Feed on
Posts
Comments

19

తిరుగుబాటు వీరుడు తుర్రేబాజ్‌ఖాన్‌ జ్ఞాపకాల విషాదంతో స్వామి కోఠీ చౌరస్త నుండి బయలుదేరి బ్యాంక్‌ స్ట్రీట్‌ల ఉన్న ఫిరోజ్‌గాంధీ పార్క్‌లకు ప్రవేశించినాడు. నరేష్‌, వేణు ఇంక రాలేదు.

ఎదురుగ పిల్లలగుంపు. పదిపన్నెండు సంవత్సరాల మధ్యల ఉన్నరు. పచ్చగడ్డిల ఎగురుతున్నరు. కలకల నవ్వుతున్నరు. గాలికి కదిలే పువ్వుల మాదిరి త్రుళ్లుతున్నరు. రకరకాల ఆటలు ఆడుతున్నరు. గోలగోలగ అరుస్తున్నరు. చెమటలు కారుతున్న వాండ్ల ముఖాలల్ల మిలమిల మెరుస్తున్న కండ్లు. పకపక నవ్వుతుంటే తెల్లగ మెరుస్తున్న పండ్లు. స్వామికి వాళ్లను చూస్తుంటె ముచ్చటేసింది. బాల్యం తనను వదిలిపెట్టి పోయినందుకు దిగులేసింది. మైదాన్‌ల పిసల్‌బండాలు. జూలాలు. తరాజులు. ఇసుకలో కబడ్డీలు. చోర్‌పోలీస్‌, చీనంచానీ, ఉచల్‌ఖూద్‌, ఐమౌట్‌లాంటి ఎన్నెన్నో ఆటలు. రంగు రంగుల లట్టూలు, లాయిలప్పలు, సీసపుగోటీలు, గిల్లీ దండాలు, పిట్టలను కొట్టే గులేర్లు, గిరగిరా గుండ్రంగా తిరిగే చెరక్‌లు, వేళ్లు తెగే మాంజాలు – మాంజలల్ల మళ్లా రకాలు కీంచ్‌కాట్‌ మాంజా, సీసం మాంజా, గీటీ మాంజా. రకరకాల పేర్లతో రంగురంగుల పతంగీలు. ఏక్‌కలం, దోకలం, జీబా, తాగేదార్‌ పతంగీలు. తోటమాలికి తెలియకుండ చెమన్‌లోనికి చొరబడి జింగన్నలను, బొంగన్నలను ఒడుపుగ పట్టుకుని వాటి తోకలకు దారాలు కట్టి గాలిల ఎగరేయడం, వాటి తోకలు తెగిపోతే పచ్చగడ్డి పరుపులు పరిచివాటిని అగ్గిపెట్టలల్ల దాచిపెట్టడం అవి చచ్చిపోతే గుంతలేసి వాటిని బొందపెట్టటం. రోడ్ల మీద పారేసిన రకరకాల సిగరెట్‌ పెట్టెల్ని సేకరించి కత్తిరించి వాటితో పత్తాలాడటం, కూల్‌డ్రింక్‌ సీసాల డక్కన్‌లను ఏరుకుని వాటిని అపురూపంగ దాచిపెట్టడం, రెండు గ్రూపులుగ విడిపోయి కట్టె యుద్ధాలు, కత్తి యుద్ధాలు భారత చైనా, భారత్‌పాకిస్తాన్‌ యుద్ధరంగం వీరంగాలు, తుపాకుల ఆటలు. గాలిమోటరు యుద్ధాలు. గల్లీలల్ల సైకిల్‌ మీద దోస్తులతో డబుల్‌ సవారీలు. అల్లం మురబ్బాలు, శక్కరగోలీలు, కోప్రామిఠాయిలు, చూరన్‌లు, జామూన్‌లు, జామకాయలు.

బాల్యం. సోయి లేకుండనే దోసిలిపట్టిన వేళ్ల సందులల్ల నుండి నీళ్లలాగ జర్రున జారిపోయిన బాల్యం. ఐసుక్రీములాగ కరిగిపోయిన కమ్మని కాలం. బాల్యం ఇప్పుడు ఎంతెంత దూరం. చాలా చాలా దూరం.
“కోయీ లౌటాదె మెరే బితే హుయె దిన్‌”

పొడుగ్గ కట్టిన పల్లీల పొట్లాన్ని చేతులల్ల పట్టుకుని పల్లీలు తింటూ వేణు పార్కులోపలికి ప్రవేశించినాడు. లోపల అగ్నిపర్వతాలు పేలుతున్న పైకి ఏమీ జరగనట్టే ప్రశాంతంగ కనబడుతుంటడు. కాసేపయిన తరవాత అతని వెనకనే నరేష్‌ వచ్చినాడు. ప్రొద్దుట్నుండీ ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నట్లుంది. ముఖం బాగా వాడి జుట్టు రేగిపోయి ఉంది. తిండి ఎప్పుడు తిన్నడో కండ్లు లోపలికి ప్కీపోయి ఉన్నై. బట్టలు బాగ మాసిపోయి ఉన్నై. ముఖం నల్లబడి ఉంది. ఒక వారంలనే ఎంతో తేడా.

‘ఎక్కడ్నుంచీ’ అన్నడు వేణు డైరక్ట్‌గ ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండ.
‘ఉస్మానియా యూనివర్సిటీ నుంచి’ అన్నడు నీరసంగ.
‘అక్కడ నీకేం పని?’ అన్నడు వేణు శ్రద్ధంత పల్లీల మీదనే కేంద్రీకరించి చూపు మరల్చకుండ.
‘అక్కడ కొంత మందిని కలవాల్సి ఉండె’ అన్నడు నరేష్‌.

నరేష్‌ సర్దార్‌ పటేల్‌ కాలేజీల డిగ్రీ స్టూడెంట్‌. ఏ సంవత్సరమో, ఏం కోర్సో తనకు సరిగ్గ తెలియదు. వాళ్ల కుటుంబం గురించి కూడ సరిగ్గ తెలియదు. ఏదేమైనా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఆగిపోయినా అతను మాత్రం ఇంకా ఏదో పనిల బిజీగ ఉన్నట్లు కనబడుతున్నడు. జరుగుతున్న పరీక్షలు కూడ రాస్తున్నట్లు లేదు. తిండి మీద, ఒంటి మీద ధ్యాస ఉండదు కాని కండ్లల్ల మాత్రం మరో ప్రపంచపు కలలేవో కనబడుతుంటై. నెమ్మదిగ ప్రశాంతంగ మాట్లాడుకుంట మాటల మంటల ఈటెలను విసురుతుంటడు. మాటను మంత్రంగ మార్చి వినేవాళ్లను కట్టిపడేస్తుంటడు. ప్రతి పదాన్ని వొత్తి వొత్తి పలుకుతూ వినేవారి కండ్లల్లకు గుచ్చి గుచ్చి చూస్తుంటడు. అతను ఉపయోగించే ప్రతి పదమూ ఎదుటివారి హృదయంలకు సూటిగ దిగుతది. ‘ఉపన్యాసకుడు’ అనటంకన్నా అతను మంచి ‘ఉపదేశకుడు’.

నరేష్‌ స్వామిని చూసి, కళ్లతోనే పలకరించి, నవ్వబోయి నవ్వలేక నీరసంతో కింద గడ్డిల చతికిలబడినాడు. వేణు తన బ్యాగుల నుంచి మంచి నీళ్ల సీసా తీసి అందించినాడు.

‘గటగటా’ ఆ సీసా ఖాళీ అయ్యింది.
ఎంత దాహమో? వేణు తన పల్లీల పొట్లాన్ని పూర్తిగ నరేష్‌ కే అందించినాడు. స్వామి వేణులిద్దరూ బెంచీ దిగి అతని ముందే గడ్డిల కూచున్నరు. నరేష్‌ ఒకొక్క పల్లీనే పొట్టుతీస్తూ నోట్లె వేసుకుంటూ స్వామిని ప్రశ్నార్థకంగ చూసినాడు.
“తిరుగబడు” లాంటి కవిత్వాన్ని జీవితంల నేను మొదటిసారి చదివినాను” అన్నడు స్వామి.
“మహాప్రస్థానం తర్వాత మళ్లా అంతటి పవర్‌ఫుల్‌ పొయెట్రీ తిరుగబడు” అన్నడు వేణు స్వామితో ఏకీభవించుకుంట.
“దానికన్నా ముందే దిగంబరకవిత్వం మూడు సంపుటాలు వచ్చినై. ఆ నేపథ్యం నుండే తిరుగబడు కవితా సంకలనం వచ్చింది” అన్నాడు నరేష్‌.
“దిగంబర కవిత్వమా? అదేమిటి?” అన్నడు స్వామి ఆశ్చర్యంగ.
“అంటే దాన్ని నువ్వు ఇప్పటి వరకూ చదువనేలేదా?” ఈసారి ఆశ్చర్యపోవటం నరేష్‌ వంతు అయ్యింది.
“నేను ఇప్పటి వరకు వచనానికే పరిమితం. కథ, నవలలే నాకిష్టం. ఆ దిగంబర కవిత్వం గురించి విననేలేదు” అన్నడు స్వామి.
“అది మంచిదే కాని దిగంబర కవిత్వం మిస్‌కావడం మాత్రం నేరమే” అన్నడు నరేష్‌ ఒకింత హాస్యంగ.
“సారీ దాని గురించి నాకు ఐడియానే లేదు” అన్నడు స్వామి ఏదో కోల్పోయానన్న భావంతోటి.
“వన్‌ మినిట్‌ నరేష్‌. స్వామికి నిజంగనే దిగంబర కవిత్వం, దిగంబరోద్యమం గురించి తెలువదు. వచనాన్ని మాత్రం చదివినాడు. కవిత్వంలకు ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నడు. స్వామికి మనం సాహిత్యంల దిగంబరోద్యమం గురించి కొంతైనా చెప్పాలె” అన్నడు వేణు.
“ఒకె. ఒకె. ఆ పని నువ్వు చెయ్యి. ఇంతల ఈ పల్లీల పని నేను పడుత” అన్నడు నరేష్‌.
“ప్లీజ్‌ వేణూ” అన్నడు స్వామి అభ్యర్థనగ.

వేణు చంకకు తగిలించుకున్న బ్యాగు క్రిందగడ్డిల పెట్టి కాళ్లుచేతులు ముడుచుకుని సక్లంముక్లం కూచున్నడు. తన కళ్లద్దాల్ని తీసి ఒకసారి దస్తీతోటి శుభ్రంగ తుడిచి మళ్లీ పెట్టుకున్నడు. అరచేతులతో చెంపలను రుద్దుకున్నడు. గొంతు సవరించుకున్నడు.

ఆ గెస్చర్స్‌ను చూసి స్వామి ఫిజికల్‌గ, మెంటల్‌గ అలర్ట్‌ అయిపోయినాడు వేణు దిగంబరోద్యమం గురించి సీరియస్‌గ చెప్పబోతున్నడని.

* * *

1965 ఏప్రిల్‌ నెలల ఒక ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయం. నగరం నడిబొడ్డు మీద ఆబిడ్స్‌ ఒరియంట్‌ హోటల్ల ఒక మూల టేబిల్‌ చుట్టూ కూచున్న ఆరుగురు యువకులు అంత ఇరవై ఇరవై ఐదు వయసు లోపలి వాళ్లు. చాయ్‌ల మీద చాయ్‌లు. సిగరెట్ల మీద సిగరెట్లు. వాడివేడి చర్చల ఆత్మల అంతరంగ మధనాలు. వర్తమాన సమాజపు పోస్ట్‌మార్టం విశ్లేషణలు. కళ్లల్లో కత్తుల ఝళిపింపులు. గుండెలనిండ ఆందోళనా అలజడులు. జనసమ్మర్థపు ఇరానీ హోటల్ల ఆ మూలల వాళ్లదైన ఒక ప్రత్యేక సాహిత్య ప్రపంచం. ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది వరకూ ఆ ఆర్గురూ క్రమం తప్పకుండ అక్కడ కలుసుకుని సాహిత్యం, కవిత్వమే ప్రాణంగ జీవిస్తుంటరు. జ్వలిస్తుంటరు. కవిత్వాన్ని ఆచరణలకు అనువదించి ఆచరించాలని తపిస్తుంటరు.

వాళ్లల్ల ఒకరైన హృషి కేశవరావు తన గంభీరమైన గొంతుతోటి ‘ఈ నెల భారతి మాసపత్రిక ఎవరైనా చదివారా?’ అని ప్రశ్నించాడు.
“మన తెలుగు రచయితలలో స్థబ్దత అన్న వ్యాసం గురించేనా మీరు అడుగుతుంది” అన్నాడు కమ్మిశెట్టి వెంకటేశ్వర్రావు.
“సామాజిక చైతన్యం స్పృహలేని మన తెలుగు రచయితలు, కవుల గురించే ఆ వ్యాసం” అన్నాడు రాఘవాచార్యులు ఆ పత్రికను తను చదివినాను అన్న ధ్వనిని స్పురింపజేస్తూ.

“నేను చూడలేదు – చదవలేదు” అన్నాడు బద్ధం బాస్కరరెడ్డి.

“భారతి పత్రికల ఆ వ్యాసం గురించి మాట్లాడుకోబోయే ముందు ప్రపంచ వ్యాప్తంగ, దేశ వ్యాప్తంగ కవిత్వంల, సాహిత్యంల వస్తున్న పెను మార్పులగురించి నేను కొంచెం వివరిస్త, దయచేసి వినండి” అన్నడు యాదవరెడ్డి ఆఖరి చాయ్‌ గుటక పూర్తిచేసి.

“ప్లీజ్‌ క్యారీ ఆన్‌” అన్నడు మన్‌మోహన్‌ సహాయ్‌.
ఆ ఆర్గురూ సాహితీ బంధువులు, సాహితీ స్నేహితులు.

హృషికేశవరావు స్వస్థలం బందరు. అసెంబ్లీలో స్టెనోగ్రాఫర్‌గ ఉద్యోగం. చక్కటి గంభీరమైన గొంతు. అప్పటికే అతని కవితా సంపుటి “ఉదయించని ఉదయాలు” ప్రచురింపబడింది. యాదవరెడ్డి, బాస్కరరెడ్డి, రాఘవాచార్యులు టీచర్లుగ పనిచేస్తున్నరు. యాదవరెడ్డి సాహిత్య వ్యాసాలు కవితలు పత్రికలల్ల అడపాదడపా దర్శనమిస్తుంటై. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావుకి ఒంగోలు జిల్లా కొత్తపట్నం సముద్రతీరాన ఒక పల్లె. అతనికి కొంచెం నత్తి. బాగ చదువుకొన్నవాడు. అతను “అగ్నిశిఖలు – మంచుజడులు” అన్న కవిత్వాన్ని ప్రచురించినాడు. మన్‌మోహన్‌ సహాయ్‌ ఓ చిరుద్యోగి. ఆ ఆర్గురికి కవిత్వం ఆరోప్రాణం. అందుకనే బాగ దగ్గరైనారు.

“గత దశాబ్ద సాహిత్య కాలాన్ని అంతర్జాతీయంగ, జాతీయంగ పరిశీలిస్తే మన వర్తమాన తెలుగు కవిత్వం, సాహిత్యం నిలవనీరులాగ నిస్తేజంగ మారిందని మనకు తెలుస్తుంది. పదేళ్ల క్రితమే అమెరికాల బీట్నిక్స్‌ కవుల ఉద్యమం బయలుదేరింది. వారిలో ఒకరైన అల్లాన్‌ గాన్స్‌బరీ రాసిన ‘ది హోల్‌’ కవిత్వం చదివి యువత ఉర్రూతలూగింది. అట్లనే బ్రిటన్‌ల యాంగ్రీయంగుమన్‌ల సాహిత్య ఉద్యమం. దాని నాయకుడు జార్జి ఆర్వెల్‌. ఇంగ్లీష్‌ సాహిత్యానికి చుక్కానిగ, దిక్చూచిగ మారినాడు. అక్కడి యువకవులకు ఆదర్శంగ నిలిచినాడు. ఇంక మన బెంగాల్‌లో ‘హంగ్రీయంగు మెన్‌ల’ పొయెట్రీ. బెంగాల్‌ బీద ప్రజల కలలను, కళలను వాళ్లు రికార్డు చేస్తున్నరు. మరి మనం మన తెలుగు కవిత్వం? నేల విడిచి సాము చేస్తుంది. ప్రజలకు వారి కష్టాలకు కన్నీళ్లకు ఆమెడ దూరంల ఉంది” ఆవేదనతో ముగించినాడు యాదవరెడ్డి.

“ఈ నేపథ్యం నుండే మనం భారతి వ్యాసాన్ని పరిశీలించాలి” అన్నడు హృషి కేశవరావు.
వెంకటేశ్వరరావు, మన్‌మోహన్‌లు దీర్ఘాలోచనల నిండా మునిగి ఉన్నరు.
“ఈ నిశ్శబ్దాన్ని నిస్తేజాన్ని మనం బద్దలుకొట్టాలె” అన్నడు బాస్కర్‌రెడ్డి ఆవేశంగ.

“ఈ వర్తమాన సమాజం ఒక దున్నపోతు. దీనికి బాగ షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలె” అన్నడు రాఘవాచార్యులు.
“మర్యాదస్తుల భాషలో కాదు సుమా – చలంగారిలా మాటల మంటల్ని, శ్రీశ్రీలా తుపాకుల తూటాలను విసరాల్సిందే” అన్నడు హృషికేశవరావు కించిత్తు హాస్యధోరణిల.

“సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలంటే ముందు సాహిత్యంల సరికొత్త ఉద్యమాన్ని సృష్టించాల్సిందే” అన్నడు మన్‌మోహన్‌.
చీకట్ల చిరురేఖలు విచ్చుకొంటున్నై. ఆ కొత్తకవుల ఆలోచనలు పెను తుఫానును సృష్టించబోతున్నై. వచ్చే ఆదివారం అందరూ తమ తమ ఆలోచనలతోటి, ప్రణాళికతోటి అదే స్థలంల కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవాలని అనుకొని విడిపోయినారు.
మహా ప్రస్థానంలో మరొక అడుగు ముందుకు వేయబడింది. ఏ వెలుగులకో ఆ ప్రస్థానం !

* * *

ఏ ఆజాదీ జూఠీహై. దేశ్‌కి జనతా బూఖీహై అని నెహ్రూ అన్నట్లుగనే 1965 నాటికి స్వాతంత్య్రానంతర కలలన్నీ కల్లలైనాయి. మూడు పంచవర్ష ప్రణాళికలు పూర్తి కావస్తున్నా, అభివృద్ధి ఫలాలు పేదలకు గగనకుసూమాలే అయినాయి. గ్రీన్‌ రెవెల్యూషన్‌ గ్రామాలల్ల ఆధునిక ధనిక వర్గాన్ని సృష్టించిందే తప్ప దున్నేటోనికి భూమిని ఇవ్వలేదు. భూ సమస్యను పరిష్కరించలేదు. నెహ్రూ మానస పుత్రిక మిశ్రమ ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థ టాటా బిర్లాలకు రాజకీయ నాయకులకు, ఉన్నతోద్యోగ బృందానికి ఊడిగం చేసింది. దరిద్ర నారాయణులు అన్నమో రామచంద్రా అంటున్నరు. నిరక్షరాస్యత, నిరుద్యోగం. చదువుకున్న యువత కన్న ఉద్యోగాల కలలు నేలకూలుతున్నై. గాంధీ పుట్టిన దేశం అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి ఆలవాలమయ్యింది. సంజె కెంజాయ పార్టీల వాళ్లు రంగు మార్చకుండనే దిక్కుమార్చి పోరుబాటను మరిచిపోయి ఎన్నికల ఊబిలో పీకలదాక కూరుకపోయినారు. సాహిత్యంల సర్కారీ కవులు ప్రభుత్వానికి బకాలూదుతున్నరు. నయాగారా కవులు సొక్కిసోలి నీరసించిన జలపాతమైనారు. ఈ భూమిక నుండే దిగంబర కవిత్వ ఉద్యమం ఆవిర్భవించింది. కాలాన్ని శాసించి కాలగమనాన్ని నిర్దేశించింది.

తిరిగి మళ్లీ ఆదివారం. అదే సమయం. అదే స్థలం. నూతనావిష్కరణకు నాంది పలికిన కొలంబస్‌లా, న్యూటన్‌లా, ఐన్‌స్టీన్‌లా నూతనోత్సాహంతో ఆ ఆర్గురు యువకవులు. పరవళ్లు తొక్కే ఉత్సాహ – ఉద్రేకాలు. నూతన చరిత్రను లిఖించ బోతున్నందుకు గుండెల నిండా సంతోషాలు.

“మన లోపలి ఆందోళనను, అలజడిని, కోపాన్ని పెద్దఎత్తున కవిత్వ రూపంల ప్రకటించాలి. మన కలంపేర్లు, మన ఉద్యమం పేరు, మన వ్యక్తీకరణ పద్దతీ, పద ప్రయోగాలు ప్రతిదీ కొత్తగా ఉండాలి” అని నాందీ ప్రస్తావనగ హృషీకేశవరావు సూచించినాడు.

“మనం ఆరుగురం ముందు మనిషిని ప్రేమించాలి. మంచికోసం, మనిషిలోని నిజమైన నిప్పులాంటి మనిషికోసం, కపటంలేని చిరునవ్వులు చిందే సమాజంకోసం మన కలాలను, గళాలను విప్పి నింగిని నేలను ఏకం చేయాలె” అని ఆవేశంగ రాఘవాచార్యులు చెప్పినాడు.

“ఈ దొంగనోట్ల దొంగవోట్ల రాజకీయ సంస్కృతిని మన కవిత్వంల ఎండగట్టాలె” అని భాస్కర్‌రెడ్డి మెరుస్తున్న కళ్లతో మాట్లాడినాడు.
ఆగండాగండాగండి అని నత్తినత్తిగ ఉక్కిరిబిక్కరిగ వెల్లువయ్యే సంతోషంతో కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అడ్డమొస్తూ “మన ఉద్యమానికి మంచి పేరు నిర్ణయించాను” అన్నడు.

“ఏం పేరు?” అని అందరూ ముక్తకంఠంతో ఆత్రుతగ అడిగినారు.

“దిగంబర కవులు, దిగంబరోద్యమం” దిక్కుల్నే వస్త్రాలుగా ధరించి ఈ సమాజం యొక్క నగ్న స్వరూపాన్ని, నగ్న సత్యాల్ని మన కవిత్వం ద్వారా లోకానికి వెల్లడి చేయాలి అన్నడు వెంకటేశ్వేరరావు. అందరూ సంతోషం పట్టలేక ‘హే’ అని అరచి చప్పట్లుకొట్టినారు. ‘ఛే’ ‘చాయ్‌లావ్‌ అని యాదవరెడ్డి ఆర్డరిచ్చి దిగంబరోద్యమానికి’ స్వాగతం పలికినాడు.

సరే ఇప్పుడు ఎవరి కలంపేర్లను వారే ప్రకటించుకోవాలి. మన కలం పేర్లన్నీ కుల చిహ్నాలుగా ఉండరాదు అని మన్‌మోహన్‌ కొత్త విషయాన్ని ప్రతిపాదించినాడు.

“ఓకే ఓకే”
అని అందరూ దీర్ఘాలోచనలో పడి, చాయ్‌ చప్పరించసాగినారు. కాసేపయిన తరవాత రాఘవాచార్యులు తన కుడిచేతి పిడికిలి బిగించి పైకి లేపి నా పేరు ఈ క్షణం నుండే ‘జ్వాలాముఖి’ అన్నడు. ఆ పేరుకు అందరూ హర్షామోదాలు తెలిపినారు.
నా పేరు ‘నగ్నముని’ అన్నాడు హృషి కేశవరావు.
నా పేరు ‘నిఖిలేశ్వర్‌’ అన్నాడు యాదవరెడ్డి
నాపేరు ‘మహాస్వప్న’ అన్నాడు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు
నా పేరు భైరవయ్య అన్నాడు మన్‌మోహన్‌ సహాయ్‌. వారి మధ్య ఆనందాల హరివిల్లులు వెల్లివిరిశాయి.
అందరూ బద్దం భాస్కరరెడ్డి వైపు ప్రశ్నార్థకంగ చూసినారు.
“నాక్కొంచెం సమయం కావాలె” అన్నడు భాస్కరరెడ్డి.

బద్దం భాస్కరరెడ్డిది విలక్షణమైన వక్తిత్వం. స్వచ్ఛమైన తెలంగాణా పల్లెటూరు పిల్లగాడు. అతను ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాల అంకుశాపురం గ్రామంల జన్మించినాడు. బాల్యంల అతనిపేరు బాలనర్సింహ. బడిల చితకబాదే పంతుళ్లకు భయపడి తోటల వెంబడి, దొడ్ల వెంబడి, గొడ్లు కాసే పసులకాపర్ల వెంబడి తిరుగుతూ ప్రకృతి ప్రేమికుడైనాడు. ఆ వీధిబడి నాల్గవ తరగతి వరకే పరిమితం. ఐదవ తరగతి చదువుకోసం పక్కూరికి పోవాలె. పేదరికంతో అమ్మానాయినలు పై చదువుకు పంపలేదు. తనే పోయి ఆ బడిల షరీకైనాడు. అక్కడ పెద్ద పంతులు అతడి పేరును భాస్కర్‌రెడ్డి అని పొరపాటుగ రాసినాడు. అదే పేరు నిలిచి పోయింది. అక్కడి చదువు మీద అతనికి మక్కువ కలిగింది. చదువుమాని గొడ్లకాడికి పోవాలని ఇంట్ల తిట్లు కొట్లు. అలిగి అన్నం బందు చేసి బడికి పోయేటోడు. రెండూ మూడు రోజుల్నుండీ తిండిలేదు. నిరహారదీక్ష చేస్తే వాళ్ల మనస్సు మారుతదని అతని ఆశ. మూడో రోజు కాలినడకన బడి నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే కండ్లు తిరిగి శోషవచ్చి కిందపడిపోయినాడు. పెద్దన్న వచ్చి సైకిల్‌ మీద ఇంటికి మోసుకపోయినాడు. అట్ల నిరాహారదీక్ష సాగించి చదువుసాధించినాడు.

ఎద్దుతోపాటు కాడి మెడమీద వేసుకుని దుక్కిదున్ని ఎంత కష్టపడినా పూటగడవడమే కష్టమైన పేద రైతు కుటుంబంల పుట్టిన అతనికి అన్నం కరువైనా పాటలకు మాత్రం కరువులేదు. వాళ్ల నాయిన శివారెడ్డి పాడేపాట అతని గుండెలల్ల గూడుకట్టుకుని నిలిచిపోయింది.

“ఏటి కేతం బెట్టి
ఎయి పుట్లు పండించి
ఎన్నడూ మెతుకెరుగరన్నా
గంజిలో మెతుకెరుగరన్నా”

ఆ పాట అతడిని జీవితాంతం వెన్నాడింది వేధించింది. ఇక అమ్మనోట విన్న పాటలకు అంతు లేదు. పాటల బాటల పెరిగిన అతనికి పాట అన్నా పాటకజనం అన్నా ప్రాణంతో సమానం. హైస్కూలుకు వచ్చేసరికి శరత్‌, ఠాగోర్‌లు అభిమాన రచయితలైనారు. శాంతినికేతన్‌ల చదువుకోవాలని, కళలను, సాహిత్యాన్ని ఔపోసనబట్టాలని కలలు కన్నడు. ఇంట్లో చెప్పకుండ కలకత్తాకు దెంకపోయినాడు. శాంతినికేతన్‌ల తేలినాడు. భాగ్యవంతుల పిల్లలకు మాత్రమే అక్కడ చదువు దొరుకుతుందని తెలిసి ఇంటికి తిరుగుముఖం పట్టినాడు. చదువుపట్ల మమకారం తగ్గలేదు. హెచ్‌.యస్‌.సి. పాస్‌ కాంగానే చౌటుప్పల్‌ల టీచర్‌ ఉద్యోగం దొరికింది. కొంతకాలం తరవాత హైద్రాబాద్‌కు బదిలీ చేయించుకొని ఉదయం పూట ఉద్యోగం చేస్తూ సాయం కళాశాలల పైచదువులు చదివినాడు. పట్నం వచ్చినా పేదరికమే. అప్పటికే వివాహితుడు. ఇంటి అద్దె పదిహేను రూపాయలు. పెద్ద భారం. సైకిల్‌ మీదనే ఉద్యోగానికి కాలేజికి పోయొచ్చేటోడు. తోటి టీచర్లంత చిట్టీల బిజినెస్‌లు, ట్యూషన్‌లు చెప్పుకొంటుంటే ఇతను మాత్రం కవిత్వంకోసం, ప్రజలకోసం, సమాజంకోసం తపించేటోడు. ఆధిక వడ్డీలతో లభించే అప్పులతో బతకలేని బడిపంతులుగ జీవించేటోడు.

ఒక రోజు నుమాయిష్‌ల యాదవరెడ్డి కనిపించినాడు. బడిల చదువుకొనే రోజులల్ల అతను తనకన్నా సీనియర్‌. అప్పటికే కవితలు రాస్తుండెటోడు. తను నగరానికి వచ్చిన తరవాత పత్రికలల్ల అతని వ్యాసాలు, కవితలు చదువుతున్నడు. చల్లని సాయంకాలం ఆ మాయాబజారుల భయపడుతనే తను అతనిని పలకరించి తనని తాను పరిచయం చేసుకున్నడు. సాహిత్యమే పునాదిగ ఇద్దరికీ గట్టి దోస్తీ కుదిరింది. యాదవరెడ్డి తనను అరిపిరాల విశ్వానికి పరిచయం చేసినాడు. ప్రతి ఆదివారం వారింట్లో జరిగే సాహిత్య సమావేశాలకు హాజరు కావటం, కవిత్వం వినటం, రాయటం, చదవటం ప్రారంభమయ్యింది. అక్కడే హృషి కేశవరావు, రాఘవాచార్యులు పరిచయం అయినారు. వారిద్దరూ యాదవరెడ్డికి పూర్వ స్నేహితులు. కుందుర్తిగారి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ వచన కవితా ఉద్యమం కూడ ఆయనను బాగ ప్రభావితం చేసింది. కవిత్వాన్ని కేవలం కవిత్వం కోసమేగాక దాన్ని పదునైన ఆయుధంగ మార్చి సమాజరుగ్మతలను దూరం చేయాలన్న తపనతో యువకవులందరూ తమ చర్చావేదికను ఆబిడ్స్‌ల ఒరియంట్‌ హోటల్‌కు మార్చినారు. అక్కడే ఆ ఆరుగురికి విడదీయరాని స్నేహం ఏర్పడి కొత్త వెలుగులకు దారితీసింది.

తన కలంపేరు నిర్ణయించుకోవటానికి భాస్కర్‌రెడ్డి చాలా రోజులు ఆలోచించినాడు. తన గత జీవితమంతా నెమరేసుకున్నడు. తన కష్టాల కడగండ్ల జీవితం కండ్ల ముందు సాక్షాత్కరించింది. రెక్కాడితే గాని డొక్కనిండని తమ పేదరికం. తన నాయిన శివారెడ్డి గుండెల నుంచి చీల్చుకుని వచ్చిన పాట “ఏటికేతం బెట్టి ఎయి పుట్లు పండించి” అతడ్ని వెంటాడి వేధించసాగింది. చదువుకోసం తన తండ్లాట. ఉప్పులు ఉపోషాలు, తిట్లు కొట్లు. గతించని జ్ఞాపకాల గాయాలు మళ్ల సలపరించసాగినై. అతను హఠాత్తుగ తన పుట్టుకలకు వెళ్లిపోయినాడు. తన పురాగాథలోకి వెనక్కి ఇంకా వెనక్కి నడుస్తూ వెళ్లిపోయినాడు. అమ్మ చెప్పిన జ్ఞాపకాల్ని నెమరేసుకున్నడు. తనని కనడం కోసం అమ్మ పడిన పురుటినొప్పుల ప్రసవవేదన. ఆ వేదన పది పదిహేను రోజులపాటు అట్లనే కొనసాగిందట. అమ్మకు వచ్చే ప్రాణం, పోయే ప్రాణం. పెద్ద ప్రాణానికే గండం దాపురించింది. ఆ నొప్పుల్ని చూసి భరించలేక ఎంతటి గట్టి పిండమో అని ముసలమ్మలు ముక్కు మీద వేలువేసుకున్నరట. ఇక లాభంలేదని అమ్మరెండు చేతులు దూలానికి కట్టి ఆమెను కోదండం వేయించినారు. అప్పుడు తను భూమ్మీద పడ్డాడట. పదిపదిహేను రోజులు బాధపెట్టి, చెరపెట్టి పుట్టినాడు. కావున ఎవరో “చెరబండరాజు” అని పిలిచినారట. ఆ పేరు గురించి తనకు ఎన్నోసార్లు అమ్మనాయినలు కథలు కథలుగ చెప్పినారు. చెరబడ్డరాజు అని ఒకరంటే కాదు చెరబండరాజు అని మరొకరు అనేవారట.

‘ఆ నిశీధి నిద్రాణ సమయంలో మానిసి మేల్కాంచినాడు’ అన్నట్లు బాస్కరరెడ్డి తటాలున తన కలం పేరు నిర్ణయం చేసుకున్నడు. తృప్తిగ గుండెల నిండ గాలిపీల్చి ఆ రాత్రి హాయిగ నిద్రపోయినాడు. ఆ తర్వాత వచ్చిన ఆదివారం సాయంత్రం ఓరియంట్‌ హోటల్ల తన మిత్రులందరికీ తన జన్మవృత్తాంతపురాగాథను పూర్తిగ వివరించి ఇక నుండి తన కలం పేరు “చెరబండరాజు” అని ప్రకటించినాడు. అందరూ అర్ద్రమయిన హృదయాలతో తమ సమ్మతిని తెలిపినారు. ఆ దిగంబర కవులు ఆరుగురూ తమ కొత్త పేర్లతో దిగంబరోద్యమానికి శంఖారావం పూరించినారు.

దిగంబరోద్యమం మొదటి సంపుటి 1965 మే 6వ తేదీ అర్థరాత్రి హైద్రాబాద్‌ల నాంపల్లి పాండు అనే రిక్షా పుల్లర్‌తో ఆవిష్కరింపజేసినారు. అధొజగత్‌ సహోదరులే తమ కవిత్వానికి మూలస్తంభాలని దిక్కులు పిక్కటిల్లేలా ప్రకటించి సంచలనం సృష్టించినారు. ‘మనిషి కోసం తపన పడి అతని కోసం వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చెత్తి ప్రవచించిన కవిత’ అని తమ మొదటి సంపుటిల తెలియచేసినారు. ఈ కుష్టు వ్యవస్థను నాశనం చేయడమే మా లక్ష్యం అని ప్రకటించుకున్నరు. మొదటి సంపుటిలనే చెరబండరాజు “నన్నెక్కన్విండి బోను” అని పవర్‌ఫుల్‌ కవిత్వం రాసి సత్యం వైపే సాక్ష్యం పలికినాడు.

రెండవ సంపుటి 1966 డిసెంబర్‌ 8వ తేదీన విజయవాడల జంగాల చిట్టి అనే హోటల్‌ క్లీనర్‌తోటి ఆవిష్కరిపంచేసినారు. ఈ రెండో సంపుటం మూఢ విశ్వాసాల మీద దొంగ బాబాల మీద పీఠాధిపతులపైన యుద్ధం ప్రకటించింది.

మూడవ సంపుటిని 1968 సెప్టెంబర్‌ 14వ తేదీ అర్థరాత్రి 12 గంటలకు విశాఖపట్టణంల యడమనూరి యశోద అనే ఇరవై సంవత్సరాల వేశ్యచేత ఆవిష్కరింపచేసినారు. ఈ మూడో సంపుటి స్పష్టంగ తమ కవిత్వ బాణాలను ప్రభుత్వం మీద ఎక్కుపెట్టి ప్రజలను తిరుగుబాటుకు సిద్ధంకమ్మని పురికొల్పింది.
మానవత్వం రెండు కండ్లు మూసుకుని గాఢనిద్రల ఉన్నపుడు త్రినేత్రం తెరుచుకుని రుద్రనేత్రంగ మారి ప్రజలను పెనునిద్దుర నుండి మేల్కొల్పిందే దిగంబరోద్యమం. ఆ ఆరుగురు దిగంబర కవులు తమ పదునైన కలాలను కత్తులుగ ఝళిపించి దిక్కులను, దిగంతాలను ఒక ఊపు ఊపినారు.

దిగంబరోద్యమం గురించి సుదీర్ఘంగ వివరించిన వేణు మౌనసముద్రంగ మిగిలిపోయినాడు. అలసటతో పచ్చికల వెల్లకిల పండుకుని ఆకాశం దిక్కు దృష్టి సారించినాడు. మళ్లా మరోసారి మంచినీళ్లు తాగిన నరేష్‌ గొంతు సవరించుకుని మాట్లాడటం ప్రారంభించినాడు. ‘ప్రజల గుండె చప్పుళ్లను పట్టించుకునే యువకవులకు దిగంబర కవిత్వం ఒక ధిక్కార స్వభావాన్ని అలవాటు చేసింది. తెలుగు కవిత్వంల పేరుకుపోయిన జడత్వాన్ని స్తబ్దతను బద్దలుకొట్టింది. కాని ప్రజలకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని, గమ్యాన్ని, చూపెట్టలేకపోయింది. ఆ లోపాన్ని 1969 డిసెంబర్‌ల వరంగల్‌ యువకవులు ‘తిరుగబడు’ కవితా సంకలనాన్ని ప్రచురించి పూరించినారు. వసంతకాల మేఘ ఘర్జనలను సృష్టిస్తున్న నక్సల్‌బరీ శ్రీకాకుళం వైపు తమ కవిత్వాన్ని మార్గనిర్దేశనం చేసినారు” అన్నడు నరేష్‌.
స్వామి కళ్ల ముందు కొత్త లోకాల తలుపులు తెరుచుకుంటున్నై.

* * *

1970 జనవరి చివరివారంలో పి.యు.సి. ఫలితాలు వచ్చినై. స్వామి పాసైనాడు. డిగ్రీ అడ్మిషన్లు మళ్లీ జూన్‌, జూలై నెలలో ఉంటై. అప్పటి వరకూ తను స్వేచ్ఛా విహంగమే. సుదీర్ఘ మైన ఆటవిడుపు.

ఒక రోజు పోస్టుల నరేష్‌ దగ్గర్నుండి స్వామికి ఒక కవర్‌ వచ్చింది. స్వామి ఆత్రంగ ఆ కవర్‌ చింపినాడు. ఒక పెద్ద ఉత్తరం. దానితోటి పాటు ఒక కరపత్రం. ఆ కరపత్రం శీర్షిక “రచయితలకు సవాల్‌”

“రచయితలారా, కళాకారులారా మీరెటు వైపు?” ఆ కరపత్రాన్ని ఎవరు, ఎప్పుడు వేసినారో తెలుసుకుందామని స్వామి దానిని త్రిప్పి వెనుకవైపు క్రింద చూసినాడు. “విశాఖ విద్యార్థులు” తేదీ 1-2-1970 అని ఉంది. ఆ కరపత్రాన్ని పక్కనపెట్టి ముందు నరేష్‌ రాసిన ఉత్తరాన్ని చదవసాగినాడు.

ప్రియమైన స్వామీ!

చరిత్ర రథచక్రాలు జగన్నాధుని రథచక్రాల లాగే చాలా వేగంగ కదులుతున్నట్లనిపిస్తుంది. పుడమి తల్లి పురుటి నొప్పులతోటి ఈ నేల అతులాకుతలం అవుతున్నట్లనిపిస్తుంది.

ఆ రోజు మనం … ఫిరోజ్‌గాంధీ పార్కుల దిగంబరోద్యమం గురించి, దాని నేపథ్యం గురించి వరంగల్‌ యువవులు కవితా సంకలనం తిరుగబడు గురించీ మాట్లాడుకున్నం కదా! ఆ పరంపరల భాగంగనే విశాఖ విప్లవ విద్యార్థులు చరిత్ర రథచక్రాలను మరొక్క త్రోపు తోసి ముందుకు తీసుకుపోయినారు.
మొన్న శ్రీశ్రీకి షష్ఠిపూర్తి సభ 1-2-1970న విశాఖపట్టణంల జరిగింది. ఆ సభ తెలుగుభాషా సాహిత్య చరిత్రనే కాక రాజకీయ చరిత్రనూ ఒక మలుపు తిప్పుతుందని కొంత మంది మిత్రులం ముందే ఊహించినాం. చరిత్ర నిర్మాణంల మనం కూడ భాగస్వాములమవుదాం అన్న ఆలోచనతోటి నేను మరికొంత మంది వరంగల్‌ విద్యార్థులం విశాఖపట్నానికి పోయినం.

అక్కడికి జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, వరవరరావు కూడ వచ్చినారు. అక్కడి విద్యార్థులు తాము ప్రచురించిన కరపత్రాన్ని ఆ సభల చదివినారు. రచయితలల్ల పేరుకపోయిన స్థబ్దతను వారు ప్రశ్నించినారు. దేశం గుండెచప్పుళ్లకు, జనజీవన కష్టాలకు, కడగండ్లకు రచయితలు, కవులూ, కళాకారులూ స్పందించనవసరం లేదా? సాహిత్యాన్ని సమాజ మార్పుకు ఒక సాధనంగ, ఆయుధంగ సృష్టించరా? అని అనేక రకాల సవాళ్లను విసిరినారు. రచయితలందరినీ నిలదీసినారు. శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటంల అమరుడైన విప్లవకవి సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వాన్ని అనుసరించి మరో ప్రపంచం కోసం సాహిత్యాన్ని మలుపుతిప్పాలని రచయితలను హెచ్చరించినారు. మహకవి శ్రీశ్రీ కూడ వారి పిలుపుకు స్పందించినాడు.
ఆ మరునాడు ఫిబ్రవరి రెండున శ్రీశ్రీ అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. రక్తాన్ని సలసల మరిగించే కవితలు చదివినారు. త్వరలోనే సాహిత్య ధోరణులల్ల పెనుతుఫాను రాబోతుందని నేను ఊహిస్తున్న. నీ పరిశీలనకోసం ఈ కరపత్రాన్ని ఉత్తరానికి జత చేస్తున్నాను.

మనం కలలుగన్న ప్రత్యేక తెలంగాణా విద్రోహానికి గురైంది. అయినా ఎత్తిన జండా దించకుండా పోరాటాన్ని ఆపకుండా మరో ఉన్నత సమాజంకోసం కృషిచేయాలని ఆశిస్తూ…

నీ
నరేష్‌

ఉత్తరంల నరేష్‌ చెప్పినట్లు కాల చక్రాలు వడివడిగనే నడిచినై. వీటన్నింటికీ స్వామి సాక్షిగ నిలిచినాడు. ఆ తరవాత నాలుగు నెలలకు జులై నెలల హైద్రాబాద్‌ల సెవెన్‌ స్టార్స్‌ సిండికేట్‌ అనే సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీకి సన్మానం చేసి పర్సు బహుకరించాలని నిర్ణయించింది. ఆ సత్కార్యం వెనుక ఏలిన వారి ఆశీస్సులు, ఆ మహాకవిని పట్టుశాలువా, పూలదండలు, పొగడ్తలతో కుదించి మరుగుజ్జును చేసే కుతంత్రమూ ఉంది.

ఆ సదస్సును, సన్మానాన్ని, బహిష్కరించాలని ఉస్మానియాకు చెందిన విప్లవ విద్యార్థులు, వరంగల్‌ విద్యార్థులు, రచయితలు, కవులు, కళాకారులు శ్రీశ్రీకి విజ్ఞప్తులు చేసినారు. ప్రజలు విప్లవ సాహిత్యాన్ని కోరుకుంటున్నరని కొడవటిగంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథశాస్త్రి లాంటి పెద్దలు దిశానిర్దేశనం చేసినారు. చివరికి శ్రీశ్రీ ప్రజాకవుల పక్షమే నిలిచినాడు. దిగంబరకవులను, వరంగల్‌ ‘తిరుగబడు’ కవులను, కరీంనగర్‌ ‘విద్యుల్లత’ కవులను, ఇంకా ఇతరులకు కలుపుకొని విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది.

నాంపల్లి హోటల్‌ ఇంపీరియల్ల అర్థరాత్రి వరకూ అనేక మంది చర్చలు జరిపిన తరవాత 1970 జులై నాలుగన విరసం జన్మించింది.
ఆ జూలై నాలుగు జనగామ జిల్లా కడివెండిల దొడ్డి కొమరయ్య నేలకొరిగి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికిన రోజు.
ఆ జూలై నాలుగు అమెరికా స్వాతంత్య్రాన్ని సాధించిన రోజు.

విప్లవ రచయితల సంఘానికి శ్రీశ్రీని అధ్యక్షునిగ ఎన్నుకున్నరు. దేశానికి అధ్యక్షుడు కావటం కన్న విరసానికి అధ్యక్షుడు కావడమే తనకు గర్వంగ ఉందని ఆయన ప్రకటించినాడు. దిగంబర కవులల్ల భైరవయ్య, మహాస్వప్న మాత్రం విరసానికి దూరంగ ఉండిపోయినారు.

ఒకరోజు సాయంత్రం వేణు చుక్కతెగిపడ్డట్టు శాలీబండాల స్వామి ఇంటికి వచ్చినాడు. అతని రాక స్వామికి ముందు ఆశ్చర్యాన్ని తర్వాత ఆనందాన్ని కలిగించింది. ఆకస్మాత్తుగ అనుకోకుండ వచ్చిన స్నేహితుని రాక స్వామిని ఉక్కిరిబిక్కిరి చేసి చక్కిలిగింతలు కలిగించింది. కాని వేణు ఎందుకో ముభావంగ ఉన్నడు. ఏదో పెద్ద సంగతే ఉందని ఊహించిన స్వామి అంగీలాగూ వేసుకొని వేణుతో నడుస్తూ లాల్‌ దర్వాజా మోడ్‌ల ఉన్న ఆనంద్‌ మిల్క్‌ బండార్‌కు పోయినాడు. తియ్యని చిక్కటి మీగడ పాలల్ల ఫైన్‌ బిస్కట్లు ముంచుకుని తిన్న తర్వాత స్వామి వేణు ముఖంలకు నింపాదిగ చూసినాడు.
‘స్వామి నీకో సంగతి చెప్పాలె. సంతోషంతో కూడిన విషాదం’ అన్నడు వేణు తలదించుకుని.

‘ఏంటది వేణూ’ అన్నడు స్వామి గుండెలదురుతుంటే ఉంటే.
‘నాకు కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంటు ఫండ్‌ శాఖల ఉద్యోగం వచ్చింది.’
‘హుర్రె’ అని గట్టిగ అరిచి “ఇది విషాదవార్త ఎట్లయితది వేణూ! సంతోషమైన వార్తే కదా’ అన్నడు స్వామి.

‘ఉద్యోగం ఇక్కడ కాదు. గుంటూర్ల కనీసం మూడు నాలుగేళ్లయినా అక్కడే పనిచేయాలె. చిన్న చిన్న తమ్ముళ్లు, చెల్లెళ్లు. అమ్మ అనారోగ్యం. నీలాంటి మంచి సాహితీ మిత్రుల ఎడబాటు’ చెప్పసాగినాడు వేణు.

‘నిజమే వేణూ, కాని కేంద్ర ప్రభుత్వంల ఉద్యోగం కదా. అసలే ఉద్యోగాలు లేని గడ్డురోజులు’ సాలోచనగ అన్నడు స్వామి.
‘నిజమే తప్పదు. పోవాలె. కాని దీన్ని మించిన మరొక సంగతి ఉంది’ అన్నడు వేణు విచారంగ.

‘మళ్లీ అదేంది?’ అన్నడు స్వామి ఆందోళనగ.
‘నరేష్‌’ అని మాటలు రాక ఆగిపోయినాడు వేణు.
‘ఏమైంది నరేష్‌కు? మొన్న నాకు లెటరు కూడ రాసినాడే’ అన్నడు స్వామి ఆత్రంగ.
వేణు చెప్పసాగినాడు. అతను చెప్తున్నంత సేపు స్వామి రెప్పవాల్చకుండ చూసుకుంట వినసాగినాడు.

నాకు ఉద్యోగం వచ్చిన వార్త నిన్ననే తెలిసింది. సంతోషం పట్టలేక ఆ వార్తను ముందు నరేష్‌కే చెప్పాలని ఉత్సాహంగ వారింటికి పోయిన. నేను పోయేసరికి వాళ్ల ఇల్లంత నిశ్శబ్దంగ ఉంది. నా మనస్సేదో కీడును శంకించింది. నన్ను చూడంగనే వాళ్లమ్మ బోరుమని ఏడవసాగింది.

ఇంతల వాళ్ల నాన్న లోపలి నుండి నేనున్న గదిలోకి వచ్చినాడు. నన్ను చూడంగనే కోపంతోటి కంపించిపోయినాడు. “గెటవుట్‌. ముందు అవతలికి పో” అని గట్టిగ అరిచినాడు. ఒక్కసారే నేను బెదిరిపోయినాను.
‘ఏమయ్యింది?’ అని వొణుకుతున్న గొంతుతోటి అడిగిన.

‘ఏం కావాలె? ఇంకేం కావాలె? నీలాంటివాళ్ల స్నేహాలు, పుస్తకాలు, మీటింగులే మా కొంప ముంచినై. మా వాణ్ణి మాకు దూరం చేసినై’ అన్నాడు గట్టిగ అరుచుకుంట.

నాకేదో స్ఫురించింది. నాకు నరేష్‌ కనబడక దాదాపు వారం రోజులవుతుంది. వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నడో, ఏం చేస్తున్నడో, ఎవర్నెవర్ని కలుస్తున్నడో నాకు కూడ తెలువదు.

అంతలనే వాళ్లమ్మ ఏడుచుకుంటనే విషయమంత చెప్పింది. నరేష్‌ ఒక ఉత్తరం రాసి ఇంట్ల పెట్టి పోయినాడట. తను ప్రజలకోసం ప్రజలల్ల కలవటానికి పోతున్ననని, మళ్లీ కనబడనని, తనకోసం వెదకవద్దని, తనను క్షమించమని ఆ ఉత్తరం రాసినాడట.

విషయమంతా చెప్పి వేణు నిట్టూర్చి ‘నరేష్‌ అట్లా వెళ్లి ఉద్యమంల చేరుతడని నేను కూడ ఊహించలేదు, స్వామీ!’ అన్నాడు వేణు విచారంగ తలవంచుకుని.
ఆ మాటలు వినంగనే స్వామికి షాక్‌ కొట్టినట్లయ్యింది. వేణు ముఖం ఎందుకు చిన్నబోయి ఉందో అప్పుడు అర్థం అయ్యింది. నరేష్‌ ఇక తమకు ఎప్పుడూ కనబడడన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నడు. అయినా నరేష్‌ అంటే తనకు ఏదో గౌరవభావం ఏర్పడుతుంది. ప్రజలకోసం పనిచేయటానికి వెళ్లిన అతను నిజమైన ప్రజల మనిషిగ కనబడుతున్నడు.

ఇంక. వేణు కూడ తనకు దూరం అవుతున్నడు. అది కూడ భరించలేని వేదనే. బ్రతుకు బాటల మీద విడిపోతున్న, దూరమవుతున్న స్నేహాలు. ఇక గడిచిన స్నేహాలకు గ్యారంటీ లేదు. ఆ రోజులు మళ్లీ రావు. స్వామికి హఠాత్తుగ జెఫ్రీ ఆకాలమరణం జ్ఞాపకం వచ్చింది. మట్టిమనిషిగ మారిన అశోక్‌. యంత్రాల మధ్య మరమనిషిగ మారిన గోపి గుర్తొచ్చినారు. ఆ ముగ్గురి ఎడబాటు ఇంకా పచ్చిగ ఉండంగనే మళ్లా ఈ దెబ్బ. దూరమైన నరేష్‌. ఉద్యోగరీత్యా దూరం కాబోతున్న వేణు. అన్ని స్నేహాలూ విడిపోవటానికే ఏర్పడుతయేమో!
ఇద్దరి మధ్య చాల సేపు నిశ్శబ్దం.

‘నరేష్‌ మన స్నేహితుడైనందుకు మనం గర్వించాలి వేణూ’ అన్నడు స్వామి నెమ్మదిగ.
‘నిజమే సిద్దార్థుడిలాగా అన్నింటినీ అందర్నీ వదిలి అడవులకు వెళ్లిపోయినాడు’ అన్నడు వేణు.
‘ఇక నరేష్‌ మనకు ఎప్పుడూ కనపడడా?’ ఆవేదనగ అడిగినాడు స్వామి.

‘ఏమో నాకైతే నమ్మకం లేదు’ అంటూ ‘స్వామీ! మనకు చాలా పరిమితులు ఉన్నయ్‌. ఉదాహరణకు నన్నే తీసుకో. నా బాధ్యతలు నీకు తెలుసు కదా! మన ఆశయాలు ఎట్లున్నా ఆచరణలో మనకు చాలా పరిమితులు ఉన్నై” అన్నాడు వేణు.
స్వామి తలెత్తి వేణు కండ్లల్లకు చూసినాడు ఏమి మాట్లాడకుండనే.

‘నీ గురించే నాకు ఒకింత బెంగగ ఉంది, స్వామీ! మీ బాపు ఇంకో రెండు మూడు సంవత్సరాలల్ల రిటైర్‌ అవుతడని నువ్వే చెప్పినవు. ఇంటికి నువ్వే పెద్దోడివి. ఇంకా ఇద్దరు తమ్ముళ్లు. నువ్వు కూడ డిగ్రీ పూర్తిచేసి ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలె. నువ్వు మరీ ఆదర్శవాదివి. నీ గురించే నా బెంగ” అన్నడు వేణు.
స్వామి ఏమీ మాట్లాడలేదు.

“ఉత్తరాలు రాస్తుండు స్వామీ! నీకైతే తెలుసు కదా నేనైతే ఉత్తర కుమారుణ్ణి” అని నవ్వించ ప్రయత్నించినాడు వేణు.
స్వామికి నవ్వురాలేదు. విచారం అతణ్ణి నిలువెల్లా కమ్ముకుంది.
వేణు స్వామికి గట్టిగ షేక్‌ హాండ్‌ ఇచ్చి, కావలించుకుని రిక్షా ఎక్కి వెనక్కి తిరిగి చూస్తూ, చూస్తూ కనుమరుగైనాడు.
ఒంటరొంటరిగ మిగిలిన ఏకైక స్వామి.

* * *

ఆ తెల్లారి ఉదయం నిద్రలేవంగనే స్వామి మనస్సంత ఖాళీగ అనిపించింది. వేణు నరేష్‌లు లేని ఒంటరి జీవితం జ్ఞాపక మొచ్చింది. ఆ వాక్యూమ్‌ నుండి తప్పించుకోవాలని దబ్బదబ్బలేచి బ్రష్‌ చేసుకొని ముఖం కడుక్కొని అమ్మ అందించిన చాయ్‌తాగి తయారై గుణవర్ధక్‌ సంస్థ లైబ్రరీ దారి పట్టినాడు. లైబ్రరీ అప్పుడే తెరిచినట్టుంది. రష్‌ అంతగ లేదు. చక్కగ దిన పత్రికల సెక్షన్‌లకు పోయి టేబుల్‌ ముందు కూచుని ఆనాటి దినపత్రిక ఆంధ్రభూమిని అందుకున్నడు. తాటికాయలంత అక్షరాలతోటి పేపరుల పతాక శీర్షిక

“నక్సలైట్‌ అగ్ర నాయకులు పెంపటాపు సత్యనారాయణ, ఆదిబట్ల కైలాసంల కాల్చివేత”.
1970 జులై 10
శ్రీకాకుళం

నిన్న శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం తాలూకా ఏజెన్సీ ప్రాంతంలోని బోరికొండలలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పులలో శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాట అగ్రనాయకులు సత్యం, కైలాసంలు మరణించారు. వీరిద్దరూ ఒకప్పుడు ఆ జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. ప్రజలు సత్యనారాయణను “కొండబారిడి మాష్టారు” అని ప్రేమగా పిలుచుకునే వారు. జిల్లాలో నక్సలైట్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వైతాళికులు వీళ్లు…………..

స్వామి ఆ వార్తా విశేషాలను దీక్షగ చదువసాగినాడు. దినపత్రికల కొసలు స్వామి గుప్పిట్ల నలిగిపోతున్నై. మనసు కకావికలమైపోయింది. తెలంగాణా గల్లీలల్ల నుండి శ్రీకాకుళం అడవుల వరకూ నెత్తురు కారుతున్న అక్షరాలు. హృదయం తుత్తునియలై పోయింది. స్వామికి హఠాత్తుగ నరేష్‌ జ్ఞాపకం వచ్చినాడు. ఏదో ఒక రోజు ఇట్లనే నరేష్‌ కూడ ‘ఎన్‌కౌంటరయ్యి’ పేపర్ల కనబడుతడేమో అన్న ఆలోచన వచ్చి అతని శరీరం భయంతోటి గజగజ వణికింది. రక్తాక్షరాలతో చేతులు తడవడం ఇష్టంలేక దినపత్రికను టేబిల్‌ మూలకు విసిరేసి చటుక్కున కుర్చీల నుంచి లేచి నిలుచున్నడు. తన మీద తనకే కోపం. మరెవరిమీదనో కోపం. పాత గాయాలు మళ్లీ కొత్తగ సలుపుతున్నై. చరచర నడుచుకుంట లైబ్రరీ సిడీలు దిగి సడక్‌ మీదికి వచ్చినాడు. Every Road has a freind and every friend has a road. హరీబౌలి దిక్కు సడక్‌ మీద నడక.నడక-నడక.నడక నడుస్తున్న చరిత్ర. నడక నడుస్తున్న చదువు. నడక నమ్మకమైన నేస్తం. నడక నడుస్తున్నపాట. చల్నా జీవన్‌ కీ కహానీ, రుఖ్నా మౌత్‌ కీ నిషానీ. ఆ ఉదయం హరీబౌలీ తోవ ఖాళీ ఖాళీగ ఉంది. భూమి కోసమే నడు. భుక్తికోసమే నడు. విముక్తికోసమే నడు. భయంగియం విడు నడు. నడు-నడు.

స్వామి నడుస్తున్నడు. అతని కుడి ఎడమల వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంలు. ఇప్పపువ్వులలో నిప్పురవ్వల్ని రగిలించిన సత్యం. వెనుక సుబ్బారావు పాణిగ్రాహి. కమ్యూనిస్టులం మేము కష్టజీవులం – ఔనన్న కాదన్న, అదే ఇష్టులం. పాణిగ్రాహి పాట ఎత్తుకున్నడు. డాక్టర్‌ చాగంటి భాస్కర్రావ్‌, డాక్టర్‌ దేవినేని మల్లిఖార్జున్‌, పంచాది కృష్ణమూర్తి, పంచాది నిర్మల, రెంజిం, రెడ్డి అప్పల స్వామి, తామాడ గణపతి, దున్న అంకమ్మ, యం.వి. రమణమూర్తి ఇంక మరెందరో కదం తొక్కుకుంట ఆ పాట కోరస్‌గ పాడుతున్నరు. స్వామితో వారందరు – వారందరితో స్వామి.

హరీబౌలీ చౌరస్తాల అక్కన్న మాదన్నలు కట్టించిన మాతా మహాంకాళీ దేవాలయాన్ని దాటి మొగల్‌పురా లోపలికి నడక. అల్లా కో ప్యారీ హై ఖుర్బానీ అని పాట పాడుకుంట ఢక్లీ బజాయించుకుంట సయ్యద్‌ మౌల్వీ అల్లాఉద్దీన్‌, తుర్రేబాజ్‌ఖాన్‌లు ఎదురొచ్చిండ్రు. వారి వెనుక చీతాఖాన్‌, అబ్బెన్‌సాహెబ్‌, సేఠ్‌ జయగోపాల్‌ దాస్‌లు. ఇంక కొద్ది దూరం పోంగనే సందు మలుపుల షోయబుల్లాఖాన్‌, మగ్దూంలు దర్శనమిచ్చిండ్రు. మగ్దూం తన విలక్షణమైన గొంతుతోటి- “యే జంగు హై జంగే – ఆజాదీ” అని తను స్వయంగ రచించిన పాట పాడుతున్నడు.

మొగల్‌పురా కమాన్‌ దాటంగనే ఫుట్‌పాత్‌ మీద నిలబడ్డ బాపు కనబడ్డడు. “భద్రం రా బాపూ!” అని దిగులుగ హెచ్చరిస్తున్నడు. ఆయన పక్కన్నే కన్నయ్య మామ. “నడుస్తున్న దారి మధ్యల పెద్దపులి అడ్డం వస్తే దాన్నుండి ఎట్ల తప్పించుకోవాల్నో” జాగ్రత్తలు చెప్పుతున్నడు. కమాన్‌ దాటి పాంచ్‌ మహల్లా ముందుకొచ్చిండు. అక్కడ ఆ హవేలీ ముందు వాకిట్ల మట్టిల అటూ ఇటూ కింద పడి పొర్లుతున్న అలనాటి పర్షియన్‌ గుల్‌ మొహర్‌ పుష్పం ఖైరున్నిసా. తన దీర్ఘ శిరోజాలను తన చేతులతోనే పీక్కుంట, దోసిళ్లతో మన్ను తన నడినెత్తిన పోసుకుంటున్నది. స్వామిని చూసి తన ఇద్దరు ముద్దుబిడ్డల తస్వీర్లను తెచ్చివ్వమని చేతులెత్తి ప్రాధేయపడుతున్నది. కనుకొలుకులలో నిలిచిన కన్నీటిని అక్కడే నిలుపుకుంట స్వామి ముందుకు, మున్ముందుకే నడుస్తున్నడు.
మక్కా మసీదు ముందు చిన్నారి చెల్లె చాదర్‌ఘాట్‌ రేణుక కనబడింది. సినుకు సినుకుల వాన ఉయ్యాలో సిత్తారి వానల ఉయ్యాలో అని బతుకమ్మ పాట పాడుకుంట ఎదురొచ్చింది. ఆమె వెనుకనే గరీబోళ్ల బిడ్డ అందాల బిడ్డ ఇసామియా బజార్‌ ప్రేమ్‌కిశోర్‌ ఇవతలికి పడుతున్న పొత్తి కడుపు పేగుల్ని రెండు చేతులతో లోపలికి అదుముకొంట కనబడ్డడు. కవాడీగుడా పిల్లగాడు ఆకుల నరేందర్‌ నడుసుకుంటనే రాబోయే పరీక్షల కోసం పుస్తకాలను చదువుతున్నడు. కంచరిబస్తీ ప్రకాశ్‌ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నడు. ప్రకాశ్‌కుమార్‌ జైన్‌, సర్వారెడ్డిలు ఇంజనీరింగు పట్టాలు చేతులల్ల పట్టుకుని విముక్త తెలంగాణల సాగునీరు, తాగునీరు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నరు. న్యాయవాది వేంకటేశ్వరరావు అంతర్జాతీయ న్యాయస్థానంలో తెలంగాణా న్యాయం కోసం వాదిస్తున్నడు. సదాశివపేట తొలి అమరవీరుడు శంకర్‌తో పాటు రాములు, ఉపేందర్‌, వేణుగోపాల్‌, ఆనంద్‌, వినోద్‌కుమార్‌ పటేల్‌, డేవిడ్‌, నారాయణ, తుకారాం, మోజెస్‌, మహమ్మద్‌ షఫీక్‌ అహమ్మద్‌లతో సహా అందరూ 360 మంది తెలంగాణా అమరవీరులు మక్కామసీదు కాడ స్వామిని కలుసుకున్నరు. స్వామి నడిచి నడిచి లార్డ్‌ బజార్‌ సందు మలుపుల ఉన్న ఇక్బాల్‌ హోటల్లకి పోయినాడు. లోపల ఒక టేబుల్‌ ముందు జోసెఫ్‌ మార్క్వెజ్‌ జెఫ్రీ తల వంచుకొని సిగరెట్‌ తాక్కుంట ఆనాటి దినపత్రికల తెలంగాణా విముక్తి వార్తల కోసం దేవులాడుతున్నడు. “బోలో సాబ్‌ క్యా హుకుం హై” అన్న సర్వర్‌ ప్రేమపూరిత పలకరింపు స్వామికి వినిపిస్తనే లేదు.

అశ్రుసిక్త నయనాలతో, శోకతప్త హృదయంతో భవిష్యత్‌ చిత్రపటాన్ని మనుసుల నింపుకున్న తన బిడ్డను నాలుగు చేతులు చాచిన చార్మినార్‌ తన చల్లని ఒడిలకు తీసుకున్నది. చార్మినార్‌ చల్లని ఛత్రచ్ఛాయలల్ల అశాంతంగ స్వామి. సత్యపథం మీద, కంటకావృతమైన కష్టాల బాట మీద నిరంతర యాత్రికుడు స్వామి. ఇంకా మంజిల్‌కు చేరుకోని ముసాఫిర్‌ స్వామి. చల్తె చలో చల్తె చలో చల్తె చలో. ఏ వక్త్‌ కీ ఆవాజ్‌ హై చల్తె చలో……..

… సమాప్తం

4 Responses to “సలాం హైద్రాబాద్ : పంతొమ్మిదో భాగం”

  1. 1
    ellanki Says:

    దిగంబర కవుల వివరాలు చాల చెప్పారు. నెనర్లు. మిగతా వారి వివరాలు తెలియజేయగలరని ఆసిస్తున్నాను.

  2. 2
    srinivasa reddy Says:

    ఇదేం సమాప్తం ??? గింతేనా తెలంగాణ చరిత్ర ? మద్యలొనె అపేసినవ్!!! ఎమ్ కత ? అలిసిపోతివా?

  3. 3
    Telaban Says:

    http://uselessnenusytham.blogspot.com/

  4. 4
    venu Says:

    కథ బగనె ఉంధి , ఇథె ఇధి జనమ్ మరచి పొయిన కథ, వెలుగులొకి తెచరు, మీ షైలి లొ… ప్రయథ్నమ్ బగుంధి.
    http://naatelangaana.blogspot.com/

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Managed by Discover Telangana Inc., a registered nonprofit organization in USA.

All opinions and views expressed by third party content providers and shown here as preview are not that of Discover Telangana.

If you find any Content that is infringing, libelous, defamatory, obscene, abusive, offensive or otherwise violation of copyright law, alert us by emailing us at discover.telangana(at)gmail.com