18
1857 జూన్ 13 మధ్యాహ్న సమయం.
జుహర్ నమాజుల కోసం మక్కా మసీదు ప్రాంగణంల అందరూ సమావేశమవుతున్నరు. కాని అందరి ముఖాలల్ల ప్రశాంతత కరువైంది. ఆందోళన, భయం అందర్నీ కమ్ముకొని ఉంది. దానికి కారణం మక్కా మసీదు గోడల మీద, తలుపుల మీద అంటించిన పెద్ద పెద్ద చేతిరాతల పోస్టర్లు. తెల్లని కాగితాల మీద ఆకుపచ్చ రంగుల రాతలు.
“ఫిరంగీలందరు కాఫిర్‌లు
వారికి వ్యతిరేకంగా జిహాద్ (పవిత్రయుద్ధం)చేయండి.”
“కిరస్తానీ సువ్వర్‌లను వధించండి
అల్లా అనుగ్రహం మన వెంట ఉంటుంది.”
“ఇట్ల గోడల మీద అంటించిన పెద్ద పెద్ద కాగితాలను నేను నిన్న బేగంబజార్ల భీ చూసిన” ఒక మౌలానా మరో మౌలానా చెవిల గుసగుసగ అన్నాడు.
“అక్కడ కొంత మంది హిందూ సేఠ్‌లు, షావుకార్లు ఈ ఇంక్విలాబ్‌కు మదద్ చేస్తున్నరట. నిన్న సాయంత్రం చార్మినార్ చబూత్ర మీద కూచున్నప్పుడు అక్కడ నడుస్తున్న బాతఖానీల ఆ మాట చెవిల బడింది.”
“ఆఁ సరేలే. చార్మినార్ దగ్గరి మాటలు నీటి మీది మూటలు. పని పాటా లేని బేకార్, బేరోజ్‌గార్‌లందరూ అక్కడ జమయ్యి హవామే పుకార్ పైదా కర్తే హై. అందరూ బాతాల పోతురెడ్డిలే. ఛీల్ ఉడీ అంటే భైఁస్ ఉడీ అనే రకాలు.. చార్మినార్ దగ్గర పుకార్లు అన్న సామెత కుతుబ్‌షాహీల కాలం నుండీ ఉండనే వుంది. కట్టుకథలకు, పిట్ట కథలకు చార్మినార్ మూల కేంద్రం. అందుకే ఆ మాటలు నిజమని నేనయితే నమ్మను.”
“అరే అల్లా. ఖుదా కే వాస్తే వైసా మత్ బోలో. చార్మినార్ దగ్గరి షికార్ల పుకార్లు, అక్బార్ల ఖబర్లు అన్ని అసల్ సిసల్ అవ్వల్ దర్జాగనే ఉంటవి. ఊదు కాలందే పొగ లేస్తదా? కాని అక్కడ చార్మినార్ గోడల మీద ఇంకో రకం రాతలున్నవి.”
“వో క్యా హై”
“మొగల్ బాదుషా బహద్దూర్ షా జఫర్ జిందాబాద్. అంగ్రేజోఁకా హుకుం ముర్దాబాద్.”
“ఈ కాగితాల మీది రాతలను చదువని వానిని అల్లా శిక్షిస్తాడు” అని రాసినారు.
“యా అల్లా. ఖయామత్ కా దిన్ ఆగయా” అని వెనక ఖాజీసాబ్ పక్కనున్న మరో వృద్ధునితో తన భయాన్ని పంచుకుంటున్నడు.
ఆ రాతలు కొందరిల భయాన్ని మరికొందరిల ఉత్సాహ ఉద్రేకాలను కలిగిస్తున్నయి. దానికి తగ్గట్టే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని నగర కోత్వాల్ మక్కా మసీదు అవుతల జబర్‌దస్త్ బందోబస్తు ఏర్పాటు చేసినాడు. అరబ్బు సైనిక పటాలం లాఠీలు, బరిసెలు పట్టుకొని కవాతులు చేస్తున్నరు. గస్తీ కాస్తున్నరు. కుఫియాలు అందించిన సమాచారం ఆధారంగ దివాన్ సాలార్‌జంగు గడ్‌బడ్‌లు జరుగుతయన్న ముందుచూపుతో ‘గస్తీ నిషాన్ తిర్పన్” కూడ విధించినాడు. లష్కర్ బోయిన్‌పల్లి, పరిసరాలల్ల కూడా అటువంటి పోస్టర్లను గోడలకు అంటించినారు. సర్కార్ వాటన్నింటినీ తొలగించింది.
1857ల హైద్రాబాద్‌ల జరిగిన సిపాయిల తిరుగుబాటుకు బలమైన చారిత్రక నేపథ్యం ఉంది.
1799ల మైసూరు యుద్ధంల టిప్పుసుల్తాన్‌ను ఓడించి, సంహరించిన ఇంగ్లీషువారికి నైజాం నవాబు సహాయం చేయటం హైద్రాబాద్ ప్రజలకు ఇష్టంలేదు. టిప్పుసుల్తాన్ వీర మరణాన్ని వారు మరచిపోలేదు. ఆ మైసురు యుద్ధం ముగియంగనే నైజాం రాజ్యంల అంతర్భాగమైన కర్నూలు, రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్‌వారు మద్రాసు ప్రసిడెన్సీలో విలీనం చేయటం హైద్రాబాద్ ప్రజలు సహించలేదు. 1838లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ‘వహాబీ’ రహస్య ఉద్యమం హైద్రాబాద్ పట్టణంల వ్యాపించింది. దానికి కూడా ప్రజల మద్ధతు లభించింది. ఆ ఉద్యమ నాయకుడు నిజాం స్వంత తమ్ముడు ముబారిజుధౌలా. ఆయన ఆంగ్లేయుల పెత్తనానికి వ్యతిరేకంగ కుట్రచేస్తే అతడిని గోల్కండ కోటలో బంధించినారు. అతను అండ్లనే కృంగికృశించి మరణించినాడు. ప్రజలు అతడిని వీరుడిగ అభిమానించారు.
అగ్గిమీద గుగ్గిలం అన్నట్లు 1853లో నైజాం రాజ్యంలో అంతర్బాగమైన బీరార్‌ను నైజాం చెల్లించవలసిన అప్పులకింద బ్రిటిష్‌వాళ్లు జప్తుచేసినారు. తమ ఇంగ్లాండులోని లాంక్‌షైర్ బట్టల మిల్లులకు అవరసమైన ముడిపత్తి కోసం బంగారంలాంటి పత్తిని పండించే బీరార్‌ను తెల్లవాళ్లు గుటుక్కున మింగేసినారు. ఆ అవమానాన్ని కూడా నగర ప్రజలు భరించలేకపోయినారు. “సరైన సమయంకోసం ఎదిరి చూస్తుంటే 1857మే నెలల ఉత్తర భారతదేశంల సిపాయిల తిరుగుబాటు జరిగింది.
ఆ పరిణామాలన్నింటి పరాకాష్టనే 1857 హైద్రాబాద్‌లో జరిగిన సిపాయిల తిరుగుబాటు.
ఒక నెల ఆలస్యంగ 1857 జూన్ నెలలో హైద్రాబాద్ సంస్థానంలో తిరుగుబాట్లు తలెత్తినై. నానాసాహెబ్, తాంతియాతోపే అనుచరులు సాధువులు, సన్యాసులు, వైద్యులు ఫకీర్ల వేషాలలో హైద్రాబాద్ సంస్థానంలోని అనేక గ్రామాలలో తిరుగుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని సమీకరిస్తున్నారు. మసీదులలో మౌల్వీలు ‘జిహాద్’ ప్రాముఖ్యతను భోదిస్తున్నారు. హిందువులు యక్షగానాల రూపంలో ధర్మయుద్ధాన్ని ప్రభోదిస్తున్నారు. ఈ తిరుగుబాట్ల పుణ్యమా అని వెయ్యేళ్ల తరవాత భారతదేశంలో హిందూ ముస్లింల సమైక్యత సాధ్యమయ్యింది. హిందూ, ముస్లిం గంగా, యమునల సంగమం అందర్నీ సంతోష పరిచింది. భవిష్యత్తులో 1920లో గాంధీజీ నిర్వహించబోయే ఖిలాఫత్ ఉద్యమానికి ఈ ఐక్యత ఒక పునాదిగా దోహదపడింది.
ఇంతలో నైజాం సంస్థానంలో భాగమైన ఔరంగాబాద్‌లో అల్లర్లు చెలరేగినై. వాటిని అణచటానికి హైద్రాబాద్ నుండి ఒక సైనిక పటాలాన్ని హైదరాబాద్ రెసిడెంటు అక్కడికి పంపించినారు. మధ్య దారిలోనే ఇంగ్లీష్ అధికారులకు వాళ్ల కింద పనిచేసే సైనికులకు మధ్య గొడవలు బయలుదేరినై. సాయంత్రం ఒక నది పక్కన సంధ్యావందనం, నమాజుల కోసం ఆగిన హిందూ, ముస్లిం సైనికులను అధికారులు అడ్డుకొని ఇది ప్రార్థనలు చేసే సమయం కాదని వెంటనే ప్రయాణం ఆపకుండా కొనసాగించాలని వత్తిడి చేసినారు. చీకట్లో ఆగితే ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని వాళ్ల లోలోపలి భయం. మా మతాచారాలలతో మీరు జోక్యం చేసుకున్నరని సైనికులు నిరసన తెలిపినారు. మరునాడు ఔరంగాబాద్ చేరుకోంగనే మరి కొన్ని పుకార్లు బయలుదేరినై. ఆ పటాలన్నంతటినీ ఔరంగాబాదు నుంచి ఢిల్లీకి పంపి అక్కడ జరుగుతున్న సిపాయిల తిరుగుబాటును అణచటానికి ఉపయోగిస్తారనీ, మొఘల్ చక్రవర్తి బహుద్దూర్ షా జఫర్‌ను బందీగా పట్టుకురమ్మని తమపై ఒత్తిడి చేస్తారని రకరకాల వదంతులు బయలుదేరినై.
ఆ గాలి వార్తలతో సైనికులలో కలవరం మొదలయ్యింది. అప్పటి వరకూ నిజాం ఢిల్లీ పాదుషాకు ఒక సామంతరాజు తప్ప సర్వస్వతంత్రుడు కాదు. హైద్రాబాద్ సంస్థానంలోని నాణాలను కూడా మొగల్ చక్రవర్తి పేరుతోనే చెలామణీలో ఉండేవి. ఘనత వహించిన మొగల్ చక్రవర్తికి వ్యతిరేకంగా పనిచేసే కాఫిర్లంకాదని, ఉత్తరభారతంలో తమ సైనిక సోదరులు చేసే తిరుగుబాటును తామే తమ చేతులతో అణిచివేయమని, హైద్రాబాద్‌లోని తమ కుటుంబాలను, పిల్లలను వదలి నర్మదానదిని, వింధ్యపర్వతాలను దాటి దూరంగా ఉన్న ఢిల్లీకి వెళ్లలేమని ఆ సైనిక పటాలం మొత్తం తిరుగుబాటు చేసింది.
అయితే ఆ తిరుగుబాటును క్రూరంగా అణిచివేసినారు. అందులో కొంత మంది జమేదార్ చీతాఖాన్ నాయకత్వంలో ఔరంగాబాద్ నుండి తప్పించుకుని హైద్రాబాద్ చేరి నిజాం శరణుజొచ్చినారు. నిజాం నవాబు తమని అర్థం చేసుకొని క్షమాభిక్ష ప్రసాదిస్తాడనీ, రక్షిస్తాడని, ఈ నేల మీద సంచరించే ఆ భగవంతుని నీడ అతనేనని ఆ ఆమాయకులు ఆశపడినారు. కాని నిజాం ఎటువంటి కనికరం లేకుండా మీరు నా సేవకులు కాదు ఇంగ్లీషు వారి సేవకులు అని చెప్పి వారందరినీ విచారణ నిమిత్తమై కోఠీలో వున్న రెసిడెంట్‌కు అప్పజెప్పినాడు. వారి పరిస్థితి పెనం నుండి మండుతున్న పొయ్యిలోకి దుంకినట్లయింది. రెసిడెన్సీలోని నేలమాళిగలో బందీలుగా వుండి చిత్రహింసలకు గురవుతున్నారు. ఇంకా విచారణ తేదీలు నిర్ణయించబడలేదు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారు. లోలోపల కుమిలిపోతున్నారు. ఆ రోజు 1857 జూన్ 17. ఖయామత్ కా దిన్ రానే వచ్చింది.
ఆ రోజు శుక్రవారం. పవిత్రమైన మొహర్రం మాసం. అసర్ నమాజుల కోసం మక్కా మసీదులో అందరూ జమ అవుతున్నారు. ఇమామ్ గారి ‘జమాత్’ ఇంకా ప్రారంభం కాలేదు. మళ్లీ అవే రాతలు. అవే పోస్టర్లు. ఈసారి ఏకంగా నిజాంనే నిందిస్తూ పోస్టర్లు. నిజాం, దివాన్ – ఇద్దరూ అంగ్రేజీలకు వెన్నెముక లేని గులామ్‌లని నిందాపూరిత వ్యాఖ్యలు. మరో పోస్టరులో “అల్లా, మహమ్మద్ ప్రవక్త సాక్షిగా జిహాద్ కోసం ఫత్వా జారీ చేయాలని లేకపోతే నిజాం ఏడు తరాలవాళ్లు నాశనం అవుతారని” బెదిరింపులు. “ధైర్యం లేని వాళ్లు గాజులు ధరించి ఇంట్లో మూలకు కూచోవాలని” పరుష వ్యాఖ్యలు. రెసిడెన్సీలో బందీలుగా వున్న చీతాఖాన్‌ని అతని సహచరులని వెంటనే విడుదల చేయాలని నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నై.
నమాజులు అయినంక అక్కడ గుమిగూడిన జన సందోహం నగరంలో, సంస్థానంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా చర్చించింది. చివరికి నలుగురు మౌల్వీల ప్రతినిధి బృందాన్ని నిజాం నవాబు వద్దకు పంపి రెసిడెన్సీలోని చీతాఖాన్, ఇతర బందీల విడుదలకై విజ్ఞప్తి చేయాలని నిర్ణయం జరిగింది. ఆ నలుగురు మౌల్వీల ప్రతినిధి వర్గం అల్లా ఆశీస్సులతో మక్కామసీదు, లార్డ్ బజార్ పక్కనే వున్న ‘చౌ మహల్లా’ నిజాం అధికార నివాసానికి బయలుదేరి పోయినారు. ఆ నలుగురు మౌల్వీలలో సయ్యద్ అల్లా ఉద్దీన్ మౌల్వీ ఒకరు.
ఆయన మొగల్‌పురా నివాసి. మొగల్‌పురా ఆ రోజులల్ల మేధావులకు, కవులకు, కళాకారులకు నిలయం. మొగల్‌పురా కమాన్‌లోపల మసీదు ఈ మౌల్వీ అల్లాఉద్ధీన్ కట్టించిందే. ఆ మసీదు పక్కనే ఆయన నివాసం.
“అయినను పోయి రావలె హస్తినకు” అన్నట్లు ఆ రాయబారం మీద మౌల్వీ అల్లావుద్దీన్‌కు మొదటి నుండి భ్రమలు లేవు. అతనూ అతని దోస్త్ తుర్రేబాజ్ ఖాన్ అనే మరో రోహిల్లా వీరుడు “చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ ముందే పూర్తి చేసుకున్నారు” దెబ్బకు గాని దయ్యం వదలదని వారికి బాగా తెలుసు. వందలాది మంది అనుచరుల వత్తాసు, బేగంబజారు, కోఠీలలో వున్న హిందూముస్లిం షావుకార్ల ఆర్థిక మద్దతూ వారికుంది. ఇంకా దూరదూరంగా వున్న జమీందార్లు, చిన్న చిన్న రాజులు ఆర్థిక, సైనిక సహకారాన్ని అందిస్తామని వాగ్దానాలు చేశారు. పై నుండి నానా సాహెబ్, రావు సాహెబ్ పీష్వా, తాంతియా తోపేల ఆశీర్వాదాలు ఉండనే ఉన్నాయి.
అనుకున్నట్లుగానే రాయబారం విఫలమయ్యింది. వేలాడే ముఖాలతో ముగ్గురు మౌల్వీలు మక్కా మసీదుకు ఉత్త చేతులతో, ఏడుపు ముఖాలతో వాపస్ వచ్చినారు. మౌల్వీ అల్లా ఉద్దీన్ మాత్రం అక్కడికి చేరుకోలేదు. అతను వీరుడు. వీరుల తీరే వేరు.
సమయం సాయంత్రం 4.45.
“అల్లా హో అక్బర్”( God is great ) నినాదాలకి సైదాబాద్ మైదాన్ నుండి మౌల్వీ అల్లా ఉద్దీన్ నాయకత్వంలో తిరుగుబాటు వీరుల సైన్యం బయలుదేరింది. చాలా మంది చేతులలో తుపాకులు, బరిసెలు, తల్వార్లు. అశ్వంపై అగ్రభాగాన వున్న అల్లా ఉద్దీన్ చేతిలో ఆకుపచ్చ పవిత్ర పతాకం. అందులో చాంద్ సితారా గుర్తులు. ఆ పటాలం జయజయనాదాలు చేస్తూ చంపా దర్వాజా, డబీర్‌పురా దర్వాజా, ఢిల్లీ దర్వాజాలను దాటి బేగం బజారు చౌరస్తా చేరుకుంది. దారిలో అనేక మంది ప్రజలు ‘దీన్‌దీన్’ (ఇస్లాం మతం పట్ల విశ్వాసాన్ని ప్రకటించే నినాదం) అని అరుస్తూ పరిగెత్తుతూ వారిని అనుసరించినారు. అప్పటికే బేగంబజార్ చౌరస్తాలో తుర్రేబాజ్‌ఖాన్ తన మూడు వందలమంది దండుతో సిద్ధంగా ఉన్నాడు. ఆ రెండు సైనిక ప్రవాహాలు కలిసిపోయి ఏకప్రవాహంగా మారి గౌలిగుడా, పుత్లీబౌలీల మీద నుండి కోఠీ చేరుకున్నాయి. బ్యాంకు స్ట్రీట్‌లో వున్న షావుకార్లు జయగోపాల్ దాస్ పిత్తీ, అబ్బెన్ సాహెబ్, పెస్తోంజీల బంగ్లాలు తిరుగుబాటుదారులకు ఆశ్రయమిచ్చినై.
జయగోపాల్ దాస్ బంగ్లా మీద తుర్రేబాజ్‌ఖాన్, అబ్బెన్ సాహెబ్ బంగ్లా మీద మౌల్వీ అల్లా ఉద్దీన్‌లు తమ అనుచరులతో చేరి ‘సుబ్హానల్లా’ అని స్మరించి తుపాకుల్ని రెసిడెంటు భవనంపైకి పేల్చారు. సంకుల సమరం మొదలయ్యింది. అల్లాహో అక్బర్ నినాదాలు అంబరాన్ని చుంబిస్తున్నై. మరో రెండు గ్రూపులు రెసిడెన్సీ రెండు గేట్ల ముందు నిలబడి లోపలున్న ముస్లిం, హిందూ స్థానికుల సైన్యాన్ని ఇవతలికి వచ్చి తమతో చేతులు కలపమని అరుస్తున్నై. వారి సహకారం లభిస్తుందని వీరు ఆశించినారు. అనుకున్నట్లుగానే గేటు తీసుకుని ఆశ్వికదళం రిసాల్‌దార్ ఇస్మాయిల్ ఖాన్ ఇవతలికి వచ్చినాడు. కాని అతను వీరితో చేతులు లుపటానికి రాలేదు. లోపల పెద్ద పెద్ద ఫిరంగులున్నాయని వాటి ధాటికి మీరు పిట్లల్లా రాలిపోతారని హెచ్చరించటానికి వచ్చినాడు. మాట వినని తిరుగుబాటుదారులు అతనిపై కాల్పులు జరపగా అతను మళ్లీ లోపలికి పరుగెత్తినాడు. రెండు వైపుల్నుండీ కాల్పుల వర్షం. ఫిరంగీలకు వ్యతిరేకంగా అరుపులు, నినాదాలు ప్రజలు భయంతో ఇళ్ల తలుపులు మూసుకుని పిడుగులు పడుతున్నట్లు తుపాకుల మోతలు విని ‘అర్జునా, ఫల్గుణా’ అని వొణికిపోతున్నారు. చీకట్లు కమ్ముకున్నాయి. అయినా రెండు దిక్కుల నుండి తుపాకులు కాలుస్తూనే వున్నారు.
1857 జూన్ 18 శనివారం సూర్యోదమయ్యింది.
చాదర్‌ఘాట్ వంతెన వైపు నుండి సాలార్‌జంగు పంపిన అదనపు అరబ్బు దళాలు కోఠీకి చేరుకున్నాయి. రెసిడెంటుకు బలం వచ్చింది. కోఠీ కోటలోపలున్న మిలిటరీ సెక్రెట్రీ మేజర్ బ్రిగ్సు ఫిరంగుల్ని సిద్ధం చేయించినాడు. ఈలోగా బ్యాంక్ స్ట్రీట్‌లో వున్న రొహిల్లా వీరులు అజీమ్ అలీఖాన్ ఇంటి గోడను పగులగొట్టి వీధుల్లోకి వచ్చినారు. ముందుకు పరిగెత్తి కోఠీ గేట్లను బద్దలు కొట్టి నిప్పు పెట్టినారు. గేట్లు కూలినై కాని ఏం ఫాయిదా!
లోపల్నుండి మరఫిరంగులు ఆకలిగొన్న సింహాల్లా ముందుకు దూకి గర్జించటం ప్రారంభించినై. కోఠీ చౌరస్తాలో రెండు పిరంగులు నిలుచుని ఒకటి ఇటు బ్యాంక్ స్ట్రీట్ వైపు అటు పుత్లీబౌలీ వైపు మరొకటి మెడలు సాచుకుని గర్జిస్తున్నై. అధర్మ యుద్ధం. ఇటు మరఫిరంగులు అటేమో నాటు తుపాకులు, బరిసెలు, తల్వార్లు. రోహిల్లా వీరులు టపటపా పిట్టల్లాగ కిందికి రాలిపోయినారు. నిప్పుల్లో దూకిన శలభాలై పోయినారు. చనిపోయిన వారిని రోడ్ల మీదే వదిలిపెట్టి గాయపడ్డ వారిని మాత్రం మోసుకుపోతున్నారు. సూర్యోదయమైన తర్వాత కొన్ని క్షణాల లోపలే అంతా ఉల్టాపల్టా అయిపోయింది. కొద్ది మంది అనుచరులతో ఆ ఇద్దరు వీరులు మాత్రమే మిగిలిపోయినారు. ఓటమిని అంగీకరించని తుర్రేబాజ్ ఖాన్ బంగ్లా మీది నుండి ఇంకా కాల్పులు జరుపుతూనే ఉన్నాడు.
అబ్బెన్‌సాహెబ్ ఇంట్లో నుండి మౌల్వీ అల్లావుద్దీన్ ఇవతలికొచ్చి జయగోపాల్ దాస్ బంగ్లా మీద వున్న తుర్రేబాజ్‌ఖాన్‌ని కలిసినాడు. ఒక్క క్షణం ఇద్దరూ ఒకళ్ల కళ్లలోకి ఇంకోళ్లు సూటిగా చూసుకున్నారు. ఇద్దరి కళ్లలోనూ కూలుతున్న కలలే కనబడ్డాయి. అయినా వారి పెదాల మీద ఓడిపోని చిరునవ్వులు.
“మనం ఓడిపోయాం మిత్రమా? వాగ్దానాలు చేసిన మిత్రులంతా ఏరీ? సైన్యాలను పంపిస్తాం అన్నారు. తుపాకుల్ని అందిస్తాం అన్నారు. పైసలు పంపిస్తాం అని నమ్మించినారు. ఏరీ వారంతా ఏరీ?” అని తుర్రేబాజ్‌ఖాన్ ఆవేదనతో బాధగా మౌల్వీ సాబ్‌ను అడిగినాడు.
“నిజమే నిర్మల్ నుండి, కౌలాస్ నుండి, సురపురం నుండి రాజాలు జమీందార్లు అన్ని రకాల సహాయాలను అందిస్తాం అని వాగ్దానాలు చేసినారు. కాని ఆ సహాయం అందలేదు. చివరికి మనిద్దరం మాత్రమే ఒంటరిగా మిగిలినం” విచారిస్తూ అన్నాడు మౌల్వీ.
“మనల్ని వదిలి పారిపోయిన మన అనుచరులది తప్పేం లేదు. వారి మీద నాకు కోపం లేదు. మొండిగా ఫిరంగుల గుళ్లకు బలి కావటం కంటే పారిపోవటమే మంచిది. మనకు మాత్రం ఏం తెలుసు లోపల ఫిరంగులున్నాయని? తుపాకులకు తుపాకులే సమాధానం అనుకున్నాం. కాని చిన్న పామును పెద్ద కట్టెతో కొడతారని మనకేం తెలుసు?” నిజాయితీగా తమ పొరపాటు వ్యూహాన్ని ఒప్పుకున్నాడు ఖాన్ సాబ్.
“సరే మరేం చేద్దాం?” మౌల్వీ నిస్సహాయంగా దీనంగా అడిగినాడు.
“నేను ఇట్లనే ఈ జిహాద్ చేస్తూ ఇక్కడే చనిపోతాను. ఇంక బతికేం లాభం? ఎట్లాగూ ఇది మొహర్రం మాసం. కనీసం అట్లనైనా నాకు పవిత్రమైన చావు లభిస్తుంది” నిర్వేదంగా మాట్లాడినాడు ఖాన్‌సాబ్.
“నీ ఖుర్బానీకి (త్యాగం) ఫిదాయి (బలిదానం)కి సలాం చేస్తాను ఖాన్‌సాబ్! కాని ఈ ఫిరంగీలు నీ శవానికి శాస్త్రప్రకారం అంత్యక్రియలు చేస్తారని లేదా నీ మృతదేహాన్ని నీ కుటుంబానికి అప్పగిస్తారని అనుకుంటున్నావా? పవిత్రమైన చావు లభిస్తుందని ఆశ పడుతున్నావా?”
“మరి?” అయోమయంగా చూసినాడు ఖాన్‌సాబ్.
“అల్లా అనుగ్రహం ప్రకారమే అంతా జరుగుతుంది ఖాన్ భాయి! విచారించకు. మనిషి జన్మ ఎత్తినందుకు మన ధర్మాన్ని మనం నిర్వర్తించినాం. మనుషుల్లా తలెత్తుకొని జీవించినాం. ఫలితం అంతా అల్లాదయ. ప్రస్తుతానికి మనం ఈ నగరం వదిలి ఏ దూర దేశమైనా ప్రవాసం పోదాం. భవిష్యత్తులో కాలం కలిసొస్తే మళ్లీ జిహాద్ చేసి ఈ రక్తాన్ని ఈ వతన్‌కే ధారపోద్దాం” అనునయంగా అన్నాడు మౌల్వీ.
తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి.
“పద. ఇప్పటికే ‘ఫజర్’ నమాజుకు సమయం మించిపోయింది. ఇక్కడే కాసేపు నమాజు చేసుకుందాం” అన్నాడు మౌల్వీ సాబ్.
ఇద్దరూ పడమర వైపు తిరిగి మోకాళ్ల పైకి వంగి కూచొని అంతా మరిచిపోయి నిష్కల్మశంగా, నిష్టగా అల్లాను ప్రార్థించుకున్నారు. తమ దుఃఖాన్ని, వేదనను శుభ్రపరుచుకొని అప్పుడే పుట్టిన నూతన శిశువుల్లా పవిత్రంగా మారినారు. అరచేతులతో ముఖాన్ని అద్దుకున్నారు. కండ్లు తెరిచి మళ్లా ఒకళ్లనొకళ్లు చూసుకొని చిరునవ్వులు నవ్వుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు.
“అల్విదా మౌల్వీ సాబ్” ఖాన్‌సాబ్ కొంచెం శిరసు వంచి కుడిచేయిని కిందికీ పైకి ఊపుతూ మూడు సార్లు సలాం చేసినాడు. సలాం చేస్తూ చేస్తూ వెనకకు నడిచినాడు. వీడ్కోలు సమయంలో పెద్దవాళ్లకు వీపు చూపించటం మర్యాద కాదు.
“అల్లా ఆప్ కో సలామత్ రఖేఁ” దీవించినాడు మౌల్వీ.
ఇద్దరూ విడివిడిగా కాలినడకన గల్లీలల్ల నుండి నడుచుకుంటూ, ఎవరైనా వెంబడిస్తున్నారేమోనని చుట్టుపక్కల గమనిస్తూ బేగం బజారులోని సేఠ్ పూరణ్‌మల్ బంగ్లాకు పోయినారు. ఆ సేఠ్ అప్పటికే రెండు మేలిమి అరబ్బు గుర్రాలను కొంత నగదును సిద్ధం చేసి పెట్టినాడు. వాళ్లిద్దరూ అక్కడే వేషాలు మార్చుకొని సేఠ్‌కు శుక్రియాలు చెప్పి తెలిపి పురానాపూల్ వైపు వెళ్లిపోయినారు.
“అసలైన భూమి పుత్రులు” అంటూ రెండు చేతులూ జోడించి ఆకాశానికి దండం పెట్టినాడు సేఠ్ పూరణ్‌మల్.
* * *
నైజాం ప్రభుత్వం తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పించారని, కుట్రదారులకు ఆర్థిక సహాయం అందించినారని సేఠ్ జయగోపాల్ దాస్‌ను ఆయన కొడుకులను ఇంకా అబ్బన్ సాహెబ్ కుటుంబసభ్యులందరినీ అరెస్టు చేసింది. వారి ఆస్తులను జప్తు చేసింది. అరబ్బు గుండాలు వారి ఇండ్లపై దాడి చేసి సామానుల్ని లూఠీ చేసి వారి భవంతులను నేలమట్టం చేసినారు. ఆ షావుకారుల కుటుంబాలు ‘అన్నమో రామచంద్ర’ అని వీధిన పడ్డాయి. జీవచ్ఛవాలైనారు. నైజాం ప్రభుత్వం మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్‌ఖాన్ తలల మీద వెలలు ప్రకటించి వారిని పట్టిచ్చిన వారికి ఐదు వేల రూపాయల చొప్పున బహుమతి ఇస్తామని తెలియజేసింది.
తుర్రేబాజ్‌ఖాన్ మారువేషంలో బెంగుళూరుకు పోతుండగా మహబూబ్‌నగర్ జిల్లా మొగిలిగిద్ద వద్ద పోలీసులకు దొరికిపోయినాడు. అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి విచారణ జరిపి అతనికి అండమాన్ జైలులో ఒంటరి కొట్టులో యావజ్జీవ శిక్ష విధించినారు. అతనిని అక్కడికి తరలించాలని ప్రయత్నిస్తుండగానే 1859 జనవరి 18న మళ్లా మెరుపుతీగలాగా తప్పించుకున్నాడు. కొద్ది రోజులకే మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో అతని ఆచూకీ దొరికింది. కుర్బాన్ అలీ అనే ద్రోహి ద్వారా అతడిని పట్టుకున్నారు. కాని పోలీసులలో జరిగిన ఘర్షణలో అతను అక్కడే వీరమరణం చెందినాడు.
అతడి మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చి అదే కోఠీచౌరస్తాలో రోజుల తరబడి గొలుసులకు వేలాడదీసినారు. ఉరికొయ్యకు ఊయలలూగిన దేశభక్తుడు తుర్రేబాజ్‌ఖాన్. ఆ వీరుడి శవాన్ని చూసి నగర ప్రజలందరూ అశ్రుసిక్త నయనాలతో, శోకతప్త హృదయాలతో నివాళులు అర్పించినారు.
మౌల్వీ అల్లాఉద్దీన్ మాత్రం బెంగుళూరుకు పారిపోయి మంగళంపల్లి అనే గ్రామంలో తలదాచుకున్నాడు. చివరికి బ్రిటిష్ వారు అతనిని కూడా అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి విచారణ జరిపినారు. కోర్టు కేసు తీర్పు 1858 జూన్ 28న వెలువడింది. అండమాన్‌లో యావజ్జీవ శిక్ష విధించినారు. ఆఖరు మొఘ ల్ చక్రవర్తి బహద్దూర్‌షా జఫర్‌లాగనే ఆ వృద్ధుడు కూడ అక్కడే 1884లో అల్లాకు ప్రియతముడైనాడు. తన జాతి జనులను పెనునిద్దుర నుంచి మేల్కొల్పిన అతను పెను విశ్రాంతిలోకి వెళ్లిపోయినాడు.
ఇది కోఠీల ఉన్న “తుర్రేబాజ్‌ఖాన్‌రోడ్” వీరోచిత విషాధగాధ.
… తరువాత భాగం ఒచ్చే వారం
March 1st, 2010 at 1:25 am
“భారతీయులంతా హిందువులే. హిందువులు కానివారు భారతీయులే కాదు.హిందువు అన్న పదానికి అర్థం మతం కాదు, అది జీవన విధానం.చాణక్యుడు చెప్పిన విషయాలు ఆ కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి గానీ ఆధునిక భారతానికి కాదు.–ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ (సాక్షి 1.3.2010)
ఈ విస్తృత నిర్వచనం ప్రకారం మన భారతదేశంలో జన్మించిన క్రైస్తవ,ముస్లిం భారతీయ సోదరులంతా జన్మతా హిందువులే కదా?భారతీయ ముస్లిములు,క్రైస్తవులు- హిందువులు కాకుండా ఎలా ఉంటారు?
March 1st, 2010 at 6:57 am
హిందువు అన్నపదం వేదాలలో ఉందో లేదో నాకు తెలియదు.భారతీయులంతా హిందువులే అని భాగవత్ గారుఅన్నారు కాబట్టి ముస్లిములు కూడా హిందువులేనా అనే కన్ ఫ్యూజన్ వస్తోంది.ప్రస్తుతం మన అందరినీ సోదరుల్లా కలిపి ఉంచే శక్తి హిందూ అనే పేరు కంటే భారతీయత అనే పేరుకే ఎక్కువ ఉన్నట్లుంది.కానీ భాగవత్ గారు హిందువులు కానివారు భారతీయులే కాదు అంటున్నమాటను ఎలా అర్ధం చేసుకోవాలి?
November 7th, 2011 at 1:26 pm
bhagavath gaaru annadhi adhi kaadu, sariga chadavandi, bharatheeyulantha hinduvule, hinduvulu kaanivaru bharatheeyulu kaadhu ani annadi bhagavath kaadu, chanakyudu, ee yana annadi adhi kevalam aa rojulaku sambandhinchina vaakya kaani nedu adhi paniki radhu ani..
aina bharatha deshanni kalipi unchuthunna shakthi, binnathvamlo ekathvam hinduthvame, andhuke musilmlu ekkuvaga unde pranthallo nithyam kallolame…
http://naatelangaana.blogspot.com/