Feed on
Posts
Comments

17

రెసిడెన్సీ నుండి స్వామి మళ్లీ నడక సాగించినాడు. ఆంధ్రా బ్యాంకును దాటి సుల్తాన్‌ బజార్‌ లేన్‌ల నుండి నడుస్తున్నడు. కాలు పెట్ట సందులేదు. అన్నీ ఫుట్‌పాత్‌ దుకాణాలు నడిచొచ్చి నడిరోడ్డును ఆక్రమించుకున్నై. సైకిళ్లు, రిక్షాలు పద్మవ్యూహంల అభిమన్యుడిలాగ సందు చేసుకొని ముందుకు దూసుకపోతున్నై. సకలం సమస్త సామానులు సరసమైన ధరలకే అక్కడ అమ్మబడును. పేదోళ్ల షాపింగు సెంటర్‌ మదీనా బజార్‌ లేదా జుమ్మెరాత్‌ బజార్‌. దండోళ్ల షాపింగు సెంటర్‌ ఆబిడ్స్‌. మధ్యతరగతి వాళ్ల మార్కెట్‌ సుల్తాన్‌ బజార్‌ గల్లీ. తరువాత కాలంల ఈ షాపింగు సెంటర్లన్నీ వెనుకబడిపోయి అమీర్‌పేట, కూకట్‌పల్లి, దిల్‌సుక్‌ నగర్‌లు అధునాతన సెంటర్లుగ ముందుకొచ్చినై. ఈ స్థావర జంగమాత్మక ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం చాలా క్లిష్టం. మళ్లీ సుల్తాన్‌ బజార్‌ చౌరస్త. ఎడమ వైపు రాంకోఠి, రాజా కందస్వామి లేన్‌. రాయల్‌ టాకీస్‌ ఎదురుగ ఉన్న మార్కెట్‌ పేరు రాజా కందస్వామి మార్కెట్‌. అక్కడి నుండి ముందుకు పోతే హనుమాన్‌ టేక్డీ. ఆ పక్కన ట్రూప్‌ బజార్‌.

ముందు ఫ్రెంచి తరువాత ఇంగ్లీషు వారి సైన్యాలు అక్కడ ఉండేవి కావున ట్రూప్స్‌ బజార్‌ అని పిలిచేటోళ్ళు. కాలక్రమంల దానిని తూర్పు బజార్‌ అని పిలువసాగినారు. కుడి దిక్కు తిరిగితే సుల్తాన్‌ బజార్‌ క్లాక్‌ టవర్‌. 1939ల ఆ క్లాక్‌ టవర్‌ ముందే హైద్రాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంల స్వామి రామానంద తీర్థ నాయకత్వాన మొదటి సత్యాగ్రహుల జట్టు అరెస్టు జరిగింది. అది చరిత్రకు సాక్షీభూతం. ఆ సత్యాగ్రహంతో నైజాముల పునాదులు కదలడం ప్రారంభించినాయి. కుడి ఎడమలకు తిరగకుండా స్వామి కొంచెం ముందుకు నడిచినాడు. బడీ చావిడి గల్లీ. మహారాష్ట్రుల, కన్నడిగుల నివాసాలన్ని అక్కడే అధికం. నైజాం వ్యతిరేక హైద్రాబాద్‌ విముక్తి పోరాటంల వారు చురుకుగ పాల్గొన్నరు. ఒకసారి రజాకార్లు ఆ వీధిలకు వస్తే కేవలం ఆడవాళ్లే వాళ్లను మూడు చెరువులు, ముప్పై కుంటల నీళ్లు తాగించినారు. ఆ గల్లీ పేరు అంటెనే రజాకార్లకు ‘ఊపర్‌ షేర్వానీ అందర్‌ పరేషానీ’.

ఎడమ వైపు ఎత్తు సిడీల మీద విశాలాంధ్ర బుక్‌ హౌస్‌. స్వామి లోపలికి పోయి తీరికగ పుస్తకాలన్ని చూసినాడు. ఇష్టమైన పుస్తకాల పేజీలను అక్కడక్కడా తిప్పి చదివినాడు. ఎవరూ ఏమీ అనలేదు. అభ్యంతరాలు లేవు. తను చిన్నప్పుడు చదివిన ‘పారిపోయిన బఠానీ’ మళ్లీ దర్శనమిచ్చినాడు. ‘దారి తప్పిన గొర్రె పిల్ల’ మళ్లీ దగ్గరికి వచ్చినట్టనిపించింది. ఆప్యాయంగ ప్రేమతో మునివేళ్లతో ఆ పుస్తకాన్ని స్పృశించి పలకరించినాడు. బాల్యాన్ని ముట్టుకున్న భావన. మళ్లా పట్టుకున్న భావన. ‘చంఘీజ్‌ ఖాన్‌’ కనబడినాడు. గోబీ ఇసుక ఎడారిల గాలితో పోటీ పడి ఉరికే అరబ్బీ గుర్రంమీద టెమూజిన్‌. యూలన్‌, బుర్టీ, కరాచర్‌, షామాన్‌, చమూగా, సుబుటాయ్‌ భగత్తూర్‌ పాత్రలన్నీ స్వామి కళ్ల ముందు కనబడుతున్నయి. స్కూలు ఎగ్గొట్టి లైబ్రరీల కూర్చొని చంఘీజ్‌ఖాన్‌ నవలని రోజుల తరబడి చదివెటోడు. పుస్తకం ముగించి ఇంటికి పోయేటప్పుడు గాలిలనే తప్ప భూమి మీద నడిచెటోడు కాడు. కళ్లు మూసుకుంటే గోబీ ఇసుక ఎడారి కళ్లల్లకు వచ్చి నిలిచేది. స్వామి జీవితంల స్కూలు కంటే లైబ్రరీలకే అధిక ప్రాధాన్యత. శ్రీశ్రీ మహాప్రస్థానం కనిపించింది. వేణు జ్ఞాపకమొచ్చినాడు. అతను చదివిన ‘కవితా ఓ కవితా’ జ్ఞాపకం వచ్చింది. జేబులున్న పైసలన్నింటినీ లెక్క పెట్టుకొని అతి జాగ్రత్తగ రూపాయి చారానా ఇవతలికి తీసి మహాప్రస్థానం కొన్నడు. జీవితంల స్వామి మొదటిసారిగ కొన్న పుస్తకం అదే. అది కూడ కవిత్వం.

మెట్లు దిగి పుస్తకాన్ని తిరిగేసుకుంట ఒక్కొక్క కవితనే చదువుకుంటా వచ్చిన తోవలనే వెనుకకు నడుస్తున్నడు. కొన్ని కవితలు అసలు అర్థం కాలేదు. నోరు తిరగని సంస్కృత పద్యాల్లాగ అనిపించినై. మరికొన్ని మాత్రం మంచిగనిపించినై.

“మనమంతా బానిసలం
గానుగలం పీనుగలం
వెనక దగా ముందు దగా
కుడి ఎడమల దగా దగా
మనదీ ఒక బ్రదుకేనా
కుక్కల వలె నక్కల వలె
మనదీ ఒక బ్రదుకేనా
సందులలో పందుల వలె”

అటువంటివి సులభంగ అర్థమైన వాటిని పునశ్చరణ చేసుకుంట నడుచుకుంట ఆగి నిలబడి ఎదురుంగ చూస్తే దిల్‌షాద్‌ టాకీస్‌. అండ్ల రాజ్‌కపూర్‌ సినిమా ‘జిస్‌ దేశ్‌ మే గంగా బహతీ హై’.

“ఆఖరి పరీక్ష పేపరు రాయంగనే మ్యాట్నీ షో కోసం దిల్‌షాద్‌ టాకీసుకు రా. అండ్ల రాజ్‌కపూర్‌ది మంచి సిన్మా ఆడుతుంది. నేనూ, నరేష్‌ కూడ వస్తం” అని వేణు లెటర్‌ రాసినాడు. పరీక్షల హాంగోవర్‌ ఉతార్‌కు సిన్మా ఒక్కటే సరియైన ఔషధం. స్వామి థర్డ్‌ క్లాసు లైనుల నిలుచున్నడు. మిత్రులిద్దరూ ఇంకా రానట్టుంది.

ఎదురుగ జిస్‌ దేశ్‌ మే…. నలుపు తెలుపుల సీన్మా పోస్టర్లు. అండ్ల ఒక పోస్టర్‌ భావగర్భితంగ, గొప్ప సింబాలిక్‌గ ఉంది. ఆ పోస్టర్‌ల ఒకే ఒక పెద్ద డప్పు. దానికి అడ్డంగ ఒక తుపాకీ. అవి రెండు తప్ప ఆ పోస్టర్‌ల వేరే ఎవరూ లేరు. ఏమీ లేదు. బాగ ఆకట్టుకునే పోస్టర్‌. హింసనూ, బలప్రయోగాన్ని నమ్ముకున్న కరుడు గట్టిన బందిపోట్ల ముఠాను తన డప్పుతో, పాటలతో హృదయ పరివర్తనం గావించి, శాంతి మార్గం వైపు మళ్లించి, జనజీవన స్రవంతిల కలిపిన సాదాసీదా, అమాయక చక్రవర్తి, అనాథ యువకుడి కథ.

అండ్ల హీరో రాజ్‌కపూర్‌. స్వామి నచ్చిన, మెచ్చిన హీరో. రాజ్‌ – కా -పూర్‌. పేద ప్రజల హృదయాలకు అద్దం పట్టిన రాజు – రారాజు – రాజు పేద రెండు అతనే. సినిమాల కూడా అతని పేరు రాజు అనే ఉంటది. మనదేశంల ఆ పేరు ‘సర్వనామం’. ఆమ్‌ ఆద్మీకా నామ్‌ “రాజు”. అందుకే ‘మేరా నామ్‌ రాజు’ అన్న పాటతోటే ఆ సీన్మా ప్రారంభమౌతుంది. తొమ్మిది సంవత్సరాల లేత వయస్సుల చూసిన సిన్మా జిస్‌ దేశ్‌ మే గంగా బహతీ హై. ఆ పసి హృదయం మీద ప్రభావం చూపి మొదటిసారిగ ముద్రవేసిన కళాత్మకమైన గొప్ప సిన్మా జిస్‌ దేశ్‌మే ………….

సినిమా అంటే ఏందో తెలియనంత చిన్నతనంల స్వామి మొదటిసారి చూసిన సిన్మా అలీబాబా నలభై దొంగలు.

అమ్మ తమ్ముడు కన్నయ్య మామ పుణ్యమా అని స్వామికి మొదటిసారి సీన్మా దర్శన భాగ్యం కలిగింది. ఆయన ఎక్కడ్నో భద్రాచలం అడవులల్ల కొండలు కోనల మధ్య కోయగూడెంల సింగిల్‌ స్కూల్‌ టీచర్‌గ పనిచేసేటోడు. ఆయన ఎండాకాలం సెలవులల్ల పట్నం వచ్చినప్పుడల్ల తమ ఇంట్ల దీపావళి పండుగరాత్రి పూల్‌చెడీలు వెలిగినట్లుండేది.

మొదటిసారి తన చిట్టి పాదాలకు చెమికీల మెరుపుల చెప్పుల్ని కొన్నదీ ఆయనే, మొదటిసారి తనకు చల్లటి తియ్యటి లస్సీ తాగించిందీ ఆయనే, మొదటిసారి పలక మీద ఎబిసిడీలను దిద్దించిందీ ఆయనే. కన్నయ్య మామ సంబరాల రాంబాబు. హార్మోనియం వాయించుకుంట గొంతెత్తి కమ్మని పాటలు పాడేటోడు. రంగురంగుల కాగితాలు, అట్టలతో రకరకాల బొమ్మలు చేసేటోడు. బొమ్మలు గీసేటోడు. రాత్రుళ్లు దీపం వెలుగులల్ల లేదా వెన్నెల వెలుగులల్ల గోడలమీద తన చేతివ్రేళ్ల నీడలతో జంతువుల ఆకారాలను సృష్టించి తమాషాలు చేసేటోడు. కుక్కలు, నక్కలు, గుర్రాల బొమ్మల నీడలు. కుక్కతోక ఆడిస్తున్నట్లు తలపైకెత్తి మొరుగుతున్నట్లు చూపించేటోడు. అట్లనే రకరకాల పక్షుల ఆకారాల్ని చూపిస్తూ అవి ఆకాశంలకు ఎగిరిపోతున్నట్లు దృశ్యాలు చూపించేటోడు. దారాసింగు, ఆక్రమ్‌ ముక్రమ్‌ పహిల్వాన్ల కతలు చెప్పేటోడు.

కన్నయ్య మామ వస్తే ఇంట్ల సందడే సందడి. ప్రతి ఎండాకాలం రెండు నెలల సెలవులన్నీ తమ ఇంట్లనే గడిపేటోడు. పట్నం వచ్చిన ప్రతిసారీ ఆయన ఏదో ఒక సంగీత పరికరమో, వాయిద్యమో కొని తనుండే పల్లెటూరుకు పట్టుకపోయేటోడు. నల్లటి గుండ్రటి రికార్డును ప్లేటు మీద జాగ్రత్తగ అమర్చి, ఆ గ్రామ్‌ఫోన్‌ డబ్బాకు గట్టిగ ‘కుంజీ’ ఇచ్చి తిరుగుతున్న రికార్డు మీద నీడిల్‌ను ఆనించేసరికి “పల్లెకు పోదాం పారును చూద్దాం చలోచలో” దేవదాసు సీన్మాల పాట వచ్చింది. అట్ల ఊహించని స్వామి ఆశ్చర్య చకితుడై పోయినాడు. ఆ పాట, మ్యూజిక్‌తో వాళ్ళ ఇల్లు ఒక వెలుగు వెలిగిపోయింది. ఆనందాల నవ్వుల పువ్వులు అంతట వెల్లివిరిసినై. కన్నయ్యమామ స్వామికి అద్భుతమైన మాంత్రికుడిలాగ కనిపించేటోడు. అతను మాట్లాడే ఖమ్మం జిల్లా ‘యాసభాషలు’ బాగా ఆకర్షించేవి. ఆయన ‘వెధవా’ అని తిట్టినా తనకు ఆనందంగనే ఉండేది తిడితే తిట్టాడుగని మహాగొప్పగ తిట్టినాడని బొలెడంత సంబరమేసేది.
నైజాం రాచరిక, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగ ఖమ్మం జిల్లాల జరిగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం గురించి వైనవైనాలుగ వర్ణిస్తూ కథలు చెప్పేటోడు. ఆయన ద్వారనే స్వామికి మొదటిసారి అరుణ పతాకం గురించి, కమ్యూనిస్టుల గురించి తెలిసింది. వాళ్లత్యాగాలు వాళ్లు పడిన కష్టాలు, వాళ్లు చేసిన సాహసాలు బాగా ఆకర్షించినై. ఆ చిన్నారి హృదయంల కమ్యూనిస్టుపార్టీ మీద ప్రేమ జనించింది. అంతరంతరాలల్ల అది పాతుపోయింది.

భద్రాచలం దట్టమైన అడవులల్ల సంచరించే పెద్దపులులూ, చిరుతపులులూ, ఎలుగుబంట్లు, రేచుకుక్కల గురించి కతలు చెప్పేటోడు. వాటి స్వభావాలను ఆహారపు అలవాట్లను వర్ణించేటోడు. వరంగల్‌ జిల్లాలోని ములుగు, దాటి ఏటూరు నాగారం వరకు బస్సు ప్రయాణంచేసి తరవాత వచ్చే గోదావరి నదిని తెప్ప మీద దాటి అక్కడ్నుంచి ఒంటెద్దు బండిల రెండు మూడు రోజులు అరణ్యయాత్ర చేసి తానుండే కోయగూడానికి చేరుకునేటోడు. హైద్రాబాదు నుంచి ఆ అడవిల ఉన్న ‘గుండాల’ కుగ్రామానికి చేరుకోవటం కంటే అమెరికాకు పోవడం చలా ఈజీ అని జోకులు వేసేటోడు. రెండు మూడు రోజులు చేసే ఆ అరణ్య ప్రయాణంల ఎదురయ్యే పెద్ద పులులు, రేచు కుక్కల గురించి ఒళ్లు జలదరించేలాగ సంగతులు చెప్పేటోడు. చీకటిపడిన తరవాత ప్రయాణం చేస్తుంటే ఆ బండికింద వ్రేలాడే కందీల్‌ వెలుగును చూసి పెద్దపులి రోడ్డుకు అడ్డంగ ఎట్ల నిలుచునేదో చెప్పేటోడు. అది అరగంట, గంట సేపు అట్లనే నిలుచుని ఆ కందీల్‌ వెలుగుని చూసేసి చివరికి నెమ్మదిగ వెళ్లిపోయేదని, మేము మాత్రం దానిని అదిలించేవారం కాదని ఒక వేళ అట్ల చేస్తే తమ మీద దాడిచేసి తమను చంపి తినేసేదని చెప్తుంటే శ్రోతలందరూ నోర్లు వెళ్లబెట్టుకొని ఆశ్చర్య చకితనయనాలతో భీరిపోయేటోళ్ళు. ఆ అనుభవాలతో ఆయనే గనుక కథలు రాస్తే ఆంధ్రా ‘రుథ్‌యార్డ్‌ కిప్లింగు’ అనిపించుకునేటోడు. అరణ్యమార్గంల దొరికే ఇప్పసారా, కోయపడుచుల గురించి రహస్యంగ బావ చెవిల గుసగుసలాడేటోడు.

కన్నయ్య మామ స్వతహాగ అందగాడే అయినా ఇంక అందంగా కనబడటానికి చాల జాగ్రత్తలు తీసుకునేటోడు. ప్రాథమికంగ ఆయనొక కళాత్మక జీవి. ఓపికగ నున్నగ గడ్డంగీసుకున్న తరవాత చిన్న కత్తెరతో మీసాలు సుతారంగ కత్తిరించుకునేసరికి సరిగ్గ అర్థగంట పట్టేది. ఆ తర్వాత స్నానానికి బావిగచ్చుమీద కూచుంటే బావిలోపలి సగం నీళ్లు కల్లాస్‌. సబ్బు సగానికి సగం ఐసుక్రీములాగ కరిగిపోయే వరకు వొళ్లు రుద్దుకుని, బుడుంగుబుడుంగుమని నాలుగు బక్కెట్ల నీళ్లు వొంటి మీద గుమ్మరించుకునేటోడు.

ఆ తర్వాత అద్దం ముందుకూచుంటే, ఆడవాళ్ల కన్నా అన్యాయం, అదో అర్దగంట. వొత్తుగ ఉండే నల్లటి వొంకీల, జులపాలజుట్టుకు తెల్లటి బ్రిల్‌క్రీమ్‌ను దట్టంగ పట్టించి స్త్రీల మాదిరిగ మధ్యపాపిట తీసి పక్కలకు దువ్వేటోడు. అది ఆ కాలం నాటి బెంగాలీ బాబుల హేర్‌స్టైల్‌. ముఖానికి రెమీ స్నో రాసి పాండ్స్‌ పౌడర్‌ అద్దుకునేటోడు. ఆ బిల్‌క్రీములు, స్నోలు, పౌడర్లతో ఇల్లంత పరిమళభరితమైయ్యేది. గుమగుమలాడేది. సన్నటి దావణగిరి పంచెను సింగులు పోసి కట్టి దాని మీద మల్లెపూవులాంటి లాల్చీ ధరించేటోడు. ఆయన ఎల్లప్పుడు దవళకాంతుల శ్వేత వస్త్రధారి. కొత్త రూపాయి నోటులాగ ఫెళఫెళలాడుతుండేటోడు. కన్నయ్య ‘కన్నయ్య’ మాదిరిగనే జీవించినాడు.

అతని విలాసాల కులాసాల జీవితమే అతడిని వ్యసనపరుడిగ మార్చివేసింది. నిత్యాగ్నిహోత్రుడు. చార్మినార్‌ సిగరెట్‌ నిరంతరం వేళ్ల మధ్య వెలుగుతుండేది. రాత్రయ్యేసరికి సారా కోడిమాంసం లేనిదే భోజనం సయించేది కాదు. “చార్మినార్‌ భరండీ మదీనా బిర్యానీ” కోసం బావను సతాయించేటోడు. పట్నం వచ్చిన పదిరోజులల్లనే తెచ్చుకున్న పైసలన్నీ కల్లాస్‌. అక్కను, బావను పైసలు ‘బదులు’ ఇవ్వమని బతిమాలుకునేటోడు. ఎందుచేతనో అతనికి – భార్యకు సఖ్యత కుదరలేదు. ఆమె ఎప్పుడూ పుట్టింట్లనే ఉండేది. పిల్లలు లేరు. “పిల్లలుంటే వీడు ఇట్ల తెగిన పతంగిలా ఉండకపోయేది” అని స్వామి అమ్మ అంగలార్చేది. వీడు తాగి తాగి ఎన్నడో చస్తడు అని ఆమె ఏడ్చేది.

కనపడని విషాదం ఏదో అతడిని వెన్నాడుతుంటే సంగీతం సహారాతో సారా ఆసరాతో, పరస్త్రీల సాంగత్యంతో తెగిన పతంగంలాగే బతికినాడు. చివరికి ఉద్యోగం ఊడిపోయింది. పెన్షన్‌ కూడ రాలేదు. చిన్న వయస్సులనే కాళ్లకు గాంగ్రీన్‌ వచ్చి పుండ్లు పడిన పాదాలతో నడవలేక నేల మీద దేకేటోడు. బీడీలు తాగుతూ, సారాకోసం అలమటించేటోడు. సారా ఇప్పించమని అందర్నీ బ్రతిమాలేటోడు. మల్లెపువ్వు లెక్క గుభాళించిన మనిషి శుచిశుభ్రతలకు దూరమై భార్య చీత్కారాలను భరిస్తూ, పక్షవాతం కమ్ముకురాగా ఆ మారుమూల గ్రామంలోనే పూరిగుడిసెలో కుక్కిమంచంల వెలియై ఒంటరియై కుంగి కృశించి మరణించినాడు.

“దిల్‌ పే మర్నేవాలే మరేంగే బికారీ”

స్వామి మొదటిసారి చూసిన సీన్మా అలిబాబా నలభై దొంగలు. ఆ హాలు లోపలికి పోయే సరికి చిమ్మనిచీకట్లు. తనను ఎవరో ఎత్తుకున్నారు తెరమీద ఆడవాళ్లు డాన్సు చేస్తున్నరు. నిజంగ మనుష్యులే అనుకున్నడు. వాళ్లు మాట్లాడుతుంటే తననే ఏదో పలకరిస్తున్నారని భ్రమపడ్డడు. ఇంతల స్వామిని ప్రక్కనున్న ఖాళీ కుర్చీల కూచోబెట్టినారు. ఆ కుర్చీ చెక్క అటుఇటూ ఊగుతుంటే కింద పడిపోతానేమోనని భయపడ్డడు. ముండ్లమీద కూచున్నట్లు కుర్చీమీద కూచున్నడు. ఇంటర్వెల్‌లో తెల్లని తెర కనబడింది. అందులోపల మనుషులుంటరేమోనని ఇంకో భ్రమ. ఆ సీన్మా పేరేమిటో ఇంటికొచ్చినంక పెద్దవాళ్లు మాట్లాడుకొంటుంటే తెలిసింది. కొండడు తిరపతికి పోయి దేవుడిని చూడకుండనే తిరిగివచ్చినట్లయింది స్వామి పని.

స్వామి తరవాత చూసిన రెండో సీన్మా రత్నగిరి రహస్యం. చాదర్‌ఘాట్‌ కమల్‌ టాకీసుల పెద్దబావ, అక్కలతో కలిసిపోయినాడు. ఖాళీ వెండితెరని చూస్తుంటే దాని వెనక ఏదో నిగూఢరహస్యం దాక్కుందనిపించింది. సీన్మా నడుస్తున్నంతసేపు తెరమీదికి చూడకుండ మెడవెనక్కు తిప్పి రంద్రాలల్ల నుంచి వస్తున్న పొగ వెలుతురునే చూసినాడు. తెర మీద బొమ్మలకన్న ఆ వెలుతురు పొగనే తనను ఆకర్షించింది. ఇంటికి వచ్చిన తరవాత ప్రతి తెల్లని గోడ సీన్మాతెర మాదిరిగనే కనిపించసాగింది. గుడ్డి దీపం వెలుగులల్ల రాత్రుళ్లు గొడల మీద పడేతన నీడలనే సీన్మా బొమ్మలుగ భావించి వాటితో ఆడుకునేవాడు స్వామి.
మూడోసారి చూసిన సీన్మా జిస్‌దేశ్‌మే………….

అప్పుడు సరిగ్గ స్వామి వయస్సు తొమ్మిదేళ్లు. ఆ రోజు ఇంట్ల తాతగారి తిరువధ్యయనం (తద్దినం) జరిగింది. మధ్యాహ్నం ఆలస్యంగ సాపాట్లు ముగిసిన తరవాత అమ్మాబాపులు కునుకుతీస్తుంటె అక్కలు ముగ్గురూ ముస్తాబులు మొదలుపెట్టినారు. ఆద్దాల కుంకుమ పెట్టెను ముందు పెట్టుకుని అండ్ల నుంచి స్నో పౌడర్‌ కాటుక డబ్బాలను ఇవతలికి తీసినారు. సుశక్క సబ్బు సగం అరగదీసి ముఖం కడుక్కుని ముఖానికి మందంగ పౌడరేసుకుని రంగుల రిబ్బన్లతో రెండు జడలు వేసుకుని చెవులకు లోలక్కులను బిగించుకుంటుంది. చిన్నక్క ఇత్తడి చెంబుల భగభగలాడే బొగ్గుకణికల్ని వేసి లంగావోణీ ఇస్త్రీ ప్రారంభించింది. ఇంట్ల అప్పటికి ఇస్త్రీ పెట్టె లేదు. పెద్దక్క శకుంతల పూలపూల ఫుల్‌ వాయిల్‌ చీరకట్టుకుని సవరంపెట్టి జడవేసుకుంటుంది. వాళ్ల హడావుడిని స్వామి అప్పటికే గమనించినాడు. స్వామి పసిగట్టిన సంగతి వాళ్లకు తెలిసిపోయి లోలోపలే గుసగుసగ మాట్లాడుకుంట జాగ్రత్తపడుతున్నరు. డాక్టరు దగ్గరికి వెళ్లి ఇంజెక్షను వేయించుకోవాలంటూ స్వామికి వినబడేలాగ పైకి బిగ్గరగ మాట్లాడుకుంట నటనలు మొదలుపెట్టినారు.

స్వామికి ఉక్రోషం ముంచుకొచ్చింది. కొద్ది రోజుల కింద ఇట్లనే డాక్టరు దగ్గరకు పోయి రావాలంటూ అబద్దాలు చెప్పి చీకటి పడినంక ఇంటికి వచ్చినారు. ఆ మర్నాటి నుంచి వారంరోజుల వరకూ ఆ నాగేశ్వేర్రావు సీన్మా ముచ్చట్లనే చెప్పుకున్నరు. అమ్మ ముందు సుశక్క సీన్మాల నాగేశ్వర్రావు చేసిన డాన్సు కూడ చేసి చూపించింది. వాళ్లు తనను మోసం చేసినారని లోలోపల స్వామి ఎంత దుఃఖించినాడో! రాత్రుళ్లు నిద్రపోయే ముందు తను వెళ్లని ఆ సీన్మాను తలుచుకుని తలుచుకుని లోలోపలే కుమిలికుమిలి ఏడ్చేటోడు. కన్నీళ్లతో దిండు తడిచిపోయేది. ఈసారి మాత్రం స్వామి మోసపోదల్చుకోలేదు. ఆ రోజు వాళ్లసంగతేదో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నడు.

అవతల తమ గల్లీ మలుపుల కాపు కాసినాడు. వాళ్లు రిక్షా ఎక్కేది అక్కడే. ముగ్గురక్కలు స్వామి సంగతే మరిచిపోయి హుషారుషారుగ ఇంట్ల నుండి బయటికి వచ్చి తమ గల్లీ మలుపు దాటంగనే పదహారుపండ్లు కనబడేలా ఇగిలిచ్చుకుంట స్వామి శనిగ్రహంలాగ ఎదురొచ్చినాడు. వాళ్లు కొంచెంసేపు తికమకపడినారు. బతిమిలాడినారు. రకరకాల అబద్దాల వాగ్దానాలు చేసినారు. స్వామి మాత్రం రిక్షా ఎక్కుతనని మొండికేసినాడు. వాళ్లు ముగ్గురూ కండ్లతోనే మాట్లాడుకుని ఓకే అంటె ఓకే అని సైగలు చేసుకున్నరు. సుశక్క చెంగుచెంగున పరిగెత్తుకుంట ఇంట్లకి పోయి తమ్ముణ్ణి కూడా సీన్మాకు తీసుకుపోతున్నమని చెప్పింది.

ఇక స్వామి ఆనందానికి హద్దులేదు. లోపలి బాధ పొగమంచు లెక్క కరిగిపోయి అక్కల మీద ప్రేమ ముంచుకొచ్చింది. సుశక్క స్వామి కన్న రెండేండ్లు మాత్రమే పెద్ద. ఆమెతో స్వామికి మంచి దోస్తీ. చిన్నక్క పేరు వెంకటమ్మ. ఆమె టీచర్‌ ట్రేనింగు చేస్తుంది. నిజానికి ఆమె రెండో అక్క. సుశక్క ఆమెను ‘చిన్నక్కా’ అని పిలవటంవలన స్వామి కూడ ఆమెను చిన్నక్కా అనే పిలుస్తాడు. పెద్దక్క పెళ్లి అయిపోయింది. ఆమెకు ఒక పాప. రిక్షాల పెద్దక్క చిన్నక్క పైన కూచున్నరు. స్వామి సుశక్క వాళ్ల పాదాల దగ్గర కింద కూచున్నరు. రిక్షా శాలిబండా ఉతార్‌ నుంచి గుల్జార్‌హౌజ్‌ల కృష్ణాటాకీసుకు జోరుగ బయలుదేరింది. స్వామి మనస్సు ఆకాశంల ఎగురుతున్న రంగుల పతంగ మయ్యింది. భూమ్మీద గిరగిర తిరుగుతున్న రంగురంగుల బొంగరమయ్యింది. అప్పుడే కడాయి నుంచి తీసిన రసాలూరే తియ్యని జిలేబీ అయ్యింది.

అంతకు ముందు కొద్ది రోజుల క్రిందటే స్వామి ‘జిస్‌దేశ్‌మే’ సీన్మాకథ కొంచెం విని ఉన్నడు. ఎండాకాలం సెలవులల్ల బాపు ‘తన డొక్కలోని కంతి’ సతాయిస్తుంటె నాంపల్లి సర్కారీ దవాఖానాల షరీకైనాడు. చుట్టాలల్ల అదొక సంచలనవార్త. ఆయన్ని చూసి పరామర్శించటానికి అందరూ క్యూలు కట్టి పట్నం వచ్చినారు. అందరి కన్న ముందు పట్నంల వాలింది కన్నయ్య, అప్పయ్య మామలు. అప్పయ్య మామ పూర్తిపేరు వెంకటప్పయ్య. ఒక ప్రభుత్వశాఖల పెద్ద గుమాస్తా. అమ్మకు ఆయన వరుసకు తమ్ముడు. వరంగల్‌ జిల్లాల మానుకోట ఆయన స్వగ్రామం. తన చిన్న మేనత్తకు భర్త.

ఆ ఇద్దరూ జొగడు బాగడుగ, అక్కన్నమాదన్నలుగ కలిసి తిరిగేటోళ్ళు. ప్రతిరోజు దవాఖానాల ఉన్న బాపుకు అన్నం, బట్టలు పట్టుకపోవడం వాళ్ల డ్యూటీ. బాపును దవాఖానాల పలకరించిన తరవాత మిగిలిన సమయంల పట్నమంతా బలాదూర్‌గ తిరిగేటోళ్ళు. జుమ్మేరాత్‌ బజారుకు పోయి పాతసామానులను అగ్గువసగ్గువకు కొనేటోళ్ళు. పచ్చళ్లు నిల్వచేసే పాతరాతిచిప్పలు మొదలుకొని సైకిలుకు వేలాడే పాత గ్యాసు నూనె కందీల్‌ వరకూ అన్నీ అడ్డికి పావుసేరుగ బేరంచేసి అప్పయ్యమామ కొనేటోడు. ఆరోజులల్ల హైద్రాబాదుకు వచ్చిన ప్రతివారు జుమ్మేరాత్‌ బజారును సందర్శించనిదే తమ ఊళ్లకు తిరిగివెళ్లేటోళ్ళుకాదు. హర్‌ఏక్‌ మాల్‌ బహుత్‌ సస్తామాల్‌గ ఆ బజార్‌ల దొరికేది. మరొక రోజు బాగేఆంకు పోయి అండ్ల ‘జూ’ ను చూసేటోళ్ళు. ముఫత్‌గ చార్మినార్‌ ఎక్కేటోళ్ళు. కాళ్ల పిక్కలు నొప్పులు పెట్టితే పక్కనే ఉన్న మక్కామసీదులోపలి నల్లరాళ్ల బండల మీద కూచొని అక్కడ టపటపా ఎగురుతున్న తెల్లపావురాళ్లను చూసేటోళ్ళు.
దివాన్‌ దేవిడీల సాలార్‌జంగు మ్యూజియంకు పోయి అండ్ల గంటల గడియారాన్ని చూసి తరించేటోళ్లు. పైసలుంటే మదీనా హోటల్ల మటన్‌బిర్యానీ, జేబు గరంగరం లేక లాచార్‌ కండీషన్‌ల ఉంటే ‘ఆలూటమాట – ఘీకాపరాట’ తిని పౌనా తాగి కృష్ణా టాకీసుల సిన్మా చూసేటోళ్ళు. అట్ల ఆ రోజు సాయంత్రం వాళ్లు కృష్ణా టాకీసుల జిస్‌ దేశ్‌మే….. సీన్మా చూసి ఇంటికి వచ్చినారు. రాత్రి సాపాట్లు అయిన తరవాత ఇంట్ల అందరి పర్మాయిషీ మీద ఆ సీన్మాకథ చెప్పటానికి సిద్ధం అయినారు. ఒకరు కాదు ఇద్దరూ జంట కవుల మాదిరిగ !

సీన్మాను చూసి వచ్చిన అదృష్టవంతులు ఆరోజు రాత్రి అన్నాలు తిన్న తర్వాత సిన్మా కత చెప్పబొతున్నారని సాయంత్రం నుండే చాటింపు వేయబడేది. అట్ల చెప్పబొయే కథకు నేపథ్యంగ ఒక ఉత్సాహకర వాతావరణం సృష్టించబడేది. త్వరత్వరగ అందరూ ఆముదం నూనెలు పోసిన ప్రమిదల ముందో, గ్యాసునూనెతో వెలిగే చిమ్నీబుగ్గల ముందో అన్నాలు ముగించేటోళ్ళు. ఎండాకాలం కావున ఇండ్లల్ల పండుకునే ప్రసక్తేలేదు. వాకిలి విశాలంగ ఉండేది. పైన పెద్ద వేపచెట్టు ఆకాశంల నిండు పున్నమి చల్లని వెన్నెల. లేకపోతే అమావాస్య కటిక చీకటి రాత్రి శ్యామలాకాశంల మిణుకు మిణుకుమని వెలిగే లక్షలలక్షల నక్షత్రాలు. ఏదైతేనేం ఆకాశం పందిరికిందర మంచాలని వాటిపై పరుపుల్ని వేసేటోళ్ళు. చాలకపోతే నేలపై ఈతచాపలని పరిచేటోళ్ళు. పక్కన్నే బావి గచ్చు. దాని మీద మంచమేసుకుని నడుం వాలిస్తే దాని సుఖం ముందు ఏసి రూము సుఖం బలాదూర్‌. బావి ప్రక్కనే మల్లెపూల పందిరి. ఆ వెన్నెల వెలుగులకు తోడు మల్లెపూల పరిమళాలు. రెండూ కలిసి శ్రోతల్ని, ఆనంద ఆహ్లాదకర వాతావరణంల ముంచితేల్చేవి. పెద్దలందరూ మంచాలల్ల, పిల్లలందరూ చాపలమీదకు చేరంగనే దీపాలను పూర్తిగ ఆర్పేసేటోళ్ళు. ఇక వాళ్ల మధ్య వెన్నెల రాజ్యమేలేది. పై నుంచి వేపచెట్టు సన్నసన్నగ వింజామరలు వీచేది. అందరూ ‘లాహిరి లాహిరి లాహిరి’ల తేలిపోయేటోళ్ళు.

అప్పుడు ‘కథక చక్రవర్తులు’ కొంచెంసేపు బతిమాలించుకున్న తర్వాత గొంతు సవరించుకుని కథ చెప్పడం ప్రారంభించేటోళ్ళు.

ఆ రోజులల కథలు చెప్పడంల అందరూ ‘తీస్‌ మార్‌ఖాన్లే’. ఒకళ్లను మించి మరొకళ్లు కళ్లకు గట్టినట్లు ‘దృశ్యమానంగ’ కతలు చెప్పేటోళ్ళు. తెర మీద పేర్లు వేసేది మొదలుకొని చివరికి ‘శుభం’ వరకూ పొల్లుపోకుండ డైలాగులతో సహా వినోదం, విషాదం సీన్లను వర్ణిస్తూ కతలు చెప్పేటోళ్ళు. శ్రోతలు నిజంగ సీన్మాచూస్తున్నట్లే ఆ కథల పూర్తిగ లీనమై నవ్వేటోళ్లు. ఏడ్చేటోళ్లు. ఎక్కువా లేదు తక్కువా లేదు. మూడుగంటల సీన్మాకథను సరిగ్గ మూడుగంటలల్ల చెప్పి ముగించేటోళ్లు. అంత అమోఘమైన జ్ఞాపకశక్తి అరుదుగ చూసే సీన్మాలవల్లనే వచ్చిందేమో! చూసే ప్రతి సీన్మాను అన్యమనస్కంగ కాక హృదయంలోకి ఇంకించుకోవటం వల్లనే, అనుభూతి చెందటం వల్లనే వచ్చిందేమో! సీన్మా చూసి వచ్చిన తరవాత ఇక వైనవైనాలుగ దాని గురించి ఒక వారం రోజుల వరకూ చెప్పుకునేటోళ్లు. ఆ కథను అండ్ల ఉన్న వినోద విషాదఘట్టాలను తమ జీవితాలకు, అనుభవాలకు అన్వయించుకొని సంతోషపడేటోళ్ళు. బాధపడేటోళ్ళు. స్ఫూర్తి, ఉత్తేజం పొందేటోళ్ళు. సీన్మాను ఒక్కరేచూసినా పదిమందికి ఆ ఆనందాన్ని పంచేటోళ్ళు. అట్లా ఆ ఆనందాన్ని తిరిగి పదింతలు రెట్టింపు చేసుకునేటోళ్ళు. ఏమి వెన్నెలకతలవి! ఎటువంటి బంగారు రోజులవి!

ఒక సీన్మాకథలేకాదు. ఇతర కథలు అనేకం చెప్పేటోళ్ళు. స్వామి ఇంటిపక్కన ఉండే వొడ్ల వెంకయ్యతాత ‘బిగబిగతాడు సొంటెసొంటె కట్టె’ లాంటి జానపద కథలను, చుక్కల పర్వతం మీదికి తను పని కోసం పోయినప్పుడు అక్కడి మన్యంల ఎదురైన మెకాల గురించి, ఆ అనుభవాల గురించి కథలు చెప్పేటోడు. చెప్పుకోవటానికి కథలు ఏమి లేకపోతే లోకం మీది ముచ్చట్లనే కథలుగా చెప్పుకునేటోళ్ళు. ముచ్చట్లు అండ్‌ ముచ్చట్లు. ఏ మ్యాటర్‌ ఆఫ్‌ నొ ఇంపార్టెన్సు ముచ్చట్లు. ముట్టుకుంటే అంటుకునే ముచ్చట్లు.

కథలన్నీ కంచికి వెళ్లిన తరవాత చెప్పుకోవటానికి కథలు ఏమీ లేకపోతే ఆ పండు వెన్నెల్ల పెద్దలు ఆష్టాచెమ్మా, పచ్చీస్‌, పామునిచ్చెన వైకుంఠపాళీ ఆటలు ఆడుతుంటే పిన్నలు వామన గుంటల పీటనో, చెక్కబొమ్మలతోనో ఆడుకునేటోళ్ళు. రేడియోలు వచ్చిన తర్వాత పండు వెన్నెల పున్నమి రాత్రుళ్లల్ల అందరూ కలిసి అందులో వచ్చే వింజమూరి సీతా, అనసూయ పాడే జానపదగీతాలనో, ఈ మాసపు పాట లలిత సంగీతాన్నో, నాటికలనో, సీన్మాపాటలనో వినేటోళ్ళు. ఏం చేసినా, ఏం విన్నా సమైక్యజీవన సామూహిక ఆనందమే. వారివి ఒంటరి ద్వీపాలు ఒకట్ల అంకెల జీవితాలు కావు. పంచుకొని పెంచుకునే సంతోషం వారిది.

ఆ రాత్రి కన్నయ్య – అప్పయ్య మామలు జిస్‌దేశ్‌మే…. కథ చెప్పటం ప్రారంభించినారు. ఆ సీన్మాల హీరో రాజ్‌కపూర్‌ ఆహార్యం, రూపురేఖా విలాసాలను వర్ణించి ఆ పాత్రధారిని మా కండ్ల ముందు రంగ ప్రవేశం చేయించినారు. ఆ వర్ణన వినుకుంటనే స్వామి నిద్రలోకి జారుకున్నడు. తెల్లవారగట్ల కోళ్లుకూసే సమయానికి ఆ కథ ముగిసిందట.

ముగ్గురక్కలతో స్వామి కూర్చున్న రిక్షా కృష్ణాటాకీసులకు పోయి ఆగింది.

ఆ రోజులల్ల సీన్మాటాకీసులల్ల స్త్రీలకు ప్రత్యేకమైన గ్యాలరీ ఉండేది. కృష్ణా టాకీసుల మేడ మీద స్త్రీల గ్యాలరీ. అది నగరంలనే పురాతనమైన సీనిమాహాలు. 1926ల దానిని నిర్మించినారు. తర్వాత అది ఎటువంటి మార్పులకు గురికాలేదు. యాఖుత్‌మహల్‌, నూర్‌ మహల్‌, తాజ్‌మహల్‌, స్టేట్‌ టాకీస్‌, జగత్‌ టాకీస్‌లు ఆ రోజులల్ల పాతనగరంల ప్రధానమైన సీన్మాటాకీసులు. కాలగర్భంల అవన్నీ కనుమరుగైనా “కిష్ణా” ఇప్పటికీ కృష్ణానదిలాగా తన పురాపయనాన్ని కొనసాగిస్తుంది. కాల ప్రవాహానికి ఎదురీదుతూ ప్రవహిస్తనే ఉంది.

టిక్కట్లు తీసుకుని ఆ చీకటి హాలులోపలికి ప్రవేశించే సరికి రాజ్‌కపూర్‌ ‘మేరానామ్‌ రాజు’ అన్న పాటతో తనని తాను పరిచయం చేసుకుంటున్నడు. పవిత్ర గంగానది జలాలల్ల తెప్పమీద నిలబడి ‘ఢక్లీ’ కొట్టుకుంట, నోటిలో తాళం వాయించుకుంట, పాట పాడుతున్నడు. నేపథ్యంల కాశీస్నానఘట్టాలు. గుళ్లుగోపురాలు. తీర్థయాత్ర కొచ్చిన రకరకాల ప్రయాణీకులు కనబడుతున్నరు. “రాజులు పోయినా రాజ్యాలు మారినా పాట మాత్రం నాశనం కాదని – చివరికి పాట మాత్రమే నిలబడుతదని – పాట ద్వారానే ప్రేమను పంచుతానని, పెంచుతానని – పనిలేనపుడు పాటలరాగాలు కట్టుతనని కట్టిన పాటల్ని అందరికీ వినిపిస్తనని – వినేటోళ్లు ఎవరూ లేనపుడు తనలో తనే తనకోసమే పాడుకుంటనని పాట పాడుకుంటనే దేశదేశాలు సంచరిస్తనని – చివరికి ప్రాణమైనా పోనీ పాట మాత్రం మాననని” ఆ పాట సారాంశం. ఆ లొకసంచారి చేసే లక్ష్యం గమ్యంలేని నిరంతర యాత్రల అతను నమ్ముకున్న నేస్తం, అతని శరీరంల ఒక ముఖ్యమైన భాగం అతని ‘డక్లీ’ మాత్రమే.

రాజు పాత్ర యాంటీహీరో లక్షణాలు కలిగి ఉంటది. రాజు మధ్యప్రదేశ్‌ మారుమూలల బుందేల్‌ఖండ్‌ నివాసి. తల్లితండ్రులెవరో తెలియని అనాధ. అనాధాశ్రయంల పెరిగిన అతని చదువు నాలుగవ తరగతి మాత్రమే. దేశ సంచారానికి బయలుదేరిన ఆ ముసాఫిర్‌ ఆకారం, ఆహార్యం, అమాయకత్వం అన్నీ భారతదేశానికి చెందిన గ్రామీణ సగటు మనిషి అంతర్‌బాహ్య లక్షణాలేగాక అతనిల నిగూఢంగ ప్రాచీన బౌద్ధబిక్షువుల, సాధుసంతు మత ప్రచారకుల తాత్వికత, జీవన విధానం కూడ ఇమిడి ఉంటది. భారతదేశంలో రాజులు, రాజ్యాలు సంక్షోభంల ఉన్నప్పుడు, సమాజం అల్లకల్లోలంగ ఉన్నప్పుడు సాధు, సంతు, ఫకీర్లే నావను గట్టెక్కించే ఆశాజ్యోతులుగ నిలబడ్డరు. నానక్‌, కబీర్‌, రామానంద్‌, చైతన్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మంలు ఎవరైనా కావొచ్చు. వారి లక్షణాలన్నీ కథానాయకుడు రాజుల నిక్షిప్తమై ఉంటాయి. అతను ధరించే నల్లటి ‘అంగరఖా’ బౌద్ధబిక్షువుకు సంకేతంగ ఉంటది.

రాజు పాత్రధారి తల అంటకత్తెర వేసిన తల. దాదాపు బౌద్ధభిక్షువు తలకు దగ్గరగ ఉంటది. ఒక చెవికి పెద్ద రింగు. అది సూఫీ ఫకీర్లకు సంకేతం.
పసితనం వీడని అమాయకమైన ముఖం. పసితనానికి సంకేతాలైన పరిశుభ్రనిర్మల హృదయం, పెదాలపై కల్తీలేని స్వచ్ఛమైన చిరునవ్వు ఆ రెండూ అతని ఆభరణాలు. మోకాళ్ల క్రిందికి ఉండే నల్లని లాగు మీద చేతి మణికట్టుల దాకా తెల్లని లాల్చీ మళ్లీ దాని మీద నడుము వరకూ కాలర్‌ లేని పక్క గుండీల నల్లని అంగరఖా. ఇంగ్లీషువాళ్లు వచ్చేవరకూ మనదేశంల పురుషులు ధరించినది ఆ కాలర్‌లేని బనీను లాంటి అంగరఖానే. కాళ్ల చీలమండల నుండి మొకాళ్లదాకా చుట్టబడిన మేజోళ్లు – కాళ్లకు పాదరక్షలు. బుజానికి వేలాడే ఓ జోలెసంచీ. అందులో ఒక జత దుస్తులు. నల్లటి జంపఖానా. ఆ జోలెకే తగిలించిన ఓ కందీల్‌ మరియు నల్లటి గొడుగు. చేతిలో ‘డక్లీ’. ఇదీ రాజు ఆకారం, ఆహార్యం. ఆ సీన్మాల ప్రారంభం నుంచి చివరి వరకూ రాజు ఆ ఆకారంలోనే ఆ దుస్తులతోనే ఉంటడు. అందులో ఎటువంటి మార్పు ఉండదు.

ఆ బాటసారి తన ప్రమేయం లేకుండనే చంబల్‌లోయల బందిపోటు దొంగల ముఠాకు బందీగా చిక్కుతడు. తన అమాయకత్వం, స్వచ్ఛమైన హృదయం, ఆటపాటలతో ఆ దొంగలనాయకుడి ఏకైక కూతురు, వెన్నెల సోనెలు జాలువారే ఆ ముద్దుగుమ్మ హృదయాన్ని దోచుకుంటడు. ఆమెను ‘బార్బాద్‌ చేసే లుఠేరా’ గ మారుతడు. ఆమె కూడా రామపాదం సోకిన అహల్యగ మారి అతణ్ణి ప్రేమిస్తుంది. బందిపోట్లు అతణ్ణి నానా హింసలు పెట్టి కత్తులు, కటార్లతో నరకటానికి – తుపాకులతో కాల్చటానికి సిద్ధమైతే తన డక్లీ ద్వారా పాటల ద్వారా వారిల హృదయ పరివర్తనం తీసుకొచ్చి వారిని జనజీవన స్రవంతిల చేరుస్తడు. భారతదేశం యొక్క శాంతిని, సహజీవనాన్ని, గొప్పతనాన్న, తాత్వికతను ప్రతి దృశ్యంల దర్శింపచేస్తడు.

ఆ సీన్మాను చూసి ఇంటికి వచ్చిన తెల్లారి నుండి స్వామికి రాజ్‌కపూర్‌ జ్వరం పట్టుకుంది. బియ్యం డబ్బా మీద గుండ్రటి మూత అచ్చంగా డక్లీలాగనే ఉండేది. దాన్ని చేతులతో వాయిస్తూ ఆ సీన్మా పాటలు పాడుతూ అందర్నీ నవ్వించేటోడు. పక్కింటి రేడియోల ఆ పాటలు వస్తుంటే పరిగెత్తి ఆ కిటికీ దగ్గర నిలబడి వినేటోడు. హిందీ భాష స్వామికి అర్థం కాకున్న ఆ ‘ధున్‌’ మాత్రం హృదయంలకు ఇంకిపోయింది. రాజ్‌కపూర్‌ అన్న పేరు వినబడంగనే స్వామి హృదయం చలించిపోయేది.

ఏదో ఒకరోజు తను పెద్ద ఉద్యోగం చేసి బాగ డబ్బులు సంపాదించి అదే కృష్టాటాకీసుల ప్రత్యేక షో వేయించి ముగ్గురక్కలతో కలిసి ఆ సీన్మా మళ్లీ చూడాలె. ఆ హాలుల తాము నలుగురే తప్ప వేరే ఎవరూ ఉండరాదు. తమ మధ్య దూరమైన ప్రేమలన్నీ మళ్లీ ఆ సీన్మాద్వారా అతికించుకోవాలె… అనుకుంటున్నడు స్వామి.

‘హాలో ఆబ్సెంట్‌ మైండెడ్‌ ఫ్రొఫెసర్‌’ అన్న కేకతో స్వామి ఉలికిపడి ఈ లోకంలోకి ఊడిపడినాడు. ఎదురుగ నరేష్‌, వేణులు నవ్వుతూ స్వామినే చూస్తున్నరు. ‘ఇన్హేతో సప్నోంకా సౌదాగర్‌ హై’ అని వేణు మరో చెణుకు చెణికినాడు. తన పరాకు తనానికి, నిలుచుండే గతంలోకి జారిపోయే తత్వానికి స్వామి సిగ్గుపడినాడు. నిమ్మపండు పసిమి ఛాయల ఉండే నరేష్‌ లేత పసుపు పచ్చ షర్టుల ఇంకా అందంగ ఉన్నడు. వేణు తెల్లని చుడీదార్‌ ఫైజామా, తెల్లటి లక్నో చికెన్‌ కుర్తాల బిల్కుల్‌ సొలానా లఖ్నవీ షాయెర్‌ లెక్క కనబడుతున్నడు. టిక్కట్లు ఇవ్వటం మొదలైనట్లుంది. లైనుల ‘డక్లండక్లీ’ తోపులాటలు. చుట్టాబీడీ సిగరెట్‌ పొగవాసనలు. పాన్ల ఉమ్మివేతలు. కూతలు బూతులు. కుస్తీ పట్లతో టిక్కట్లను చేజిక్కించుకుని హాలులోపలికి దూరినారు.

* * *

సీన్మా ముగిసిన తరవాత రాయల్‌ టాకీస్‌ సందుల ఉన్న చాట్‌ బండీ మీద గప్‌చుప్‌, రగడా సమోసాలను తిని బాలాజీ భవన్‌ల చాయ్‌లు తాగినారు. విడిపోయే సమయంల నరేష్‌ స్వామి చేతికి ఒక పాకెట్‌ ఇచ్చినాడు. లోపల ఏదో పుస్తకం ఉన్నట్టుంది.

“దీనిని చదివిన తరవాత మనం కొన్ని సంగతులు మాట్లాడుకోవాలె. వచ్చే సోమవారం సాయంత్రం ఆరు గంటలకు కోఠీ ఫిరోజ్‌గాంధీ పార్కుల కలుసుకుందాం. తప్పక వస్తవు కదా” అన్నాడు నరేష్‌ స్వామిని ఉద్దేశించి.

“సరే” అన్నాడు స్వామి ఆ పాకెట్‌ అందుకుని
“నేనూ ఆఫీసు నుండి అటే వస్త” అన్నడు వేణు.
ముగ్గురు ఓకే అంటె ఓకే అనుకున్న తరవాత స్వామి కోఠీ బస్సుస్టాండు దిక్కు అడుగులేసినాడు.

* * *

ఆ రాత్రి సాపాటు అయిన తరవాత బావి గచ్చు మీద ఆరాం కుర్చీల పుర్‌సత్‌గ పండుకుని టేబుల్‌ లాంపు వెలుతురుల నరేష్‌ ఇచ్చిన పాకెట్‌ విప్పినాడు. ఒక చిన్న పుస్తకం ‘తిరుగబడు’ కవితా సంకలనం. ‘అట్ట’హాసం లేకుండ చాల సాదాసీదా కవితల పుస్తకం. ముఖచిత్రం తిప్పి వెనుక ప్రచురణ వివరాలు చూసినాడు. 1969 డిసెంబర్‌ నెలల అంటే ఈ నెలలనే వరంగల్‌ యువకవులు ఆ పుస్తకాన్ని ప్రచురించినారు. కొత్త పుస్తకం. ఆ కవుల పేర్లన్నీ కొత్తగనే ఉన్నై. ఎప్పుడు వినలేదు. వరవరరావు, కిషన్‌, లోచన్‌, టంకశాల అశోక్‌, ఎక్స్‌రే సూటిగ, సులభంగ అర్థమయ్యే వచన కవిత్వం. పుస్తకం శీర్షిక తిరుగబడు లాగనే ప్రతి కవిత తిరుగుబాటును, సాయుధ విప్లవాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి కవిత ఫిరంగి గుండులాగ విస్ఫోటనం చెందుతుంది. రక్తం పరవళ్లు తొక్కుతుంది. ఉద్రేకం ఉరకలేస్తుంది. చదివిన కవితనే మళ్లా మళ్లా చదువుతున్నడు. లోచన్‌ రాసిన ‘ట్రిగ్గర్‌ మీద వ్రేళ్లతో రా’ కవిత స్వామిని బాగ ఆకర్షించింది. దానిని పదే పదే చదువుతున్నడు. దాదాపు అది కంఠోపాఠం అవుతుంది. ‘విషం కలిపిన పాయసం మన స్వరాజ్యం. డబ్బున్న బడవాపోషించే ఉంపుడు గత్తె మన ప్రజాస్వామ్యం’ అన్న చరణాలు కొత్త ఆలోచనకు ఆచరణకు దారి తీస్తున్నయి. ‘ఆపరేషన్‌’ అన్న కవితల వరవరరావు కుళ్లిన వ్యవస్థకు ‘శస్త్రచికిత్స’ తప్ప మరోమార్గం లేదని నొక్కి చెప్పినాడు. బాయ్‌నెట్‌ పాయింట్‌ మీదనే కలుసుకుని మాట్లాడుకుందం రమ్మని లోచన్‌ పాఠకుణ్ణి రణరంగానికి ఆహ్వానిస్తున్నడు.
ఆ నిశ్శబ్ద నిశిరాత్రిల ప్రతి కవిత, ప్రతి అక్షరం స్వామిని రగిలించి, వెలిగించి జ్వలింప చేసింది. ఏదో తెలియని అశాంతి అతణ్ణి చలింప చేసింది. ఏదో తెలియని అశాంతి అతణ్ణి అతులాకుతలం చేసి నిద్రకు దూరం చేసింది. ఆకలితో చచ్చేకంటే పోరాటంల మరణించటం మేలన్న మాటలు అతణ్ని ఆవేదనా, ఆవేశానికి గురిచేసినై. విద్రోహానికి గురైన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంల దెబ్బతిన్న హృదయం మళ్లీ మరొకసారి బగ్గుమని కొత్తదారి కోసం వెదుకుతుంది. తెల్లారగట్ల

ఎప్పుడో ఆ చిన్న పుస్తకాన్ని ఎదకు హత్తుకొని ఆ ఆరాం కుర్చీల అట్లనే నిద్రలకు జారుకున్నడు.

అతని తల పక్కన టేబుల్‌ లాంపు వెలుగుతనే ఉంది. రాబోయే భవిష్యత్తుకు సంకేతంగ!

మర్నాడు నుండే సోమవారం ఎప్పుడు వస్తదా అని చాలా ఆత్రుతగ ఎదిరిచూసినాడు. దోస్తులతో తన ఆలోచనలు, ఆవేశం పంచుకోకపోతే భరించలేనన్న దశకు వచ్చేసినాడు. వొళ్లంతా జ్వరం వచ్చినట్లు వేడిగ మారుతుంది. ఎవరి మీదనో కోపం కోపంగ ఉంది. ఏం చేయాల్నో తోచకుండా ఉంది. ఆ చిన్న పుస్తకాన్ని మళ్లా మళ్లా చదువుకున్నడు. చదివిన ప్రతీసారి కొత్తగనే ఉంది. అండ్ల ఉన్న కవులు ప్రత్యక్షంగ తన ఎదురుగ నిలబడి తనతో సంభాషిస్తనే ఉన్నరు. ఆ కవిత్వం తనను నిలవనీయదు. నిద్రపోనీయదు. రక్తచాలనం కొత్త దారులను వెదుకుతుంది.

ఎదురుచూసిన సోమవారం రానే వచ్చింది. ఆ సాయంత్రం స్వామి కోఠీల బస్సుదిగే సరికి సమయం ఐదు అయ్యింది. వేణు నరేష్‌లు బ్యాంకు వీధిల ఉన్న ఫిరోజ్‌గాంధీపార్కుకు వచ్చేందుకు ఇంకా గంట సమయం ఉంది. స్వామి కిషోర్‌ కేఫ్‌ల ఛాయ్‌తాగి కోఠీ చౌరస్తల దిన పత్రికలు తిరగేసి పక్కనున్న రేల్సింగ్సుపై తీరికగ కూర్చున్నడు.

స్వామి ఎదురుంగ రెసిడెన్సీ బస్‌ స్టాప్‌ల 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగ నగరంల చనిపోయిన విప్లవ వీరుల స్మారక స్థూపం. 1957ల ఆ విప్లవం వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆస్థూపాన్ని నెలకొల్పింది. నాలుగు ఏనుగుల మీద నిలుచున్న అశోక స్తంబం. దానిని తీరికగ తిలకించి దాని కథ ఏమిటో తెలుసుకునే ఓపిక, శ్రద్ధ ఎవరికీ లేదు. చరిత్రను నిర్మించిన వారి గురించి కొంచెం కూడ తెలుసుకోలేని చరిత్రహీనులు.

అటు పక్క ఆంధ్రాబ్యాంకు ముందు రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు పాతిన పసుపుపచ్చ సిమెంటు బోర్డు మీద నల్లటి అక్షరాలు “తుర్రెబాజ్‌ ఖాన్‌ రోడ్‌”. ఆంధ్రాబ్యాంకు నుంచి గౌలీగూడకు వచ్చే రోడ్డు పేరు అది. ఆ స్మారక స్థూపం ఈ రోడ్డు పేరు రెండింటికీ అవినాభావ సంబంధం. పక్కనున్న గురువును, అన్న దమ్ములను మరిచిపోయి పరిసరాలను మరిచిపోయి చేపను కూడ చూడకుండ కేవలం చేపకన్ను మీదనే చూపునిలిపిన అర్జునుడి మాదిరి స్వామి చూపు ఆ స్మారక స్థూపం మీదనే నిలిచిపోయింది. ఇప్పుడు అతని దృష్టిల జన సమ్మర్థంతో నిండిన కోఠీ చౌరస్తా ఒక నిర్మానుష్యమైన ఇసుక ఎడారి. ఆ ఇసుక ఎడారిల ఆ స్థూపం ఒక్కటే యదార్థ సత్యం. నిర్మానుష్యమైన ఆ వీధిల నఖశిఖ పర్యంతం క్షతగాత్రుడైన రోహిల్లా వీరుడు తుర్రేబాజ్‌ఖాన్‌ ఒక్కడే ఒంటరిగ నడుచుకుంట తను కూర్చున్న వైపు వస్తున్నడు. తన దగ్గరికి వచ్చి తనకు షేక్‌ హ్యాండ్‌ ఇస్తున్నడు. తన కళ్ళల్ల కళ్ళు కలిపి తనలోపలికి పరకాయ ప్రవేశం చేస్తున్నడు. జన్మజన్మల పురాస్మృతుల పేటిక “పండోరా బాక్స్‌” ఫెటిల్లున తెరుచుకొంది.

… తరువాత భాగం ఒచ్చే వారం

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com