లు ఆ తోటలో ఇష్టారాజ్యంగా సంచరిస్తుండేవి. ఆ రెసిడెన్సీకి అతను షాజహాను ఆమె ముంతాజ్ మహల్.
ఆ సంతోష చంద్రశాలను ఆ దంపతుల ఆనందోత్సాహాలను చూసేసరికి నవాబ్ మీర్ ఆలంకు కండ్లలో మిరియాలు, కారాలు చల్లినట్లు భగ్గున మండిపోయినాడు. అతనిది పాము పగ. పడగ విప్పితే కాటేసే దాకా నిద్రపోడు. 1803లో రెండవ నిజాం చనిపోయినాడు. సికిందర్ జా సింహాసనాన్ని అధిష్ఠించినాడు. ప్రధాన మంత్రి అరస్తుజా కొన్ని మాసాలకే తన ప్రియతమ ప్రభువును వెదుక్కుంటూ పోయినాడు. కొత్త ప్రధానమంత్రి ఇక మీర్ ఆలం తన పాచికలను ప్రయోగించటం ప్రారంభించినాడు.
మూడవ నిజాం సికిందర్ జాకు పాట్రిక్ అంటే అంత సదభిప్రాయం లేదు. గతంలో తండ్రి మీద తను చేసిన తిరుగుబాటును పాట్రిక్ అణిచినాడని కక్షగా ఉంది. మీర్ ఆలం తన తొలి అస్త్రంగా కలకత్తాలో ఉన్న గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీకి ఒక లేఖ రాసినాడు. అందులో మాల్‌మసాలా బాగా దట్టించినాడు. సంగతులన్నీ పూసగుచ్చినట్లు ఫిర్యాదు చేసినాడు. పాట్రిక్ పెళ్లికి ముందే ఖైరున్నిసాను రేప్ చేసినాడని, అప్పటికే ఆమె మైనర్ బాలిక అని, దానితో హైద్రాబాద్‌లో రెసిడెంట్ పరువే గాక ఈస్టిండియా కంపెనీ పరువు కూడా పోయిందనీ, గత్యంతరం లేక పెళ్లి చేసుకున్నాడనీ దానితో ముస్లింల మనోభావాలు దెబ్బ తిని తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని, రెసిడెన్సీ నిర్మాణంలో ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసినాడనీ ఆరోపణలను కుమ్మరించి పాట్రిక్‌ను శిక్షించాలని ఆ లేఖ ముగించినాడు. దానితో లార్డ్ వెల్లస్లీ అసలే కోతి కల్లు తాగింది ఆపై నిప్పు తొక్కింది అన్నట్లు తయారయినాడు.
సెప్టెంబర్ మాసం ప్రవేశించింది. మళ్లీ ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనుకుంటూ ముసలోళ్లు గుండెల్ని అరచేతులతో పట్టుకొని గొణుక్కుంటున్నారు. రెండు రోజుల్నుండి ఎడతెరిపి లేని గాలివాన దుమారం. ముచికుందమ్మకు సిగమొచ్చింది. పురానాపూల్ కట్ట మైసమ్మకు కోపమొచ్చింది. అనంతగిరి పద్మనాభ స్వామి కొండలల్ల నుండి ముచికుంద గండిచెరువు మీదకు విరుచుకుపడింది. ఆ దెబ్బకు గండిచెరువు తాళలేక లంగర్‌హౌజ్, అత్తాపురం, హైదర్‌గూడెం, ముష్క్ మహల్, జియ్యోరుగూడెంలను (నేటి జియాగూడ) ముంచేస్తూ పాత వాలాద్రి మీదకి దూకి సవారీ చేసింది. పాత వాలాద్రి వెల్లువలో పూచిక పుల్లగా మునిగిపోయింది.
రెండవ నిజాం భయం నిజమే అయ్యింది. రెసిడెన్సీలోకి నీళ్లు వచ్చినై. గాలి దుమారానికి చార్‌బాగు తీన్ తేరా నౌ అఠారా అయ్యింది. పెద్ద పెద్ద చెట్లు కూకటి వేళ్లతో సహా కూలిపోయినయి. చార్‌బాగులోని పూదోటలు నీళ్ల కింద సమాధి అయినయి. కబూతర్‌ఖానా, చిడియా ఘర్‌లు నేల కూలినయి. పక్షులు, కుందేళ్లు అన్నీ ప్రాణాలు కోల్పోనయి. ఉద్యానవనం స్మశానంగా మారిపోయింది. ఆ గాలిదుమారం, ఉరుములు మెరుపులు, అన్ని పక్షుల ప్రాణాలు ఒకేసారి పోవటం, పూలు నేల రాలటం, చెట్లు కూలటం ఆ దంపతులిద్దరికీ ఏదో అపశకునంగా తోచింది. భవిష్యత్తులో జరుగబోయే పెద్ద వినాశనానికి ఇదొక చిన్న హెచ్చరికగా అనిపించింది. చేసేదేమీ లేక వారిద్దరూ పిల్లలను ఒడిలో దాచుకుని ఆ రాత్రంతా నిద్రలు లేక బిక్కుబిక్కుమని గడిపినారు.
మీర్ ఆలం కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నాడు. కలకత్తాకు మహాజర్లు పంపుతూనే ఉన్నడు. పాట్రిక్ ఖైరున్నిసాలకు ఏవేవో ప్రమాద ఘంటికలు చెవి సోకుతూనే ఉన్నై. మృత్యుదేవత కరాళనృత్యం దాని ఇనుపగజ్జెల చప్పుడు దగ్గరవుతూనే ఉంది. నిద్ర రాని ఒక రాత్రి ఖైరున్నిసా పాట్రిక్ ఎద మీద తల పెట్టుకొని “మీరు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంపుడుగత్తెగానే ఉంచుకొంటే ఈ బాధలన్నీ ఉండకపోవునేమో” అంది దిగులు నిండిన కన్నీళ్లతో.
“ష్” అన్నాడు పాట్రిక్ తన మునివేళ్లతో ఆ గులాబీ పూరేకుల పెదాలను సుతారంగా మూసేస్తూ.
ఆ కలకంఠి కంటి పొంట వొలికిన ముత్యాలు జలజలా అతని ఎదను తడిపేస్తుండగా “జాన్ మాల్కం మాహ్‌లఖా చందాను ఉంచుకున్నట్లే మీరు కూడా నన్ను ఉంచుకుంటే లోకంలోని ఇంత మందికి శత్రువులం కాకపోదుమేమో?” అంది నిర్వేదంగా.
“ప్రేమ నేరం కాదు. తప్పు అసలే కాదు. అసలైన ప్రేమ లోకాన్ని ఎదిరించవలసిందే. తప్పు చేసినట్లు తప్పుకొని బతకటం చాటుమాటుగా బతుటం నాకు చేత కాదు” అన్నాడు పాట్రిక్ దృఢంగా.
ఖైరున్నిసా గురువంపు గువ్వ లెక్క అతని కౌగిలిలో ఒదిగిపోయింది.
ఆ మర్నాడే పాట్రిక్‌కు సమన్లు వచ్చినై – వెంటనే కలకత్తాకు వచ్చి విచారణ కమిటీ ఎదుట హాజరు కావాలని.
ఆ రాత్రే రహస్యంగా, ఖైరున్నిసాకు కూడా తెలియకుండా తన తదనంతరం తన భార్యాపిల్లలకు చెందవలసిన ఆస్తుల గురించి విల్లు రాసినాడు. మరో లేఖ తన అన్న జేమ్స్ విలియం కిర్క్ పాట్రిక్‌కు రాసినాడు. తనకేమైనా ప్రమాదం సంభవిస్తే పిల్లలిద్దరినీ లండన్ తీసుకుపోయి మీరే వారి సంరక్షణ, చదువుల బాధ్యత వహించాలని ఖైరున్నిసా చిన్న పిల్ల కావున తల్లికే అప్పగించాలనీ వివరంగా రాసినాడు. ఆ విల్లును, లేఖను రెండింటినీ ఒకే సీల్డు కవరులో పెట్టి లండన్‌కు స్పీడ్‌పోస్టులో పంపినాడు.
అప్పటికి 19 సంవత్సరాల చిన్న పిల్ల ఖైరున్నిసా. సంగతులన్నీ వివరంగా చెబితే గుండె చెదిరి భయపడుతుందని ఏమీ చెప్పలేదు. సర్కారు పని మీద కలకత్తా పోతున్నానని చెప్పినాడు. ఆ పిచ్చిపిల్ల నమ్మేసింది. వచ్చేటప్పుడు కలకత్తా చౌరంఘీ బజారు నుండి ఆకుపచ్చ లక్నో సీసం గాజులు పట్టుకురావాలని మరీ మరీ చెప్పింది. ‘త్వరగా రావాలి సుమా’ అని చేతిలో చేయి వేయించుకుని ‘వాదా’ తీసుకుంది.
పాట్రిక్ తన పరివారం వెంబడి రోడ్డు గుండా మచిలీపట్నం పోయి అక్కడి నుండి ఓడలో కలకత్తాకు ప్రయాణమైనాడు. దారిలోనే సముద్రపు జ్వరం తగిలింది.
ఒక నెల తర్వాత గవర్నర్ జనరల్ ఆఫీసు నుండి వర్తమానం వచ్చింది. పచ్చ కామెర్ల వ్యాధితో పాట్రిక్ కలకత్తాలోనే మరణించినాడని, అక్కడే సమాధి కూడా చేసినామని. అప్పుడు అతని వయస్సు 41 సంవత్సరాలు.
రెసిడెన్సీ రోదించింది.
“హర్ ములాఖత్ కా అంజామ్ జుదాయీ క్యోం హోతీ హై?”
* * *
జాన్ మాల్కం నూతన రెసిడెంట్‌గా నియమింపబడినాడు. రస్సెల్ అతనికి మొదటి అసిస్టెంట్‌గా పదోన్నతి పొందినాడు.
తమ్ముని లేఖ అందుకున్న జేమ్స్ విలియం కిర్క్ పాట్రిక్ లండన్ నుండి హుటాహుటిన హైద్రాబాద్ చేరుకుని పిల్లలిద్దరినీ చదువుల కోసం, సంరక్షణ కోసం తన వెంట ఇంగ్లాండుకు తీసుకు పోతున్ననని షర్ఫున్నిసాకు, ఖైరున్నిసాకు తెలిపినాడు. అప్పటికి పాట్రిక్ చనిపోయి రెండు నెలలు. ఖైరున్నిసా ఇంకా ఆ షాక్ నుండి కోలుకోలేదు. లోకం పోకడలు తెలియని 19 సంవత్సరాల అమాయకురాలికి వైధవ్యం. తరచు ఫిట్స్ వచ్చి బేహోష్ అయిపోతుంది. మొదలు నరికిన చెట్టులా కూలిపోతుంది. మళ్లీ పసిపాపలా మారి తల్లి, అమ్మమ్మ ఒడులలో తల దాచుకుని పడుకుంటుంది. రెసిడెన్సీలోని రంగమహల్ మధుర క్షణాలు ఆమెను బాధ పెట్టటం వలన, ప్రతి అంగుళమంగుళం కిర్క్ పాట్రిక్ కనబడుతున్నందున అక్కడ ఉండలేక తల్లిగారింటికి ‘పాంచ్ మహల్లా’కు తిరిగి వచ్చేసింది.
తన ఒడిలో పెరిగిన బిడ్డ మళ్లీ తన దగ్గరికే వొచ్చినందుకు ‘చార్మినార్’ చిన్నబోయింది. లక్నోకు వెళ్లిన అఖలుద్దౌలా అక్కడే అల్లాకు ప్రియతముడైనాడు. మొగ దిక్కు లేని ముగ్గురు ఆడవాళ్లు. కోరలు సాచి విషం కక్కుతున్న మీర్ ఆలం. భర్తతో గడిపిన ఆ నాలుగు సంవత్సరాలు ఒక కరిగిపోయిన కమ్మని కలలా కనిపిస్తుంది. అన్ని అవాంతరాలు, అడ్డంకులు దాటి అందుకున్న స్వర్గం మళ్లీ చేజారి పోయింది. ఇప్పుడు మరో శరాఘాతం.
కన్నతల్లి ఒడి నుండి పసికూనల్ని దూరం చేసే దుర్మార్గం. ఆ విషయంలో కూడా నిస్సహాయులైన ఆ ఆడవాళ్లు ఓడిపోయినారు. అమ్మీ అమ్మీ అని ఆ పసి పిల్లలిద్దరూ విలవిలలాడుతూ కాళ్లూచేతులు కొట్టుకుంటుంటే బలవంతంగా తల్లి ఒడి నుండి వారిని ఇవతలికి లాగి తీసుపోయినారు. ఒకప్పుడు పూబాలగా, రేబాలగా, విరబూసిన ముగ్ధ మనోహర మందార పుష్పంలా ఉండే ఖైరున్నిసా చివరికి పిల్లలు కూడా తనకు దూరమవుతుంటే కింద దుమ్ము ధూళిలో పడి కొట్టుకుంది. నేల మీద అటూ ఇటూ దొర్లింది. పిడికిళ్లతో మట్టి ఎత్తి తల మీద చల్లుకుంది. పట్టులాంటి మెత్తటి జుట్టును పిడికిళ్లతో పట్టుకుని గుంజుకుంటుంది. పీక్కుంది. వెంట్రుకలు ఊడి చేతులకు వచ్చినై. తర్వాత స్పృహ తప్పి పడిపోయింది.
భూదేవికి ఏ మాత్రం దయ వున్నా – భూకంపాన్ని సృష్టించి ఆ అభాగ్యురాలిని తన చల్లని ఒడిలోకి ఎందుకు తీసుకోలేదో!
* * *
రస్సెల్ తరుచూ పంచ్ మహల్లాకు వచ్చి ఆ అభాగ్యుల అవసరాలు నుక్కుంటున్నాడు. అప్పుల పేరుతో ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నై. రస్సెల్ చేతనయినంత వరకూ ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాడు. తన చేతులతో రెసిడెన్సీని, రంగమహల్‌ను నిర్మించినాడు. కాని ఆ దంపతుల అదృష్టాన్ని, జీవితాలను మాత్రం నిర్మించలేకపోయినాడు. ఆ విషయంలో అతను కూడా నిమిత్తమాత్రుడే. ఒకప్పుడు తనకు అధికారి, సన్నిహితుడు, స్నేహితుడు అయిన పాట్రిక్ మీది గౌరవంతో ఒక నైతిక బాధ్యతగా వారిని సంరక్షిస్తున్నాడు. వారి అవసరాలు తీరుస్తున్నడు.
కాలం రంగుల రాట్నంలా ఆర్నెల్లు గిరగిరా తిరిగింది. ఖైరున్నిసా ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుంది. ఎంతో మంది హకీములకు చూపిస్తున్నా, మనోవ్యాధికి మందు లేదు అని వారు స్పష్టంగా చెప్పినారు. రంథి, మనాది, జ్ఞాపకాలు, గడిచిన మధుర జీవితం ఆమెను వెంటాడి వేధిస్తున్నై. షా అలీ బంధాకు సంబంధించిన సూఫీ సాధువు ఒక రోజు పాంచ్ మహల్లాకు కైరాతీ కోసం వచ్చినాడు. ఖైరున్నిసాను చూసినాడు. దుర్దానా బేగం, షర్ఫున్నిసాలను పిలిచి ‘గాలి మార్పు అవసరం – కాలం అన్ని గాయాలను మాన్పుతుంది’ అని సలహా ఇచ్చి ఓదార్చినాడు. బేటీ కొన్ని రోజుల కోసం ఏదైనా దర్గాకు వెళ్లి వద్దామా అని అమ్మా అమ్మమ్మా అడిగినారు.
“నా దర్గా, నా మంజిల్ ఔర్ మక్సద్ కలకత్తాలో ఉన్న నా భర్త పాట్రిక్ సమాధే” అని నిర్వికారంగా అంది. అంత దూరమా? ఎట్లా వెళ్లగలం అని వారు విస్తుబోయినారు.
ఆ మాట రస్సెల్‌కు తెలిసింది. “చాలా మంచి ఆలోచన. నేను కూడా పాట్రిక్ సమాధిని ఇంత వరకూ దర్శించనే లేదు. అదే ఆలోచనలో ఉన్నాను. నేను లాంగు లీవ్ పెట్టి మీకు తోడుగా వస్తాను. మీకు సహాయంగా, ధైర్యంగా ఉంటుంది” అని కొత్త ఆలోచన చేసినాడు.
అన్ని ఏర్పాట్లు రస్సెల్ చేసినాడు. ఎనబై సంవత్సరాల దుర్దానా బేగంతో పాటు తల్లి కూతుళ్లు ప్రయాణమైనారు. రస్సెల్ వారికి ఆద్బాంధవుడిగా కనబడుతున్నడు.
వీసమెత్తు కష్టం కలగకుండా బోయీలు, బిస్తీలు, నౌకర్లు, మేనాలు, గుర్రపు బగ్గీలు, షామియానా గుడారాలు, ఆహార పదార్థాలు, దినుసులు, దుస్తులు, మందులతో సహా ఆ యాత్రను పకడ్బందీగా రూపొందించినాడు. మచిలీపట్నం వరకూ వారి కారవాన్ చాలా ఆహ్లాదంగా కొనసాగింది. పట్నం సరిహద్దులు దాటని ఆ స్త్రీలు లోకాన్ని చూస్తున్నరు. లోకం పోకడలు, జనుల కష్టం, సుఖం చూస్తున్నరు. ప్రజల బాధలను కళ్లారా తిలకించినారు. అయినా ఆ పేదల పెదాల మీద చెదరని చిర్నవ్వుల్ని గమనించినారు. కష్టాల కడలిలో ఈదుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని తిలకించినారు. అనేకులు ఆనందాన్ని బయటి నుండి కాక తమ లోపల నుండే సృష్టించుకోవడాన్ని చూసినారు. జానపదుల జీవితాలలో ఉండే జీవిత సత్యాలను తెలుసుకుంటున్నారు.
హయత్‌నగర్‌లోని హయాత్ బక్షీ బేగం నిర్మించిన మసీదు మొదలుకొని కృష్ణా జిల్లాలోని కూచిపూడి అగ్రహారం అందులో రాత్రుళ్లు దివిటీల వెలుగులో భాగవతుల ఆటల దాకా యాత్రలోని అన్ని వింతల్ని, విశేషాల్ని, స్థలాల్ని రస్సెల్ వారికి చూపిస్తున్నాడు. దారి మధ్యలో ఆమె బెజవాడ కనకదుర్గ గుడి కొండ మీదికి సరదాగా, చిన్నపిల్లలకు కొండలెక్కడంలో ఉండే ఉత్సుకతతో రస్సెల్ చేయి పట్టుకొని ఎక్కింది. అంతెత్తు నుండి కింద కనపడే పట్నాన్ని, బొమ్మరిండ్లలా కనబడే రకరకాల ఇండ్లను, కొండపల్లి బొమ్మల్లా కనబడుతూ అటూ ఇటూ తిరుగుతున్న లెక్కకు మిక్కిలి స్త్రీపురుషులను చూసి చిత్రవిచిత్ర భావనలకు లోనయ్యింది. వారందరికీ సుఖాల కంటే కష్టాలే ఎక్కువ ఉంటయి. అయినా వారందరూ అల్లా ప్రసాదించిన బతుకును కొనసాగిస్తున్నప్పుడు తను మాత్రం ఎందుకు జీవించకూడదు? అన్న ఆలోచన వచ్చింది. తన పిల్లలను చూడటానికైనా జీవించాలని అనుకుంది. ఖైరున్నిసా నెమ్మదినెమ్మదిగా ఈ లోకంలోకి వస్తుంది. గతం హైద్రాబాద్‌లోనే ఉండిపోయింది.
నడుస్తున్న యాత్రలో ఖైరున్నిసా రస్సెలు మంచి స్నేహితులుగా మారుతున్నారు. వారు సమవయస్కులు కావటం కూడా ఇందుకు దోహదపడింది. రస్సెల్‌ది సంగీత హృదయం. బుల్‌బుల్ తారా, మౌత్ ఆర్గన్, చక్కగా వాయిస్తాడు. ట్రంపెట్ చక్కగా కొడుతాడు. మార్గమధ్యం సరాయిలలో ఆగినప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలే ప్రకృతిలో ఆ సంగీతాన్ని వినిపించేవాడు. ఆ సుస్వరాలు ఆమెకు లోపలి గాయాలకు మలామును పూస్తున్నాయి. అతని సంగీతం, స్నేహం, ఆమె మీద వైద్యంగా, మందుగా పని చేస్తున్నై. ప్రకృతి, పల్లెపట్టులు, చల్లని పిల్లగాలి తెమ్మెరలు ఆ గాయపడిన హృదయాన్ని సేద తీరుస్తున్నాయి. అమ్మా అమ్మమ్మల ఆరోగ్యాలు కూడా బాగుపడుతున్నాయి. ఆత్మానుభవం అయితే కాని జీవిత తత్వం బోధపడదు. లోకాన్ని చుట్టి వస్తే గాని ఆత్మానుభవం కలుగదు. జీవితం ఎక్కడా నిలువ నీరులా నిలువరాదు. నిలిస్తే మురికి గుంట అవుతుంది. సెలయేరులా నదిలా జీవితం ముందుకే, మున్ముందుకే కొనసాగాలని ఆ జీవిత యాత్రలో ఖైరున్నిసా తెలుసుకుంటుంది. ఆమె బుద్ధీ, హృదయమూ వికాసం చెందుతున్నాయి.
మచిలీపట్నంలో ఓడ ఎక్కి కలకత్తాకు ప్రయాణమైనారు. ఆ సముద్రపు గాలి పాట్రిక్‌ను పొట్టన పెట్టుకుంటే అదే సముద్రపు గాలి ఖైరున్నిసా ఆరోగ్యం బాగుపడటానికి ఉపయోగపడింది. ఖైరున్నిసా మళ్లీ జన్మించింది. హైద్రాబాద్ నుండి బయలుదేరిన నెల రోజులకు కలకత్తా చేరుకున్నారు.
* * *
కలకత్తాలోని పాట్రిక్ సమాధి మీద రస్సెల్ చక్కటి ఎపిటాఫ్‌తో శిలాఫలకం రాయించినాడు.
“ఇతను జీవించనూ లేదు. మరణించనూ లేదు. ఈ విశాల విశ్వ వినువీధులలో సంచలిస్తూ, సంచరిస్తూ రవంత సేపు విశ్రమించటానికి ఈ భూమిని సందర్శించి తిరిగి మాయమైనాడు.”
ఇక ఖైరున్నిసాకు ఆ సమాధిని చూస్తుంటే తొలి రోజుల మాదిరి తీవ్రమైన రోదన వేదన కలుగలేదు. మనస్సంతా ఆనంద విషాదాలకతీతంగా ఒక నిరామయ, నిర్వేద, అలౌకికస్థితిని చేరుకొని ఒక సూఫీ సాధువు దర్గాను సందర్శిస్తున్నట్లే అనిపించింది. చాలాసేపు ధ్యానముద్రలో ఉండి పాట్రిక్ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేసింది. లేచి తిరిగి వస్తుంటే ఒక పురాతన పర్షియన్ కవితా చరణాలు జ్ఞప్తికొచ్చాయి.
“జగము సత్రము
చావు స్వగృహ యానము
ఎరిగియున్ ఎందుకు
వగచెదవే ఓ మనసా.”
* * *
వారు నలుగురు రెండు నెలలు కలకత్తాలో విశ్రాంతిగా గడిపినారు. రస్సెల్ తమందరి కోసం విశాలమైన బంగళా అద్దెకు తీసుకున్నాడు. దుర్దానా బేగం, షర్ఫున్నిసాలిద్దరూ దగ్గరలోనే ఉన్న ముజఫర్‌పూర్‌లోని మసీదులను, దర్గాలను సందర్శించటానికి ఒక పక్షం రోజుల యాత్రకు పోయినారు. ఏకాంతం రస్సెల్, ఖైరున్నిసాలను ఒకటి చేసింది. మిగిలిన అందమైన జీవితాన్నంతా ముందే పరుచుకున్న ఇరవై సంవత్సరాల యువతికి రస్సెల్‌లో ఒక స్నేహితుడు, సహచరుడు కనబడినాడు. దారితెన్నూ తెలియని సుదీర్ఘ ఇసుక ఎడారిలో ఖైరున్నిసాకు రస్సెల్ ఒక సహారా. ఒక సాత్‌దారి. చల్లటి నీడను ప్రసాదించే అందమైన ఒయాసిస్సు.
సంసారులు, మర్యాదస్తులు, భద్రలోకులు అద్దాల మేడల లోపల ఏ రాళ్ల దెబ్బలు తగలకుండా సుఖంగా జీవించేవారు నీతి అవినీతి తూకపు రాళ్లతో, పాతివ్రత్యపు కొలబద్దలతో ఖైరున్నిసాను తూలనాడవచ్చు. తిరస్కరించవచ్చు. ఛీ కొట్టవచ్చు. కాని తుఫానులో గడ్డిపోచలా వొణికిపోతున్న ఆమె బేసహారా మనస్సుతో ఆలోచిస్తే ఆ నిర్ణయంలోని ఔచిత్యం బోధపడుతుందేమో!
ఆ నలుగురు హైద్రాబాద్‌కు తిరిగి వచ్చేసరికి నగరమంతా పుకార్లతో అట్టుడుకుతుంది. కలకత్తాలో వారి రాసలీలల్ని గురించి అక్బార్లు కాకుల్లాగా కూస్తున్నాయి. మళ్లీ తమ ఇనుప ముక్కులతో వారిని పొడవటానికి సిద్ధంగా ఉన్నాయి. గోరుచుట్టు మీద రోకటి పోటులా మరో ఉపద్రవం. మీర్ ఆలం ప్రధాన మంత్రి అయినాడు. పేనుకు పెత్తనం దొరికింది. ఇక తలంతా కొరుక్కు తినడం మొదలు పెడుతుంది.
ఖైరున్నిసాకు మళ్లీ దిగులు మొదలయ్యింది. రెసిడెన్సీలో ఉండటానికి భయపడుతుంది. అక్కడ భద్రతా జవానులను మీర్ ఆలం ఉపసంహరించినాడు. ప్రాణహానితో సహా ఏ అఘాయిత్యమైనా జరుగొచ్చు. మళ్లీ పాంచ్ మహల్లాకు వచ్చింది. అక్కడ పరిస్థితులన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. అప్పులవాళ్లు ఆస్తుల్ని, జాగీరులను అప్పడంలా నంచుకు తిన్నారు. షర్ఫున్నిసా రోజులు గడవటం కోసం ఇంట్లోని సామానులను ఒక్కటొక్కటి అమ్మేస్తుంది. జాగీరులు జప్తుకు గురైన సంగతి దుర్దాన బేగంకు తెలిసేసరికి గుండె ఆగి మరణించింది.
మళ్లీ కాళరాత్రి చీకట్లు ఆ తల్లీబిడ్డలను మ్ముకుంటున్నాయి. తన వల్లనే తన వాళ్లందరూ బర్బాద్ అయ్యి అన్నీ కోల్పోయారని ఖైరున్నిసాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఇంగ్లాండులో ఉన్న తన పిల్లల సమాచారం ఒక్క ముక్క కూడా తెలుస్తలేదు. వాళ్లక్కడికి పోయిన తర్వాత కనీసం ఒక కార్డు కూడా రాలేదు. ఖైరున్నిసా మళ్లీ మనాది రోగానికి గురైంది.
సుఖాలన్నీ ఒక్కటొక్కటే వొచ్చి కష్టాలు మాత్రం అన్నీ కలిసికట్టుగా వస్తాయన్నట్లు మీర్ ఆలం ఖైరున్నిసాకు నగర బహిష్కరణ శిక్ష విధించినాడు. మతపరమైన కారణాలతో ఆమెపై అనేక అభియోగాలు మోపి ఆమె అనైతిక ప్రవర్తనతో హైద్రాబాద్ నగరం కలుషితం అవుతుందని ఆరోపిస్తూ ఆ శిక్ష విధించినాడు.
రస్సెల్ ఆ తల్లిబిడ్డలను హైద్రాబాద్ సంస్థానానికి దూరంగా ఈస్టిండియా కంపెనీ ఆధీనంలో ఉన్న మచిలీపట్నంలో ఉంచితే సురక్షితంగా ఉంటుందని అన్ని ఏర్పాట్లు చేసినాడు. రస్సెల్‌కు పాట్రిక్‌కు ఉన్నంత సత్యసంధత, లోకాన్ని ఎదిరించే గుండె ధైర్యం లేవు. ఉద్యోగానికి, జీవితానికి ఎసరు తెచ్చుకునే ప్రయత్నాలు, సాహసాలు చేయరాదని పాట్రిక్ జీవితం చూసి నేర్చుకున్నాడు. అతనికి జాన్ మాల్కం ఆదర్శం కాని పాట్రిక్ కాదు. అసలైన ప్రేమ జీవితాలను పూర్తిగా తినేస్తుందని అతనికి తెలుసు కాని అతనికి ఖైరున్నిసా కావాలె. అందుకే మచిలీపట్నంలో ఆమెను ఉంచితే ఆమెకు, తనకు ఏ బాధలు ఉండవని కేళీ విలాసంగా గడపవచ్చునని ఆ పనిచేసినాడు.
తల్లిబిడ్డలు ప్రాణభయంతో మూగ జీవుల్లా మచిలీపట్నానికి పోయినారు. ఖైరున్నిసాకు రస్సెల్ కొంచెం కొంచెం అర్థమవుతున్నాడు. అయినా నిస్సహాయత. మల్లెతీగకు ఆసరాగా ఎవరో ఒకరు తోడుండాలె.
మచిలీపట్నం జీవితం దుర్బరంగా మారింది. అసలే ఎండాకాలం. హాయిగొలిపే చల్లటి హైద్రాబాద్ వాతావరణంలో పుట్టి పెరిగిన ఆమె సముద్రతీరంలోని ఆ పట్టణం ఉక్కకు, వేడిమికి తట్టుకోలేక అనారోగ్యం పాలైంది. దోమల బాధతో కొద్ది రోజులు మలేరియా జ్వరం పీడించింది. సముద్ర తీరాన చచ్చిన చేపల దుర్వాసన పట్టణమంతా ఆవరించుకుని ఉంది. ఆ వాసనకు అన్నం సయించేది కాదు. లోలోపల పిల్లల మీద బెంగ ఆమె మనస్సును కుమ్మరి పురుగులా తొలుస్తూనే ఉంది. స్వతహాగా ఆమె స్నేహశీలి. స్థానికులలో ఆమెకు ఎవరూ స్నేహితులు దొరకలేదు. ఇటు ముస్లింలు, అటు ఆంగ్లేయులు ఎవరైనా ఉన్నా వారు తక్కువ సామాజిక శ్రేణికి చెందినవారు కావున వీరు వారితో ఇమడలేకపోయేవారు. జీవితంలో పరాయితనానికి గురైనారు. చుట్టూ సముద్రం తప్ప చూడటానికేమీ కనబడదు. రస్సెల్ వారి వెంబడి నిరంతరం ఉండటం కుదరదు కనుక నెలకు ఒకటి రెండు సార్లు వచ్చిపోతూ ఉండేవాడు. పనుల ఒత్తిడి వలన ఒకసారి ఆర్నెల్ల వరకూ తిరిగి రాలేదు.
ఖైరున్నిసా జీవితంలో మళ్లీ అభద్రత, ఒంటరితనం. రస్సెల్‌ని బ్రిటిష్ ప్రభుత్వం హఠాత్తుగా మద్రాసుకు బదిలీ చేసింది. వారి మధ్య అక్రమ సంబంధం పుకార్లు మళ్లీ వెల్లస్లీ దాకా పోయినై. రస్సెల్ మద్రాసు వెళ్తూ మచిలీపట్నంలో ఆగి ఖైరున్నిసాను కలిసినాడు. అప్పటికే ఆమె మళ్లీ తన వెనకటి మానసిక స్థితికి చేరుకుంది. మనోవ్యాధి మళ్లీ ముదరపెట్టింది. ఏం మాట్లాడాలో రస్సెల్‌కు తోచలేదు. ఏమైనా కావాలా అని అడిగినాడు. ఇద్దరు పిల్లల చిత్తరువులు కావాలని ఒకే ఒక కోరిక కోరింది. పిల్లలు లండన్‌కు వెళ్లి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఒక లేఖ కూడా అక్కడ్నుంచి రాలేదు. తల్లికూతుళ్లు ఎన్ని ఉత్తరాలు రాసినా అక్కడ్నుంచి జవాబులు రాలేదు. కనీసం వారి ఫొటోలైనా చూడాలని మాతృహృదయం తపించేది. ఆ ఫొటో ఒక్కటే గత జీవితంతో ఆమెకున్న ఏకైక సంబంధం.
మీర్ ఆలం ప్రధానమంత్రి పదవి చేపట్టగానే ఒక్కటొక్కటిగా బాకర్ అలీ ఆస్తుల్ని కాజేయటం ప్రారంభించినాడు. పాంచ్‌మహల్లాకు ఎసరు వచ్చింది. దిక్కు తోచక షర్ఫున్నిసా కూతురును విడిచి ఒక్కతే హైద్రాబాద్ వచ్చింది. పరిస్థితి అంతా చేజారిపోయింది. తాను బతకటానికి, పూట గడవటానికి మళ్లీ ఇంటి సామానులు అమ్ముకోవలసి వచ్చింది. క్రమక్రమంగా ఆమె పేద స్థితికి నెట్టివేయబడింది. ఖైరున్నిసా ‘ప్రేమ’ ‘కార్చిచ్చు’గా మారి తన వారందరినీ ధ్వంసం చేసింది.
మచిలీపట్నంలో ఖైరున్నిసా ఒక్కతే. జీవితం అర్థరహితంగా, లక్ష్యం గమ్యం లేకుండా తయారయ్యింది. రస్సెల్ మద్రాసులోనే ఉంటున్నాడు. ఉత్తరాలు కూడా రావటం లేదు. పిల్లలు తన వద్దకు వచ్చి తన ఒళ్లో కూచున్నట్లు భ్రమలు కలుగుతున్నాయి. ఒంటరితనంలో గోడలతో మాట్లాడటం మొదలుపెట్టింది. స్నానం, నిద్ర, ఆహారం క్రమం తప్పినై.
1809లో మీర్ ఆలం కుష్ఠు వ్యాధి వచ్చి మరణించినాడు. ఆమె ప్రవాసశిక్ష అతని చావుతో రద్దు అయ్యింది. షర్ఫున్నిసా వచ్చి ఖైరున్నిసాను నగరానికి వాపస్ తీసుకు పోయింది. మనిషి కాదు నీడ మాత్రమే నగరానికి చేరింది. పైగా మృత్యుదేవత ఆ నీడను నీడలా వెంబడిస్తుంది. రెసిడెన్సీలో ఉండటానికి వీల్లేదు. అదొక ‘బూత్ బంగ్లా’గా మారింది. భయంతో ప్రజలు రెసిడెన్సీ గురించి రకరకాల పుకార్లు సృష్టిస్తున్నారు. ఇటు పాంచ్ మహల్లా కళ తప్పింది. బీటలు వారిన ఇంట్లో ఆ ఇద్దరు తల్లీకూతుళ్లు. నౌకర్లు చాకర్లు అందరూ పోయినారు. మీర్ ఆలం తర్వాత వచ్చిన రాజా చందూలాల్ ఒక గుంటనక్క. మహాలఖా బాయి చందా ఆస్తుల్ని కాజేసింది చాలక షర్ఫున్నిసా జాగీర్లను తక్కువ ధరకు కొని ఆ వెలను కూడా చెల్లించకుండా మోసం చేసినాడు. చందూలాల్ బేలా ఇతనిదే. అది శాలిబండాలో ఉంది. చందూలాల్ బారాదరీ కూడా ఇతనిదే. ఇతను ప్రధానమంత్రిగా పని చేసే కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినాడు.
మద్రాసులో రస్సెల్ ఒక ఇంగ్లాండు యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ వార్త ఖైరున్నిసాకు తెలిసింది. అప్పటికే ఆమె బాధకు అతీతమైన స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ వార్త వినగానే విఫల మందహాసం ఆమె పెదాలపై నర్తించి ఒక దక్కనీ ఉర్దూ కవితాచరణాలను ఉచ్చరించినై.
“ఆప్ కే ఊపర్ భీ ఫూల్ బర్సాయే
ఔర్ హమారే ఊపర్ భీ
బస్ ఫరక్ ఇత్నా హై కీ
ఆప్ డోలీ (పెల్లి పల్లకి) మే హై
ఔర్ హమ్ డొలే (శవపేటిక) మేఁ”
ముందే చెప్పినట్లు ఖైరున్నిసా దగ్గరికి వచ్చిన వాళ్లందరూ బర్బాద్ అయిపోయినారు. రస్సెల్ కూడా సుఖపడలేదు. వివాహం జరిగిన ఆర్నెల్ల లోపలే అతని భార్య ఏదో విషజ్వరం వచ్చి కన్ను మూసింది. ఎవరూ సుఖపడలేదు. వికలమైన మనస్సుతో అతను ఒక సంవత్సరం లాంగు లీవ్ పెట్టి ఇంగ్లాండుకు వెళ్లిపోయినాడు. డ్యూటీలో జాయిన్ కాగానే 1810లో తిరిగి హైద్రాబాద్‌కు బదిలీ చేసినారు.
అప్పటికే ఖైరున్నిసా మంచంలో పడింది. రస్సెల్ నగరానికి రాంగానే పాంచ్ మహల్లాకు పోయినాడు. పలిగిపోయిన ఆమె హృదయాన్ని అతికించే ప్రయత్నం చేసినాడు. కాని ఏం లాభం? జీవితంలో ఒకసారి విధి వక్రీకరించింది. రెండోసారి మోసానికి గురైంది. ఇక ఇప్పుడు ఆమె జీవితం రెక్కలు తెగిన సీతాకోక చిలుక. నేల రాలిన ఒక ఎర్రగులాబీ. భళ్లున కింద పడి పగిలిపోయిన అత్తరు సీసా. తీగెలు తెగిన సారంగీ.
ఖైరున్నిసా తన చివరి రోజులలో ఒక చిన్న ఉత్తరం రస్సెల్‌కు రాసింది. ‘నేను చనిపోతున్నాను’ అన్న ఒకే ఒక వాక్యం అందులో ఉంది. రస్సెల్ ఏడుస్తూ పాంచ్ మహల్లా దేవిడీకి వచ్చినాడు.
ఆ భగ్నసుందరి అతణ్ని చూసి మంచంలో అటు తిరిగి గోడ వైపు ముఖం తిప్పి పడుకుంది. కనుకొలుకుల వరకూ వచ్చిన కన్నీటిని అక్కడే ఆపుకుంది. రస్సెల్ మోకాళ్లపై వంగి కూచుని ఆ మంచం పట్టీపై తలవాల్చి చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చినాడు. క్షమించమని గొణిగినాడు. రెసిడెన్సీలోని ‘రంగు మహల్’కు తిరిగి రమ్మని బతిమిలాడినాడు. అక్కడికి వస్తే ఆమె కోలుకుంటుందని అతని చివరి ఆశ. తన భర్త పిల్లలతో గడిపిన ఆ మధురమైన రోజులు మళ్లీ తిరిగి రావు. అక్కడికి వెళ్లితే మిగిలేది ఒక్క కాల్చివేసే జ్ఞాపకాల బాధ తప్ప మరేమీ కాదు.
ఆమె తన మౌనంతోనే అతణ్ని శిక్షించింది.
ఇక ఆమె రెండు రోజులలో చనిపోతుందనగా తల్లి షర్ఫున్నిసా జోడెడ్ల బండిలో మెత్తటి ఎండు గడ్డిపరిచి దాని మీద జంపఖానా వేసి ఆమెను అందులో పడుకోబెట్టింది. ఆచారం ప్రకారం పంచదార కలిపిన పాలను ఆమెతో సహా నౌకరులు, చాకర్లు అందరూ తలా ఓచెంచా ఖైరున్నీసా నోరుతెరిచి పోశారు. కాని ఒక్క చెమ్చా పాలుకూడా గొంతులకు దిగకుండా చెంపలపై నుండి కిందనున్న దిండుమీదికి కారిపోయాయి. షర్ఫున్నిసా తన ముద్దుల బిడ్డను స్పృహ లేని స్థితిలో పాంచ్ మహల్లా నుండి రెసిడెన్సీలోని రంగు మహల్‌కు తీసుకపోయి అక్కడి పానుపు మీద పడుకోబెట్టింది.
అది ఆమె తొలిరాత్రి నాటి పూలపానుపు. తర్వాత ఆమె కలలు పండి ఒడి నిండి ఇద్దరు బిడ్డలను కన్నదీ దాని మీదనే. ఆ శయ్యే ఇప్పుడు మృత్యుశయ్యగా మారి అన్ని బాధల నుండి విముక్తిని ప్రసాదించబోతుంది. రస్సెల్ ఆ మంచం దగ్గర నుండి కదల్లేదు. ఆమె పాత మిత్రులు, కలం స్నేహితులందరూ రెసిడెన్సీకి చేరుకున్నారు.
అందరూ పాత రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎటువంటి అందం. పురాతన పర్షియా రాచకన్నెల అందం. ఆమె అందం మొత్తం దక్కన్‌కే దీపస్తంభం. జగజ్జేయమానంగా వెలిగిన కర్పూర దీపకళిక. కళ్లలో జిగేలున మెరిసిన మెరుపు తీగ. కాంతిరేఖ ఇప్పుడేమైంది. మంచానికి అతుక్కుపోయి, చిక్కి శల్యమై పోయి, మృత్యుదేవత చల్లని ఒడి కోసం నిరీక్షిస్తూ….
ప్రాణం పది నిమిషాలకు పోతుందనగా ‘చావు తెలివి’ వచ్చింది. అందర్నీ చూసింది. అందర్నీ గుర్తు పట్టింది. తల్లిని కళ్లతోనే కౌగలించుకుంది. మంచంపై వాలి ఏడుస్తున్న రస్సెల్ తలపై చేయి వేసి క్షమించింది. పిల్లల ఫొటోలు… అన్నది. అందరూ తలలు దించుకున్నారు. పాట్రిక్ ఫొటో అడిగింది. ఎవరో పరుగెత్తి తెచ్చిచ్చినారు. దానిని చూసి కండ్లల్లకు ప్రాణం లేచివచ్చి మందహాసం చేసింది. పాలిపోయి పగిలిపోయిన పెదాల నుండి ఆఖరి కవితాచరణాలు జాలువారినాయి.
“అప్నే మర్నేకా ఘమ్ నహీఁ లేకిన్
హయే ! తుమ్హారీ యాదోఁసే జుదాయి హోతీ హై”
ఆ తర్వాత ప్రశాంతంగా కండ్లు మూసుకుంది. లోకం పెట్టిన బాధల నుండి విడుదల అయ్యింది. లోకం చెర నుండి విముక్తి అయ్యింది. 27 సంవత్సరాలకే నూరేళ్లూ నిండిపోయినై. ఆమె 1813లో మరణించింది. మధురమైన జీవితాలన్నీ విషాదాలుగానే ముగుస్తాయేమో!
* * *
ఖైరున్నిసా కంటి పొంట వొలికిన ఒక కన్నీటి చుక్క ఆమె చెక్కిలి మీద ఘనీభవిస్తే అది రెసిడెన్సీగా రూపొందింది. ఆడపిల్లలు చదువుకునే కోఠీ ఉమెన్స్ కాలేజీగా మన కళ్ల ముందు నిలిచింది.
హైద్రాబాద్ ప్రేమికులమని చెప్పుకునేవాళ్లంతా తమ తమ బిజీ బిజీ మోడ్రన్ లైఫ్‌లో కొంచెం తీరిక చేసుకొని ఒక్కసారైనా రెసిడెన్సీని సందర్శించాలె. ఖైరున్నీసా పాట్రిక్‌లకు ఆశ్రుసిక్త నివాళులు అర్పించాలె. ఇంకొంచెం వీలైతే, నేటి చార్మినార్ బస్టాండుకెదురుగా వున్న పాంచ్ మహల్లాను కూడా దర్శించాలె. ఆ హవేలీ యిప్పటికీ, యింతటి శిథిలావస్థలోనూ, ఆ ప్రేమ చరిత్రకు మూగసాక్షిగా నిలబడి వుంది.
జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్, ఖైరున్నిసాలది విషాద ప్రేమగాథే అయినా అది రెండు మతాల మధ్య, రెండు ఖండాల మధ్య ప్రేమకు, సహనానికి, సాంస్కృతిక సమైక్యతకు వారధిగా నిలుస్తుంది. నేటి ఇస్లాం క్రైస్తవ మతాల ప్రచ్ఛన్నయుద్ధ నేపథ్యంలో, రెండు నాగరికతల మధ్య ఘర్షణ అని ప్రచారం జరుగుతున్న సందర్భంలో వారి ప్రేమ సందేశం దేశదేశాల సరిహద్దులను దాటి రాబోయే తరాలవారిని ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. జేమ్స్ అక్లీస్ కిర్క్ పాట్రిక్, ఖైరున్నిసాలు మళ్లీ మళ్లీ జన్మిస్తూ దేశదేశాల యువతరాన్ని స్నేహం, ప్రేమ, శాంతి, సహనం సందేశాలతో ఐక్య పరుస్తూనే ఉంటారు.
ఇదే రెసిడెన్సీ మనకు ఇచ్చే సందేశం.
… తరువాత భాగం ఒచ్చే వారం
February 15th, 2010 at 10:41 am
వహ్వా, యెంత అద్భుతముగ్ రాస్తున్నారు.